Previous Page Next Page 
నయనతార పేజి 23

 

    కాని సారధి అంచనాలు రెండో సారి తప్పాయి.
    పది రోజుల తర్వాత .....
    రాత్రి తొమ్మిది గంటలకి --- హోటల్లో భోం చేసి వచ్చి ప్రక్క మీద పడుకుని ఏదో ఇంగ్లీషు నవల చదువుతున్నాడు సారధి.
    తెరిచి వుంచిన తలుపు లోంచి సుడిగాలిలా లోపలికి వచ్చింది తార. తెల్లపోయి చూస్తూ సారధి ప్రక్క మీద నించి లేచే లోపలే అతని గుండెల మీద వ్రాలిపోయి అతని గుండెల్లో మొహం దాచుకు వెక్కెక్కి ఏడవటం ఆరంభించింది. సారధి విస్తుపోతూ కొన్ని క్షణాలు అలా నిశ్చేష్టుడై వుండిపోయాడు. తరువాత "తారా! ...... ఏమిటి? ఏమిటిది, ఏం జరిగింది?" అంటూ ఆమెని లేవనెత్తి తను లేవడానికి ప్రయత్నించాడు . కాని తార అతనిని ఇంకా హత్తుకుపోయింది. అతని గుండెల్లో మరింతగా వదిగిపోయింది. అతని చుట్టూ చేతులు ఇంకా బిగించింది. "సారదీ ..... సారదీ , నీవు లేకుండా బ్రతకలేను. నన్ను దూరం చేయకు. నీవు దూరమైతే బ్రతకలేకపోతున్నాను సారధీ" అంటూ ఏడవసాగింది.
    సారధి ఇంకా ఆశ్చర్యంనించి తేరుకోలేకపోయాడు. తార ఎందుకు ఏడుస్తుందో, ఏమంటుందో అర్ధం చేసికోలేక పోయాడు. "తారా, ఏమిటిది , ప్లీజ్ , లేవనీ నన్ను , లేచి కూర్చో , ఎవరైనా చూస్తె బాగుండదు. లే లేచి కూర్చో"
    "ఊహు , లేవను . ముందు మాట ఇయ్యి. నన్ను దూరం చెయ్యనని నాకు దూరం అవనని మాట ఇయ్యి." ఇంకా ఏడుస్తూనే అంది." నీవు కావాలి సారదీ. నీవు కావాలి నాకు."
    సారధి కాస్త బలంగానే తారని లేవదీసి లేచి ప్రక్కమీద కూర్చున్నాడు. ఏడుస్తున్న తార మొహంలోకి వింతగా చూసి, "ఏం జరిగింది సుందరీ యీ ఏడుపెమిటి? ఇలా వచ్చేవేమిటి రాత్రి? ప్రశ్నలు కురిపించాడు ఆరాటంగా."
    తార అతనికి మొహం చూపించలేనట్టు రెండు చేతులలో మొహం దాచుకుంది ఏడవడం తప్ప ఏం సమాధానం చెప్పలేదు. "సుందరీ , ఛ, ఏమిటీ ఏడ్పు ముందు కళ్ళు తుడుచుకో . ఊ" అనునయంగా అంటూ ఆమె చేతులని మొఖం మీద నుంచి తొలగించాడు. తార మొఖమంతా కన్నీటి చారలతో తడిసింది. మూసుకున్న ఆమె కళ్ళ నుంచి చెంపల వెంబడి నీరు కారుతోంది. సారధి మనసు ద్రవించింది తార నా స్థితిలో చూసి.
    "సుందరీ ఏమిటది. ఈ ఎడ్పేమిటి చెప్పు. ఏం జరిగిందో చెప్పు. ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా?" ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆదరంగా అడిగాడు. ఆమె కళ్ళు తెరవకుండానే తలాడించింది అడ్డంగా.
    "ఎవరూ ఏమీ అనలేదు. ఎవరూ ఏమీ చెయ్యలేదు. నీవే నీవే చేశావు అంతా, నీవే నన్నిలా ఎడిపిస్తున్నావు" విసురుగా అని మళ్ళీ మొహం చేతులతో కప్పుకుని ఏడుపు ఆరంభించింది. సారధి ఏం చెయ్యాలో తోచక కొన్ని క్షణాలు అలా నిశ్శబ్దంగా ఆమె ఏడుపుని చూస్తూ వూరుకున్నాడు. కొంతసేపటికి ఆమె ఏడ్పు ఉదృతం తగ్గింది. మొహం మీద నుంచి చేతులు తీసింది. కళ్ళు తెరచి తననే చూస్తున్న సారధి వంక చూడకుండానే పమిటతో కళ్ళు , మొహం తుడుచుకుంది.
    "సారీ, నిన్ను డిస్ట్రబ్ చేసినట్టున్నాను. క్షమించు" అంటూ ప్రక్క మీద నుంచి దిగి లేచి నిల్చుంది "సిల్లీగా బిహేవ్ చేశాను ఏమనుకోకు" అంది అదోలా.
    "అసలిదంతా ఏమిటి సుందరీ...... నాకేం అర్ధం కావడం లేదు." విస్మయంగా అడిగాడు. తార కఠినంగా నవ్వింది. "అవును నీలాంటి కఠినులకి, హృదయం లేని మనుషులకి అర్ధం కాదని నాకు తెలుసు. అందుకే, ఇది తెచ్చాను. అప్పటికైనా అర్ధమవుతుందేమో చూడు. అర్ధమైతే జవాబు రాయి." అంటూ హేండ్ బ్యాగునుంచి ఓ కవరు తీసి సారధి చేతిలో పెట్టి గబగబ బయటికి వెళ్ళిపోయింది . సారధి తేరుకుని "సుందరీ" అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి  ఆమె కారు కదిలింది.
    ఆరాటంగా సారధి చేతిలో కవరు చించాడు.
    "సారధి ..... నా సారధి
    నీవు లేక నేను బ్రతకలేనని ఈ నెల రోజులు స్పష్టం చేశాయి. నా మనసేమిటో , నేనేమిటో అప్పుడు గ్రహించ లేకపోయినా మనం కలిసి తిరిగిన ఇన్ని రోజులలో నీవు గ్రహించ లేకపోతే ఇంకేం చెప్పగలను? చెప్పకపోతే తెలియనట్లే నటించే నీ గడుసుతనాన్ని నీ పురుషాహంకారాన్ని  క్షమించలేక పోతున్నాను. కేవలం ఆ నటనకి అహంకారం ఒక్కటే కారణం అయితే నీవే గెలిచావు. ఈ వుత్తరం నేనే రాశాను కనక, ఇంక అహంకారానికి అర్ధం లేదు. అలా కాకా ఇదివరకు సుందరిగా అడిగినప్పుడు ఏం జవాబిచ్చావో యిప్పుడు అదే జవాబు మరోసారి యిస్తే?! యిస్తే ..... నేనేం అవుతానో ఎలా చెప్పను? యింతకంటే ఏం రాయను! నీ జవాబు మీద నా భవిషత్ ఆధారపడి వుంది! ఎదురు చూస్తుంటాను -- నన్నీ నరకం నుంచి తప్పిస్తావన్న ఆశతో ---- నీ జవాబుకి ------ నీ సుందరి.
    వుత్తరం చదిరి ఏదో పెద్ద ఆపద నెత్తినపడిన వాడిలా సారధి దిగాలు పడి అలా కూర్చుండి పోయాడు. ఉత్తరం చిన్నదే! భావం పెద్దది! ఏం జవాబు రాయటం! ఇలాంటిదేదో తప్పదని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. సుందరి, పాపం సుందరి! తనేం చెయ్యాలి? ఏమని జవాబివ్వాలి?
    అ రాత్రి ఒక్క క్షణం నిద్ర పట్టలేదు సారధికి. ఎంత ఆలోచించినా తారకేం జవాబివ్వాలో అంతుపట్టలేదు . అతని ఆలోచనలు, అతని మనసూ, అవును , కాదు మధ్య ఉయ్యాలలూగాయి.
    హాయిగా బోలెడు డబ్బు ఈ జీతంతో తనేన్ని జన్మలు ఉద్యోగం చేసినా సంపాదించలేని డబ్బు. డబ్బుతో తను ఈ జన్మలో పొందలేని సుఖాలు, వాటి మధ్య తను. తార ఇంట్లో బంధువులందరితో పాటు తనూ ఒకడు ----- తార సంపాదన మీదే దృష్టి ----- అనామకుడిగా, నటీమణి భర్తగా ఆమె వెనక తిరగే తనని అందరూ  చూసి చాటుగా హేళనగా నవ్వడం - డబ్బు కోసం తనూ వారిని పీడించడం -- తారకి తనకి డబ్బు వల్ల మనస్పర్ధలు ---- తార తనని హేళనగా చూడటం --- ఇంట్లో వాళ్ళందరితో పాటు తననీ ఎహ్యించుకోవడం, తనూ డబ్బుకు దాసోహం అయిపోవడం -- డబ్బు కోసం తార అడుగులకి మడుగులు వత్టటం.

 Previous Page Next Page