Previous Page Next Page 
రక్తచందనం పేజి 23


    ప్రపంచం మొత్తంమీద లెక్కేస్తే 4057 మిలియన్ హెక్టార్ల అటవీ భూములుంటే, అందులో మనదేశం శాతం 1.85.
    జనాభాకేం తక్కువలేదు. ప్రపంచ జనాభాలో మనదేశ జనాభా మాత్రం 1987 నాటికే 15.64 శాతం.
    అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయా, ఒరిస్సా, అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రమే అవసరమయిన 33 శాతం కన్నా ఒకింత ఎక్కువ శాతం అడవులున్నాయి.
    కేరళ, గోవా, డామన్, మణిపూర్, మహారాష్ట్రలో ప్లస్ 20 శాతం అయితే మిగతా రాష్ట్రాల్లో అదీ లేదు. ఇకపోతే మనం మన ఆపరేషన్ ప్రారంభించవలసిన అడవులు పర్వతశ్రేణి, నదీపరివాహక ప్రాంతంలో వున్నాయి.
    ఇండియన్ ఫారెస్టు ఐదు రకాలు.
    ఒకటి _ ఎవ్వర్ గ్రీన్, రెండు _ డెసిడ్యూస్, మూడు_ డ్రై, నాలుగు_హిల్, ఐదు_టైడల్ ఆర్ లిట్టోరల్.
    అడవులు నదీపరివాహక కేంద్రాలుగా వ్యవహరిస్తూ జలావరణ చక్రాన్ని (హైడ్రోలాజికల్ సైకిల్) అదుపు చేస్తూ క్రమం తప్పకుండా  వర్షపాతాన్ని కలిగిస్తుంటాయి.
    మనిషి మనుగడ జీవావరణ సమతౌల్యంమీద ఆధారపడి వుంటుంది.
    అలాంటి ప్రాముఖ్యతను కలిగిన అడవులు బీడు భూములుగా మారుతుంటే నిస్సహాయంగా చూస్తుండి పోవలసి వస్తుంది...." నిట్టూరుస్తూ అన్నాడు. టిష్యూ కల్చర్ పై పరిశోధనచేసి గోల్డ్ మెడల్ సంపాదించుకున్న శర్మ.
    అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న రంజిత్ సివంగిలా పక్కకు దూకి ఒక్క ఉదుటున తలుపుల్ని బార్లా తెరిచాడు. ఒక నీడ అప్పుడే కనుమరుగవుతూ కనిపించింది.
    వెంటనే వేగంగా కిందకు దిగి వెళ్ళి, ప్రధాన ద్వారబంధం వరకు వెళ్ళి చూశాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ లో ఒకరు లేరు.
    రంజిత్ భృకుటి అనుమానంతో ముడిపడింది. "వాడేడి...." హుంకరిస్తున్నట్లుగా అడిగాడు రంజిత్. బాత్రూం కెళ్ళినట్లుగా సంజ్ఞ చేశాడు మిగిలినతను. కాంపౌండ్ వాల్ గేట్ కేసి చూశాడు. అక్కడుండవలసిన ఇద్దరూ అక్కడే పహరా కాస్తూ కనిపించారు.
    ఒక్కక్షణం అక్కడే ఆగి తిరిగి పై కొచ్చాడు.
    "ఎవరు....? ఏమన్నా తెలిసిందా?" శర్మ ప్రశ్నించాడు ఆత్రుతగా.
    "లేదు. కానీ తెలుస్తుంది_ త్వరలో" అన్నాడు తిరిగి కూర్చుని గ్లాసు నింపుకుంటూ నర్మగర్భంగా.
    ఆ తాగుడు, తిండీ చూసి శర్మ విస్తుపోయాడు.
    "అదీ వీరూ నెట్ వర్క్ అంటే. మనం మన స్టాఫ్ యూనిఫాం వేసుకోటానికి వెయ్యి రూపాయలు జీతం ఇస్తుంటే_ వీరూ తనకు ఇన్ ఫార్మర్స్ గా చేయమని నెలకు రెండువేలిస్తుంటాడు...." వేదాంత ధోరణిగా అన్నాడు శర్మ.
    "అప్పుడే....ఆపరేషన్ ఆరంభించకముందే అలా నీరుగారిపోతే ఎలా శర్మా....? చూస్తుండు ముందు ముందు ఏం జరగబోతోందో.... అని రంజిత్ సిగరెట్ వెలిగించుకొని తిరిగి ప్రశ్నించాడు.
    "ఐదు రకాల అడవులన్నావు గదా....? వీరూ తిరిగే ఆ ప్రాంతం ఏ రకం క్రిందకు వస్తుంది....?"
    "కేరళ, తమిళనాడు అడవులు సతత హరితారణ్యాలు. వర్షపాతం బాగా ఎక్కువ. ఆ అడవులెప్పుడూ పచ్చగా వుంటాయి. అలాంటి అడవుల్లోనే ఏనుగులు సంచరిస్తుంటాయి. కేరళ అడవులలో పోచర్స్ ఎక్కువయి_ మగ ఏనుగుల్ని చంపి దంతాలను పెరుక్కోవటం ఎక్కువ కావటంతో అవన్నీ ఇప్పుడు ముదుమలై అడవుల్లోకి తరలివచ్చాయి.
    మైసూర్ జిల్లాకి చెందిన గుండ్లుపేట్ కి ముందునుంచే బండిపూర్ ఆడవి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కర్ణాటక  _ తమిళనాడు బోర్డర్ వస్తుంది. బోర్డర్ అవతల నుంచి ముదుమలై అడవి ప్రారంభమవుతుంది. అది తమిళనాడుకి చెందిన నీలగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. అక్కడ వర్షపాతం ఎక్కువ. అదంతా పర్వతశ్రేణులమయం. ఆ తర్వాత గుడలూరీ_ ఊటీ అడవులు కూడా అంతే.
    ఇకపోతే మైసూర్ జిల్లా మద్దూర్, నుగుడ్యామ్, బేగూర్, సర్ గూర్, హెగ్గద దేవన్ కోటే, లక్ష్మణ్ తీర్థ ప్రాంతాలు నాగరహోలె అడవులకు దారితీస్తాయి.
    నాగరహోలే అడవుల్లో ఏనుగులు విపరీతంగా వుంటాయి. అక్కడి నుంచి కొడగూ జిల్లా తితిమతి అడవి ప్రారంభమవుతుంది. కాఫీ ఎస్టేట్స్ తో నిండిపోయిన కొడగుజిల్లా సముద్రమట్టానికి చాలా ఎత్తులో వుంటుంది. అందుకే వర్షపాతం చాలా ఎక్కువ. వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటుంది. మైసూర్ నాగరహోలే అడవులు, కొడగు జిల్లా అడవుల్లో కూడా ఏనుగులు ఎక్కువ. అయినా ముదుమలై తరువాతే తమిళనాడు, కర్ణాటక అడవుల్లో కావేరీ నది ప్రవహిస్తుంటుంది. ఆ అడవుల్ని నదీపరివాహక ప్రాంతపు అడవులంటారు.
    ఎమ్.ఎమ్. హిల్స్, కొల్లెగాళ్, సత్యమంగళం, భవానీ అడవులు పర్వతశ్రేణుల అడవులు.
    బండిపూర్ అడవులు మాన్ సూన్ ఫారెస్ట్స్ కిందకొస్తాయి...." ఆగాడు శర్మ.
    "సో....వీరూ సంచరించే అడవుల్లో అన్నిరకాలున్నాయన్నమాట" రంజిత్ అవగాహన చేసుకుంటూ అన్నాడు.
    "అవును.... కొన్ని పల్చటి అడవులు _ మరికొన్ని దట్టమయిన అడవులు కూడా వున్నాయి. ఊటీ, నాగర్ హోలే అడవుల్లో చలెక్కువ. వర్షం కూడా ఎక్కువే. బండిపూర్ అడవులు ఫర్వాలేదు. కొల్లెగాళ్, మలై మహదేశ్వరా, హోగెనకల్ ఫాల్స్, సత్యమంగళం అడవులు దట్టంగా వుండి, ప్రమాదకరంగా వుంటాయి.
    మనం ఏ ఏరియాలో....ఐ మీన్ ఏ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాలనుకుంటే ఆ అటవీప్రాంతపు వాతావరణ పరిస్థితుల్ని, అక్కడ సంచరించే వైల్డ్ ఏనిమల్స్ గురించి, దారుల గురించి క్షుణ్ణంగా తెల్సుకొని మరీ ముందుకు సాగాలి.
    పట్టుబడకుండా తప్పించుకోవాలనుకొనే వీరూకి, అతని అనుచరులకు ఆ అడవులు కొట్టిన పిండి. వారిని పట్టుకోవలసిన మనకూ_ముఖ్యంగా మీ పోలీసు శాఖకు కొత్త. ఏమరుపాటు అసలు తగదు...." శర్మ జాగ్రత్తలు చెబుతుంటే రంజిత్ ఆలోచనల్లో పడిపోయాడు.
    అర్దరాత్రి కావొస్తుండగా శర్మ లేచాడు.
    "ఇకపై ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ ని రక్షణకి పెట్టుకో....గుడ్ నైట్" అన్నాడు రంజిత్.
    వీరూని పట్టుకొనే ఆపరేషన్ కి శ్రీకారం చుట్టకముందే శర్మ ఒకింత భయాందోళనలకు గురయ్యాడు. అదెంతోసేపు కాదు.


                                                *    *    *    *


    సరీగ్గా రాత్రి ఒంటిగంటకు కొల్లెగాళ్ టౌన్ లో ఒక ఇంటిలో ఫోన్ రింగయింది.
    ఆ ఇంటి యజమాని దానికోసమే మేల్కొని వున్నట్లుగానే వెంటనే అందుకొని అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా విని రెండు నిమిషాల తరువాత ఫోన్ పెట్టేసి, లైట్ వేయకుండా చీకట్లోనే తడుముకుంటూ పెరటిగోడ దగ్గరకు వెళ్ళాడు.
    అప్పటికే ఒక మనిషి అక్కడ సిద్ధంగా వున్నాడు.
    అతనికేదో ఇతను చెప్పాడు.
    ఆ మరుక్షణం అతను చీకటిలో కలిసిపోయాడు. అతనా రాత్రంతా ప్రయాణించి కొల్లెగాళ్ ఫారెస్ట్ రేంజ్ లో వున్న ఒక గుట్ట అంచుకు చేరుకున్నాడు.
    అప్పటికే తెలతెలవారుతోంది.
    అయినా చీకటి దట్టంగా పర్చుకొనే వుంది. చల్లటి ఈదురుగాలులు వుండుండి వీస్తున్నాయి. తూర్పు సంధ్యారాగాన్ని ఆలపించేందుకు పక్షులు సిద్ధమవుతున్నాయి.
    రాత్రంతా నిద్రించిన అడవి మేలుకుంటోంది.
    అతను వొక గుట్ట అంచుకు చేరుకొని, అడుగులో అడుగువేస్తూ కిందకి దిగటం ప్రారంభించాడు. ఏ మాత్రం కాలుజారినా అగాధంలోకి జారిపోవటం ఖాయం.

 Previous Page Next Page