వాళ్ళ వంటినిండా వార్ పెయింట్ - యుద్ధానికి సన్నద్ధమయ్యేటప్పుడు పూసుకునే రంగు పులి చారల్లాగా వులిమి వుంది. అడవిపంది కొవ్వు రాసుకోవడం వల్ల కాబోలు, శరీరాలు నిగనిగలాడుతున్నాయి.
త్వరత్వరగా జీవుని చుట్టుముట్టేసి, ఎవరికీ అర్థంకాని ఏదో భాషలో గోలగోలగా మాట్లాడటం మొదలెట్టారు. 'ళ' అనే అక్షరం మాత్రం పదే పదే వినబడుతోంది మాటల్లో.
సందీప్ కి ఆంత్రోపాలజీతో కొంచెం పరిచయం ఉంది. అయినా, ఈ తెగ మనుషులు మాట్లాడుతున్న చిత్రమైన భాష ఏమిటో అతనికి అంతుబట్టలేదు. ఈ కీకారణ్యంలో, ఇంకా నాగరికుల దృష్టికి రాని ఇలాంటి ఆటవిక తెగలూ, భాషలూ ఎన్ని ఉన్నాయో అనిపించింది.
ఆ ఆటవికులకి నాయకుడిలా కనబడుతున్నవాడు దగ్గరగా వచ్చి సందీప్ మీదకు వంగాడు. అతని చేతిలోని ఈటె మొన సందీప్ గుండెలని తాకుతోంది. సూదిగా ఉన్న దాని కొనకి ఏదో పసరు పూసినట్లు కనబడుతోంది.
అదేదో విషపూరితమైన ఆకు పసరు అయివుంటుందని గ్రహించాడు సందీప్. అది గీసుకుని గాయమయినా చాలు, ప్రాణాలు తక్షణం పోతాయి.
వాళ్ళతో స్నేహంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు సందీప్. "మేము మీ శత్రువులం కాదు" అన్నాడు చేతులు పైకి ఎత్తి, విశాలంగా నవ్వుతూ.
నాయకుడికి అది అర్థం అయినట్లులేదు. హుంకరింఛి పెద్దగా ఏదో అన్నాడు. అతనికి వంత పాడుతున్నట్లు గందరగోళంగా కేకలు వేశారు తక్కిన ఆటవికులు.
"మావల్ల మీకేమీ హాని జరగదు" అన్నాడు సందీప్, తనకు తెలిసిన ఒక గిరిజన భాషలో.
గుండెలు అవిసిపోయేలా కేకపెట్టి, గుడ్లు ఎర్రగా చేశాడ్ నాయకుడు.
"ఏమంటాడు ?" అంది స్వప్న ఆదుర్దాగా.
"అతనేమంటున్నాడో మనకీ, మనమేమంటున్నామో అతనికీ అర్థం కావడంలేదు. అదే తంటా!"
"ఎవడికైనా అర్థమయ్యే ఇంటర్నేషనల్ భాష ఒకటి ఉంది. అదే డబ్బు భాష ! కాసిని డబ్బులు వాళ్ళ మొహాన కొడదాం! వాళ్ళ దోవన వాళ్ళే పోతారు" అంది స్వప్న.
"లాభం ఉంటుందనుకోను" అంటూ పర్సు తీసి, వంద రూపాయలు నోటు ఒకటి నాయకుడికి అందించాడు. పెదిమలు ఈ చెవి దగ్గర నుంచీ ఆ చెవిదాకా సాగదీసి నవ్వుతూ.
నాయకుడు దాన్ని నిర్లక్ష్యంగా లాక్కుని, హీనంగా చూసి, నేలమీదకు విసిరికొట్టి, కాళ్ళతో తొక్కాడు.
అతని అనుచరులు శివమెత్తిన వాళ్ళలాగా చిందులు తొక్కారు.
"ఈ జంగ్లీ గాళ్ళకు డబ్బు విలువ తెలియదు!" అన్నాడు భూతాలరాజు, ఖాండ్రించి ఉమ్మేస్తూ.
అతను ఉమ్మేయగానే ఆటవికులు అందరూ కూడా యథాశక్తిన వుమ్మేసి, స్నేహంగా చూస్తూ నిలబడ్డారు. వాళ్ళ మొహాల్లో టెన్షన్ కాస్త తగ్గింది. తెల్లబోయాడు రాజు.
ఉమ్మేయడమే వాళ్ళలో శాంతికీ, రాజీకీ సంకేతమేమో అనిపించింది సందీప్ కి.
అప్పటిదాకా సందీప్ ఛాతీకి ప్రమాదకరమైనంత దగ్గరగా ఉన్న నాయకుడి ఈటె దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఆటవికులింకా వాళ్ళని చుట్టుముట్టే ఉన్నారు.
గుండెలనిండా గాలి పీల్చుకుని, నాయకుడి వైపు పరీక్షగా చూశాడు సందీప్. అతని మెడలో రంగు రంగుల పూసలూ, హారాలూ వేలాడుతున్నాయి. ఆ హారాల్లో గవ్వలూ, శంఖాలూ కూడా ఉన్నాయి. మధ్యలో పెద్దపులి గోరు ఉంది.
నాయకుడు స్వప్న మెడలోని ముత్యాల హారాలవైపు కళ్ళప్పగించి చూస్తున్నాడు.
ఒక అయిడియా తట్టింది సందీప్ కి. వెంటనే స్వప్న మెడలో ఉన్న ముత్యాల హారం తీసి నాయకుడికి ఇచ్చాడు.
నాయకుడి నల్లటి మొహంలో తెల్లటి పళ్ళు కనబడ్డాయి. అతని మొహం ఆనందంతో వికసించింది. సంతోషంగా ముందుకు వంగి, "బుంబా ! బుంబా !" అంటూ తన ముక్కుని సందీప్ ముక్కుకి రాశాడు.