Previous Page Next Page 
హైజాక్ పేజి 23

అతని వెనకాలే నిలబడి ఉన్నాడు శతృఘ్న. విపరీతమైన టెన్షన్ కనబడుతోంది అతని మొహంలో.
బయట పాసెంజర్స్ కేబిన్ లోనుంచి మరణయాతన పడుతున్న మనిషి కేక వినబడింది.
భయంగా శతృఘ్న మొహంలోకి చూసింది అనుపమ.
"హెల్!" అని విసుక్కున్నాడు శతృఘ్న. "నీకు ఫస్ట్ ఎయిడ్ తెలుసా?"
"తెలుసు!" అన్నట్లు సంకోచంగా తల వూపింది అనుపమ.
"కడుపులోకి విషంపోతే ప్రథమ చికిత్స ఏమిటి?"
పరీక్షల ముందురోజుదాకా బట్టీపట్టిన సమాధానాలు, క్వశ్చన్ పేపర్ చూడగానే బుర్రలోనుంచి మాయమైపోయినట్లు, తెల్లకాయితంలా మొహంపెట్టి చూసింది అనుపమ. "మ...మర్చిపోయాను"
"సాల్టు వాటర్ తాగించవచ్చు" అంది దగ్గరలోనే ఉన్న మోనికా.
శతృఘ్న మొహంలోకి కొంచెం కళ వచ్చింది. "ఇక్కడున్న మొహాల్లో నువ్వే కొంచెం తెలివి ఉన్నదానిలా కనబడుతున్నావు. అవును కరెక్టే! ఉప్పు కలిపిన నీళ్ళు తాగిస్తే, అవి విషాన్ని పలచన చేసి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇంకా స్పృహ తప్పకుండా మిగిలిన వాళ్ళకి నువ్వు సాల్టు వాటర్ తాగించు! ఈలోగా నేను ఈ పైలట్లని అటెండ్ అవుతాను" అని ఆగి, "బై ఎనీ ఛాన్స్, ఆ పడిపోయిన డాక్టరు తనతోబాటు మందులేమన్నా తెచ్చి ఉంటాడా?" అన్నాడు.
"తెచ్చారు" అంది మోనికా. "ఆయన చేతిలోని మెడికల్ ఛెస్టుని పైన వున్న లగేజీ రాక్ లో పెట్టింది నేనే!"
శతృఘ్నకి ప్రాణం లేచివచ్చినట్లయింది.
"తీసుకురా దాన్ని! క్విక్!"
పరుగెత్తుకెళ్ళి మెడికల్ ఛెస్టు తీసుకువచ్చింది మోనికా. అంతసేపూ ఆమెని రివాల్వర్ తో కవర్ చేస్తూనే ఉన్నాడు ఇక్బాల్.
త్వరత్వరగా మెడికల్ ఛెస్టు తెరిచి, దాన్లో ఉన్న మందులను పరికించి చూసి, ఒక ఇంజక్షన్ ఆంప్యూల్ బయటికి తీశాడు శతృఘ్న. మందుని సిరెంజిలోకి ఎక్కించాడు. సవ్యసాచి షర్టు చేతులు పైకిలాగి, చేతిమీద గుచ్చబోయాడు.
"జస్ట్ ఏ మినిట్!" అంది అనుమానంగా. "నీకు...మీకు ట్రీట్ మెంట్ ఇవ్వడం వచ్చా?"
"నాకా?" అన్నాడు శతృఘ్న విరక్తిగా. "నేను మెడిసిన్ చదువుతూ సగంలో ఆపేసిన సగం డాక్టర్ని." అతని గొంతులో కసికూడా ధ్వనిస్తోంది.
ఆ మాట వినగానే ఒక్కసారిగా తెరిపిన పడ్డట్టయింది మోనికా ప్రాణం.
సో! ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా దూసుకుపోతున్న ఈ విమానాన్ని నడిపించడానికి సగం పైలట్ ఒకడూ, పేషంట్లని ట్రీట్ చెయ్యడానికి సగం డాక్టరొకడూ దొరికారన్నమాట!
జీసస్!
అన్నిటికంటే విచిత్రం కర్కోటకుడయిన ఈ హైజాకరే పేషంట్ల ప్రాణాలు రక్షించవలసి రావడం.
పైలట్లకీ, ఫ్లయిట్ ఇంజనీరుకీ ఇంజక్షన్ లు ఇచ్చాడు శతృఘ్న.
ఈలోగా పేషెంట్లు అందరికీ ధారాళంగా ఉప్పు కలిపినా నీళ్ళు తాగించింది మోనికా.
పైలట్లని అటెండ్ కావడం పూర్తికాగానే, పడిపోయి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు శతృఘ్న. ముందు అతని ప్రాణాల్ని రక్షించాలి తను. ఆ తర్వాత మిగిలిన పేషంట్లని అప్పగించవచ్చు.
డాక్టరుని ఇటువైపు పొర్లించి, సిరెంజిలోకి మందు ఎక్కించడం మొదలెట్టాడు శతృఘ్న.
కాక్ పిట్ లో....
రాజేందర్ తగిలించుకున్న హెడ్ ఫోన్స్ లో మాటలు వినబడుతున్నాయి. పైలట్ మెహతా చెబుతున్నాడు.
"సో! కంట్రోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకున్నావా? నౌ! ఆటో పైలట్ ని ఆన్ చెయ్యి! ఆటో పైలట్ దానంతట అదే విమానాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళుతూ ఉంటుంది. తర్వాత ప్లేన్ ని నీ కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోవాలో చెబుతాను, రెడీ?"
"రెడీ!"
ఆటో పైలట్ ని ఎలా ఆన్ చెయ్యాలో చెప్పాడు మెహతా.
దాన్ని అందుకోవడానికి చెయ్యిజాపాడు రాజేందర్.
అతను దాన్ని తాకకముందే... దయ్యం పట్టినట్లు ఒక్కసారిగా ఊగిపోయింది విమానం.
"గాడ్! ఏమవుతోంది?" అన్నాడు రాజేందర్.
అతని ప్రశ్నకు జవాబులాగా మళ్ళీ గజగజ వణికింది విమానం.
"రాజేందర్...రాజేందర్...." అంటున్నాడు మెహతా. "కమ్ ఆన్ రాజేందర్... ఆటో పైలట్ ఆన్ చేశావా?"
"విమానం అటూ ఇటూ ఊగిపోతోంది. ఎయిరు టర్ బ్యులెన్స్ అనుకుంటాను" అన్నాడు రాజేందర్.
ఎయిర్ టర్ బ్యులెన్స్ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసు రాజేందర్ కి. తను ఆ చిన్న విమానాల్లో ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు రెండు మూడుసార్లు దాన్లో చిక్కుకున్నాడు. అల్లకల్లోలంగా వీస్తున్న వాయువుల్లో చిక్కుకుంటుంది విమానం ఒక్కొక్కసారి. మామూలప్పుడయితే విమాన ప్రయాణం ఇంట్లో సోఫాలో కూర్చున్నట్లే ఉంటుంది. కదలిక అసలు తెలియనే తెలియదు. ఎయిర్ టర్ బ్యులెన్స్ లో చిక్కుకున్నప్పుడు మాత్రమే విమానం అటూ ఇటూ ఊగడం, అదరడం తెలుస్తుంది.

 Previous Page Next Page