ఇంతకీ ప్లాను ఏమిటి?
నీల్ కుమార్ లక్కీని ఎక్స్ ప్లాయిట్ చేశాడు. తను నీల్ ని ఎక్స్ ప్లాయిట్ చేస్తుంది. చాలా దగ్గరివాళ్ళు తప్ప తనని గుర్తు పట్టలేనంతగా గెటప్ మార్చేసుకుంటుంది. మేకప్ లో కనుబొమల షేపు దగ్గర నుంచి పెదాల షేపు దాకా, ఆ అమ్మాయి ఐశ్వర్యకాదు! వేరే అమ్మాయి అనే భ్రాంతి కలిగించడం అసాధ్యంకాదు. తను మంచి మిమిక్. ఇటాలియన్ అమ్మాయిలు ఇంగ్లీషు నేర్చుకుంటే ఎలా మాట్లాడతారో తనకి బాగా తెలుసు. తన ఉచ్ఛారణ మార్చేస్తుంది. తను అమెరికాలో పెరిగిన ఇండియన్ అని ఎవరూ కనుక్కోలేరు. 'ట'కి బదులు 'ద' దొర్లించేస్తుంటే తనని ఇటాలియన్ గర్ల్ అని భ్రమపడతారు. తన స్ట్రక్చరూ అలాగే ఉంటుంది కదా. ఇంకో సోఫియా లారెన్ లాగా వెర్నాలిసీలాగా.
అతను నమ్మకపోతే?
వెల్ - అప్పటి సంగతి అప్పుడు ఆలోచించవచ్చు. తన మీద తనకి నమ్మకం ఉంది. తన దగ్గర ఉన్న రివాల్వర్ మీద, రివాల్వర్ అక్కర్లేకుండానే ఒక్క కిక్ తో ఎదుటి మనిషిని నరకానికి డిస్పాచ్ చేసెయ్యగల తన కరాటే, కుంగ్ ఫ్యూ, టేక్ వాన్ దో శిక్షణ మీద కూడా అపారమైన నమ్మకం ఉంది.
"నువ్వు వేరే అమ్మాయివని నమ్మించి? ఆ తర్వాత?" అంది లక్కీ.
"నువ్వే చూస్తావుగా!" అంది ఐశ్వర్య.
అనుకున్నట్లే నీల్ ట్రాప్ లో పడ్డాడు. కొత్తపిల్లతో ప్రేమలో పడ్డాననుకున్నాడు. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేసింది ఐశ్వర్య.
ఒకరోజున అతను అడగనే అడిగాడు.
"మరి మన పెళ్ళెప్పుడు?" అని.
"ఇప్పటికే నీకు పెళ్లాం ఉందిగా!" అంది ఐశ్వర్య.
"దాన్ని వదిలేశాను కదా!" అన్నాడు నీల్.
"వదిలేసినంతమాత్రాన పూర్తిగా వదిలించుకోగలవా? అది తిరిగివస్తే" అంది ఐశ్వర్య.
"తన్ని తగలేస్తాను"
"అసలు తిరిగి రాకుండా చెయ్యగలవా?" అంది ఐశ్వర్య.
"అంటే...?" అన్నాడు నీల్ అనుమానంగా.
"అంటే దాన్ని చంపెయ్! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా!"
నీల్ ఒక్క గుటక మింగాడు. "చంపడమా.. ఇంతవరకూ ఎవర్నీ..."
"నీల్! ప్రతిదానికీ ఏదో ఒక మొదటిసారి అంటూ ఉంటుందిగా! హత్యలకి ఇదే మొదలూ, చివరా కూడా అనుకుని ఫినిష్ ఆఫ్ దట్ బిచ్."
తడి ఆరిపోతున్న పెదిమలని తడి చేసుకున్నాడు నీల్.
"ఎలా చంపను?"
నవ్వింది ఐశ్వర్య. "సింపుల్. దాన్ని పిలు. కలిసిపోదాం అని చెప్పు. కలిసి ఓ బోటులో సముద్రంలోకి షికారు వెళ్ళండి. దాన్ని తోసెయ్. గుడ్ రిడ్డన్స్! ఆ తర్వాత నువ్వూ నేనూ కలిసి... వుయ్ విల్ లివ్ హేపిలీ ఎవర్ ఆఫ్టర్!"
నీల్ కళ్ళు ఆశగా మెరిశాయి.
"సరే!" అన్నాడు.
నాటకంలో పాత్రధారిణిలాగా లక్కీ తిరిగి నీల్ దగ్గరికి వచ్చింది. ఆమెకి ఓ రోజంతా స్వర్గం చూపించాడు నీల్. మర్నాడు బోటింగ్ అన్నాడు. ఇద్దరూ సముద్రంలోకి వెళ్ళారు. లక్కీ ఆదమరచి ఉండగా నీళ్ళలోకి తోసేశాడు నీల్. ఆమె మూడుసార్లు తేలింది. తర్వాత అదృశ్యమైపోయింది.
లక్కీ నీళ్ళ అడుగున ఈదుతూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకుందనీ, సేఫ్ గా ఐశ్వర్య ఇంట్లోనే ఉంటోందనీ నీల్ కి తెలీదు. లక్కీ ఎక్స్ పర్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ అని కూడా అతనికి తెలీదు. స్విమ్మింగ్ ఛాంపియనే కాదు. స్కూబా డైవింగ్ లో కూడా ఎక్స్ పర్టు. నీటి అడుగున ఈదగలదు. ఇంక నీల్ జీవితాన్ని దుర్భరం చెయ్యడం మొదలెట్టింది ఐశ్వర్య. ప్యూర్ బ్లాక్ మెయిల్! "నువ్వు లక్కీని చంపావు. నువ్వు మర్డరర్ వి. పోలీసులకి చెప్పేస్తా. పోలీసులకి చెప్పేస్తా!" అని.
లక్కీ 'శవం' కనపడలేదు. ఎలా కనబడుతుందీ? కానీ నెలరోజులు తిరిగేసరికి సైకలాజికల్ రెక్ అయిపోయాడు నీల్. టెన్షన్ భరించలేక పోలీసులకి భయపడి పారిపోయాడు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరో చెప్పారు.
ఆరోజు నుంచి ఐశ్వర్య, లక్కీ ఇంక ఒక్కక్షణం కూడా ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండలేదు.
భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడనుకున్న నీల్ కుమార్ చనిపోలేదా? ఇండియాలో సర్ ఫేస్ అయ్యాడా? దిసీజ్ ట్రబుల్! రియల్ ట్రబుల్! ఆలోచనల్లోంచి బయటపడ్డారు మూర్తిగారు.
"అంటే... నీ ఉద్దేశ్యం?" అన్నాడు ఇన్ స్పెక్టర్ షణ్ముగంతో.
"ఐశ్వర్యని హత్యచేయడానికి నీల్ కి స్ట్రాంగ్ మోటివ్ ఉంది. తను మొదటి నుంచి కూడా పర్వర్ట్. దానికి తోడు రివెంజ్ మోటివ్. ఐశ్వర్య ప్రపంచంలో ఏ మూల ఉన్నా అతను వెతుక్కుంటూ రావచ్చు"
ఇన్ స్పెక్టర్ షణ్ముగం వేపు పరిశీలనగా చూశాడు మూర్తిగారు.
"ఇదంతా నీకెలా తెలిసింది?"
కొంచెం సిగ్గుపడ్డాడు షణ్ముగం.