ఈ యుద్దం రెండు వర్గాలమధ్య జరిగిందని చెప్పొచ్చు. ఒకటి మేధావి వర్గం - రెండవది రాజకీయ వర్గం. మేధావుల ప్రభావం నుండి తప్పించుకోవాలని రాజకీయం చేసిన ప్రయత్నంగా ఇది కనిపిస్తుంది. రాజకీయం మీద తన బలాన్ని నిరూపించుకోవడానికి మేధావి వర్గం చేసిన ప్రయత్నంగూడ ఈ యుద్ధం కనిపిస్తుంది. ఇందులో ఎవరు ఓడారు? అంటే రాజకీయం ఓడింది. శాస్త్రజ్ఞుల వద్దగల శాస్త్రజ్ఞులతో బహుశః వారు రాజకీయాన్ని ఓడించి యుంటారు.
ఇక్కడ మనమొక చారిత్రకాంశాన్ని గమనించవచ్చు. శబళ సృష్టించిన సైనికుల్లో శకులు, యవనులు, పల్లవులు వున్నారు. వీరు విదేశీయులు. ఈ దేశానికి వచ్చి రాజ్యాల నేర్పరచుకున్నారు. వారి కలం ఇటీవలది. అది రామాయణ కాలంనాటిది మాత్రం కాదు. బాలకాండ ప్రక్షిప్తం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తుదకు విశ్వామిత్రుడ్ని ఓడించినవారు కాంభోజులు అని చెప్పారు. కాంభోజులు ఈ దేశంవారు. అంటే విదేశీ సైనికులకంటే మనదేశ సైనికులు బలవంతులని చెప్పడం వారి ఉద్దేశ్యమనిపిస్తుంది.
విశ్వామిత్రుడు బ్రాహ్మణ బలాన్ని ఎదిరించడానికి తపస్సు ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. తనకు ధనుర్వేదం సాంతం ఇవ్వాల్సిందని విశ్వామిత్రుడు కోరాడు. శివుడు వరమిచ్చాడు.
విశ్వామిత్రుడు ధనుర్వేదబలంతో బయలుదేరాడు. గర్వపు రెక్కలు తొడుక్కొని వశిష్టుని ఆశ్రమం మీద దాడి చేశాడు. ఆశ్రమాన్ని నేలమట్టం చేశాడు. ఆశ్రమవాసులు అతని ధాటికి తట్టుకోలేకపొయ్యారు. చెల్లాచెదరైపారిపోయారు. వశిష్టుడు మండిపడ్డాడు. "చిరకాలం నుంచి పెంచి పెద్దచేసిన ఆశ్రమాన్ని పొట్టపెట్టుకుంటావా! వెధవా!" అని బ్రహ్మదండం పట్టుకొని నిల్చున్నాడు. విశ్వామిత్రుడు అనేక అస్త్రాలు ప్రయోగం చేసాడు. బ్రహ్మదండం వాటినన్నింటిని మింగివేసింది. చివరకు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మదండం దాన్ని కూడ మింగేసింది. ఐనా వశిష్టుడు జాజ్జ్వల్యమానమైన అగ్నివలె ప్రకాశిస్తున్నాడు. కోపంతో మండిపోతున్నాడు. దేవతలు అతని రౌద్రం చూశారు. శాంతించవలసిందిగా ప్రార్థించారు. వశిష్టుడు శాంతించాడు. విశ్వామిత్రుడు పరాజితుడైనాడు.
"క్షత్రియ బలమేం బలం? బ్రహ్మబలమే బలం. ఒక్క బ్రహ్మదండం నా అస్త్రాలన్నింటిని మింగివేసింది. ఈ విషయం నాకిప్పుడు తెల్సింది. ఇక శాంతిస్తాడు. ప్రసన్నేంద్రియుణ్ణి అవుతాను. బ్రహ్మత్వం సిద్ధించేవరకు తపస్సు చేస్తాను" అనుకున్నాడు విశ్వామిత్రుడు. భార్యతోకూడ శరావతీనది దక్షిణంగా వెళ్లాడు. అక్కడ మహత్తరమైన తపస్సు చేశాడు. అలా వేయి సంవత్సరాలు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. "నీవు నీ తపస్సువల్ల రాజర్షులందరిని జయించావు" అన్నాడు. వెళ్లిపోయాడు. ఆ వరం విశ్వామిత్రునికి సంతృప్తి కలిగించలేదు. దుఃఖించాడు. కోపించాడు. దేవతలందరు తనను రాజర్షిగానే గుర్తించినందులకు దుఃఖించాడు. మళ్లీ తపస్సు ప్రారంభించాడు.
విశ్వామిత్రుడు ఆనాటి విప్లవవాదిగా కనిపిస్తున్నాడు. అనాదిగా వస్తున్న, ఒకవ్యవస్థను ఎదిరించి ప్రగతిశీలమైన కొత్తవ్యవస్థను ఏర్పరచేవాడు విప్లవవాది. బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్తలంతా సనాతనాన్ని ఎదిరించారు. కొత్త వ్యవస్థ నేర్పాటు చేయటానికి ప్రయత్నించారు. అందుకు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డది మనకందరికి తెల్సిందే. విశ్వామిత్రుడు అలాంటి వాడిలాగే కనిపిస్తున్నాడు. ఆనాటి వ్యవస్థ బ్రాహ్మణాధిక్యతను గుర్తించింది. దాన్ని ఎదిరించడానికి విశ్వామిత్రుడు చాల ప్రయాసలు పడవలసి వచ్చింది. శాస్త్రవిజ్ఞానం తన సొత్తని దానిని గుత్తగొని కూర్చున్నవారిని ఎదిరించడం అతని ఉద్దేశ్యం. ఆ ఉధ్దేశ్య సాధనకే అతడు తన రాజ్యాన్ని వదిలేశాడు. ప్రయాసలు పడ్డాడు.
మరొక విషయం కూడ చెప్పొచ్చు. విశ్వామిత్రుడు క్షత్రియ వర్గానికి నాయకుడై, బ్రాహ్మణ వర్గాన్ని ఎదిరించడానికి కంకణం కట్టుకున్నాడు. అదీ ప్రగతివాదమే.
సమాజం సాధారణంగా సనాతులనే మన్నిస్తుంది. ప్రగతివాదాన్ని సాధారణంగా మన్నించదు. ప్రగతివాదం గెలుపొందినపుడు మాత్రమే సమాజం దాన్ని ఆదరిస్తుంది. సమాజం దాన్ని ఆదరించగానే సనాతులు దాన్ని మన్నిస్తారు దానికి మూఢాచారాల తొడుగులు తొడిగి తమకు అనుకూలంగా తిప్పుకుంటారు. దాన్ని తమ స్వార్థానికి వినియోగించుకుంటారు. ఇది స్వప్రయోజనపరులు చేసే పన్నాగం, బుద్ధుడు, శంకరుడు, రామానుజాచార్యులు తుదకు గాంధీ వీరందరిని సనాతనులు ఎదిరించారు. వారి తరువాత వారి సిద్ధాంతాలను సనాతనీకరించి వాటిని మట్టి కలిపారు.
సనాతనులు ఎంత ఎదిరించినా, విప్లవానికే విజయం కల్గిందని చరిత్ర చాటి చెపుతూంది. విశ్వామిత్రుడు సనాతన ధర్మాన్ని సంస్కరించడానికి ప్రయత్నించాడు. అతనికి అడుగడుగునా సమాతన వ్యవస్థ అడ్డంకులు కల్పించిన విషయం మనం ముందు ముందు చూస్తాం. ఐనా విశ్వామిత్రుడు చలించలేదు. తన ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించాడు. అతడు విజయం సాధించిన విషయం మనకు ముందు ముందు తెలుస్తుంది.
ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడనే రాజుండేవాడు. అతడు దేహంతోనే స్వర్గానికి పోవాలనుకున్నాడు. విశిష్టుడు అతని పురోహితుడు.. అతనికి తన కోర్కెను తెలియబరిచాడు. అది సాధ్యపడదని తెలియజేశాడు వశిష్టుడు. త్రిశంకుడు నిరుత్సాహపడలేదు. అతడు వశిష్టుడు కొడుకుల వద్దకు వెళ్లాడు. వారు నూర్గురు. తమ తండ్రితో కానిపని తమతో కాదన్నారు. అప్పుడు త్రిశంకుడు వేరే పురోహితుణ్ణి ఎన్నుకుంటానన్నాడు. అది విని ఋషి పుత్రులకు కోపం వచ్చింది. వారు త్రిశంకుణ్ణి చంఢాలుడివి కమ్మని శపించారు. త్రిశంకుడు చంఢాలుడైపోయాడు.
పంచితుడైన త్రిశంకుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుడు ఇదివరకే వంచితుడై ఉన్నాడు. త్రిశంకునితో యజ్ఞం చేయిస్తానన్నాడు. ఋత్విజులను, బ్రాహ్మణులను పిలిచాడు. మహోదయ మహర్షి, వశిష్టుడు, అతని పుత్రులు మాత్రం రాలేదు.
"యజ్ఞం చేసేవాడు చండాలుడు. చేయించేవాడు క్షత్రియుడు. దేవతలు, ఋషులు, హవిస్సుల నెలా అందుకుంటారో చూద్దాం" అనుకున్నారు.
విశ్వామిత్రుడు వారి మాటలను విన్నాడు. మండిపడ్డాడు. "నేనెలాంటి దుష్టత్వం ఎరుగను. ఉగ్రమైన తపస్సులో వున్నాను. అలాంటి నన్ను నిందించారు. మీరు భస్మీభూతులగుదురుగాక. తర్వాత ఏడు వందల జన్మలదాక పీనుగులను తిందురుగాక." అని శపించాడు. తర్వాత విశ్వామిత్రుడు యజ్ఞం ప్రారంభించాడు. శాస్త్ర ప్రకారం హవిస్సులను అర్పించాడు. దేవతలనందరిని ఆవాహనం చేశాడు. కాని దేవతలు రాలేదు. విశ్వామిత్రుడు కోపంతో మండిపోయాడు. స్రువం చేతబట్టి "రాజా నిన్నిదే స్వర్గానికి పంపుతున్నాను వెళ్లు" అన్నాడు. మునులు చూస్తూనే వున్నారు. త్రిశంకుడు స్వర్గానికి శరీరంతో వెళ్లిపోయాడు.
దేవతలు అది సహించలేదు. "గురుశాప హతుడైన నీవు తలక్రిందులుగా భూమిపై పడిపో" అన్నారు. అది విని త్రిశంకుడు "రక్షించు రక్షించు" అని కేకలు వేశాడు. విశ్వామిత్రుడది విని బుగ్గైపోయాడు. వెంటనే కొత్త నక్షత్రాలను సృష్టించాడు. "ఇంకో ఇంద్రుని సృష్టిస్తాను. లేదా ఇంద్రుణ్ణే లేకుండా చేస్తాను" అని గర్జించాడు. అది విని దేవతలు వణికిపొయ్యారు. శాంతించవలసిందని విశ్వామిత్రుని ప్రార్దించారు. అప్పుడు విశ్వామిత్రుడు "నేను ఆ త్రిశంకునికి సశరీరస్వర్గం ఇస్తానని అన్నాను. నా మాటకు తిరుగులేదు" అన్నాడు. దేవతలు గడగడలాడారు. "మహర్షీ! నీవు సృష్టించిన నక్షత్రాలు, నీవు పంపింన త్రిశంకుడు స్వర్గం పొందిన త్రిశంకుడు స్వర్గం పొందిన వారిలా ఉంటారు" అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు శాంతించాడు.