Previous Page Next Page 
గోరింటాకు పేజి 24


    ఆమె బదులు చెప్పకుండా కోపంగా శరీరాన్ని అటువైపు లాక్కుంది... ఇంట్లోకి పోయాక ఆమెను మంచంమీద పడుకోబెట్టి దుప్పటికప్పాడు అతను. ఆమె తల దగ్గర నిలబడి వొంగి ముఖంలోకి చూశాడు. నిశ్శబ్దంగా, జాలిగా ఏడుస్తోంది మంజువాణి. అతని హృదయాన్ని వెన్నతో నింపినట్లయింది. మరికొంచెం వంగి ఆమె చెవిలో ఇలా అన్నాడు. "మీరు కన్నీటితో నా రక్తాన్ని నీరుగా మారుస్తారేగాని నా మొర ఒకింత వింటారా! మిమ్మల్ని చూచినప్పుడు నా మనసు ఎలాంటి భావాల్తో నిండిపోయేదో, ఎటువంటి పవిత్రమైన వూహల్తో నిండిపోయేదో మీకు ఎలా అర్థమవుతుంది? నా జీవితంలో మిమ్మల్ని చూసిన గౌరవదృష్టితో ఇంకెవర్నీ చూడలేదు. నన్ను ఎందుకిలా దుర్మార్గుణ్ని చేసి ఇలాంటి కఠినమైన పదాలు పలికించారు?"

 

    ఆమె జవాబు చెప్పకపోయేసరికి "ఇంత కఠినమైన శిక్ష అనుభవించటంకన్న చావటం మేలు నేను. ఇది మీకు న్యాయమా?" అంటూ ఇవతలకు జరిగి వస్తూండగా అతనిచెయ్యి అనాలోచితంగా ఆమె పాదంమీద పడింది. అన్నాడు "ఇది నా చెయ్యి వుండవలసిన ప్రదేశం. దెబ్బ తగిలింది కదూ?"  

 

    "అవును, తగిలింది దెబ్బ. నా పాదమెందుకు పట్టుకుంటారు? వదిలి పెట్టండి" అందామె ఏడుస్తూనే.

 

    "శిష్యుణ్ని కదా. ఆ మాత్రం అర్హత లేదా? మీరు క్షమించాననాలి."

 

    రెండు నిమిషాలు ఆమె జవాబుకోసం ఎదురుచూచి, ఏమీమాట్లాడక పోయేసరికి ఖిన్నుడై "మంచిది. మీకిది న్యాయమనితోస్తే అలాగే మౌనం వహించండి... ఒకమాట... మీ లేఖ చదివాను. ఆ ఘడియే, ఆ క్షణమే మీకు దాసోహం అన్నాను. కాని మీకు అర్థంకాదు. మల్లెపువ్వులాంటి మీ హృదయాన్ని గాయపరచాననేకదూ మీ కోపం? మీ దయ. ఈ పవిత్రమైన అనుభూతిలో, ఆ స్వచ్ఛమైన దశలో అంతకంటే ఏం చెయ్యను నేను? రేపే ఇక్కడ్నుండి వెళ్ళిపోతున్నాను. నేను కనిపించకపోవటమే మీకు శాంతి."   

 

    అతను వెళ్ళిపోదామని ఓ అడుగు ముందుకు వేశాడు. ఇంతలో వెనుక నుంచి అతని చొక్కాను పట్టుకుని ఎవరో లాగినట్లయింది. పులకితుడై వెనక్కి తిరిగాడు.

 

    అతని చేతిని తీసుకుని హృదయానికి హత్తుకుంటూ "ఉఁ హుఁ వెళ్ళనివ్వను" అన్నది మంజువాణి.

 

                                                        * * *

 

    "ఏమిటన్నయ్యా అలా వున్నావు?" అంది సౌదామిని.

 

    "సౌదామినీ! అలా మాట్లాడుకుంటూ కాలవదాకా పోయివద్దాం వస్తావా కాని గ్రౌండ్స్ లో స్టూడెంట్సు ఆడుకుంటున్నారు. చూస్తే..."

 

    "ఏడిశారులే... కాని కాలవకేసి వద్దు. కొండ ఎక్కుదాం. ఆ కొండచివరకు ఎక్కాలని ఎన్నాళ్ళనుంచో నా కోరిక."

 

    "పద" అంటూ రాజారావు ముందుకు నడిచాడు.

 

    "ఈ కొండపుట్టి ఎన్నివేల సంవత్సరాలయిందో!" అంది సౌదామిని.

 

    రాజారావు అన్యమనస్కంగా వున్నాడు. వినిపించుకోలేదు. అది కనిపెట్టి సౌదామిని "అన్నయ్యా! నాకు ఫిట్సురోగం వుంది. పడిపోయి చచ్చిపోతానేమో? నన్ను కాపాడేభారం నీదేసుమా!" అన్నది.

 

    రాజారావు ఒక్కమారుగా ఉలిక్కిపడి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు."ఏమిటి సౌదామినీ అన్నావు? నేనుండగా నీకు..." అన్నాడు.

 

    ఆమె ఫకాల్న నవ్వింది. "కంగారుపడకు అన్నయ్యా! నిన్ను ఈ లోకంలోకి రప్పించాలనే ఈ ఎత్తువేశా"నన్నది. రాజారావు సిగ్గుపడి ఆమె చేతిని విడిచిపెట్టబోయాడు కాని ఆమె అతని వ్రేళ్ళు గట్టిగా పట్టుకుని వదల్లేదు.

 

    "చెప్పు అన్నయ్యా!" అంది.

 

    "ఏమిటి?"

 

    "నీ వ్యాకులపాటుకు కారణం?"

 

    రాజారావు చప్పున "ఛీ. ఇలాంటి కబుర్లెందుకులే సౌదామినీ! మనసుల్ని చికాకుపరుస్తాయి. మొన్న దేవుడి గురించి చెప్పానా? ఇవాళ మతాన్ని గురించి చెబుతాను."

 

    "ఉహుఁ! నాకు ఇవ్వాళ అవేమీ వద్దు. నాకు మనసుని గురించి చెప్పు."

 

    "ఎవరి మనసు?"

 

    "నీ మనసు."

 

    "అది ఏముంది? అది ఒట్టి చంచలం. చాలా అసహ్యం. ఎంతో వికృతము."

 

    ఉన్నట్లుండి ఈ పిల్ల నవ్వసాగింది. "ఎందుకు?" అనడిగాడు రాజారావు విస్మయంగా.

 

    "ఎవరిని వాళ్ళు పొగడుకోవటం... తిట్టుకోవటం ఆరంభిస్తారు... తర్వాత?"

 

    "దానినిండా కర్మఫలము, కల్మషము, కశ్మలము."

 

    "అబ్బా!"

 

    "నువ్వు హాస్యం చేస్తావు సౌదామినీ! ఒక పురుషుడు ఒక స్త్రీని కాముకదృష్టితో చూడటం చాలా తేలిక. ప్రేమించటం ఒక సుఖమైన అనుభవం. సోదరిగా చూడటం అదృష్టం. భార్యగా చూడటం స్వార్థం. పవిత్రంగా చూడటం సంఘర్షణ. శక్తి,ఆశక్తీ అక్కడే దెబ్బలాడుకుంటాయి.     

 

    "పవిత్రమైన వస్తువుల్నే మనస్వంతం చేసుకుందామనుకుంటామన్నయ్యా!"

 

    రాజారావుకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లయింది. "అవును. మనం దేనికైతే భయపడతామో... అదే మనని ఆకర్షిస్తూంటుంది" అన్నాడు నీరసంగా.

 

    సౌదామిని ఓ రాయి ఎక్కుతూ అంది హఠాత్తుగా "మనకు ఇష్టంలేని పనులు చేయడంలో అసహ్యంతోపాటు, గొప్పతనంకూడా ఫీలవుతాం కదూ అన్నయ్యా!"

 

    "ఇప్పుడెందుకు సౌదామినీ ఆ మాట?"

 

    "నేనెప్పుడూ నాకిష్టంలేని పన్లు చేస్తూ వుంటానులే!"

 

    "అయితే నీకు పెళ్ళిచేసుకోవటం ఇష్టమా? కాదా?"

 

    "ఎంత అయిష్టమో అంత భయంకూడా." అన్నది మెల్లగా నవ్వి.

 

    "ఒకవేళ అయిష్టం అని అనుకోవటంకూడా ఆత్మవంచనేమో?"

 

    "కావచ్చు అన్నయ్యా! ఒకవేళ అదే ఆత్మవంచన అయితే అలాంటి మనస్తత్వం కలిగివున్నందుకు నేను బాధపడను. పై పెచ్చు సంతోషం కూడా. అన్నయ్యా! నాకు ఆయాసంగా వుంది. ఇక్కడ కాసేపు కూర్చుందాం. అవునూ, చెప్పవేం నీ గురించి?

 

    ఆమె ఓ ఎత్తయిన ప్రదేశంమీద చతికిలబడి కుతూహలంగా అడిగింది.       

 Previous Page Next Page