Previous Page Next Page 
గోరింటాకు పేజి 23


    "సిగ్గా? విడ్డూరమే. ఆడదే వదిలేసింది."

 

    "అప్పుడేలే వచ్చేది చిక్కు" అంటూ అతను ఆమె ముఖంకేసి ఓ నిమిషం తదేకంగా చూశాడు.

 

    "ఏమిటీ విపరీతం? అంతలా చూడవచ్చా?"

 

    "ఈ ముఖంలో గనుక ఒకానొకభావం ద్యోతకం కాకపోయి వుంటే ఇన్ని మాటలు మాట్లాడి వుండేవాడ్నా అని..."

 

    "ఏమిటప్పుడే భావాలదాకా పోయారు. మరి అందం విషయమో! మీ రెక్కడన్నా చూశారా ఇంతటి రూపసిని?"

 

    "అందమైన వాళ్ళందరకూ తమ రూపసంపదను గురించి ఓ నమ్మకం, అహంభావం వుంటాయి. అవి తెలియకుండా వుంటే...?"    

 

    "అవి ఎరగా పెట్టకపోదురు. మీరు రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు?"

 

    "లెక్కపెట్టను. రేపు చెబుతాను లెక్కవేసి."

 

    "అంతశ్రమ అక్కర్లేదు. నేనెన్నడో లెక్కవేశాను. అదిసరే. మీ నిర్దయను గురించి పూర్తిగా వినరేం?"

 

    "సెలవియ్యండి."

 

    "మీరు చేసిన ఒక్కొక్క తప్పుతో ఇవతలివాళ్ళ ఒక్కొక్క ప్రాణం తినేశారు. ఆరోజు సాయంత్రం ఆ అమ్మాయిలిద్దరూ పాట పాడుతుంటే మీరెందుకలా కూర్చున్నారు? అంతకు ముందురోజు కిటికీ దగ్గర గంటసేపు అలా కదలకుండా. దీర్ఘంగా ఆలోచించారే! అప్పుడు ముఖం ఎందుకండీ బ్రహ్మాండంగా పెట్టారు? అదిసరే...! మీ ముఖంలో నేనెప్పుడో మరచిపోయాననుకున్న సుధాకరుని లక్షణాలు యెందుకు వున్నాయి?"  

 

    "ఆగండి...! ఎవరీ సుధాకరుడు మధ్యలో?"

 

    "ఒక రొమాంటిక్ స్టోరీలో సగం కథానాయకుడు."

 

    "ప్రస్తుతం ఏమిచెస్తూ వుండొచ్చు?"

 

    "రంభా, ఊర్వశి ఇత్యాదులు సరససల్లాపాలు ఆడుతుంటే రిఫ్యూజు చేస్తూ ఉండొచ్చు."

 

    "ఓహో...! అయితే మీరు ట్రాజిడీలోంచి కామెడీలోకి పరుగెడుతున్నారన్న మాట!"

 

    "ఊఁ! బాగా గ్రహించారు. అదీ ఇప్పుడు నేను చేస్తున్న పని."

 

    "అంతేనా నా నిర్దయ?"

 

    "ఇంకా... రోజుకి కొన్ని వందలసార్లు మీరు కనిపిస్తారేమోనని తపించి చూసేటట్లు ఎందుకు చేశారు?"

 

    "నా శరీరంలో మీ చూపులు చాలా గ్రుచ్చుకున్నాయన్నమాట. గురువుగారి దగ్గర బాణాలకి ఏమీ లోటు  లేదు."

 

    "నిజమే ఆ మాట. వాటికి ఓ మంత్రంకూడా అంటించి వదిలే శక్తి వుంటే..."

 

    రాజారావు మనసులో అనుకుంటున్నది ఒకటి, బయటకు మాట్లాడుతున్నది ఒకటి. విచిత్రమేమిటంటే ఇది అతను కావాలని చేస్తున్న పనికాదు.

 

    "ఉన్నట్లుండి మాటలు ఆపెయ్యడం మీ హాబిట్ లలో ఒకటేమిటి?"

 

    "..........."

 

    "లేకపోతే ఎదుటివాళ్ళను ఆకర్షించటానికా ఈ మార్గం?"

 

    "ఓ... రాజా!"

 

    రాజారావు ఉలిక్కిపడ్డాడు. "క్షమించండి మంజువాణీ! నా పేరు రాజారావు. రాజాకాదు. అలా పిలిస్తే ఎలానో వుంటుంది."

 

    "ఉండనివ్వండి మహానుభావా! ఏం చేస్తాం?"

 

    "మహానుభావా, రాజా అన్నమాటలు మీరు మానకపోతే గదిలోంచి బయటకు గెంటేస్తాను."

 

    "అదీ అందమైన దృశ్యమే. కాని నా వంటిమీద మీ చెయ్యి పడుతూందే. పోన్లేగాని ఏదో ముఖంలో భావం అన్నారు ఇందాక. అదేమిటో చెప్పండి."

 

    "ఉహుఁ! చెప్పను."

 

    "ఎందుచేత?"

 

    "నాకు చేతకాదు."

 

    "పోనీ నేను చెప్పేదా?"

 

    "వద్దు."

 

    "ఎందుచేత?"

 

    "మీరు నిజం చెప్పేస్తే కొంప మునిగిపోతుంది. నేను భరించలేను."

 

    "పోన్లెండిగాని రాజా!" నాలిక కొరుక్కుని నవ్వుతూ "సారీ! నేను వచ్చినందుకు మీరు ఆశ్చర్యపడరేం?"

 

    "ఎందుకు పడాలి?"

 

    "నావంటి సంసారి, ఓ ఆఫీసరుగారి భార్య, ఓ అందమైన స్త్రీ, ఓ పరాయి అబ్బాయి గదికి ఇలావస్తే ఆశ్చర్యపడవద్దూ!"

 

    "అందుకనే మిమ్మల్ని ఇంక దయచేయమని చెబుతున్నాను."

 

    "మీకు బొత్తిగా మర్యాద తెలియదేం?"

 

    రాజారావు కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. అది ఆమె కంటబడకుండా వుండాలని ముఖం ప్రక్కకి త్రిప్పుకుంటూ "మిమ్మల్ని 'కులటా' అని పిలిచే అధికారం నా కిప్పుడుందని తెలుసా?" అన్నాడు హఠాత్తుగా.

 

    "ఏమిటి?" అన్నది మంజువాణి తృళ్ళిపడి.

 

    "నాకా చనువు తీసుకోవాలనివుంది. తీసుకునేదా?"

 

    ఆమె లేచి నిలబడి "భలే మంచి పసందైనమాట విసిరారు. మీ ఆధిక్యత బయటపడిందనేగా మీకు తృప్తి" అన్నది.

 

    "మంజువాణీ!" అన్నాడు రాజారావు కఠినంగా. "దయవుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. నన్ను గురించి నాకు తెలుపనక్కరలేదు. చీకటిలో భయపడితే వచ్చి దిగబెడతాను."

 

    "ఆఁ పెద్ద భయం తీర్చేవాడివి వచ్చావులే నువ్వు" అంటూండగానే ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. రగ్గక్కడ పడేసి గబగబ క్రిందకు పరుగెత్తింది. రాజారావు "ఆగు..." అంటూ ఇంకేదో అనుకోబోతున్నాడు. ఇంతలో క్రింద దభీమని చప్పుడయింది. అతను అయ్యో అనుకుంటూ కంగారుగా పరుగెత్తాడు.

 

    ఆమె నీటిగుంటలోపడి మెల్లగా అతి ప్రయాసతో లేస్తోంది. రాజారావుకి కళ్ళు ఆర్ద్రమైనాయి. వెళ్ళి ఆమె భుజం పట్టుకుని లేవదీస్తూ "కాస్త చూచి నడిస్తే..." అన్నాడు.

 

    "నా వంటిమీద చెయ్యి తియ్యండి" అంది కోపంగా.

 

    "ఈ కోపాలను లెక్కచెయ్యను. అట్టే మొండికేస్తే మిమ్మల్ని ఎత్తుకుని లోపలకు తీసుకుపోగలను తెలుసా?" అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని నడిపించసాగాడు.ఇద్దరూ వానలో చప్పగా తడిసిపోసాగారు.

 

    "మీరుకూడా మిగతావాళ్ళలో జమేనా? మీ చమత్కారమంతా ఒక్క తృటిలో ఎగిరిపోయిందే!" అన్నాడు రాజారావు.                    

 Previous Page Next Page