తిలక్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది బాధతో కాదు. తనకు ఓ ఆత్మీయురాలు దొరికిన భావన ఆనందభాష్పాలుగా రూపాంతరం చెందింది. చిన్నప్పట్నుంచీ ఏ అభిమానానికి నోచుకోని అతను ఆమె అభిమానానికి కదిలిపోతున్నాడు.
నీటి చప్పుడు అతన్ని ఈ లోకంలోకి లాక్కొచ్చింది. అటు చూశాడు. కొళాయి తమ మీద కసితో నీళ్ళు ఒలకబోస్తున్నట్టు అనిపించింది.
చుట్టూ చూశాడు.
ఉత్తరుడి కళ్ళల్లో ప్రాణభయం పేరుకుపోయి వుండడం మసక వెలుతురులోనూ ఎర్రగా కనిపించింది. బుద్ధుడు మాత్రం ఇంకా నిబ్బరాన్ని కోల్పోలేదు. మరో అయిదు నిముషాలకు అతనూ జావకారిపోతాడని అనుకున్నాడు తిలక్.
అతని మెదడులో చిన్న కదలిక.
ప్రమాదం నుంచి బయటపడటానికి చిన్న ఉపాయం తట్టింది. తన ట్రిక్ ఖచ్చితంగా పని చేస్తుందన్న నమ్మకం లేకపోయినప్పటికి అంతకు మించిన మార్గం కనిపించడం లేదు.
ఇక ఆలస్యం చేయలేదు అతను.
మెల్లగా నీటిలో మునిగాడు.
బుద్ధుడు, ఉత్తరుడు వూపిరి బిగపట్టి చూస్తున్నారు. ఏదో ఐడియా రావడంతో తమ బాస్ నీళ్ళల్లో మునిగాడని వూహించాడు గానీ ఆ ఐడియా ఏమిటో వాళ్ళకు అంతుబట్టడం లేదు.
అడుగుభాగానికి వెళ్ళిన తిలక్ తనకు కావలసిన దానికోసం రెండు చేతులతోనూ వెదుకుతున్నాడు.
మరికొద్దిసేపటికి అతనికి కావలసింది దొరికింది.
అది కొయ్యి మేకు. ట్యాంక్ కడిగినప్పుడు నీళ్ళు బయటికి పోవడానికి వున్న రంధ్రాన్ని మూస్తూ దిగగొట్టిన మేకు అది.
కుడిచేత్తో దాన్ని పట్టుకుని అటూ ఇటూ కదిపాడు. అది బాగా కదిలాక స్పీడ్ గా లాగాడు. వూడి వచ్చిందది. వెంటనే దానిని అక్కడే లూజుగా పెట్టాడు.
రంధ్రంలోంచి నీళ్ళు బయటికి పోతుండడం తెలుస్తూ వుంది.
అప్పటికి వూపిరి పీల్చడం కష్టమైపోయింది.
మెల్లగా లేచి, గుండెల్నిండా గాలి పీల్చుకున్నాడు. చిన్నగా వెళ్ళి బుద్ధుడి పక్కగా కూర్చున్నాడు.
చీకట్లో వేసిన బాణం తగుల్తుందో లేదోనన్న సందేహం కుదిపేస్తోంది నీటిధారను చూస్తూ కూర్చున్నాడు.
మెదడు దాటి గడ్డాన్ని తాకుతున్న నీళ్ళను చూస్తూ భయపడిపోతున్నాడు ఉత్తరుడు. చావు భయానికి అతని గుండె వుబ్బి వికారమయిన ఫీలింగ్ ను కలుగచేస్తోంది అతనిలో.
ఇక నీటిమట్టం పెరగడాన్ని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
బుద్ధుడికి కూడా కంగారు మొదలైంది.
తిలక్ నీళ్ళల్లో మునిగి రంధ్రానికున్న కొయ్యమేకును లాగి తిరిగి లూజుగా పెట్టాడని అతనికి బోధపడింది కానీ అందులోంచి వెళుతున్న నీళ్ళు తక్కువ. పైప్ లోంచి పడుతున్న నీళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి నీటిమట్టం పెరగడం ఖాయం. మరి తమ బాస్ కొయ్య మేకు ఎందుకు లాగాడో తెలియడం లేదు. కొయ్య మేకును పూర్తిగా తీసేస్తే నీళ్ళు ఎక్కువైపోయి, ఆ శబ్దానికి గార్డు అసలు విషయం కనిపెట్టేసే ప్రమాదం వుంది. అందుకే తమ బాస్ కొద్దిగా లూజు చేశాడని మాత్రం అనుకున్నాడు. కానీ దీనివల్ల ప్రయోజనం లేదని, నీట్లో మునిగిపోవడం ఖాయం అని అనిపించగానే బెదురు ఎక్కువైంది. ప్రతి మనిషీ ఏదో పాయింట్ వద్ద జావగారిపోతాడు. మనిషికీ, మనిషికీ ఆ పాయింట్ల మధ్య బేధం వుండచ్చుగానీ సహజమైన విషయాలకూ ఎవరూ అతీతులు కారు.
అందుకే చివరికొచ్చేసరికి అతనూ ఉత్తరుడిలా భయపడిపోతున్నాడు.
అప్పటికే నీళ్ళు ముక్కును తాకుతుండటంతో ఉత్తరుడు కొద్దిగా నడుం పైకెత్తాడు. పైనున్న సిమెంట్ పలకకు తల తగలడంతో తిరిగి యధాప్రకారంగా కూర్చున్నాడు.
తిలక్ నీళ్ళ పైప్ నుంచి దృష్టి మరల్చడం లేదు.
నీళ్ళు ముక్కులోకి రాకుండా బుద్ధుడు నానాతంటాలు పడుతున్నాడు.
పైప్ వైపే చూస్తున్న తిలక్ మెల్లగా కదిలాడు. నీటిధారలో మార్పు వచ్చినట్టు అతను కనిపెట్టాడు.
ఒక్కసారి పైకి లేచి 'యురేకా' అని అరవాలనిపించింది. కానీ తమాయించుకున్నాడు. మెరుస్తున్న కళ్ళతో మిత్రులవైపు చూశాడు.
నీటి ధార సన్నగా అయింది.
తిలక్ తన చేతిని నీళ్ళలోంచి పైకి లేపి విక్టరీ సైన్ చేశాడు.
అప్పటివరకు ఉరకలేసిన నీటిధార తన ప్రతాపాన్ని తగ్గించుకుని, నీరసపడి, ఆపై పూర్తిగా ఆగిపోయింది.
వెంట్రుక వాసిలో తప్పిపోయిన మృత్యువు చూసి పరిహసిస్తున్నట్టు వాళ్ళిద్దరూ చిన్నగా నవ్వారు.
తిలక్ నీళ్ళలోకి వంగి ఏం చేశాడో, ఈ గండం నుండి ఎలా తప్పించాడో ఎంత ఆలోచించినా వాళ్ళకు తట్టడం లేదు.
తొట్టి కిందనున్న రంధ్రానికి కొయ్యమేకును లూజుగా పెట్టడంతో, అందులోంచి నీళ్ళు బయటికి వచ్చి పైప్ గుండా తోటలోకి ప్రవహించాయనీ, కిందనున్న వార్డర్ ఆ నీటిని చూసి ట్యాంక్ నిండిపోయి నీళ్ళు ఓవర్ ఫ్లో అవుతున్నాయనీ భ్రమపడి మిషన్ ఆపు చేశాడనీ వాళ్ళు వూహించలేకపోయారు.
చీకట్లో తను వేసిన బాణం సూటిగా తగిలిందని తెలిసిన తిలక్ మాత్రం వాళ్ళవైపు చూసి గుంభనంగా నవ్వాడు.
* * * *
చీకట్లో కాలేజీ భవనం దెయ్యాల మేడలా వుంది. రోడ్డుకి ఇరువైపులా వున్న అశోకవృక్షాలు రాక్షసుల చేతులను కత్తిరించి భూమిలో దిగగొట్టినట్టున్నాయి. రోడ్డుకి అటూ ఇటూ పాతిపెట్టిన ఇటుక రాళ్ళు ప్లాస్టిక్ కోరల్లా కనిపిస్తున్నాయి. మైన్ గేటు వున్న స్థంభాల మీదున్న రెండు బల్బులు రాక్షసబల్లి పెట్టిన గుడ్లలా వున్నాయి.
ఆ ప్రాంతంలో మసక వెలుతురు సన్నటి తెల్లటి పొరలా పరుచుకుని వుంది గాలి భయం భయంగా వీస్తోంది.
లాలస కారు గేటు దాటి రోడ్డంటా పరుగెత్తి కాలేజీ భవనం ముందు ఆగింది.
ఇటుకరాయి రంగు జీన్స్ మీద లైట్ బ్లూ షర్ట్ వేసుకున్న ఆమె కారులోంచి దిగింది. వాచ్ చూసుకుంది. పన్నెండుకు పదినిముషాలు తక్కువ. అంటే మరో గంటవరకు వెయిట్ చేయాలనుకుంటూ కారుకు ఆనుకుని నిలబడింది.
దూరంగా జైలు ప్రహారీగోడ కనిపిస్తోంది. టెర్రస్ పైనున్న హై ఓల్ట్స్ బల్బు చీకటి దేవత నుదుటన అతికించిన వెలుతురు స్టిక్కర్ లా వుంది.
ఇంకో గంటకు కరెంట్ ఆగిపోతుంది. అప్పుడు తిలక్, అతడి స్నేహితులు ప్రహారీ గోడ దగ్గరకు వస్తారు. అక్కడ నిలబడి వున్న తను అవతలికి తాడు వదులుతుంది. వాళ్ళు ఇటువైపుకు వస్తారు. నలుగురూ కారులో టౌన్ లిమిట్స్ దాటేస్తారు... ఇంతకీ తిలక్, అతడి స్నేహితులు బ్యారెక్కునుంచి బయటపడ్డారా? ఏమైనా వూహించని అవాంతరం ఏర్పడి బ్యారెక్కులోనే వుండిపోయారా? అప్పుడు తనేం చేయాలి?