Previous Page Next Page 
ఉషోదయం పేజి 23

    "లేదమ్మా! ఇవాళెందుకో కాస్త అనీజీగా వుంది. తలనొప్పి, ఒళ్ళునొప్పులుగా వుంది. తొందరగా ఇంటికెళదామనిపించింది. పనిమీద మనసు లగ్నం చెయ్యలేకపోతున్నాను..." అన్నారాయన.
    నీరద ఆదుర్దాగా తండ్రి చేయిపట్టుకుని, "ఒళ్ళు కాస్త వేడిగా వుంది డాడీ. జ్వరం వచ్చినట్టుంది. మీరు వెళ్ళండి డాడీ,మాత్ర వేసుకుని రెస్ట్ తీసుకోండి. నన్ను శ్రీనివాస్ డ్రాప్ చేస్తాడులెండి... ఇంకా నాకు ఓ గంట పనివుంది డాడీ. మీరు వెళ్ళండి.. శ్రీనూ, డాడీని కారులో కూర్చో పెట్టిరా" అంది.
    "నే వెళ్ళగలను అతనెందుకమ్మా, శ్రీనివాస్! నీరదని ఇంట్లో జాగ్రత్తగా దింపి వెళ్ళు బాబూ" నారాయణమూర్తిగారు వెళ్ళిపోయారు.
    ఎనిమిదిన్నరకి ఇద్దరి పనీ పూర్తి అయింది. పేపరు మేటర్ సెట్ చేసి ఇచ్చి "పద వెళదాం ఇంక" అంది నీరద కంప్యూటర్ ఆఫ్ చేసి.
    శ్రీనివాస్ స్కూటర్ స్టార్ట్ చేశాడు.
    "రేపు తొమ్మిదిగంటలకి మనకి పాండురంగారావుతో అపాయింట్ మెంట్ వుంది. మర్చిపోకు. రేపు ఆఫీసుకి వచ్చాక అక్కడినించి కలిసి వెళదాం..." అంది.
    "అలా ఎందుకు ముందుకూ, వెనక్కి మీ ఇంటికొచ్చి పికప్ చేసుకుంటాను"
    "లేదులే. కొన్ని పేపర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి, ఆఫీసులోనే కలుద్దాం" అంది.
    స్కూటర్ సడెన్ బ్రేక్ తో ఆగింది.
    రోడ్డుమధ్య ఓ స్కూటరు పడివుంది. దానిపక్కనే మనిషి పడున్నాడు.
    "మైగాడ్... యాక్సిడెంట్ అయినట్టుంది." శ్రీనివాస్ స్కూటర్ దిగుతూ అన్నాడు. నీరద దిగి గబగబా అక్కడికి వెళ్ళబోతూంటే సడెన్ గా ఎక్కడినించో ఓ చెయ్యివచ్చి ఆమెని పక్కకి లాగింది. గిరుక్కున వెనుదిరిగి చూసేసరికి శ్రీనివాస్ ని వెనకనించి ఓ మనిషి గట్టిగా నోరుమూసి పట్టుకున్నాడు. కళ్ళుమూసి తెరిచేలోగా నీరదని అక్కడ చీకట్లో ఆగివున్న వ్యాన్ లోకి లాగి ఎక్కించాడు. శ్రీనివాస్ ని పట్టుకున్నవాడు ఒక్కతోపు తోసి శ్రీనివాస్ ని పడేసి స్టార్ట్ చేసిన వ్యాన్ ఎక్కడం అంతా అరనిముషంలో జరిగిపోయింది. ముందుకు బోర్లాపడిన శ్రీనివాస్ కాళ్ళు చేతులు చెక్కుకుపోయాయి.
    నెమ్మదిగా లేచి దులుపుకుని చూసేసరికి దూరంగా వ్యాన్ వెళ్ళిపోతోంది. చీకట్లో నెంబరుకూడా చూడలేకపోయాడు. శ్రీనివాస్ తేరుకుని గబగబా సెల్ ఫోన్ తీసి నారాయణమూర్తిగారికి ఫోను చేశాడు.
    కాఫీతో మాత్ర వేసుకుని కాస్త మగతగా పడుకున్న నారాయణమూర్తికి శ్రీనివాస్ అంటున్న మాటలు సరిగా అర్థంకాలేదు. గాభరాగా చెబుతున్న అతని మాటలు గోలగోలగా అనిపించింది. "శ్రీనివాస్... ఏం జరిగింది... నీవు చెప్పింది నాకేం అర్థం కావడంలేదు. నెమ్మదిగా చెప్పు..." ఆందోళన అణచుకుని నెమ్మదిగా అడిగారు.
    అప్పటికి శ్రీనివాస్ కాస్త కూడదీసుకుని జరిగింది చెప్పుకొచ్చాడు.
    ఆయన నిర్ఘాంతపోయారు. మెదడు పనిచెయ్యలేదు ఒక్కక్షణం. ఇలాంటిది జరిగుతుందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు.
    ఎంతసేపూ ఆ బెదిరింపులు విని తనని ఏమన్నా చేస్తారేమో అనుకున్నారు. కాని ఇలా ఊహించని విధంగా నీరదని టార్గెట్ చేస్తారని ఎదురు చూడకపోవడంతో దిమ్మెరపోయాడు. ఆయన చెయ్యి వణికింది. "శీనూ, నీవు తిన్నగా పోలీసు స్టేషన్ కి రా. నేనూ వెంటనే అక్కడికి వస్తున్నాను" వణుకుతున్న కాళ్లతో కారు తాళాలు తీసుకుని బయటికి వచ్చారు.
    "అదేమిటి బట్టలేసుకున్నారు? ఒంట్లో బాగాలేదన్నారు. ఈ రాత్రి మళ్ళీ బయటికెళుతున్నారేమిటి" టీ.వీ. చూస్తున్న లలితమ్మ ఆరాటంగా అంది.
    "అతిముఖ్యమైన పని మర్చిపోయాను. ఒక్క అరగంటలో వచ్చేస్తాను" మొహం తిప్పుకుని గబగబా వెళ్ళిపోయారు.
    నీరదని టార్గెట్ గా ముందునించి అనుకున్నారా... లేక తను దొరకలేదని నీరదని కిడ్నాప్ చేశారా? ఇవాళ నీరద స్కూటరుమీద రావడం వాళ్ళపనికి సులువైంది. రోజూ ఇద్దరూ కలిసి కారులో వెళ్ళేవారు. అవకాశంకోసం చూసి ఈరోజు ఈ పని చేశారంటే తమని ఎవరో కనిపెడ్తూండి కబురు అందిస్తూన్నారన్నమాట.
    ఈ సెల్ ఫోన్లు వచ్చాక కమ్యూనికేషన్ సులువై వార్తలు ఆగమేఘాలమీద వెళ్ళిపోతున్నాయి. ఆలోచనల్లో వుండగా సెల్ ఫోన్ మోగింది.
    "ఏం, ఇప్పటికైనా తెలిసిందా మావి ఉత్తి బెదిరింపులు కావని... నీ కూతురు నీకు దక్కాలంటే ముందా రాతలు మాను. ప్రజాసేవ కావాలో, కూతురు కావాలో తేల్చుకో... ఈ విషయం పోలీసులకి చెబుతావని మాకు తెలుసు.మాకేదన్నా జరిగేముందు నీ కూతురు ఏమవుతుందో ఆలోచించుకో"గడగడా మాట్లాడిందా మగగొంతు.
    "రాస్కెల్... నీకు ధైర్యం వుంటే నాతో తలపడాలి.. ఓ ఆడపిల్లమీద కాదు నీ ప్రతాపం... ఇలా కిడ్నాప్ చేసి మీరు ఎన్నాళ్ళు తప్పించుకోగలమనుకుంటున్నారు" ఫోన్ అవతలనించి కట్ అయింది.
    సెల్ ఫోన్ లో నెంబరు చూసి ల్యాండ్ లైన్ అని గ్రహించారు. ల్యాండ్ లైన్ అంటే ఇలాంటి ఫోన్లు సాధారణంగా పబ్లిక్ టెలిఫోన్ బూతులనించి వచ్చినవే అవుతాయి. సెల్ వాడితే నెంబరు తెలుస్తుందని తెలిసినవారు... అంటే ప్రోఫెషనల్స్ అయివుంటారు. కిరాయిగూండాలు, ఇలాంటి పనులు అలవాటైన వారికి డబ్బిచ్చి చేయించిన పని.
    పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ రాసుకున్నారు. శ్రీనివాస్ ద్వారా జరిగింది విన్నారు. హఠాత్తుగా జరగడం వలన చీకటిలో అసలు మనుషుల ముఖాలు చూసే అవకాశమే కలగలేదన్నాడు. వెహికల్ మాత్రం టాటాసుమో అని చూడగలిగానని చెప్పాడు.
    నారాయణమూర్తిగారు ముందునించి జరిగిందంతా చెప్పుకొచ్చారు. పేపరులో బ్యాంక్ ఇవాళా, పెద్దమనుషుల జాతకాలు బయటపెట్టడం, వాళ్ళ బెదిరింపు ఫోన్ కాల్స్, అన్నీ వివరంగా చెప్పారు.
    "సార్, అలా బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడే పోలీసులకి చెప్పివుంటే ఆ కాల్స్ ట్రేస్ చేసేవాళ్ళం గదా... చదువుకున్న మీలాంటివారే అలక్ష్యం చేస్తే ఎలా సార్..."
    "ఏదీ ఇంకా మేం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా, కాలర్ ఐడెంటి ఫోన్ పెట్టిద్దామా అనుకునేలోగానే... ఏదీ అంతా కల్సి మొత్తం పదిరోజులలోనే జరిగిపోయింది. వాళ్ళు ఇంత త్వరగా రియాక్ట్ అవుతారనుకోలేదు. నేను ఎంతసేపూ నన్నదో చేస్తారనుకున్నాను గాని మా అమ్మాయిని టార్గెట్ అనుకోలేదు."

 Previous Page Next Page