Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 22

    మోనోను తననుంచి వేరుచేయబడిన ఆనాటి బాధ, భయం, ఆమె మనసులో గూడుకట్టుకొని వుంది.
   
    అవచేతనలో మనసు దాన్ని తోడి ఆందోళనకు గురిచేస్తూంది. తన రెండో బిద్దకూడా తనకు దక్కదేమో అన్నభయం ఆమెకు తెలియకుండానే ఆమెలోని అణువణువునూ పట్టి పీడిస్తూంది.
   
    మరో ఏడునెలలు ఈ మానసిక వ్యధను భరించగలదా?
   
    ఇప్పుడు తనకు ప్రతివిషయం తెరిచిన పుస్తకాన్ని చదువుతున్నంత స్పష్టంగా అర్ధమౌతోంది.
   
    అపరాధ భావంతో ఆమె నరక బాధను అనుభవిస్తూంది. ఆమెనలా వదిలెయ్యడం ప్రమాదకరం. మామూలు మనిషి కూడా కాదు__గర్భవతి-
   
    "అమ్మగారూ! ఓ అమ్మగారూ!" గలగలలాడుతూ పనిపిల్ల పంకజం గదిముందుకొచ్చింది.
   
    "బామ్మగారు గుడికెళుతున్నారట? వస్తారేమో అడగమన్నారు."
   
    "ఉండమను వస్తాను."
   
    సుధ పక్క దిగింది. చీరకుచ్చెళ్ళు సర్దుకొంది.
   
    "ఏమండీ వెళ్ళమంటారా?" భర్తను చూసి అడిగింది.
   
    "మనకు ఆలస్యమైపోతుందేమో? ఇప్పుడే మూడుంబావు అయిపోయింది."
   
    "రేపు గండిపేట వెళదామండీ! రేపుకూడా శెలవు పెట్టారుగా? ఈరోజు బామ్మగారితో గుడికెళ్ళి వస్తాను."
   
    "అలాగే వెళ్ళిరా!"
   
    సుధ బాత్ రూమ్ లోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. చీరమార్చుకుంటూండగా పక్కింటి బామ్మ లోపలకొచ్చింది.
   
    "అమ్మాయ్__సుధమ్మా__ఇంకా...." అంటూ హాల్లో ఎదురుగా నిలబడి వున్న కృష్ణను చూసి ఆగిపోయింది. ఒదిగి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించింది.
   
    "రండి మామ్మగారూ! సుధ చీర మార్చుకుంటోంది" చెప్పాడు కృష్ణ సుబ్బమ్మగారిని లోపలకు ఆహ్వానిస్తూ.
   
    "చూడు నాయనా! అమ్మాయికి తొలిచూలు. జాగ్రత్తగ ఉండాలి."
   
    "తొలిచూలో, మలిచూలో, నీకేం తెలుసు?" అన్నట్టు బామ్మగారి కేసి చూశాడు కృష్ణ.
   
    "ఇంట్లో పెద్ద దిక్కుంటే మంచిది. మీ అమ్మగారినికానీ, లేక ఎవరైనా దగ్గిర బంధువులుంటే పిలిపించు బాబూ. సుధ తరపున ఆడదిక్కు సరైనవాళ్ళెవరూ లేరటగా? ఆమే చెప్పింది. ఏమైనా తొలిచూలు. చాలా జాగ్రత్త తీసికోవాలి. మా పెద్దకోడలికి రెండుసార్లు కడుపు నిలవలేదు. మూడోసారి కాన్పు వచ్చేసరికి అదెంత బెంబేలుపడిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి నాయనా?"
   
    "సుధకు ఇదంతా చెప్పారా?"
   
    "చెప్పాను నాయనా! నాకు చేతనయిన సహాయం ఏదో నేను చేస్తూనే వుంటా. కాని ఐనవాళ్ళు వున్నదారి వేరుగదా?"
   
    "మంచిపని చేశావ్!" అనాలనుకున్నాడు. కాని అనలేదు.
   
    సహాయమట సహాయం!
   
    కొదలకు జరిగిన అబార్షన్ గురించి చెప్పిసుధను హడలుగొట్టింది.
   
    బామ్మను చూస్తూ కృష్ణకూడా కసిగా అనుకొన్నాడు.
   
    అంతలో సుధ ముస్తాబై వచ్చింది.
   
    బామ్మగారివెంట గుడికి బయలుదేరింది.
   
    గేటుదాకా వచ్చి వాళ్ళను సాగనంపాడు. మలుపు తిరిగేదాకా చూస్తూ నిల్చున్నాడు కృష్ణ.
   
    సుధకు పీడకలెందుకొచ్చింది? బామ్మగారు చెప్పిన విషయాలు మనసులో నాటుకుపోవడంవల్లనేనా?
   
    లేక మొదటి బిడ్డ మోనాను తల్చుకోవడంవల్లనా?
   
    ఏదిఏమైనా పరిస్థితులు విషమించకముందె ఏదోఒకటి చెయ్యాలి.
   
    ఆలస్యం అమృతం విషం.
   
    "ఏందిబాబూ ఇక్కడ నిలబడ్డారు?"
   
    కృష్ణ త్రుళ్ళిపడి వెనక్కు తిరిగి చూశాడు.   
   
    పంకజం పళ్ళికిలిస్తూ ఎదురుగా నిలబడివుంది.
   
    "నా పని ఐపోయింది. ఎళుతున్నా బాబూ! ఇల్లు సూసుకోండి ముందు తలుపు తీసేవుంది" అంది పంకజం.
   
    "సరే నువ్వెళ్ళు" అని కృష్ణ అక్కడనుంచి కదిలాడు.
   
    హాల్లోకి వచ్చి సోఫాలో జారగిలబడ్డాడు.
   
    మళ్ళీ పురుగు తొలచడం ప్రారంభించింది.
   
    సుధకు ఎలా చెప్పాలి?
   
    ఆమెనెలా ఒప్పించాలి?
   
    జగన్ దగ్గిరకు ఆమెను చేర్చాలి. కానీ ఇప్పుడెలా ప్రసవించేదాకా ఆగితే? అంతవరకూ తను ఓపికపట్టగలడా? మనసు విప్పి ఆమెతో తను మాట్లాడగలడా? ఆమెతో కాపురం చేయగలడా?
   
    చెయ్యలేడు! తనవల్లకాదు.
   
    ఆమెను తన అర్ధాంగిగా తన మనసు అంగీకరించలేదు.
   
    తొమ్మిదినెలలు కాహ్డు-తొమ్మిదిరోజులు భరించలేడు.
   
    అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని సుధతో తను మామూలుగా వున్నట్టు నటించలేడు. తను దూరదూరంగా తిరుగుతాడు. అందుకు ఆమె బాధపడుతుంది. కుమిలికుమిలి కృంగిపోతుంది. అది మంచిదికాదు. ఆమె జీవితాన్నే నాశనం చేసినవాడౌతాడు తను.
   
    అటు జగన్మోహన్ కూ, మోనాకూ, ఇటు పుట్టబోయే తన బిడ్డకు కూడా అన్యాయం చేసినవాడైపోతాడు.
   
    నౌ ఆర్ నెవ్వర్!
   
    టు బీ ఆర్ నాట్ టు బీ!
   
    షేక్స్ పియర్ నాటకంలోని హామ్లెట్ పాత్ర కృష్ణ కళ్ళముందు కదిలింది.
   
                                                                15
   
    అస్తమిస్తోన్న సూర్యబింబపుకాంతి ఉస్మాన్ సాగర్ నీళ్ళలో ప్రతిఫలిస్తోంది.
   
    పట్టుతివాచీలా పరచుకొనివున్న పచ్చికమీద సుధాకృష్ణలు ఎదురెదురుగా కూర్చున్నారు.
   
    "నిజం చెబుతారా?"
   
    "అడుగు."

    "మద్రాసునుంచి వచ్చినప్పటినుంచీ అదోలా వున్నారు. ముందేదో ఆఫీసు గొడవలనుకున్నాను. అది కాదని నాకిప్పుడు అనిపిస్తోంది. మద్రాసులో ఏం జరిగిందో చెప్పండి. చెప్పకపోతే నామీద__"
   
    "సుధా! చెప్పి నిన్ను బాధపెట్టడం మనస్కరించకే వూరుకున్నాను.
   
    "అందువల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నా మనసులో ఏదో తెలియని గుబులు బాధ రోజురోజుకూ పెరిగిపోతూ వుంది. మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి" ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది.
   
    ఆమె ముఖంలోకి చూడలేనట్టు చూపులు మరల్చాడు. దూరంగా దేన్నో చూస్తున్నాడు.
   
    పశ్చిమదిక్కున ఆకాశం అప్పుడే ప్రసవించిన బాలింతలా వుంది.
   
    "మాట్లాడరేం? మీకు విమ్మీ ఎప్పటినుంచి తెలుసు? ఆమెను ప్రేమించారా?"
   
    "విమ్మీయా?" కృష్ణ తెరిచిన నోరు అలాగే వుండిపోయింది.
   
    "ఎందుకంత ఆశ్చర్యం? విమలను మీరు ప్రేమించలేదా?"
   
    "సుధా! పొరపడుతున్నావ్. మీ విమలను మొదటిసారిగా మొన్న విమానంలోనే చూశాను."
   
    "అయితే మద్రాసులో మీరు మనసిచ్చిన ఆవిడ కన్పించిందా?"
   
    "సుధా నేనెవరినీ ప్రేమించలేదు. నన్నెవరూ ప్రేమించలేదు."
   
    సుధ చివాలున తలెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది.
   
    "పెళ్ళికాకముందు...." అన్నాడు.
   
    ఆమె నిట్టూర్పు విడిచింది.
   
    "జగన్మోహనరావు కన్పించాడు!" ఊపిరి బిగబట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
   
    అమాంతం ఆకాశం వచ్చి నెత్తిమీద పడుతుందనుకున్నాడు.
   
    కాని అదేమీ జరగలేదు.
   
    "ఏమిటలా చూస్తున్నారూ?"
   
    ఏమిటీ? తను ఆ మాటలు పైకి అనలేదా?
   
    తనలో తనే మాట్లాడుకున్నాడా?
   
    మంచిదే అయింది. ఇంకా నయం పైకి అనలేదు.
   
    అలా నేరుగా అడగడం అనర్దాలకే దారితీస్తుంది.
   
    ఎలా మొదలుపెడితే బాగుంటుంది?
   
    ఆలోచనలతో కృష్ణ బుర్ర వేడెక్కిపోతున్నది.
   
    "మద్రాసులో నా చిన్ననాటి స్నేహితుడు కన్పించాడు" చిక్కుపడి పోయిన దారపుఉండలో కొస దొరికినట్టు ప్రారంభించాడు.

 Previous Page Next Page