Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 22


    ఇంకా తెల్లవారలేదు.

    బైట చీకటిగానే వుంది.

    టైము ఎంతయిందో తెలియటం లేదు. అవంతి కిటికీ తలుపులు భద్రంగా వేసి వచ్చి మళ్ళీ మంచం ఎక్కింది. చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆలోచించి ఆలోచించి ఎప్పుటికో మళ్ళీ నిద్రపోయింది.

    ఓ పక్క తూర్పు తెల్లవారుతున్నది.

    బాగా మంచుపడటంతో ఉదయ కిరణాలు కాన రావటం లేదు.

    ఆ సమయంలో మాంచి గాఢనిద్రలో వుంది అవంతి.

    బైట తాళం తీస్తున్న చప్పుడు అవంతి వినలేదు.

    తాళం తీసి ఇందర్ లోపలికి వచ్చి గడియ వేశాడు. చంద్ర దగ్గర మరో తాళం చెవీ వుంది. ఎవరు ముందు వస్తే వాళ్ళు తాళం వెయ్యటానికి తియ్యటానికి వీలుగా చెరో తాళం చెవీ పెట్టుకున్నారు. వాళ్లకి యింకో ఏర్పాటు కూడా వుంది. బల్లమీద ఒక పుస్తకం వుంటుంది. విషయం ఏదైనా వుంటే దాంట్లో రాసి వెళతారు.

    బిజినెస్ పని మీద కంపెనీ వాళ్ళు పంపిస్తే ఇందర్ రాంచి వెళ్లాడు. పది రోజుల దాకా రాడు. చంద్ర అర్జంట్ గా ఊరికి వెళ్ళాల్సివచ్చింది. తను ఊరికి అర్జంట్ గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. వారం పదిరోజుల దాకా తిరిగి రానని వివరంగా చంద్ర పుస్తకంలో రాసి వెళ్ళాడు. అది తెలియదు ఇందర్ కి.

    ఫ్యాను తిరుగుతున్న చప్పుడు తెలుస్తూనే వుంది. బెడ్ లైట్ వెలగటం లేదు. లైటు లేకుండా కటిక చీకట్లో పడుకోడు. చీకటి అంటే చంద్రకి భయం. ఇందర్ కి ఆ విషయం తెలుసు.

    ఇందర్ గోడకి తడిమి చిన్నలైటు స్విచ్ వేశాడు.

    మంచం మీద నిండు దుప్పటి కప్పుకున్న ఆకారం కనిపించింది.

    తెల్లవారు ఝామున  చలిగా వుంటే అవంతి కాళ్ళ దగ్గర వున్న దుప్పటి తీసి నిండా కప్పుకుని పడుకుంది. ఎండాకాలం  అయినా సరే చంద్ర నిండా కప్పుకుని పడుకుంటాడు. అందుకని ఆ పడుకుంది చంద్ర అనే అనుకున్నాడు ఇందర్.

    బెడ్ లాంప్ వెలుగు చాలా తక్కువగా ఆ గదిలో ప్రసరించటం వల్ల వస్తువుల ఆకారాలు తెలుస్తున్నాయి అంతే.

    ఇందర్ వచ్చి అవంతి పడుకున్న మంచం మీద కూర్చున్నాడు. అవంతికి మెలుకువ రాలేదు. చీమ చిటుక్కుమంటే లేచే అవంతి అంతకుక్రితమే నిద్రపోవటం వల్ల గాఢనిద్రలో వుంది.

    "వరేయ్! చందురుడూ!" చంద్ర మీద చెయ్యివేసి ఇందర్ పిలిచాడు.

    చంద్ర అక్కడ లేడు కాబట్టి తననెవరో కొద్దిగా కుదిపినట్లయి అవంతి కళ్ళు తెరిచింది. కాని దుప్పటి తొలగించలేదు.

    "నిద్రపోతే కుంభకర్ణుడే" అని విసుక్కుని తండ్రీ! నీ మొగుణ్ణి వచ్చాను లేవరానాయనా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి ఆపై కళ్ళు మూసుకో. ఈ డ్రస్ లో నేనెలా వున్నానో చెప్పి ఆపై నిద్రపో. నేను డ్రస్ మార్చుకుంటాను. అని ఇందర్ అంటుంటే అవంతి ఆలోచించి చాలా క్విక్ గా ఓ నిర్ణయానికి వచ్చింది. "ఇడియట్! లేవరా అని మర్యాదగా లేపుతుంటే లేవకుండా వేషాలు పోతున్నావా!" అంటూ అవంతి దుప్పట్లోకి చెయ్యి దూర్చాడు. చక్కలిగింతలు అసలు భరించడు చంద్ర. చక్కలి గింతలు పెడదామని ఇందర్ వుద్దేశ్యం. ఇందర్ చేతికి అవంతి గాజుల చెయ్యి తగిలింది. ఇందర్ గబుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని స్ప్రింగ్ లా పైకి లేస్తూనే దుప్పటిని లాగేశాడు. అవంతి క్విక్ గా పైకి లేచి మంచంమీద నుంచి కిందకు గెంతింది. ఇందర్ ఒక్కంగలో స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్ళి పెద్ద లైటు వేశాడు. గదంతా వెలుతురు పర్చుకుంది. ఇందర్ బోర్డు దగ్గరే నుంచుని అవంతిని పరికించి చూశాడు. పెళ్ళికూతురు దుస్తుల్లో వున్న అవంతిని చూడగానే ఇందర్ కళ్ళు జిగేల్ మన్నాయి. కొద్దిగా అలసటతో వాడిన ముఖం తప్ప అవంతి ముమ్మూర్తులా అందమైన పెళ్ళికూతురిలా వుంది. రెండు చేతులూ ఎక్స్ ఆకారంలోకి గుండెకి నొక్కిపట్టీ మధ్య మధ్య బిత్తర చూపులు చూస్తూ వణికి పోతున్న ఆ పెళ్ళి కూతురుని చూస్తుంటే ఇందర్ కి అయోమయం అయిపోయింది. ఇక్కడ వుండాల్సిన చంద్ర ఏమయాడో తెలియదు. బైట తాళం వేసివున్న ఇంట్లో ఈ చిన్నారి పెళ్ళికూతురు ఎలా వుందో అంతకన్నా తెలియదు.

    చంద్ర ఏదో పెద్దపనే చేశాడు అనుకున్నాడు ఇందర్.

    అవంతి ఆ నిమిషానే కొత్త అవతారం ఎత్తింది. దానిలో భాగమే ఈ బిత్తర చూపులు, వణకడం వగైరా.

    నల్లగా నిగనిగలాడే మిలటరీ బూటులాంటి బూట్లు. అష్ కలర్ లాంగ్ కోటు రెండు జేబుల్లో స్టయిల్ గా చేతులు. పట్టుదల సూచించే బిగించిన పెదవులు, పొడగాటి ముక్కు, మూతి చివర్లదాకా వుండి కొద్ది వంపు తిరిగిన దట్టమైన మీసాలు. చురుక్కుమనేలా చూసే చూపులు, విశాలమైన నుదురు, కర్లింగ్ హెయిర్, పురుషుల్లో అందంగా హుందాగా వుండే చెయ్యెత్తు మనిషి.

    ఇందర్ భారీ పర్సనాల్టీ అవంతి బిత్తర చూపులతోనే బాగా పరికించి చూసింది. "పిల్లగాడు బాగానే వున్నాడు. చంద్రలాగా అమాయకుడు మాత్రం కాదు. చెప్పింది తొందరగా నమ్మే ముఖంలా లేదు" అనుకుంది.

    పరస్పరం చూడటం అయిపోయింది.

    "ఎవరు నువ్వు?" ఇందర్ అడిగాడు.

    "కరకుగా అడగకపోతే కాస్త మృదువుగా మాట్లాడకూడదా!" అనుకుంది అవంతి. తను ఎవరో మాత్రం చెప్పలేదు.

    "ఎవరు నువ్వు?" ఇందర్ మళ్ళీ అడిగాడు.

    అవంతి బిత్తర చూపులు చూసి వూరుకుంది.

 Previous Page Next Page