మా అబ్బాయి వెధవైనా, మగవాడు కనుక మీ అమ్మాయి వాడికి నచ్చింది కనుక- ఆ నచ్చబడినందుకు మీరు గర్వించండి. అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచే మగపిల్లల తల్లిదండ్రులని నరికి పోగులు పెట్టాలి.
ఆడపిల్ల ఐ.ఎ.ఎస్. అయినా, మగ ఐ.ఎ.ఎస్. వెధవలు కోట్ల కట్నం కోసం డబ్బున్న ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటే ఆడ ఐ.ఎ.ఎస్ లకు తమ స్థాయి వాళ్ళు దొరకక తమకంటే కింద స్థాయిలో ఉన్న మగవాళ్ళను పెళ్ళి చేసుకుంటే కడివెడంత గుమ్మడికాయ అయినా, కత్తిపీటకు లోకువ అనే ఒక పిచ్చి సామెతను పేల్చి పురుషాహంకారాన్ని చూపే మగవాళ్ళని ఎ.కె.56 పెట్టి కాల్చెయ్యాలి.
అదే ఒక ఆడపిల్లకి ఒక మగవాడు నచ్చితే, నచ్చిందని చెప్పటానికి ధైర్యం లేని స్థితికి స్త్రీ జాతిని మీ మగవాళ్ళు దిగజార్చేస్తారు. కనీసం తమ కనీస ఇష్టాన్ని కూడా వ్యక్తపరుచుకోలేని దారుణమయిన స్థితిలో కూరుకుపోయి వుంది నేటి స్త్రీజాతి....
మగవాడికి ఆడపిల్ల నచ్చితే గొప్ప-
ఆ వెంటనే పెళ్ళి.
ఒక అమ్మాయికి, ఓ అబ్బాయి నచ్చితే- అది బరితెగింపు.
ఏం న్యాయం ఇది?
అయినా అసలు మా స్త్రీజాతికే బుద్దిలేదు,
ఎన్టీఆర్ 1986లోనే ఆడపిల్లలకు, మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కు ఇచ్చినా, సమాన వాటాకోసం పోరాడకుండా, ముష్టిగా పడేసే కట్నం తీసుకుని ఓ మూర్ఖున్ని పెళ్ళిచేసుకుని వాడి వెనుక బానిసల్లాగా వెళ్ళి పోతున్నారు. స్త్రీ జాతికి బానిసత్వంలోనే అపరిమితమయిన ఆనందము ఉందేమో......? పెళ్ళికాగానే, మొగుడి ఇంటిపేరు భార్య పెట్టుకోనక్కరలేదు- అనే చట్టం ఎప్పుడొస్తుందో.....?" అంటూ నిట్టూర్పు విడిచింది మాయాదేవి.
"స్త్రీ ఎక్కడైనా దుర్మార్గురాలైతే అది స్త్రీ తప్పు కాదు. అది ముమ్మాటికీ మగవాడి తప్పే!
మగవాడు దుర్మార్గుడైతే ఆ తప్పుని స్త్రీజాతి మీదకి నెట్టేస్తాడు. మగవాణ్ని దుర్మార్గున్ని చేసేది స్త్రీ కాదు. స్త్రీ నుంచి విడిపోయి మగవాడు తనకు తానే దుర్మార్గుడిగా తయారైపోతాడు.
కాలం మారుతోంది. మారాలి..... మార్పు రావాల్సిన సమయం కూడా ఆసన్నమయింది. మా ఇష్టాలకు మీ మగజాతి విలువిచ్చి తీరాలి.....ఎందుకంటే వేల సంవత్సరాలుగా మేం మీకు విలువిస్తూ వచ్చాంకదా.....అందుకు-!"
మాయాదేవి అంత భావోద్వేగానికి గురికావడం మనోహర్ అంతకు ముందెన్నడూ చూడలేదు.
ఆమె వాదనలో అతనికెలాంటి తప్పు కనిపించలేదు.
తనకు మరోచోట తీర్చుకోవాల్సిన కృతజ్ఞతకి తలవంచాల్సిన అవసరం లేకపోయుంటే- ఇలాంటి పరిపూర్ణమయిన స్త్రీకి భర్తగా కాకపోయినా, బానిసగా పనికి కుదిరినా గొప్పగా వుండేదేమో.
కొద్దిక్షణాల్లోనే భావోద్వేగంలోంచి బైటపడిన మాయాదేవి అతని కేసి ప్రసన్నంగా చూపింది.
"నా ఆవేశంలో, ఆవేదనలో నీకేమయినా తప్పు కనిపించిందా?" అతనికేసి ప్రేమగా చూస్తూ అడిగింది మాయాదేవి.
లేదన్నట్లు తలాడించాడు మనోహర్.
"ఆత్మ విమర్శ చేసుకొని, ఆకాశంలో సగభాగానికి జేజేలు పలికేవాడే నా దృష్టిలో నిజమయిన మగవాడు."
"నేనలా ఆకాశంలో సగభాగానికి జేజేలు పలకలేదే- నువ్వు మాట్లాడేది అర్ధమైనట్లే అనిపిస్తున్నా, సరిగ్గా అర్ధంచేసుకునే టైంకి ఏమీ అర్ధంకాకుండా మిగిలిపోతున్నావు. అయినా నన్నెందుకు ప్రేమిస్తున్నావు?" పాల బుగ్గల పసివాడిలా, అమాయకంగా అడుగుతున్న మనోహర్ ని చూస్తూ మరీ తట్టుకోలేకపోయింది- మాయాదేవి. ఆమె కళ్ళలో ఎమోషనల్ ఎక్స్ ప్లోజస్.
"దగ్గరికి రా__ఒకసారి ప్రేమగా, ఇష్టంగా, ఆర్తితో, ఆరాధనతో నన్ను కౌగిలించుకో. ఆకాశంలో సగభాగం ఏమిటన్నది నీకర్ధం అయిపోతుంది- కమాన్-" అందామె.
కంగారుపడిపోయాడు మనోహర్.
"ఇదే తేడా__ఆకాశంలో సగభాగం అన్యాయమయిపోయిందనటానికి ఇదే నిదర్శనం__" అసహనంగా అంది మిస్ మాయాదేవి.
"మీరు రమ్మన్నప్పుడు వచ్చి మిమ్మల్నెందుకు వాటేసుకోవాలి-? ఈ శాసనం ఏమిటి?" మొండికేసిన చిన్నపిల్లాడిలా అడిగాడు మనోహర్.
"వేల సంవత్సరాలుగా మీ మగజాతి వచ్చి వాటేసుకో అని శాసిస్తే, మేము మీ గుండెల్లో గువ్వల్లా ఒదిగిపోయాము. మీరు మీ పెళ్ళాల్ని అందమయిన వాళ్ళుగా, ఇతరులకు చూపించాలనుకున్నప్పుడు, మీ అభిరుచి మేరకు గంగిరెద్దుల్లా తయారయ్యాం- మా ఇష్టాల్నీ, మనసునీ, అభిరుచుల్నీ మూటకట్టి తీసి గట్టున పెట్టి, మనిషి తప్పుచేస్తే, ప్రాణభయంతో తనను తాను దాచుకోకపోతే, చచ్చిపోతాడు.
కానీ మనసు చేసేది తప్పయినా- ఒప్పయినా బైటపెట్టుకుంటేనే అది బతికుంటుంది. మనసు చచ్చి, మనిషి బతికుంటే మాత్రం ఏం లాభం- ఈ ప్రపంచంలో మన స్వేచ్చా, సుఖాలకి తప్ప, మరి దేనికైనా విలువనిచ్చే వారిని మనం ఎందుకు గౌరవించాలి?
పేరు, ప్రతిష్టలు, పాపులారిటీ, భర్త, తండ్రి, పాత్రలు గొప్పవే అయినా, వీటికి అతీతంగా, మీమాంసరహితంగా, మనకు మరో మనిషి అవసరం వుందనిపించినప్పుడు మనం నిజంగా బతికి వున్నట్లు.
ఒకింతసేపు శ్రీశ్రీగారి సోషలిజం ఆవేదనను ఆవల పెట్టి__'ఉస్తాద్ - ఇసా - ఆపండి' గురించి ఆలోచిస్తే ఎంత గొప్ప అనుభూతి సొంతం అవుతుందో ఆలోచించు.
షాజహాన్ గొప్పవాడా-?