Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 22


    ఎక్కడ?

    ఎలా?

    ఎవరిముందు స్పందిస్తుందో అని ఆశగా__

    ఎంతో మంది  ఎదురుచూట్టం ఎప్పటినుంచో ఎందరిలోనో కొనసాగుతున్న నిరీక్షణ.

    మాట్లాడే  తన పెదవులవేపు-పరామర్శించే తన కళ్ళవేపు  చూడకుండా చూసినా....ఆ తదుపరి  తమ చూపుల్ని  బరువయిన ఎదవేపు మరలించి ఆ తదుపరి  తన సన్నని 24 వేపు మరలించేవారంటే  ఆమెకు చిరాకు.... కోపం....

    అందుకే ఆమె అప్పుడప్పుడు తనివితీరా స్నానం చేసేప్పుడు తనువువేపు చూసుకుని, ఆ అద్భుతమైన వంపులు తనపరం కావటం తనకో శాపమేమో  అనుకుంటుంది.

    అదిగో అలాంటిదే  ఉషా....ఆ ఉషా....తమతో  ఎక్కువసేపు  మాట్లాడితే  ఎంత బావుండనుకునే  స్వప్నలోక విహారులు ఇప్పటికే ఎంతోమంది....

    ఆమె నవ్వితే

    ఆమె కళ్ళు నవ్వుతాయి.

    ఆమె చెక్కిళ్ళు నవ్వుతాయి.

    ఆమె పెదవులూ నవ్వుతాయి.

    ఎదుటి మనిషిలోని  చిరాకును  చిరుకోపాన్ని తుదముట్టించే అద్భుతమైన శక్తి ఆమె ప్రత్యేకమైన నవ్వుకుంది.

    అయితే ఏ కొద్దిమంది అదృష్టవంతులో ఆమె నవ్వును చూడగలిగితే- ఎక్కువమంది గంభీరతని చూశారు.

    అతి తక్కువమందే  ఆమెలో చిరాకును, చిరుకోపాన్ని  చూశారు.

    అయితే ఆమెలోని  అందమైన సిగ్గును  ఇంతవరకు ఎవరూ చూడకపోవటం  వలనే ఎవరూ అంత ఇదిగా  ఆమె దగ్గరకాలేదు.

    ఆమె ఎవరికీ అర్ధం కాదు.

    కాని అర్ధమైనట్లే  అనిపిస్తుంది.

    ఆమె ఇప్పుడు చొరవగా  పక్కింటి సమూహంలోకి చొరబడి పోయింది.

    "ఏమైంది? ఎందుకిలా  ఏడుస్తున్నారు....?" చురుకయిన ఆమె సన్నని కంఠం అక్కడ అలుముకున్న గందరగోళాన్ని  బెదిరించింది.

    ఎవరూ ఏం చెప్పలేక పోయారు.

    తిరిగి అదే ప్రశ్నను రెట్టించింది.

    సమాధానం చెప్పాలనుకున్న ఇద్దరు యువకులు ఆమెవేపు చూస్తూ తమ చూపుల్ని  ఆమె నైటీచాటున పారేసుకున్నారు.

    మూడోసారి స్వరం పెంచి అడిగింది.

    అప్పటికి  అక్కడున్న కొందరికి స్పృహ వచ్చింది.

    "సుందరి తన ఛిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ త్రిప్పేసిందట, ఛిట్స్ కట్టినవాళ్ళ చిరు మొత్తాలు చెట్టెక్కి పోయాయి...." ఓ మధ్య వయస్కురాలంది ముక్కు ఎగబీలుస్తూ.

    ఉదయాన్నే ఊర్రూతలూగించే సెన్సేషనల్ న్యూస్....? ఆమెలోని వృత్తి పరమైన ఉద్వేగం ఉరకలు వేసింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోయింది.

    వాళ్ళు చెబుతున్న  ప్రతిమాట ఆమె ఫోటోగ్రాఫిక్ మెదడులో  నిక్షిప్తం అయిపోతున్నాయ్.

    సుందరిని సుందరే అనుకుంది.

    కేవలం సుందరే అనుకుంది ఉషా.

    కాని అనన్యసామాన్యమైన  అండదండలామెకున్నాయని  ఉషాలోని  ఉరుకులు బట్టే చైతన్యానికి తెలియదు.

    ఒక్కొక్కరు తెలిసో తెలియకో  వేసే చిన్న అడుగు మూలంగానే చిరుతపులుల్లాంటి ప్రమాదకరమైన  వ్యక్తులు  బయటకొస్తుంటారు.

    ఆమె వెనక-సుందరి వెనుక కొన్ని చిరుతపులులున్నాయన్న సంగతి  ఆమెకు తెలిసినా ఆమెలోని నీతి నిజాయితీ వేరసేది కాదేమో.


                                                               o    o    o


    నూనూగు మీసాల యువకుడు....నిండు యౌవ్వనంలోకి అడుగిడిన ఆ యువకుడు....ఎత్తయిన జైలు గోడలవేపు  చూస్తూ మెయిన్ వేపు కదిలాడు.

    కనీసం ఒక్కసారన్నా  చిరునవ్వుకు అర్ధం చెప్పకుండా__

    తెలుసుకోకుండా  బ్రతికిన ఉక్కు ముక్కులాంటి  ఉదయ్ గేట్ కేసి వడివడిగా నడుస్తున్నాడు.

    జేబులు కత్తిరించేవాడి దగ్గర్నుంచి, మనిషి ప్రాణాన్ని చిటికెలో  హరించే నరరూప రాక్షసులవరకూ  ఆ జైల్లో వుంటారు.

    గుంటనక్కలు-

    గుడ్లగూబలు-
   
    తోడేళ్ళు-

    కట్లపాములు.

    ఇలాంటి ప్రమాదకరమయిన  వ్యక్తులమధ్య  చేయని  తప్పును రుజువుచేసుకోలేకా-

    బ్రతికేందుకు మరొక  దారిలేక  డబ్బుండి తప్పుచేసిన వాడి తప్పుల్ని  నెత్తిన వేసుకునో, కొందరు మేకల్లా, ఆవుల్లా వారి మధ్యకు చేరిపోతుంటారు.

 Previous Page Next Page