Previous Page Next Page 
రాగవాహిని పేజి 23

    అయినా ఎవడో చస్తాడు. అందరూ చావరుకదా! దండులో గుండి పడితే ఎవడి ఆలో ముండ మోసిందని వీళ్ళకేం? అందుకే సార్! ముందుగా చెపుతున్నాను. ఏవైనా గొడవవుంటే మీలో మీరే పరిష్కరించుకోండి. మా వరకు తేకండి. తెస్తే మేం మంచి వాళం కాదు. తిట్టటం కొట్టటం కాల్చడం మాకు నిత్యకృత్యాలు. అల్లా అయితేనే కానీ దేశంలో శాంతి వుండదు. వస్తాం సార్!" అంటూ కదిలేడు యస్సై సుదీర్ఘోపన్యాసం చేసి.

    యస్సై చెప్పిన ఉపన్యాసం విని నవ్వుకున్నాడు సతీష్.

    "ఊఁ ఏమిటి సంగతి నాగరాజు?"

    నాగరాజు చెప్పటానికి తటపటాయించేడు.

    "ఫర్వాలేదు చెప్పు"

    "శేషఫణిగారి ఆగడాలు మితిమీరేయండీ! అయినా అకౌంటెంట్ చంద్రబాబూ కలసి మా గొంతు కోస్తున్నారు. ఈ మధ్య ఇంజనీర్ షడాననం గారూ వీరికి తోడయ్యారు...."

    "ఏం చేస్తున్నారు?"

    "పనిలోకొచ్చే వయసులో వున్న అమ్మాయిల్ని నానా రకాలుగా గొడవ పెట్తెస్తున్నారు"

    "వూఁ"

    "జీతాలు బట్వాడా చేస్తున్నప్పుడు నెలనెలా తలా రూపాయి కోత కోస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారీ ఏదో సాకు చెపుతారు. మీటింగు ఖర్చులనీ అవనీ ఇవనీ అంటారు."

    "ఇంకా!"

    "మాలో మాకు విభేదాలు సృష్టించి తగాదాలు పెడుతున్నారు. పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు"

    "అంతేనా?"

    "అంతే నండయ్యగారూ!"

    "నాగరాజూఁ"

    "ఆయఁ"

    "మీరంతా వెంటనే పనిలోకి వెళ్ళండి. పని మానేస్తే మీకు కూలీ రాదు. నాకు నాలుగు డబ్బులు రావు. ఉత్పత్తి పోతే దేశానికే నష్టం. మనం మన స్వార్ధం కంటే దేశ శ్రేయస్సు చూసుకోవాలి ముందు. మీకేవయినా యిబ్బందులుంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకోండి. అప్పటికీ నేను పరిష్కరించుకో లేకపోతే మీ యిష్టం సమ్మె చేయండి...."

    నాగరాజు ఒక్కక్షణం సోదర కార్మికులవైపు చూసేడు.

    "జిందాబాద్" అనే కేకలు మార్మోగేయ్.

    సతీష్ ముఖం వికసించింది.

    "మరి అంతా డ్యూటీకి వెళ్ళండి"

    వికసించిన ముఖాలతో అంతా వెళ్ళేరు.

    శేషఫణి వైపు చూశాడు సతీష్! ముఖంలో కత్తి వేటుకి నెత్తురు చుక్కలేదు ....

    సతీష్ లోపలికి కదిలేడు.

    శేషఫణి మౌనంగా అనుసరించేడు.

    ఆఫీసు రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు సతీష్.

    ఆఫీస్ రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు సతీష్ లోపలికి రాబోయిన ఫణిని "జస్ట్! మినిట్ బయటే కూర్చో! త్వరగా పిలుస్తా!" అన్నాడు గంభీరంగా.

    ఆ మాటతో శేషఫణి ఆశలు గాల్లో కలిసిపోయాయి.

    షడాననాన్ని పిలిపించి గద్దించేడు సతీష్. అత నున్నదున్నట్లు చెప్పేడు. చంద్రబాబు మాత్రం ఎంతకీ ఒప్పుకోలేదు. అందర్నీ బయటికి వెళ్ళమన్నాడు సతీష్.

    పి.ఎ.ని పిలిచేడు.

    అంతదాకా జోక్యం చేసుకోకుండా వున్న పి.ఏ విషయం అంతా వివరించేడు.

    "చంద్రబాబుని డిస్మిస్ చేయ్. శేషఫణిని సస్పెన్షలో వుంచేసి నోటీస్ యివ్వు. సంజాయిషీ చూసి చర్య తీసుకుందాం. షడినానికి కెమికల్స్ ఫ్యాక్టరీకి ట్రాన్సఫర్ చెయ్. లేబరాఫీసరుతో మాట్లాడు"

    చకచక ఆర్డర్లు తయారయ్యాయి.

    సంతకం చేసి ముగ్గుర్ని పిలిచి ఆర్డర్సు యిప్పించేడు.

    శేషఫణి యేదో మాటాడబోయాడు.

    "ఫణీ! నేనేం వినదల్చుకోలేదు. నా విషయం తెలుసుగా. శుభ్రంగా తప్పొప్పుకుంటే సస్పెన్షన్ తో వదిలేసి యింకో చోటికి ట్రాన్సఫర్ చేస్తాను. లేదా డిస్మిస్ తప్పదు. ఫణి! పదవి వుందని కోరలు పెంచుకుని క్రిందివాళ్ళని కాటెయ్యగూడదు. ఎప్పుడూ అధికారం దండం పైన్నే వుంటుంది. నీ తల చితక బొడుస్తుంది"

    ఫణి యేదో చకచక రాసి అతని చేతికిచ్చేడు.

    అది రిజిగ్నిషన్!

    "ఆల్ రైట్! రాజీనామా చేస్తున్నావన్నమాట. ఇలాంటి సమయాల్లో నిజాయితీ పరులే కాదు గిల్టీ కాంషస్ వున్నవాళ్ళు రిజైన్ చేస్తాను దట్సాల్! ఆఫీసులో మాటాడి నువ్వెళ్ళు" గంభీరంగా అన్నాడు సతీష్.

    అది చూచి చంద్రబాబు కూడా రిజైన్ చేశాడు.

    "వెరీగుడ్ నీ పైన సివిల్ కేసు నడుస్తుంది. గుర్తుంచుకో. రికార్డ్సు, ఎకౌంట్స్ అన్నీ సరిగా చూపి వెళ్ళిపో! ఏమాత్రం తేడావచ్చినా కడ్డీలు లెక్క పెట్టుకోవాలి అంతే!"

    షడాననం మాత్రం తనని అక్కడే రిటైన్ చేయమని అడిగేడు. యే మాత్రం వ్యత్యాసం వచ్చినా రిజైన్ చేస్తానన్నాడు!

 Previous Page Next Page