Previous Page Next Page 
రాగవాహిని పేజి 22

    నువ్వన్నట్టే జరిగివుంటే అంతంతే కావలసిందే వుంది? నాకంటే అదృష్టవంతులుంటారా? అయినా నాకంత అదృష్టమా?

    అంతలోనే చప్పున చల్లారిపోయినట్టుగా నిరాశగా అన్న సత్య మాటలకి అతనులిక్కిపడ్డాడు. మార్గంలో పడ్డ తనుకున్న బండి మళ్ళీ గతి తప్పిందే అనుకున్నాడు.

    "ఇదిగో సత్యా! నిర్ధారణగా తెలిసేవరకూ నీలో తప్పులేదు నువ్వు దోషివి కావు. హంతకివి కావు. అది గుర్తుంచుకో!" అని కొన్ని క్షణాలాగి "నేను అలా పనిమీద బయటికి వెళ్ళివస్తాను. అంతదాకా పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో...." అని వెళ్ళి పోయేడు.

    నిట్టూర్చింది సత్య. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ.

                                                                   *        *        *

    సతీష్ ఫాక్టరీవద్దకు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా వుంది. వర్కర్లంతా గేటుముందు బైఠాయించారు. ఘెరావో చేస్తున్నారు. "మేనేజర్ నశించాలి!" "మేనేజర్ దౌర్జన్యం నశించాలి" "కార్మికులపై పెత్తనం చలాయించే మేనేజర్లు నశించాలి" "మా శక్తీపై బ్రతుకుతూ మమ్మల్నే నీచంగా చూసే తత్వం నశించాలి."

    బోర్డులు చేతుల్లో పట్టుక్కూచున్నారు.

    ఫోర్ మెన్ అరుస్తూవుంటే మిగతా కార్మికులంతా గట్టిగా కేకలు పెడుతున్నారు.

    సతీష్ కారుని చూడగానే అరుపు లెక్కువయ్యాయ్.

    "యజమాని డౌన్! డౌన్!"

    ఓ కార్మిక యువకుడు అరిచేడు. కానీ మిగతావాళ్ళు ఆ నినాదాన్ని ప్రతిధ్వనించలేదు.

    "ఛ! నోర్ముయ్!" కసురుకున్నాడు ఫోర్ మెన్.

    నవ్వుకున్నారు సతీష్. "చాలు! వీళ్ళకి ఈ మాత్రం తనపై అభిమానం వుంటే అంతేచాలు! నిమిషాల్లో సమ్మె ఆపు చేయించవచ్చు" ఆనుకుని కారుని అక్కడే ఆపేసి దిగేడు.

    "నమస్కారం అయ్యగారూ!" ఫోర్మెన్ ముందుకువచ్చి నమస్కరించేడు. అతడే కార్మికనాయకుడు.

    "ఏం నాగరాజూ! యేమిటి సంగతి?" వర్కర్లందర్నీ కలియజూస్తూ అడిగేడు సతీష్.

    "ఏం లేదండి! మేనేజర్ ఫణి ఇతన్ని అనవసరంగా కొట్టేడు. తిట్టేడు. గెటౌట్! అన్నాడు" జవాబిచ్చాడో వ్యక్తి.
    ఎందుకన్నాడు?"

    "మరేండి! జయశీలమ్మ భర్తకి జబ్బుగా వుంది. అతను సెలవు పెట్టేడు. ఆస్పత్రిలో చేరేడు. నెలరోజులైంది. మొగుడి జీతంలేదు. తన జీత మొక్కటే అయింది. ఖర్చు లెక్కువయ్యాయి. మరో పదిరోజుల్లో డ్యూటీకి వస్తాడు. అడ్వాన్స్ యిమ్మంది. వస్తాడో చస్తాడో ఎడ్వాన్స్ యివ్వను పొమ్మన్నాడు. అలా అయితే తన జీతంలో నయినా అడ్వాన్స్ ఇమ్మంది. దానికి వెకిలిగా మాటాడి తిరస్కరించి పంపేడు. జయశీలమ్మ నాగరాజుతో చెప్పింది. ఇతను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వమని అడిగేడు. అతను సరియైన జవాబు ఇవ్వకుండా కొట్టి తిట్టి పంపేడు."

    అంతలో బొంయ్ మని శబ్దం చేసుకుంటూ పోలీస్ జీబ్ వచ్చి ఆగింది.

    అదే సమయంలో మేనేజర్ శేషఫణికూడా వచ్చేడు.

    పోలీసుల్ని, అయ్యగార్ని, కార్మికులని సకాలంలో చూసి ఖంగుతిన్నాడు. నోట మాటరాక చూస్తూ వుండిపోయాడు.

    కార్మికులు-పోలీసుల్ని ఫణిని చూడగానే తిరిగి కేకలు వేశారు.

    "పోలీస్ జులుం నశించాలి."

    "మేనేజర్ ముర్దాబాద్"

     "మేనేజర్ డౌన్ డౌన్!"

    సతీష్ వాళ్ళవైపు చూసేడు. అప్రయత్నంగా నోళ్ళు మూసుకున్నారు వాళ్ళు.

    దగ్గరగా వచ్చిన సబ్ ఇన్స్ పెక్టరుతో "ఏం గొడవ. లేదు. సింపుల్ ఏదో మాలో మా తగాదా! యజమాని కార్మికుడూ అన్న తర్వాత ఏవో గొడవలు రాకుండా వుంటాయా? అన్నదమ్ముల పేచీల్లాంటివే యివి. ఇవి మేం సరిచేసుకుంటాం. దీనికి పోలీసులు లాఠీఛార్జీలు ఎందుకు? సారీ. మా మేనేజర్ త్వరపడి ఫోన్ చేశాడు" అన్నాడు సతీష్.

    "మాకు ఫోన్ మీ పేరుతోనే చేశారు."

    మేనేజరు ముఖంవైపు చూశాడు సతీష్.

    "ఐ యాం సారీ, గొడవ ఏం లేదంటున్నాగా. వెళ్ళి రండి."

    "ఆల్ రైట్ వెళ్ళొస్తాను. ఏదయినా గొడవలుంటే చెప్పండి. ఒక్కో వెధవని రెక్కలు విరగ్గొట్టి బొక్కలో తోస్తాను! మీకు తెలీదు సార్! మీరు చాలా మంచివాళ్ళు పైగా ఈ వెధవలతో టచ్ వుండదుగా ఎక్కువగా. అందుకని వీళ్ళ గుణగణాలు మీకు తెలీవు. రాస్కేల్స్ తిన్న ఇళ్ళకే వాసాలు లెక్కపెట్టి ఎసరు పెడతారు. తగినంత కూలీ యిస్తున్నామా? తృప్తిపడి ఊరుకోరు.

    ఎవడో నాయకుడో-మనల్ని చూసి వోర్చలేనివాడో ఏదో అంటాడు. లంచాలు తింటునాడ్రా కొడుకుల్లారా, కూలీ పెంచమని అడగండ్రా అంటూ వత్తి ఎగదోస్తాడు. తలకాయ మాత్రమే వుండి మొదళ్ళులేని యీ గాడిదలు పొలోమంటూ స్ట్రెయిక్ మొదలుపెడతారు.

    దానివల్ల ఎవరికి నష్టం? ఎంత నష్టం అని ఆలోచిస్తారా-ఊహూ వాళ్ళ నోటిదగ్గర తిండిపోతుంది. ఆసామికి ఆదాయం మాత్రమేపోతుంది. గొడవై అల్లరయి మేం చేయి చేసుకుంటే లాఠీచార్జీలోనో, ఫైరింగ్ లోనో చచ్చేదెవరు? ఈ అడ్డగాడ్దెలే.

 Previous Page Next Page