Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 23


                                     దొంగాట
    "ప్రధానమంత్రిగారూ! మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది కనుక 'బో ఫోర్స్' కేస్ ని అణగదొక్కేస్తారా?"
    "బో ఫోర్స్ కేస్ సక్రమంగా విచారించేందుకు భారతప్రభుత్వం స్విస్ ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తుంది. ఈ వ్యవహారంలో దోషులెవరో తేలితే తప్పక వారిని శిక్షిస్తుంది."
    "కాని, ఈ మధ్య బోఫోర్స్ కేస్ విషయంలో కొంచెం స్లోగా వ్యవహరించమని భారత ప్రభుత్వం స్విస్ కోర్టులను కోరినట్లు తెలిసింది."
    "అసంభవం. అలాంటిదేమీ లేదు. భారతప్రభుత్వం స్విస్ ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తుంది- దోషులెవరో తెలిశాక వారేంత పెద్ద పదవిలో ఉన్నాసరే శిక్షిస్తుంది."
    "కాని బోఫోర్స్ విచారణ విషయం పట్టించుకోవద్దని మీ మంత్రి సోలంకి ఒక నోట్ పంపినట్టు తెలిసింది కదా-"
    "ఇప్పుడే నాకూ ఆ విషయం తెలిసింది. ఆ నోట్ ని ఎవడో ఒక నల్లగౌను వాడు మా సోలంకికి ఇచ్చాడట స్విస్ కోర్టులో ఇమ్మని- మా సోలంకికేమీ తెలీదు. బోఫోర్స్ విచారణకి భారతప్రభుత్వం పూర్తి సహకారాన్ని ఇస్తుందని మరోసారి వక్కాణిస్తున్నాను"
    "అదంతా సోలంకే కావాలని చేశాడని ఋజువైంది కదా మరి. ఈ విషయంలో..."
    "నాకూ ఆ విషయం ఇప్పుడే తెలిసింది- అందుకే సోలంకిని రాజీనామా చేయిస్తున్నాం. ఈ వ్యవహారంలో దోషులెవరైనా సరే తప్పక శిక్షిస్తామని హామీ ఇస్తున్నాం"
    "కాని మీకు తెలీకుండా సోలంకి అలా నల్లకోటు వేసుకున్న వాళ్ళందరి దగ్గరా 'నోట్'లు తీసుకుని స్విస్ కోర్టుకి పంపడని అంటున్నారు- దాని విషయంలో..."
    "మన బడ్జెట్ చూడండి! మన్ మోహన్ సింగ్ అద్భుతమైన బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇండియా ప్రైవేటు రంగంలోకి పెద్ద ఎత్తున అడుగుపెడుతోంది. విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తోంది."
    "నేను మాట్లాడేది బోఫోర్స్ గురించి సార్! మీ ప్రమేయం లేకుండా సోలంకి గారు అలా నోట్ లు..."
    "పబ్లిక్ సెక్టారుల వల్ల వస్తోన్న నష్టాలను ఇకనుంచి ప్రభుత్వం భరించలేదు. గోల్డ్ కంట్రోల్ ని తొలగిస్తున్నాం! బ్యాంకులు అదివరకు లాగా కాంగ్రెస్ ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు 'పూజారి' మార్క్ అప్పులివ్వవు- కాపిటల్ గెయిన్స్ మీద టాక్స్ ఉండదు. రెండేళ్ళలో భారతదేశం రూపే మారిపోతుంది"
    "కాని బోఫోర్స్ విషయంలో..."
    "సబ్సిడీలకూ, రాయితీలకూ గుడ్ బై - విదేశీ ఎగుమతులకు అద్భుతమయిన ప్రోత్సాహం మన బడ్జెట్ లో కల్పిస్తున్నాం! ఒక్కమాటలో చెప్పాలంటే ఇది 21వ శతాబ్దం బడ్జెట్! అయితే చిన్న షేర్ల కుంభకోణాలు జరిగి ఉండవచ్చు!"
    "అయ్యో! ఇదేం బడ్జెట్ సార్? ఈ బడ్జెట్ వల్లే హర్షద్ మెహతా షేర్ల కుంభకోణంలో మూడు వేల కోట్ల మేరకు ప్రభుత్వరంగ సంస్థలను బ్యాంకులను ముంచేశాడు కదా?"
    "ఆ కుంభకోణం పూర్తిగా విచారణ జరిపించి దోషులు ఎంత పెద్ద పదవిలో వున్నా సరే తప్పక శిక్షించబడతారని మాట ఇస్తున్నాను-"
    "అందులో మీ కాబినెట్ మంత్రులు ముగ్గురున్నారని మాకు తెలిసింది."
    "అందుకే చిదంబరాన్ని రిజైన్ చేయించాము- ఇంకా పూర్తి విచారణకు సి.బి.ఐ.కి ఆదేశాలిచ్చాం"
    "మరి మిగతా ఇద్దరు మంత్రులెవరో చెపితే..."
    "అయోధ్య సమస్య మన దేశ సమగ్రతకే ప్రమాదం! అన్ని మతాలవారూ కలసి అలాంటి సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి"
    "నేను షేర్స్, స్టాక్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నాను- మధ్యలో మీరు అయోధ్య గొడవతెస్తారేమిటి?"
    "రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా మేము ప్రతిపక్షాలను సంప్రదించే నిర్ణయం తీసుకున్నాం"
    "అది కాద్సార్. షేర్స్ కుంభకోణం..."
    "అప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు జనతాదళ్ రెండు ముక్కలవడానికి కారణం మేము కాదు! వాళ్ళను కొనడానికి మేము డబ్బు ఖర్చుపెట్టలేదు- బంగారప్ప కుడి, ఎడమ భుజాలయిన సారా కాంట్రాక్టర్ల మీద రైడింగ్ జరపడంతో మాకేమీ సంబంధం లేదు"
    "కాని రైడింగ్ జరిగిన తర్వాత మీ అబ్బాయికి బంగారప్ప బెంగుళూరులో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కారుచవకగా అమ్మేశాడు కదా! ఆ తర్వాత మళ్ళీ రైడింగులు జరగలేదు."
    "సి.బి.ఐ. చీఫ్ మాధవన్ రాజీనామాతో మాకేమీ సంబంధం లేదు. మేము అతనిని వత్తిడి చేయలేదు."
    "ఆ స్టాకు స్కామ్ విషయం విచారణ ముందుకి జరగకూడదని మీరతనికి ఆదేశాలిచ్చారనీ అందుకు మాధవన్ ఒప్పుకోకపోవడం వల్ల మీరతనిని బలవంతంగా వాలంటరీ రిటైర్మెంటు తీసుకునేలా చేశారనీ వార్తలు వస్తున్నాయ్"
    "మా ప్రభుత్వం షేర్లు కుంభకోణం విషయంలో సి.బి.ఐ.తో పూర్తిగా సహకరిస్తోంది. ప్రభుత్వ అధికారులనేక మందిని అరెస్టు చేయడం జరిగింది-"
    "కాని ఇంకో ఇద్దరు మినిష్టర్లకు ఆ లావాదేవీలతో సంబంధం వుందని మాకు తెలిసింది.
    "మాకు తెలియదు. ఒకవేళ ఉంటే ఎంత పెద్ద పదవిలో వున్నా సరే వారిని శిక్షిస్తామని మరీ మరీ చెప్తున్నాను."
    "ఇంకో ఇద్దరు కాబినెట్ మినిష్టర్లకు ఆ షేర్ల కుంభకోణంతో సంబంధాలున్నాయని ఋజువులు..."
    "ఆంధ్రాలో, కర్నాటకలో ముఖ్యమంత్రుల మీద అసమ్మతివాదులు చేస్తున్న ఆరోపణల గురించి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది."
    "ఇటీవల జనార్ధన్ రెడ్డి ప్రభుత్వం గ్రాంటు చేసిన మెడికల్ కాలేజీలలో ఒకటి మీకు అత్యంత సన్నిహితులయిన వారికి ఇచ్చింది కదా! ఆ విషయంలో..."
    "స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దళితులనుద్దేశించి 'భంగీ'అన్నమాట ఉపయోగించటం నిజమే కాని అది వారిని ఇన్సల్ట్ చేయడానికి వాడిన మాట కాదు"
    "మీరు అది కావాలని వాడలేదని రుజువు చేయాలంటే క్షమార్పణ కోరాలి"
    "విన్ ఛద్దా స్విట్జర్లాండ్ లో వుండేందుకు లభించిన అనుమతి విషయంలో ప్రభుత్వం పాత్ర ఉన్నదనడం అసమంజసం"
    "అబద్ధం! విన్ ఛద్దా అరెస్ట్ వారెంటుని ఉపసంహరించుకోవడం, అతనికి స్విట్జర్లాండ్ లో ఉండేందుకు అనుమతి ఇచ్చే విషయంలో ఆ ప్రభుత్వానికి అంగీకారం తెలపటం - ఇవన్నీ బోఫోర్స్ విచారణను సమాధి చేయడానికి ఉద్దేశింపబడిన చర్యలు"
    "బోఫోర్స్ విచారణ విషయంలో ప్రభుత్వం స్విస్ కోర్టులకు పూర్తి సహకారం అందిస్తుందనీ, ఆ వ్యవహారంలో దోషులను ఎంత పెద్దవారయినా సరే శిక్షించడం జరుగుతుందని హామీ ఇస్తున్నాను."
                             *    *    *

 Previous Page Next Page