అబ్బో, ఇది స్వర్ణయుగం!
ముఖ్యమంత్రి పదవి మనదేశంలో ప్రధానమంత్రి పదవికంటే ముఖ్యమైందని ఆ పదవి ముందున్న 'ముఖ్య' అన్న అక్షరాలే చెబుతున్నాయ్. అందుకే ఆ పదవికి అంత డిమాండ్. అందుకే ప్రధానమంత్రులు కూడా తమ అవసరాలకూ, పార్టీ నిధులకూ ఇతర లావాదేవీలకూ ముఖ్యమంత్రుల మీదే ఆధారపడతారు. అలాంటి ముఖ్యమంత్రి పదవిలోకొచ్చిన వారిని ప్రతి పత్రికా ఇంటర్వ్యూ చేయడం, టి.వి., రేడియోలు వారి గురించి బాగా ఊదడం మామూలే.
కానీ అర్ధంతరంగా ఆ పదవిని పోగొట్టుకున్నవారి గురించి బొత్తిగా పట్టించుకున్నవారే ఉండరు. ఒకవేళ పదవి నుంచి దిగిపోయిన ఏ రాష్ట్రం తాలూకూ ముఖ్యమంత్రినయినా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ఇలా వుంటుందేమో!
"నమస్కారం ముఖ్యమంత్రిగారూ! పదవి దిగిన తర్వాత మీకెలా అనిపిస్తోంది?"
"చాలా ఆనందంగా వుంది. ఎప్పటినుంచో ఇలాంటి సుదినం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రశాంతంగా గడపాలన్న కోరిక తీరింది - అని పేపరులో రాశాను కదా!"
"పదవిలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ మీకు ఏమైనా తేడా కనిపిస్తోందా? మనలో మన మాట! నిజం చెప్పేయండి!!"
"నీకు మాత్రం కనబడ్డంలా? ఇంత ఖాళీగా ఎప్పుడన్నా ఉందా ఈ హాలు? ఇరవై నాలుగ్గంటలూ ఇక్కడే నాతో పనులు చేయించుకోడానికి పడిగాపులు పడి చచ్చేవాళ్ళు కదూ? అసలు నీకింత తేలిగ్గా అడగ్గానే ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఇచ్చానా?"
"అవున్లెండి! ఆ మాట నిజమే! మీ చుట్టూ మూగే జనం విషయంలో కాకుండా ఇంకేమైనా అసౌకర్యం మీకు కలిగిందా?"
"మెల్లిగా అంటావేమిటి? మనసుకెప్పుడు చిరాకు కలిగినా రిలీఫ్ కోసం గవర్నమెంటు హెలికాప్టర్ లో వరదలొచ్చాయనో, సైక్లోన్ వచ్చిందనో, ఈ రెండూ లేకపోతే క్షామం వచ్చిన ప్రాంతాలు చూడ్డానికనో ఏదొక సాకుతో సరదాగా కొద్ది గంటలు తిరిగేవాడిని, ఇప్పుడా అవకాశమేదీ? సొంత డబ్బుతో ప్లేనెక్కాలి- సొంత డబ్బు అంటే గుర్తుకొచ్చింది.
ఈ పదవి దిగిన వెంటనే నేను భరించలేకపోతున్న విషయం ఏమిటంటే ఏం కొనాలన్నా నేను నా జేబు నుంచి డబ్బు కక్కాల్సి వస్తోంది. నిజం చెప్తున్నాను. ఈ విషయం తల్చుకుంటే నిద్ర కూడా పట్టడం లేదు నాకు. సొంత కార్లు, సొంత పెట్రోలు- అబ్బ హెల్!"
"అంటే అదివరకు మీరు ఏం కొనాలన్నా డబ్బు లేకుండానే కొనేవారా?"
"అవును మరి! ఏ వస్తువు కొనాలంటే ఆ డిపార్టుమెంట్ తాలూకూ ఉన్నతాధికారికి ఫోను చేస్తే చాలు- క్షణాల్లో ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆ వస్తువు ఇంటికొచ్చేది. ఇవాల్టికి ఇవాళ చూడండి. మా ఆవిడకు రెండు జరీ చీరెలు అవసరమయినాయ్. వాటిని విక్రయించే చైర్మన్ కి ఫోన్ చేస్తే "డబ్బు పంపండి మేడమ్! తప్పకుండా మీరడిగిన చీరలు పాక్ చేయించి పంపిస్తాం" అన్నాడంట ఆ దగుల్బాజీ. ఎంత పొగరో చూశావా వాడికి?
వాడి అంతు తెలుస్తానులే తర్వాత - పాపం మా ఆవిడకు అలా డబ్బు కట్టటం అస్సలు అలవాటు లేదు. వాడలా రూల్స్ కి వ్యతిరేకంగా డబ్బడిగేసరికి ఆమె మనసు గాయపడి ప్రొద్దుట్నించి ఏడుస్తూ కూర్చుని వుంది. అన్నం కూడా తినలేదు."
"అయ్యో పాపం! చాలా దారుణమైన విశయమ౧ మానవత్వం విలువలు నిజంగా మంట కలసిపోయినయ్. మీరు పదవిలో ఉన్నప్పుడు ఒకరకంగానూ, దిగిపోగానే ఇంకోరకంగానూ ప్రవర్తిస్తే ఎవరికయినా చాలా బాధగా ఉంటుంది. ఇకపోతే మీ గురించి మరో విషయం కూడా తెలుసుకోవాలని కోరికగా వుంది"
"తప్పకుండా అడుగు ఏమిటది?"
"పదవి దిగకుండా ఉంటే బావుండేది అని మీకు ఎప్పుడయినా అనిపించిందా?"
"ఎప్పుడైనా ఏమిటి నీ తలకాయ్? దిగిన క్షణం నుంచే ఎందుకు దిగానా అని పశ్చాత్తాపంతో సలసల కాగిపోతున్నాను-"
"అందుక్కారణం ఏమిటి?"
"ఏమిటేమిటి? బాంక్ బాలెన్స్. దిగిన రోజునుంచీ అది ఒక్క పైస పెరిగితే ఒట్టు. పదవిలో ఉన్నప్పుడు నువ్వు నమ్ముతావో నమ్మవో గానీ రోజుకి కోటి రూపాయలు చొప్పున పెరుగుతూండేదది. సరే - అందులో కొంత అప్పుడప్పుడూ పార్టీ పెద్దలక్కూడా పంపేవాడిననుకోండి! అది వేరే సంగతి. అయినా రోజూ అంత పెద్ద మొత్తం బ్యాంక్ ఎకౌంట్ లో పడాల్సింది పోయి కనీసం ఒక్క పైసా అయినా పడకుండా ఆగిపోతే ఎవరికయినా ఎలా ఉంటుంది నువ్వే చెప్పు-"
"భవిష్యత్తులో మీ కార్యక్రమం ఏమిటో చెప్తారా?"
"పార్టీకి, ప్రజలకూ సేవ చేస్తూ ప్రశాంతంగా గడపాలన్న నా కోరిక ఇంత కాలానికి నెరవేరినందుకు నాకెంతో ఆనందంగా వుంది. ఇంతకంటే నాకింకేమీ అక్కర్లేదు."
"కానీ మీరు కేంద్రమంత్రి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే - ఎంతవరకు నిజమది? మనది న్యూస్ పేపర్ కాదు! నిజం చెప్పేయండి!"
"అవును. నేనీ పదివి దిగాలంటే కేంద్రంలో పదవి ఇవ్వాల్సిందేనని ముందే వార్నింగిచ్చాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టే దిగాను. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళా రాష్ట్రంలో నా గ్రూప్ వాళ్ళని పోగుజేసుకుని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పడేస్తాను. దాంతో నాకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవయినా వస్తుంది- లేదా కేంద్రంలో మంత్రి పదవయినా వస్తుంది"
"ఒకవేళ అవి దొరకటం కష్టమయితే?"
"అప్పుడు మా అల్లుడికి మంత్రివర్గంలో స్థానం ఇమ్మని పేచీ పెడతాను. లేదా కొద్ది నెలల వరకూ ఏదో రాష్ట్రానికి గవర్నర్ గా వెళతాను. చిన్నప్పటినుంచీ నాకు ఖాళీగా కూర్చోటం ఇష్టం ఉండదు. ఏదో ఒక పనిచేస్తూ ఉండాల్సిందే!"
"మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు సత్యదూరమని మీరు రుజువు చేస్తానని పదవి నుంచి దిగిపోయేరోజున ప్రజలకిచ్చిన సందేశంలో చెప్పారు. మరి ఎంతవరకు రుజువు చేయగలిగారు?"
"అలాగని నేను చెప్పలేదు. ఆ టీ.వి., రేడియో వాళ్ళు నా మాటలు అర్థంకాక చెప్పిన తప్పుడు మాటలవి. అయినాగానీ ఇప్పుడు జరిగిన పొరపాటుని సరిదిద్దుకోలేము గనుక ఋజువులు కొన్ని ఎంతో కష్టపడి సంపాదించాను."
"మీరు అవినీతిపరులు కాదని ఋజువులు సంపాదించినందుకు ఎంతో సంతోషంగా వుంది."
"ఇదిగో - ఆ తిక్కవాగుడే వద్దంది! నేను సంపాదించింది నేను అవినీతిపరుడిని కాదు అన్న ఋజువులు కాదు."
"మరే రుజువులు?"
"ప్రస్తుతం ముఖ్యమంత్రి నాకంటే ఎక్కువ తినేస్తున్నాడనటానికి అవసరమైన రుజువులు సంపాదించాను. ఇంక నా మీద వేసిన కమీషన్ ఎలా తోక ముడుచుకోదో చూస్తాను."
* * *