అతను ఆశ్చర్యపోయాడు. "బూతు నవలలు పబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలా? మీకేం మతి పోలేదు కదా?"
"మరి మన రాష్ట్రంలో నిర్మించే బూతు సినిమాలన్నింటికీ మూడు లక్షలు సబ్సిడీ, టాక్స్ రిబేట్ ఇస్తున్నారు కదా? మీకు మతిపోయే అలా చేస్తున్నారా?"
అతనికి కోపం వచ్చింది.
"ఏయ్! తిన్నగా మాట్లాడండి! ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రభుత్వ ప్రతినిధితో మాట్లాడుతున్నారు!"
"తెలుసు! అందుకే మీ దగ్గరకొచ్చాం! మరి మీరు బూతు సినిమాలకు ప్రోత్సాహకంగా మూడు లక్షలిస్తున్నప్పుడు బూతు నవలలు రాసే రచయితలకెందుకివ్వరు? సినిమా, సాహిత్యం రెండూ సమాజం కోసమే కదా!"
అతను కర్చీఫ్ తో చెమట తుడుచుకున్నాడు. "సినిమాలో బూతు లేకుండా చూడ్డానికి సెన్సార్ బోర్డ్ వుంది!"
"మా బూతు నవలలు కూడా సెన్సార్ చేసుకోండి. మేము వద్దనడం లేదు."
"సినిమా వేరు, సాహిత్యం వేరు."
"ప్రభుత్వమే బూతు సినిమాలకు డబ్బులిచ్చి, ఆవార్డులిచ్చి సమాజాన్ని నాశనం చేస్తున్నప్పుడు అలాంటి పని చేస్తున్న మా బూతు నవలలకెందుఇవ్వరన్నీ?"
"ఏయ్ మిస్టర్! ప్రభుత్వం బూతుని ప్రోత్సహించడం లేదు. బూతు లేకుండా చూడ్డానికి సెన్సార్ బోర్డ్ నిబంధనలున్నాయ్."
"కానీ ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్లెవరు? అందులో చాలామంది మళ్ళీ బూతు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లే వున్నారుగా?"
"సెన్సార్ బోర్డ్ వేసేది మేము కాదు! కేంద్రంలోని ఇన్ ఫర్మేషన్ మినిష్టర్ని కలుసుకుని అడగండి."
"మరి మా బూతు నవలలకు మూడు లక్షలు..." అతను జుట్టు పీక్కున్నాడు.
"ఆల్ రైట్. ఒక మెమొరాండం ఇవ్వండి! చీఫ్ మినిస్టర్ కి పుటప్ చేస్తాం."
మేము మెమొరాండం ఇచ్చి బయటపడ్డాం.
అప్పుడే కేంద్రప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ డిపార్టుమెంట్ కి చెందిన ఓ ఉన్నతాధికారి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగినట్లు తెలిసింది మాకు.
వెంటనే అందరం అక్కడికి చేరుకున్నాం!
"మా చీఫ్ సెక్రటరీగారు సెన్సార్ బోర్డ్ లో బూతు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లనే మెంబర్లుగానూ, చైర్మన్ లుగానూ ఎందుకు వేస్తున్నారో మిమ్మల్నే అడిగితే జవాబు చెప్తారని అన్నారు." అన్నాడు రంగారెడ్డి.
"వాళ్ళకయితే బూతుతో ఎక్కువ పరిచయం వుంటుంది కాబట్టి వాళ్ళనే వేస్తున్నాం! మీకు మన పెద్దాళ్ళు చెప్పే నీతి కథ గుర్తుండే వుంటుంది - దొంగకే తాళం చేతులివ్వాలని! అప్పుడిక దొంగతనం చేయడు కదా! అలాగన్న మాట. ఈ మాత్రం తెలీదా? చూస్తే అంతా ఎడ్యుకేటెడ్ లాగున్నారు!" అన్నాడు మమ్మల్ని పిచ్చాళ్ళను చూసినట్లు చూస్తూ.
"అసలు సెన్సార్ బోర్డ్ మెంబర్లుగా ఎవరిని వేయాలీ అనే గైడ్ లైన్స్ ఏమయినా వున్నాయా?"
"ఎందుకు లేవు! ఆ ప్రాంతంలో వివిధ రంగాల్లో ప్రముఖులయినవారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారినే సెన్సార్ బోర్డ్ మెంబర్లుగా వేయాలి"
"కానీ మీరు వేసిన మెంబర్లలో చాలామందికి అలాంటి పేరు ప్రఖ్యాతులేమీ లేవు కదా?"
"అందరికీ వుండాలని రూలేం లేదు. మీ రాష్ట్రంలో మినిష్టర్లు ఓ లిస్టు తీసుకొచ్చి వీళ్ళందరినీ సెన్సార్ బోర్డ్ లో వేయమంటే మేము కాదనడం బాగుండదు కదా!"
"అవును - బాగుండదు!"
"అలాగే పెద్ద పెద్ద రికమండేషన్ లు తీసుకొచ్చిన వారందరినీ నిరుత్సాహపరచడం బాగుండదు కదా!"
"బావుండదు - బావుండదు."
"అలాగే మా మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ లోని ఫ్రెండ్స్, పార్టీ వర్కర్స్ కోరితే వారిని కాదనడం భావ్యం కాదు కదా?"
"కాదు కాదు"
"మరింక మీ కంప్లెయింట్ ఏమిటి?"
"మీ డిపార్టుమెంట్ లో కొంతమందికి అమ్మాయిలను సమకూర్చేవారిని కూడా మీరు సెన్సార్ బోర్డు మెంబర్లుగా వేశారని మా వాళ్ళు అంటున్నారు."
"ఎవడా మాట అంది? అరెస్టు చేయిస్తాను."
"ఇంకొంతమంది డబ్బు తీసుకొని కొంతమందిని సెన్సార్ బోర్డు మెంబర్లుగా చేస్తున్నారని అన్నారు."
"వాట్ నాన్సెన్స్! ఇలాంటి మాటలు మాట్లాడేటట్లయితే ప్లీజ్ గెటవుట్" కోపంగా అరిచాడతను.
"అలా కోప్పడకండి! ఎవరో కొంతమంది అనుకుంటున్న సంగతి మీకు చెబుతున్నాం."
"అంతా బోగస్! వాళ్ళ మాటలు నమ్మకండి! మా మినిస్ట్రీ టీ.వి. సీరియల్స్ విషయంలో అవినీతికి పాల్పడివుంటే వుండవచ్చుగానీ ఇలా సెన్సార్ బోర్డు మెంబర్ల విషయంలో మాత్రం చాలా నీతిగా ప్రవర్తించి ఇంతకుముందెన్నడూ లేనంతమందిని, అంటే డెబ్బయిమందిని సెన్సార్ బోర్డు మెంబర్లుగా చేసింది. అయినా అపోహలే గానీ మాకు ఎవరైనా లంచం ఇచ్చి సెన్సార్ బోర్డు మెంబర్లయ్యారనుకోండి! దానివల్ల వారికేమిటి లాభం? మీరే ఆలోచించండి!"
"లాభం ఎందుకుండదు? నలుగురు మెంబర్లు కలిసి ప్రొడ్యూసర్ల దగ్గర వేలకు వేలు లంచాలు తీసుకుని ఆ సినిమాకు 'క్లీన్' సర్టిఫికెట్ ఇవ్వవచ్చు కదా! అలా లక్షలకు లక్షలు సంపాదించవచ్చు."
ఆ మాటతో ఆ అధికారి కోపం పట్టలేకపోయాడు. బటన్ నొక్కి సెక్యూరిటీ వాళ్ళను పిలిపించాడు. "వీళ్ళంతా పంజాబ్ టెర్రరిస్టులని నాకనుమానంగా వుంది. లాకప్ లో వేసి వాళ్ళ గురించి అన్నీ తెలుసుకునేవరకూ వదలకండీ."
మేమంతా వాన్ లో పోలీస్ స్టేషన్ కి బయలుదేరాం. "ఇంతకూ నా బూతు నవలల సంగతేమిటి?" విచారంగా అడిగాడు చద్రకాంత్. రంగారెడ్డి అతని భుజం తట్టాడు ధైర్యం చెబుతూ. "డోంట్ వర్రీ నాయనా! లాకప్ నుంచి బయటపడగానే మనమందరము కలిసి ఓ ఉద్యమం లేవదీద్దాం!"
"వయొలెన్స్, బూతు సినిమాలకు రాష్ట్రప్రభుత్వం మూడు లక్షల సబ్సిడీ, టాక్స్ రిబేట్ ఇస్తున్నట్లే బూతు రచయితలకూ, బూతు మిమిక్రీ ఆర్టిస్టులకూ, బూతు బొమ్మలేసే ఆర్టిస్టులకూ, వీధుల్లో బూతు డ్యాన్స్ లు చేసే ట్రూప్ లకూ, వ్యభిచారం వృత్తిగా చేపట్టిన స్త్రీలకు కూడా ఇవ్వాలని ఆందోళన ప్రారంభిద్దాం."
"కాకపోతే ఇవన్నీ మన రాష్ట్రంలోనే చేసేవారికి ఇవ్వాలని కండిషన్ పెడదాం" అన్నాను నేను. అందరూ తప్పట్లు కొట్టారు ఆనందంగా.
* * *