కూతురి వివర్ణమైన ముఖం చూసిన పార్వతమ్మ ఓర్చుకోలేకపోయింది. "మీనాక్షీ! అదసలే సిగ్గుతో ఏడుస్తూంది. కాస్త ముందూవెనకా చూసుకోకుండా ఏమిటాలా అన్నావు?" అని కోడలిని మందలించింది.
"అది ఎంత బాధపడుతూందో తెలుసా? అదేమైనా పిల్లల కోసం ఏడ్చి కంటూందా?....ఏం చేస్తుంది, పాపం!....దాని మాట అతనిదగ్గిర చెల్లుతుందా? ఆడజన్మ యింతేగదా!" అక్కగారిని వెనకేసుకు వస్తూ అంది పూర్ణ.
"బావకి బొత్తిగా బుద్ధిలేదు. చదువుకున్న మూర్ఖుడు!" రామం కోపంగా అన్నాడు.
"ఏభయ్యోపడిలో ఏ ఆసరాచూసుకుని యింకా కంటున్నాడో పిల్లల్ని? ఆమాత్రం జ్ఞానం ఉండనక్కరలేదూ? అక్కయ్య హెల్త్ కూడా అతనికి లెక్కలేదు." శంకర్ కూడా అందుకున్నాడు.
కృష్ణమూర్తి ఊరుకోలేదు. "అవును. ఇంత వయసులో పిల్లల్నికంటే వాళ్ళెప్పటికి పెరిగి పెద్దవాళ్ళవుతారన్న ఆలోచననయినా ఉండవద్దూ! నామట్టుకు నాకు యీ పిల్లల్ని చూస్తూంటే బెంగగా వుంది! అలాంటిది బావగారు ఎంత నిబ్బరంగా కంటున్నారో!" అన్నాడు.
"మా యిద్దరికీ రోజూ యిదే చింత! ఇంత ఆలస్యంగా పిల్లల్ని కన్నాము, వీళ్ళు ఎప్పటికి పెద్దవాళ్ళు కాను అని-" అంత వరకు మాట్లాడని సావిత్రి అంది ఇంగ్లీషులో, చంటిపిల్లకి పాలు పడుతూ, తమ రెండేళ్ళ కొడుకునూ, మూడు నెలల కూతుర్నీ ఉద్దేశించి.
జగన్నాథంగారు కృష్ణమూర్తికేసి చూస్తూ-
"అందుకే నాయనా, ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలనడం! అప్పుడేమో పెళ్ళి చేసుకోమంటే నలభై ఏళ్ళ వరకు చేసుకున్నావుకాదు! ఆ యిబ్బంది ఏమిటో యిప్పుడు తెలిసివచ్చిందా!" అన్నారు సమయం వచ్చిందని.
"ఆ మాట నిజమే! మగవాడు రిటైరయ్యేనాటికి మగపిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి! లేకపోతే ఒంట్లో ఓపిక, చేతిలో డబ్బు రెండూ తక్కువై అవస్థపడాలి అన్నింటికి" సుందర్రావు అన్నాడు.
"ఈ బాధలు ఏవీ లేకుండా ఉండాలంటే బెస్టు థింగ్ అసలు పెళ్ళాడకుండా ఉండడమే!" అని శంకర్ తన సిద్ధాంతం ఉటంకించాడు. "బ్రతికిఉన్న నాలుగు రోజులు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎందుకొచ్చిన జంజాటాలు, బాదరబందీలు!....నన్ను చూడండి. ఏ చీకూ చింతా లేకుండా ఎంత హాయిగా ఉన్నానో! డబ్బు చాలదన్న బెంగలేదు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అవాలన్న చింతలేదు. ఇవాళ ఇక్కడుంటే, రేపు ఇంకోచోట! ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడొచ్చినా, ఏం చేసినా అడిగేవారు లేరు. నాలాంటివాళ్ళు ఇంకా కొంతమంది వుంటే, జనాభాసమస్య తీవ్రత తగ్గి, దేశం బాగుపడుతుంది!"
"అవున్నాయనా! ఉన్నావా, తిన్నావా అని అడిగేవారైనా లేకుండా దిక్కూమొక్కూ లేనివాడిలా పడిఉండడమే బాగుంటుంది నీకు. రెండు రోజులు ఆమొచ్చి పడకవేస్తే ఆ బాగుండడమేమిటో తెలుస్తుంది" అని పార్వతమ్మ తన దుగ్ధ వెళ్ళబోసుకుంది.
"ముఫ్ఫయ్యేడేళ్ళు నిండుతాయి. పెళ్ళి, పెడాకులు లేకుండా అందరూ నీలా కాలక్షేపం చెయ్యగలరా? నీకు నువ్వే, ఆ విజయకి విజయే. ఇద్దరూ బయలుదేరారు దేశోద్దారకులు!" అంది మళ్ళీ.
"ఇంక మనం ఇక్కడినుంచి నిష్క్రమించడం మంచిదనుకుంటాను. అమ్మ పెళ్ళిపురాణం మొదలుపెట్టిందంటే తెల్లారిపోతుంది" అంటూ హాస్యంగా తేల్చేశాడు శంకర్.
"ఏమైనా అంటే మాటకి జవాబు చెప్పకుండా దాటేయడం నేర్చుకున్నావు. కన్నతల్లి నీ మంచికే చెపుతూందన్న జ్ఞానం వుంటేనా?"
"ఊరుకో అమ్మా! కంఠశోష తప్ప నీ మాట వింటాడా ఏమన్నానా? అంటూ అన్నపూర్ణ తల్లిని వెనకేసుకొచ్చింది.
"ఎలా ఊరుకోగలనే? మీరందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉండగా వాడొక్కడూ మోడులా ఉంటే నా ప్రాణం ఎలా ఒప్పుతుంది?"
"కాని నీవేం చెయ్యగలవమ్మా?"
"ఏం చెయ్యలేకపోయినా, కన్న కడుపు కనక ఉండబట్టక అంటాను." నిట్టూరుస్తూ అంది పార్వతమ్మ.
"అమ్మ యింతగా చెపుతూంటే, ఆవిణ్ణి సంతృప్తిపరచడానికి కైనా కాస్త మాట వినకూడదురా?" అంది అన్నపూర్ణ.
"బాగుందే చిన్నక్కా! ఇది ఏ యిష్టం లేని కాకరకాయ కూరో, అమ్మకోసం తినడమా! ఇంకొకరికోసం యీ రొంపిలో దిగమంటావా?"
"బాగుందోయ్.....బాగుంది. పెళ్ళి చేసుకున్నవాళ్ళందరూ రొంపిలోకి దిగినట్లేనా?"మీనాక్షి నవ్వుతూ అంది.
"మీ అందరిసంగతి వేరు. నా ఉద్యోగాన్నిబట్టి, నేను పెళ్ళిచేసుకుంటే చేతులారా బాధలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. నేను ఉండేచోట్లు చాలావరకు కాపురాలు పెట్టడానికి వీలులేనిచోట్లు.....ఆవిడ ఒకచోట, నేనొకచోట! ఎందుకొచ్చిన అవస్థ? అదీగాక, ఏ నిమిషంలో ఏమవుతుందో, ఉంటానో ఊడతానో? గ్యారంటీ లేని బ్రతుకు! నాకు బడి యింకొకర్తి ఏడవడం ఎందుకు?"
"ఛా....ఊరుకోరా! నిండు యింట్లో పెళ్ళి యింట్లో అప్రాచ్యపు మాటలూ నువ్వూనూ! పెళ్ళి చేసుకోకపోతే పీడాపోయింది. ఆ మాటలుకూడా ఎందుకు?" పార్వతమ్మ తీవ్రంగా అంది.
"అమ్మా! వదలా అని అని ఎవర్తినో లవ్ చేసి పెళ్ళి చేసుకుంటాడు. నీకెందుకు అనవసరంగా బెంగ! చూస్తూండు వాడే చేసుకుంటాడు ఎప్పుడో!" పూర్ణ అంది కవ్విస్తూ.
"ఆఁ....మరేఁ, నీలా, అన్నయ్యల్లా లవ్ లు గివ్ లు ఏంలేవు. మాట అంటే మాటే!" అన్నాడు శంకర్ దృఢంగా.
"బావగారు అపర ప్రవరాఖ్యులన్నమాట!" సుందర్రావు వేళాకోళంగా అన్నాడు.
"ఎవరి కర్మకి ఎవరూ కర్తలు? ఏది ఎలా జరగవలసిఉంటే అలా జరుగుతుంది. మనం బాధపడిమాత్రం ఏం చెయ్యగలం?" జగన్నాథంగారు వేదాంతం వల్లించారు.