Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 22


    "సరోజకి పండగకి చీరకొనమని అమ్మ ఎన్నిసార్లో చెప్పింది-సరోజని తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు వద్దు వద్దు అంటూ మొహమాటపడి వెళ్ళటం లేదు సరోజ. అమ్మ యింక లాభంలేదని నన్ను వెంటపెట్టుకుని తీసికెళ్ళి కొనమంది - షాపుకి వెడుతూ నీకు ఫోను చేశాను. నీవింట్లో లేవన్నారు." సంజాయిషీ యిస్తూ అన్నాడు కృష్ణమోహన్.
    "అవును ఎవర్తో ముక్కు మొహం తెలియని దానికి, పనిదానికి చీరలు కొనాలని తెలుసుగానీ.... నాకెప్పుడయినా కొనాలనిపించిందా?" గీత ఉక్రోషంగా, కోపంగా రెట్టించింది. కృష్ణమోహన్ ఆ అభియోగానికి ఏం చెప్పాలో తెలియక తడబడి ఆ తరువాత నవ్వేశాడు. "గారాలపట్టివి, లక్షాధికారిణివి నీకు నేను కొనే చీరలు కంటికి ఆనవు. అయినా పాతకాలంవాడిని. నీ పేషన్సు అవీ నాకేం తెలుస్తాయి. అయిన నిన్న నీకూ కొనాలనే, నిన్ను తీసుకెడితే నీవే సెలక్ట్ చేసుకుంటావని ఫోను చేశాను. నీవు లేకపోతే నేనేం చేసేది. ఎలాగో వచ్చావు కొందామంటే మాట విన్పించుకోకుండా పరిగెత్తావు. అసలలా గాభరాగా ఎందుకు పరిగెత్తావు. అడిగినదానికి జవాబు చెప్పకుండా ఏమిటో సాధిస్తున్నావు?..."
    "నేనేం గాభరాగా పరిగెత్తలేదు. వళ్ళు మండిపోయి కోపంగా వెళ్ళిపోయాను. నాకంటే నీకు ఆ సరోజే ఎక్కువయినప్పుడు అక్కడింక నేనెందుకు అని వెళ్ళిపోయాను." మొహం తిప్పుకుని బింకంగా అంది గీత. ఆమె కళ్ళల్లోకి చూస్తూ "అబద్దం ఆడకు గీతా!" అన్నాడు కృష్ణమోహన్ గాభీరంగా. గీత బిత్తర పోయింది అతని మొహం చూస్తూ అంతా అతనికి తెల్సిపోయిందేమిటా అన్నట్టు వణికిపోయింది. అంతలోనే లేని నిబ్బరం తెచ్చుకొని "అబద్దం ఏమిటి-నేనేం అబద్దం ఆడలేదు" అంది గాభరా అణచుకుంటూ.
    "ప్రభాకర్ ని చూసి పరిగెత్తావు కదూ నీవు...నిజం చెప్పు అతన్ని చూసి నీవెందుకు భయపడ్డావు?" గీత మొహం పాలిపోయి-వణుకుతున్న పెదాలతో "అతను....అతను చెప్పాడా?" అంది ప్రాణం లేనట్లు భయవిహ్వలై చూస్తూ.
    గీత మొహంలో భావాలని వింతగా చూస్తూ...."అవును అతనికి నీవు తెలుసునని, కాలేజీలో జూనియర్ అని..."
    "యింకేం చెప్పాడు....యింకా ఏమన్నాడు..." ఆరాటంగా మధ్యలోనే ఊపిరి బిగబట్టి అడిగింది గీత. "యింకేం అడగలేదు నేను. ఏం అతను నీకు తెలుసుగదా మరి ఎందుకలా గబహరాగా పరిగెత్తావు?" ఆశ్చర్యంగా; అనుమానంగా గీత ముఖకవళికలను చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. "అబ్బే అదికాదు...అసలేమిటంటే" మాటలు మింగుతూ, గాభరాపడ్తూ, కలవరపడ్తూ..."అతనికి నామీద కోపం, అందుకు అతన్ని చూడగానే భయంవేసింది....ఏం అంటాడోనని పరిగెత్తి వెళ్ళిపోయాను..." నోటికొచ్చిన కుంటి సంజాషీ చెప్తూన్న గీతని మరింత ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. ఆ క్షణంలో గీత కాస్త తేరుకుని ఉదయం నించి ఆలోచించిన జవాబు చెప్పడం మొదలు పెట్టింది.
    "అదికాదు మోహన్.....ప్రభాకర్, నేను ఒకే కాలేజిలో చదివేవారం- అతను నాకో ఏడాది సీనియర్ ... పైకి అలా వున్నాడు గాని అప్పుడు కాలేజిలో మహా అల్లరి చేసి ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు - నా కొకసారి ప్రేమ లేఖ రాశాడు. నాకు కోపంవచ్చి అది తీసికెళ్ళి తిన్నగా ప్రిన్సిపాల్ కి చూపించాను - అయన చివాట్లు పెట్టి ఒక ఏడాది కాలేజినుంచి డిబార్ చేశారు. ప్రభాకరం నన్ను చూసి కసిగా చూసుకో నిన్నేంచేస్తానో అని బెదిరించాడు, వంటరిగా వెడ్తుంటే. హడలిపోయి అప్పటినుంచి వంటరిగా ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు - ఈలోగా అదృష్ట వశాత్తు మేమీవూరు వచ్చేశాం ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత అతన్ని చూడగానే భయంవేసి పరిగెత్తాను-ఏమిటీ...యింకా కాలేజి అమ్మాయిలాగ అతనికి భయపడడం సిల్లీగాలేదూ ఉదయం ఏమిటో అతన్ని చూడగానే గాభరాపడ్డాను. అంతే..." తేలిగ్గా నవ్వుతూ అంది గీత.
    ఆ జవాబుతో కృష్ణమోహన్ మొహంలో సంతృప్తి కన్పించింది. తేలిగ్గా నవ్వి.... "అదా....ఇంకా ఏమిటో అనుకున్నాను. ఒకసారి మాట్లాడి జరిగిందానికి క్షమాపణ చెప్పేయి సరిపోతుంది." అన్నాడు తేలిగ్గా.
    గీత కంగారు నణచుకుంటూ....బింకంగా "ఆ...నే నెందుకు చెప్పాలి....నాకేం అవసరంలేదు" అంది.
    కృష్ణమోహన్ ఇంక రెట్టించకుండా వూరుకున్నాడు.
    
                                       *    *    *
    
    "గీత మీ కెలా తెలుసు?" ప్రభాకరం సరోజని ఆఫీసులో అడిగాడు మర్నాడు.
    "కృష్ణమోహన్ గారికి కాబోయే భార్య..."
    ప్రభాకరం ఆశ్చర్యంగా "నిజంగా......" అన్నాడు.
    "ఏం. అంతాశ్చర్యపడ్తున్నారు. అసలు ఆవిడ మీకెలా తెలుసు!" సరోజ కుతూహలంగా అడిగింది. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. "గీత-గీతని చేసుకుంటారా కృష్ణమోహన్ గారు?" రెట్టించాడు మళ్ళీ.
    "ఊఁ...సంబంధం నిశ్చయించి చాలా రోజులయింది. ఈలోగా ఆయన తండ్రిగారు పోయిన కారణంగా పెళ్ళి వాయిదా పడిందట."
    "ప్రేమపెళ్ళా!?" హేళనగా అడిగాడు.
    "కాదనుకుంటా-పెద్దలే కుదిర్చారు. గాని, ఇంతాలశ్యం అయింది గనక యిప్పుడు ప్రేమించుకుంటున్నారు లెండి పెళ్ళి అయ్యేలోగా." నవ్వింది.
    "హు...ప్రేమ-గీతకి ప్రేమ అన్నమాటకి అర్ధం తెలుసా!" కసిగా అన్నాడు.
    సరోజ ఆశ్చర్యంగా చూసింది. "ప్రభాకరంగారూ..గీత మీకెలా తెల్సు?"
    "తెలుసు-ఆమె ప్రేమకి కొన్నాళ్ళు నోచుకున్న దౌర్భాగ్యుడిని-ఆవిడ ప్రేమకి నేను తగనని తెలుసుకున్నాక మాసిన బట్టలా వదిలేసిన ఆ అదృష్టవంతుడిని నేను. యిప్పుడీ కృష్ణమోహన్ వంతు వచ్చిందన్నమాట. అఫ్ కోర్స్ - ఈసారి ఇతన్ని వదిలేయడానికి కారణం లేదనుకోండి. అంతస్థు, ఆస్థి వున్నట్లున్నాయిగా ఆయనకి." అతని మాటల్లో కసిని, హేళనని ఆశ్చర్యంగా చూసింది సరోజ.

 Previous Page Next Page