తారతో తిరుగుతున్నా తార కావాలని, ఆమెని చూడకపోతే ఉండలేని స్థితి ఎప్పుడూ రాలేదు. ఆమె సమక్షంలో పారవశ్యం, ఆమెని చూసినా, తాకినా తనలో ఏ వికారము, ఏ అలజడి కలగలేదు ఎప్పుడూ. తన మగ ఫ్రెండ్స్ తో సినిమాకి వెడితే వాళ్ళ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తాడో అలాగే అన్పించేది తార కంపెనీ కూడా. ఎటొచ్చీ యీమె ప్రఖ్యాత నటీమణి కనక అలాంటి ఆమె ప్రక్కన తనుండడం తనకి ఏదో ప్రత్యేకతని ఆపాదించినట్టు భావించడం మినహా మరే భావం కలగలేదు.
తామిద్దరూ ఏకాంతంగా ఎన్నిసార్లు గడిపారు. తను కావాలంటే ఎన్నో అవకాశాలుండేవి. కాని ఎప్పుడూ ఆ భావన తన మనసులో చొరబడలేదంటే ఇంక ప్రేమకి తావేక్కడుంది? ప్రేమ అటుంచి కనీసం స్త్రీ పురుషకర్షణకి కూడా తను లోనుగాలేదంటే తార పట్ల తనకే భావం లేదన్న సంగతి స్పష్టపడడం లేదూ? మరి తారతో తనెందుకు తిరుగుతున్నాడు?
ముందులో పాత పరిచయం , ఆ తరువాత ఆమె మీద జాలి, సానుభూతి, ఆ తరువాత కలిసి తిరిగితే ఏర్పడే ఎటాచ్ మెంట్ ......ఆమె తనకి కాలక్షేపం ఇచ్చే మంచి స్నేహితురాలుగా మాత్రం కనిపిస్తుంది. అంతే....... అసలు యీనాడు వట్టి సుందరే మళ్ళీ కనిపిస్తే ........ ఒకసారి పలకరించడం మినహా తను ఆమెతో ఏవిధమైన సంబంధం పెట్టుకునేవాడా ? యిలా తిరిగేవాడా! ఊహు అంటే అంటే, కేవలం తార 'సినీతార' కనక తను ఎట్రాక్ట్ అయ్యాడన్న మాటేగదా! ఆమెకి డబ్బుంది కనుక, ఆమె తనని హాయిగా త్రిప్పుతుంది గనక తను ఆమె దగ్గరికి వెడుతున్నాడు గాని, తార కనక ఉత్తి సుందరే అయితే తను యిన్నిసార్లు కలుసుకునేవాడు కానే కాదు! అంటే వ్యక్తిగా ఆమె పట్ల తనకేం లేదు, ఆమె గ్లామర్, డబ్బుకి మాత్రం ఆకర్షితుడయినట్టేగదా--
ఓరోజు సావకాశంగా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకున్నాక , తార అంటే తన మనసులో ఏముందో స్పష్టపడ్డాక , యింకా యింకా తార ఇంటికి వెళ్ళడం, ఆమెతో తిరగడం, ఆమెకి లేనిపోని ఆశలని కల్పించినట్టవుతుందనే నిర్ణయానికి వచ్చాడు. ఇంక వెళ్ళకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆమెతో యీ తిరుగుడు తన భవిష్యత్తుకే నష్టమావవచ్చు. తార కోరితే ఆమెని తను పెళ్ళి చేసుకోగలడా! ఆమెకి అందం లేదు. కేవలం అందమే కాదు , చూడ్డానికి వికారంగా కూడా ఉంటుంది! కేవలం బాహ్యసౌందర్యాన్ని కోరకపోయినా బొత్తిగా చూస్తూచూస్తూ తారలాంటి దాన్ని వివాహం అడగలడా! పెళ్ళి చేసుకుంటే ఆమె అన్నట్టు ఆమె సంపాదన , గ్లామర్, డబ్బు చూసి చేసుకోవాలి తప్ప మరేమీ లేదు. కేవలం ఆమెని ఆమెగా మాత్రం వివాహం ఆడలేడన్నది నిశ్చయం! అలాంటప్పుడు మనసు లేని యీ పెండ్లి చేసుకోడం ఆమెకి అన్యాయం చేయడమే గాక తనకి తాను చేసుకోడం అవుతుంది! పెళ్ళి చేసుకొని తార అన్నట్టు ఆ యింట్లో మనుష్యులతో పాటు జమ అయి ఆమె సంపాదన కోసం లేని ప్రేమ నటించడం ఆమె పట్ల అన్యాయమే అవుతుంది. సారధి చాలా గట్టిగా తార తోటి పరిచయం ఇంకా ఇంకా పెరగనీయకూడదన్న నిర్ణయానికి వచ్చాడు.
కాని తార -- సారధి యీ నిర్ణయాలని నిలవనీయలేదు. ఒక్క పది హేనురోజులు ఫోను చెయ్యలేదు. ఒక్క నెల రోజులు ఆమె దగ్గరికి వెళ్ళకుండా తప్పించుకోగలిగాడు. ఒక రోజు తార ఫోను చేసింది ఎందుకు రావడం లేదంటూ.
"పని వుంటుంది తారా ......" నిష్కర్షగా చెప్పలేక అబద్దం ఆడాడు.
"అబద్దం ఆడకు సారదీ ...... ఇన్నాళ్ళు లేనిపని ఇప్పుడెక్కడనించి వచ్చింది. రెండు రోజులు గాని నెలరోజులూ పని వుంటుందా? చెప్పు ------ నిజం చెప్పు ------ పరవాలేదు ."
"క్షమించు సుందరీ ..... రాలేను....'
"అదే, ఎందుకు , ఏం జరిగింది ? నావల్లేమయినా పోరాపాటు జరిగిందా?" ఆదుర్దా ధ్వనించింది ఆమె గొంతులో.
"అబ్బే.... అదేం కాదు ....... సారీ , కారణం అడగకు ....... మనిద్దరి యీ పరిచయం ఇంకా పెరగడం మంచిది కాదని నా ఉద్దేశం...."
"అంటే .....అంటే .....పత్రికల్లో ఏదో రాశారని బాధ పడ్తున్నావా? అలాంటి రాతలకి భయపడి మన స్నేహం దూరం చేసుకునేటంతటి పిరికివాడివా?" తార గొంతు తీవ్రంగా వుంది.
కాదు ..... అది కాదు ...... నీ కర్ధం గాదు, ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఈ నిర్ణయం వల్ల ఇద్దరికీ మేలే జరుగుతుందని నా నమ్మకం. క్షమించు సుందరీ."
"సారదీ, ముందు నించీ చూస్తున్నాను నీ వరస. నీవేదో చాలా గొప్పవాడివనుకుంటున్నావు.... నేనేదో నీ వెనక బడినట్లు టెక్కు చేస్తున్నావు........ నాక్కావాలంటే నీలాంటి వాళ్ళని లక్ష మందిని కాళ్ళ దగ్గరకి పడేసుకోగాలనన్న సంగతి మరిచిపోకు.... ఏదో పాత పరిచయం కొద్ది పలకరించాను ...... అభిమానించాను.... కాని.... నీవేలాంటి వాడివో యిప్పుడు తెలుసుకున్నాను....... ఐ బిగిన్ టు హెట్ యూ లైక్ ఎనీ థింగ్ ..... గుడ్ బై ...." తార గొంతు కోపంగా తారస్థాయి నందింది. ఫోను టక్కున పెట్టేసింది.
తారకి కోపం వచ్చింది. పోనీ యిదీ మంచిదే, కోపంతో నైనా తనని కలుసుకోడం మానేస్తుంది. కొన్నాళ్ళలో తనని పూర్తిగా మర్చిపోతుంది ..... తనూ , ఏదో తనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు. తారని డబ్బు కోసం చేసుకున్నా ఆ డబ్బుతో, భార్య ఆర్జించే డబ్బుతో తను సుఖ పడగలడా? ఏ గంజి నీళ్ళయినా తను సంపాదించాలి . భార్య బిడ్డల్ని పోషించాలి అన్న అహం ప్రతి మగాడికి వుంటుంది తనకీ వుంది! ఓ తారకి భర్తగా అనామకుడిగా బ్రతకలేడు తను! తార ఇంక తన జోలికి రాదు బహుశ -- అదే కావాలి తనకి!