Previous Page Next Page 
రక్తచందనం పేజి 22


    చందనంలో తిరిగి రెండు రకాలున్నాయి.
    ఒకటి శ్రీ చందనం, రెండు చందనం.
    శ్రీ చందనం నుంచి వచ్చే ఆయిల్ ఒకింత ముదురు రంగులో వుంటుంది. చందనం నుంచి వచ్చే ఆయిల్ లేత పసుపుపచ్చ రంగులో వుంటుంది. శ్రీ చందనం వృక్షాలనుంచి ఎక్కువ ఆయిల్ రావటమే కాక మంచి ధర కూడా పలుకుతుంది. ఏది శ్రీ చందనం ఏది చందనం అనేది బాగా తెలిసినవాళ్ళే గుర్తించగలరు" శర్మ చెప్పటం ముగించాడు.
    రంజిత్ కి ఫారెస్ట్ గురించి బాగా ఫీడ్ చేయమని పైనుంచి ఆర్డర్స్ రావటమేకాక, అతనికి అవన్నీ తెలిసుండటం మంచిదనే అదంతా చెప్పుకొచ్చాడు శర్మ.
    ఓ ప్రక్క తాగుతూనే వున్నా మరోప్రక్క శర్మ చెప్పే వివరాల్ని శ్రద్ధగా వింటూ, వాటిని తన ఫోటో గ్రాఫిక్ మెమొరీలో నిక్షిప్తం చేసుకున్నాడు రంజిత్.
    కొద్దిక్షణాలు నిశ్శబ్దం అలుముకుందక్కడ.
    "మా ఫైల్స్ చూడటం ఈ రోజే పూర్తిచేశాను. రేపు మీ డిపార్ట్ మెంట్ ఫైల్స్ స్టడీ చేయాలి. ముఖ్యంగా కొత్త ఎస్.పి., కొత్త డి.సి.ఎఫ్. అంటే నువ్వు వచ్చినట్లు వీరూకి తెలియాలి. అతన్ని ఎలాగయినా పట్టుకొనేందుకు మనం వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలి. అదెలాగో ఆలోచించు" అన్నాడు రంజిత్ మరోసారి గ్లాసు నింపుకుంటూ.
    రంజిత్ అంత తాగుతున్న సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకపోవటం శర్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది!
    "ఆలోచించఖ్కరలేదు. ఈపాటికి ఆ ఇన్ఫర్మేషన్ అతనికి చేరే వుండవచ్చు. మన డిపార్ట్ మెంట్స్ కి ఎవరన్నా ఇన్ఫర్మేషనిస్తే_ ఇచ్చిన అతన్ని పట్టుకొని సవాలక్ష ప్రశ్నలేసి, ఎఫ్.ఐ.ఆర్.లో ఇరికించి కోర్టుకి కూడా తీసుకెళతాం. మన వలన ఇన్ ఫార్మర్ కి పైసా లాభం లేకపోగా కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి వారికి చిరాకు, ఆగ్రహం వచ్చేలా చేస్తాం. అది మానుకొనేంతవరకు ఎవరూ మనకు సహకరించరు.
    మన చట్టాల్లో లోపాలు_మన పరిశోధనా విధానాల్లో అవకతవకలు పోనంతవరకు సివిక్ సెన్స్ గురించి, బాధ్యతాయుతమైన పౌరులంటూ నిందవేసి ప్రయోజనంలేదు.
    అదే వీరూకి ఇన్ఫర్మేషన్ అందిస్తే, ఎవరు, ఎక్కడ, ఎలా, ఎందుకు లాంటి పిచ్చి ప్రశ్నలు వేయకుండా, మంచి బహుమతి ఇచ్చి పంపిస్తాడట. ఈ మైసూర్ లోనే అతనికి ఇన్ఫర్మేషన్ అందించేవాళ్ళున్నారు. డబ్బెవరికీ చేదుకాదు, మన డిపార్ట్ మెంట్ లోనే అతనికి సహకరించే వాళ్ళున్నారట" డిజోగస్టింగా అన్నాడు శర్మ.
    మందు గుటకేయబోయిన రంజిత్ ఒక్క క్షణమాగి శర్మవేపు ఆశ్చర్యంగా చూశాడు. ఏదో మాట్లాడబోయిన శర్మకేసి మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేశాడు.
    ఏదో అడుగుల శబ్దం....
    ఆ బంగ్లా రెండో అంతస్తు చెక్కలతో నిర్మించబడింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వేసిన మెట్లు కూడా చెక్కతో నిర్మించినవే. అందుకే ఏ చిన్న శబ్దమయినా, అదేమూలనుంచి అయినా ఇట్టే వినిపిస్తుంది.
    ఇద్దరూ చెవులు రిక్కించారు.
    తిరిగి ఏదో శబ్దం మెల్లగా వినిపించింది.
    ఈసారి శర్మకు కూడా అది వినిపించింది. రిమోట్ బెల్ ప్రెస్ చేస్తే తప్ప గ్రౌండ్ ఫ్లోర్ ప్రధాన ద్వారబంధం దగ్గర వుండే ఇద్దరు పోలీసులు పైకి రారు.
    కాంపౌండ్ మెయిన్ గేట్ దగ్గరుండే మరో ఇద్దరు పోలీసులు బంగకేసి రారు. పహరా కాయటంలోనే వాళ్ళు నిమగ్నమయి వుంటారు.
    మరెవరి అడుగుల చప్పుడు అది....?!
    అడుగుల చప్పుడేనా? లేక భ్రమా....? ఎటూ తేల్చుకోలేని రంజిత్ షార్ప్ గా రియాక్ట్ అవుతూ పక్కనేవున్న న్యూస్ పేపర్ ని తీసుకొని పెన్సిల్ తో దానిమీద ఏదో రాసి శర్మకు చూపించాడు.
    వీరూ విషయాన్ని అప్రధానం చేసి ఏదో ఒకటి మాట్లాడు_ఆపకు" అని వుంది అందులో.
    శర్మ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు.
    ఏదో ఒకటి మాట్లాడే బదులు రంజిత్ ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగపడేదే చెప్పటం బెటరనుకున్నాడు శర్మ.
    "గంధం చెక్కని స్మగ్లర్స్ దోచుకోవటం మూలంగా ప్రభుత్వాలకు వచ్చే ఆర్ధిక నష్టంకన్నా, డీఫారెస్టేషన్ మూలంగా వచ్చే అనర్థం చాలా ఎక్కువ. ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏక్ట్ 1980 ప్రకారం అడవుల్ని నిర్మూలించి ఇతర అవసరాలకు వాడుకోవటం నేరం.
    ఈ ఏక్ట్ తీసుకురాకముందు సంవత్సరానికి 1.5 లక్షల హెక్టార్ల అటవీప్రాంతం నాశనమయిపోతుండేది. అది వచ్చాక, గట్టిగా దాన్ని అమలుపరచటం ప్రారంభించాక అది ఆరువేల హెక్టార్లకు తగ్గిపోయింది.
    ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్విరాన్ మెంట్ డిపార్ట్ మెంట్ సహకారంతో, రిమోట్ సెన్సింగ్ టెక్నిక్స్ ద్వారా కంట్రీస్ వెజిటేషన్ మ్యాప్ తయారుచేసింది. ఆ మ్యాప్ చూసి అందరూ షాక్ తిన్నారు.
    ఏ దేశ విస్తీర్ణంలోనయినా అడవులు 33 శాతం వుండాలి. కాని మనదేశంలో పేపర్స్ మీదున్న అటవీ భూముల శాతం 23. కానీ నిజానికి ఇండియాలో 11 శాతమే అటవీ భూములున్నాయి. ఈ పదకొండు శాంతం అడవులపై కూడా ఒత్తిడి ఎక్కువయింది.
    ఓపక్క స్మగ్లర్స్, మరోపక్క ఫారెస్ట్ కాంట్రాక్టర్స్, ఇంకోపక్క అటవీ సిబ్బంది, వేరొకపక్క అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల అవసరాలు. కలిపి మిగిలివున్న కొద్దిపాటి అడవుల్ని కూడా బ్రతకనీయటం లేదు.
    ఇప్పుడు మనముందున్న ప్రధాన విషయాలు రెండు_ ఒకటి_ డీఫారెస్టేషన్ మూలంగా పచ్చటి అడవులు మరుభూమిగా మారటం. రెండు_ కోట్లకు కోట్లు ఖరీదుచేసే అటవీ సంపద స్మగ్లర్స్ చేతుల్లోకి వెళ్ళటం.
    ఒకటి జాతి నష్టం_
    రెండు ప్రభుత్వ ఖజానాకు గండి...." చెప్పటం ఆపాడు శర్మ.
    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
    రంజిత్ మాట్లాడమన్నట్లుగా సైగ చేశాడు.
    "పరిశోధించే కేసు జటిలత, ప్రయోజనం, అవసరం, సంభవిస్తున్న నష్టం, జాతీయ ప్రాముఖ్యత తెలిస్తే ఆ కేసుని శోధించే అధికారి దృక్పథం, గాఢతని, క్రమశిక్షణని, మరింత పట్టుదలని, ఏకాగ్రతని, నీతి నిజాయితీల్ని, ధైర్యసాహసాల్ని ప్రోది చేసుకుంటుంది.
    అడవుల గురించి నీకెందుకు చెబుతున్నానో ఈపాటికి నీకర్థమయివుంటుంది. ఉపగ్రహాలు తీస్తున్న ఇండియన్ ల్యాండ్ మాప్ ఫోటో గ్రాప్స్ ద్వారా సంవత్సరానికి 1.5 హెక్టార్ల అటవీ భూమి అంతరించిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో అటవీ భూమి 40 మిలియన్ హెక్టార్లలోపే.
    ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్రీ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం 1972-75 మధ్య దేశంలో 54 మిలియన్ హెక్టార్ల అటవీ భూములున్నాయి.
    1981-82 తిరిగి లెక్కలు వేస్తే అది 46 మిలియన్ హెక్టార్లకు పడిపోయింది.
    పాపం మా డిపార్టుమెంట్ మాత్రం ఇంకా దేశంలో 74.74 మిలియన్ హెక్టార్ల అటవీ భూమి వుందని ఆత్మవంచన చేసుకుంటోంది.
    మన దేశంలో అడవుల ప్రాముఖ్యతని గుర్తించకపోయినా, వరల్డ్ బ్యాంక్ ఫుడ్ అండ్ ఎగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్, స్వీడిష్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ, స్విట్జర్లాండ్, డానిష్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఏజెన్సీలాంటి విదేశీ ఆర్థిక సేవాసంస్థలందిస్తుంది. ఆర్ధిక, సాంకేతిక సహకారంతో ఫారెస్ట్రీ డివిజన్ కి చెందిన ప్రాజెక్టు లేషన్ సెల్ దేశంలో అడవుల శాతాన్ని పెంచేందుకు ఏదో తిప్పలుపడుతోంది.
    "ఎ ట్రీ ఫర్ ఎవ్వరీ చైల్డ్" అని ఎంత అరిచినా, ముంచుకురానున్న వాతావరణ విపరీతాల గురించి చెప్పినా ఎవడికి పడుతోంది?

 Previous Page Next Page