"ఏమిటి అంత దీర్ఘమైన ఆలోచనలో పడిపోయారు. మీ..."
"డిస్టర్బ్ చెయ్యొద్దు!" అన్నట్లు వారించింది స్వప్న ఆలోచిస్తూనే, తర్వాత ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది.
"యురేకా! కనిపెట్టేశాను ! నువ్వు ఇప్పుడు చెప్పింది పరమ కాపీజోకు! ఎక్కడ చదివానా అని ఆలోచిస్తున్నాను. గుర్తొచ్చింది. ఈ జోకు మార్క్ ట్వెయిస్ చెప్పాడు అవునా?" అంది విజయగర్వంతో.
భుజాలు చరిచాడు సందీప్. "ఓకే. యూ విన్ ! కనిపెట్టేశారన్నమాట! మిస్ స్వప్నా! మీ పెదిమల మీద ఆ చిరునవ్వు చూడగలగడానికి జోకులు టోకున కాపీ కొట్టడమే కాదు, పుస్తకాలకు పుస్తకాలే దొంగతనం చేస్తాను. ఆ కొండలని పిండిచేస్తాను. ఈ భూమిని, ఆకాశాన్నీ కలిపి ముడేసేస్తాను, సప్త సముద్రాలూ...."
చిరునవ్వు పెదిమల కింద తొక్కిపట్టి, ఓరగా అతనివైపు చూసింది స్వప్న.
ఆరోగ్యంగా కనబడుతున్న చామచాయలో ఉన్నాడతను. బిగువుగా వున్న చెంపలు, ప్రొఫైల్ లో ఎత్తుగా, పొడుగ్గా కనబడుతున్న ముక్కూ, గుబురు మీసం.
దృఢమైన టేకు చెట్టు మానులా మాన్లీగా ఉన్నాడతను. ఒళ్ళంతా కండలే తప్ప, ఒక్క అంగుళం మేర కూడా అనవసరమైన కొవ్వు కనబడటం లేదు. సింహానికి ఉన్నట్లు సన్నటి నడుము, పులిపంజాలలాగా బలంగా ఉన్న చేతులు, వాటిమీద గుబురు వెంట్రుకలు.
మొగవాళ్ళలో అందంకంటే మాటకారితనాన్ని చూసి ఆడపిల్లలు ఎక్కువ ఇష్టపడతారంటారు. అందమూ, మాటకారి తనమూ రెండూ ఉన్న సందీప్ సాన్నిధ్యంలో స్వప్నకు అదివరకూ ఎన్నడూ ఎరగని స్పందన కలిగింది - జీవితంలో తొలిసారిగా.
ఆ రమ్యమైన భావం ఒక్క క్షణమైనా నిలవకముందే అడవిలోనుంచీ భయభ్రాంతురాలైన 'సాంబార్' అనే దుప్పిజాతి జంతువు అరుపు వినబడింది. కొండముచ్చులు చెట్ల కొమ్మల మీదనుంచీ అలజడిగా అరుస్తున్నాయి.
కేవలం కోతులూ, కొండముచ్చులూ అరిస్తే చిరుతపులి వస్తున్నదని గుర్తు. అది చెట్లు ఎక్కగలదు కాబట్టి కోతులకు భయం.
కోతులతోపాటు సాంబార్ కూడా అరుస్తోంది కాబట్టి అది పెద్దపులి అయి ఉండాలి. ఆ అనుమానాన్ని నిజంచేస్తూ, సోకింది పులి గబ్బు - ఘాటుగా వచ్చే పులి వాసన.
తేలిగ్గా నిట్టూర్చాడు సందీప్. పులి వాసన తమకి తగిలిందంటే పులి ఇంకా తమని గమనించ లేదన్నమాట. పులి అనుక్షణం గాలివాటాన్ని గమనిస్తూ, తను వేటాడబోయే జంతువుకి తన వాసన సోకకుండా, గాలి వీస్తున్న దిశకు వ్యతిరేకమైన దిక్కునుంచీ వచ్చి లంఘిస్తుంది.
ఇది మరో పులా? లేకపోతే 'మాన్ ఈటర్' పెద్దపులే ఇక్కడ కూడా ప్రత్యక్షమవుతోందా? సాధారణంగా తను వేటాడే జంతువుని అంత దూరం తరుముకుంటూ రాదు పెద్దపులి. అసలు జంతువులని తరమడం పెద్దపులి లక్షణం కాదు, పొంచి ఉండి, ఒక్కసారిగా లంఘించి, బాకులలాంటి కోరలతో మెడను పట్టేసుకుంటుంది పెద్దపులి. జంతువు ఒకటి రెండు కిలోమీటర్లు తరిమి కూడా పట్టుకునేది చిరుతపులి- భూమిమీద చరించే ప్రాణులలో అత్యంత వేగంగా అంటే గంటకు డెబ్భై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల జంతువు.
ఇది నిశ్చయంగా వేరే పెద్దపులి అయివుండాలి.
గుబురు ఆకులమధ్య గలగల శబ్దం.
నెమ్మదిగా, గుబురులోనుంచీ పెద్దపులి తల బయటకు వచ్చింది.
ఆ వెనుకనే మరొకటి... మరొకటి.
పులుల గుంపు. మొత్తం ఆరు.
సింహాలు అయిదారు కలిసి, మందగా ఒకే కుటుంబంగా ఉంటాయి. కానీ పులులకు ఆ లక్షణం లేదు. ఏకాకిగా తిరుగుతూ ఉంటుంది పులి. ఆరు పులులు ఒక చోట గుమిగూడితే, భయంకరమైన పోరాటం తప్పదు.
"అహోయ్ !" అని కేకలు వేస్తూ, పులి మాస్కులు ముఖానికి పెట్టుకున్న అడవి మనుషులు ముందుకు ఉరికి వచ్చారు.