Previous Page Next Page 
హైజాక్ పేజి 22

నోటికొచ్చిన ధైర్యవచనాలు చెబుతున్నాడుగానీ, అతని మాటల మీద అతనికే నమ్మకం లేదు. పుష్పక్ ఎయిర్ క్రాప్టుని - అదీ అప్పుడో గంటా, అప్పుడో గంటా నడిపిన వాడిని నమ్ముకుని ఈ జెయింట్ ఎయిర్ బస్సుని కిందకు దించడానికి ప్రయత్నించడమా!
గాడ్ ఓ గాడ్!
"ఓకే!" అన్నాడు రాజేందర్ బలహీనంగా.
"ఎయిర్ బస్ కంట్రోల్స్ గురించి ఏమన్నా తెలుసా నీకు?" అన్నాడు మొదటిపాఠం మొదలెడుతూ.
సమయం ఎంత తక్కువ ఉన్నదో, ఆ అతి తక్కువ సమయం ఎంత అమూల్యమైనదో అతనికి తెలుసు. కానీ, కంట్రోల్స్ గురించి వివరించకుండా రాజేందర్ కి సహాయం చెయ్యడం సాధ్యంకాదు.
"అతి కొద్దిగా తెలుసు."
"ఎలా?"
"సిమ్యులేటర్ లోకి ఒకసారి వెళ్ళి చూశాను."
మాట్లాడకుండా ఉండిపోయాడు మెహతా. పైలట్లకి ట్రయినింగ్ ఇవ్వడానికి 'సిమ్యులేటర్' అనే ఒక సాధనం ఉంటుంది. అందులో కూర్చుంటే, నిజం విమానం తాలూకు కాక్ పిట్ లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. నేలమీదే ఉంటుంది ఆ సిమ్యులేటర్. డయల్సూ, ఇన్ స్ట్రుమెంట్సూ, కంట్రోల్సూ అన్నీ నిజం విమానంలో ఉన్నట్లే ఉంటాయి.
పైలట్లు విమానంలో ఫ్లయింగ్ చేస్తూ, మొత్తం ప్రాక్టీస్ గాలిలోనే చెయ్యాలంటే చాలా ఇంధనం వృధా అయిపోతుంది. అంతేకాక, ఈ ట్రెయినింగ్ విమానాల టేకాఫ్, లాండింగుల వల్ల తక్కిన రెగ్యులర్ విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.
అందుకని ట్రయినింగ్ కొంతభాగం విమానాలలోనూ, కొంతభాగం సిమ్యులేటర్లలోనూ పూర్తి చేస్తారు. సిమ్యులేటర్లో కూర్చుని ఉదాహరణకు బాంబే ఎయిరుపోర్టులో దిగాలనుకుంటే ఒక స్విచ్ నొక్కాలి. కింద నిజంగానే బాంబే ఎయిర్ పోర్టు కనబడుతుంది. అక్కడ తన విమానాన్ని "లాండ్" చేస్తాడు పైలట్... అంతా ఉన్నచోటు నుంచి కదలకుండానే!
దాన్లోకి మామూలుగా అయితే అందరినీ అనుమతించరు కానీ... అప్పుడప్పుడు... అక్కడక్కడ... రూల్సుకి వ్యతిరేకంగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి.
ఈ రాజేందర్ సిమ్యులేటర్ ని చూసి ఉండటం వల్ల ఈ రోజు ఇంతమంది ప్రాణాలు రక్షించబడతాయా? చీకట్లో రాయి విసరడం లాంటిదే ఈ ఆశ!
"రాజేందర్! ఫ్యూయల్ గేజ్ అక్కడే ఉంటుంది చూడు! ఎంత ఫ్యూయల్ ఉందో చెప్పు ముందు" అన్నాడు మెహతా.
విమానంలో ఇంధనం ఎంత ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఇంధనం అయిపోతే విమానం గాలిలో ఉండలేదు. ఇది ఢిల్లీ వెళ్ళే ఫ్లయిట్ కాబట్టి రెండు గంటలకంటే ఎక్కువ సేపే గాలిలో ఉండడానికి తగిన ఇంధనం ఉండి ఉండాలి.
కళ్ళు చిట్లించి చూడబోయాడు రాజేందర్. భయంతో అతని దృష్టి ఒకచోట నిలవడం లేదు. భయం క్షణక్షణానికీ అతని మెదడుని కొరికేసి నిరుపయోగంగా చేసేస్తోంది.
"లేదు! దాన్ని నేను గుర్తుపట్టలేకపోతున్నా" అన్నాడు వణుకుతున్న గొంతుతో.
అతని గొంతులోని భయాన్ని గుర్తించాడు మెహతా. అతనికి ముందర ధైర్యం కలిగించాలి. అది ముఖ్యాతి ముఖ్యం. లేకపోతే అతనిచేత ఏ పని చేయించడం సాధ్యం కాదు.
"చూడు బ్రదర్!" అన్నాడు అనునయంగా. "నువ్వు ఫ్లయింగ్ క్లబ్బు రాజేందర్ వి కదూ! నీలో మంచి స్పార్క్ వుంది. మంచి పైలట్ కాగల లక్షణాలు చాలా ఉన్నాయ్! నీకు తెలియకుండానే రెండు మూడుసార్లు అబ్జర్వ్ చేశాను కూడా! పర్ ఫెక్ట్ లాండింగ్!" అన్నాడు తేలిగ్గా అబద్దమాడేస్తూ.
నిజానికి రాజేందర్ ఎవరో అంతకుముందు తెలియదు మెహతాకి - కంట్రోల్ టవరువాళ్ళు చెప్పేదాకా.
"కానీ నేను నడిపింది పుష్పక్ ఎయిర్ క్రాప్టు? ఇది బ్రహ్మాండమైన ఎయిర్ బస్!" అన్నాడు రాజేందర్ పాడిన పాటే పాడుతూ.
"ఓహ్ కమాన్!" అన్నాడు మెహతా తేలిగ్గా "లుక్ బడ్డీ! ఆడపిల్లలతో ఎప్పుడన్నా సరసాలాడావా నువ్వు? ఒడ్డూ పొడుగూ వున్న అమ్మాయి అయినా నాజూగ్గా, బంగారు తీగెలా ఉన్న అమ్మాయి అయినా, నల్లపిల్ల అయినా, తెల్లపిల్ల అయినా - అసలు విషయానికి కొచ్చేసరికి అందరూ ఆడపిల్లలే! అవునా? వాళ్ళని హాండిల్ చెయ్యడంలోనే ఉంది మన మగతనం! ఇదీ అంతే!" అన్నాడు.
సరదాగా మాట్లాడుతున్నాడు అతను. అది చీప్ టాక్ అని అతనికి తెలుసు. కానీ, మరణశయ్యమీద ఉన్నవాడికి కూడా మరులు రేకెత్తించేది స్త్రీల గురించిన సంభాషణే అని అతనికి తెలుసు అనుభవపూర్వకంగా.
కనీసం చాలామంది విషయంలో అది నిజం.
రాజేందర్ కూడా అందుకు అతీతుడేం కాదు.
అతని పెదిమల మీదికి అప్రయత్నంగానే చిరునవ్వు వచ్చింది.
"చెప్పు! ఏం చెయ్యాలి నేను?" అన్నాడు.
"నౌ! జాగ్రత్తగా విను! ఇన్ స్ట్రుమెంట్స్ పానెల్ చూడు! నీకు కుడివైపున..." అంటూ మొదలెట్టి, ఏది ఎక్కడ ఉంటుందో వివరించడం మొదలెట్టాడు మెహతా.
శ్రద్ధగా వింటూ గుర్తుపెట్టుకుంటున్నాడు రాజేందర్.

 Previous Page Next Page