Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 22


    "నీల్... నీల్ కుమార్? ఎవరతను?"


    "మీకు తెలిసే ఉండాలండి. ఐశ్వర్య, లక్కీ, నీల్..."


    "ఓహ! ఆ నీల్ కుమార్!" అన్నాడు మూర్తిగారు షాకయిపోతూ. "నీల్ కుమార్ ఇండియాలో" అన్నాడు అప్రయత్నంగానే.


    "అంతే కదండీ మరి!" అన్నాడు షణ్ముగం.


    కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు మూర్తిగారు. ఐశ్వర్య దుందుడుకుతనం ఏదో ఒక రోజున కొంప మీదికి తెస్తుందని ఆయనకి తెలుసు. అంతపనీ జరగబోతుందా ఇప్పుడు?


    నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి ఆయనకి.


    అమెరికాలో.


    ఐశ్వర్య, లక్కీ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఫ్రెండ్స్ కాదు రైవల్స్. అంతే! ప్రతి విషయంలో పోటీపడేవాళ్ళు. ప్రతిదానికీ ప్రత్యర్థులు. అప్పుడు వాళ్ళ కాలేజీలో కొత్తగా చేరాడు నీల్ కుమార్. అతను పుట్టడం, పెరగడం అంతా అమెరికాలోనే. తండ్రి పంజాబీ, తల్లిది ఐరిష్ బ్లడ్. అతను అంతా అమెరికన్ లాగానే ఉండేవాడు చూడ్డానికి. కానీ జుట్టు, కళ్ళు మాత్రం నలుపు. అతను చాలా అందగాడు. లేడీ కిల్లర్! అతనితో కలిసి తిరగడం ఓ పెద్ద ప్రిస్టేజీగా భావించేవాళ్ళు ఆడపిల్లలందరూ. ఐశ్వర్యకి అతనంటే ఇన్ ఫాచ్యుయేషన్ డెవలప్ అయింది. ప్రేమ కాదు. ఇన్ ఫాచ్యుయేషన్. అదో మైకం లాంటిది. తొలి వయసు తోలకరింపులో కలిగే ఓ పులకరింపు. అంతే - దానినే ప్రేమ అని భ్రమపడింది ఐశ్వర్య. సరిగ్గా అదే వయసులో ఉన్న లక్కీకి కూడా అతనిపట్ల అదే భావం కలిగింది. అది అతనికి తెలిసిందో లేదో గానీ ఐశ్వర్యకి తెలిసింది. ఇంకేముంది! ఫైర్ వర్క్స్!


    ఒలింపిక్స్ కోసం కూడా అంత కాంపిటీషన్ ఉండదేమో! నీల్ అడిగితే ఆ అమ్మాయిలు ఇద్దరూ ఒక్కొక్కళ్ళూ ఒక్కో డజన్ ఒలింపిక్ గోల్డు మెడల్సు సంపాదించి అతని పాదాల దగ్గర పెట్టెయ్యడానికి రెడీగా ఉన్నారు. టెన్షన్! టెన్షన్! అతను ఎవర్ని వరిస్తాడు.


    ఓ రోజున లక్కీ వచ్చి చెప్పింది. "యూ సిల్లీ గర్ల్! నాతో కాంపిటీషన్ నీకేమిటి? నేను గెలిచాను నీల్ ని! మేమిద్దరం కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాం. లాస్ వేగాస్ లో అతనికి మంచి జాబ్. అప్పుడప్పుడు ఫోన్ చేసి 'హై' అని చెబుతుంటాలే! నీకు తగ్గవాణ్ణి ఎవరినన్నా చేసుకుని..." పట్టరాని కోపంతో చటుక్కున లేచి, లక్కీ చెంప మీద కొట్టింది ఐశ్వర్య. లక్కీ చెంప నిమురుకుని నవ్వుతూ "యూ అన్ లక్కీ గర్ల్! గుర్తుంచుకో! నా పేరు లక్కీ!" అంది వెళ్ళిపోతూ. తర్వాత ఆ సంగతి ఇంక మర్చిపోయింది ఐశ్వర్య. మర్చిపోయినట్లు నటించింది. మర్చిపోలేనని మనసు ఎంత రగడ చేసిందో ఆమె తలగడకి మాత్రమే తెలుసు!


    అతి కష్టం మీద అదంతా మర్చిపోయానని ఆమె అనుకుంటూ ఉండగానే - ఓ రోజున మళ్ళీ వచ్చింది లక్కీ అర్థరాత్రప్పుడు! ఎలా ఉంది? లక్కీలాగా లేనేలేదు అసలు! లక్కీ తాలూకు ప్రేతంలాగా ఉంది. చిక్కిపోయింది బాగా. "నేను ఓడిపోయాను. యా! ఐయామ్ ది మోస్ట్ అన్ లక్కీ గర్ల్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్" అంది వెక్కివెక్కి ఏడుస్తూ. లక్కీ చెంపలు పీక్కుపోయి ఉన్నాయి. భుజాల మీద టీకా మచ్చలలాంటి మచ్చలు - సిగరెట్ కాల్చిపెట్టిన వాతలవి. బట్టలు మాసి ఉన్నాయి. చినిగి ఉన్నాయి కూడా.


    "ఏం జరిగింది లక్కీ?" అంది ఐశ్వర్య ఆదుర్దాగా.


    "ఆ నీల్ అనేవాడు ఒక చీట్ - శాడిస్ట్, క్రూక్ - గ్రీకు దేవతలా కనబడే దెయ్యం!" అంది లక్కీ ఐశ్వర్యని కావలించుకుని ఏడ్చేస్తూ.


    "ఏం చేశాడు వాడు?" అంది ఐశ్వర్య. ఆమెకి లక్కీ మీద ఉన్న కోపం, అసహ్యం అన్నీ కూడా ప్రస్తుతం ఆమె ఉన్న స్థితిని చూడగానే మాయమై పోయినట్లు అనిపించింది. తనకు తెలియకుండానే లక్కీ భుజం మీద చెయ్యివేసి దగ్గరికి తీసుకుంది.


    వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది లక్కీ. నీల్ తనని నమ్మించి ద్రోహం చేశాడు. షరా మామూలు కథే. తనని తీసుకెళ్ళాడు. పెళ్ళి చేసుకున్నాడు. మోజు తీరాక తనచేత అడ్డమైన పనులూ చేయించబోయాడు. తను అభ్యంతరపెడితే శారీరకంగా హింసించాడు. తనని ఓ బ్రోతెల్ హౌస్ కి అమ్మెయ్యబోయాడు.


    ఇది మామూలు కథే గానీ తను చాలా మామూలు అమ్మాయిగా అతని ట్రాప్ లో పడిపోయినందుకు మరింత దుఃఖంగా ఉందని చెప్పింది లక్కీ.


    "శ్రీ! నేను ద్రోహం చేశాననుకున్నావు. కానీ అతన్ని నేను పెళ్ళి చేసుకుని ఆ విధంగా నిన్ను నీల్ బారి నుండి కాపాడినట్లయింది. ఇంక కోపం పెట్టుకోకేం" అంది జాలిగా.


    "నేరుగా నా దగ్గరికే ఎందుకొచ్చావు లక్కీ?" అంది ఐశ్వర్య.


    "ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. పైకి ఎన్ని పంతాలు పోయినా కూడా!" అంది లక్కీ మనస్ఫూర్తిగా.


    లక్కీని గట్టిగా కావలించేసుకుంది ఐశ్వర్య. వాళ్ళు ఇంక ఆ క్షణం నుంచి ఒకళ్ళని ఒకళ్ళు వదిలిపెట్టలేదు.


    "మరి వాణ్ణి అట్లాగే వదిలేస్తామా?" అంది ఐశ్వర్య, లక్కీని సేదదీర్చిన తర్వాత.


    "వదిలెయ్యక ఏం చేస్తాం?" అంది లక్కీ.


    "ఏం చేస్తామో తర్వాత చెబుతాను - కానీ వాడి అంతు చూస్తాం. అది తప్పదు!" అంది ఐశ్వర్య.


    రెండ్రోజులు ఆలోచించాక ఒక ప్లాను తట్టింది ఐశ్వర్యకి. అది ఐశ్వర్యకి మాత్రమే తట్టగల ప్లాన్. చాలా డేరింగ్! చాలా సినిమాటిక్ ప్లాన్ అది!

 Previous Page Next Page