Previous Page Next Page 
సీతాచరితం పేజి 22


    సమాజానికి సూక్ష్మరూపం కుటుంబం. సమాజ సభ్యులు తమ స్వాతంత్ర్యాన్ని కొంత వదులుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచారు. వారు ప్రభుత్వానికి విధేయులుగా వుండడం అవసరం. ప్రభుత్వాన్ని మార్చే హక్కు ప్రజలకున్నా, ఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారో, దానికి విధేయులై వుండడం ప్రజల విధి. అలా కాకుంటే అరాచకం ఏర్పడుతుంది. తద్వారా సమాజం ఛిన్నాభిన్నమై సంక్షోభం ఏర్పడుతుంది. అది సమాజానికి శ్రేయస్కరం కాదు.


    అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తమ స్వాతంత్ర్యాన్ని కొంత వదులుకొని, యజమానికిచ్చేస్తారు. అందువల్ల యజమాని బాధ్యతలు పెరిగి కుటుంబ సంక్షేమాన్ని గురించి ఆలోచించవలసినవాడవుతాడు. కుటుంబానికి, సమాజానికి తేడా ఏమంటే, కుటుంబం ప్రేమబంధంతో తన సభ్యులను కట్టివేస్తుంది. యజమానికి కుటుంబం మీద వుండే వాత్సల్యం, బాధ్యతగా మారి, ఇతరమైన ఒత్తుడిలు లేకున్నా ఆ భారాన్ని అతడు వహిస్తాడు.


    సమాజానికి, ప్రభుత్వానికి మధ్య ప్రేమబంధం లేదు. శాసనబంధం మాత్రమే వుంది. అందుకే ప్రభువు అధికారానికే అర్రులు జాస్తాడు కాని, ప్రజా శ్రేయస్సును అంతగా పట్టించుకోడు. అతని పదవి రక్షణకు సరిపోయినంత ప్రజా శ్రేయస్సునే కోరతాడు. అందుకే ఏ ప్రభుత్వమూ ఈనాటికి సంపూర్ణమైన ప్రజా సంక్షేమాన్ని సాధించలేకపోయింది.


    కాని కుటుంబం అలాకాదు. చాలావరకు కుటుంబాలు కుటుంబ సంక్షేమాన్ని సాధించగలిగాయి.


    ఈ కాండలో చాలవరకు బ్రాహ్మణ, క్షత్రియ వైమనష్యలను మనకు కనిపిస్తాయి. ఇక్కడ క్షత్రియ స్త్రీలు దేవతలను పెండ్లాడటానికి నిరాకరించడం కనిపిస్తుంది మరొక విషయమేమంటే క్షమాగుణం క్షత్రియుల్లో ఎక్కువ వున్నట్లు కనిపిస్తుంది. వాస్తవంగా ఇది బ్రాహ్మణుల్లో ఎక్కువ వుండాల్సింది. అధికారం వున్నవారికి క్షమాగుణం వుండటం అవసరమేమో!


    గాథి తరువాత విశ్వామిత్రుడు రాజయినాడు. అతడు ఒకసారి సైన్యం సహితంగా సంచారానికి బయల్దేరాడు. అనేక నదులు, పర్వతాలు, ఆశ్రమాలూ దర్శించాడు. ఒకనాడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమం చాలా అందంగా వుంది. రకరకాల జంతువులున్నాయి. పుష్పలతలున్నాయి. చక్కని పొదలున్నాయి. రకరకాల పిట్టలున్నాయి.


    విశ్వామిత్రుడు వచ్చాడు. రాజు రాకకు వశిష్టుడు సంతోషించాడు. ఆదరించాడు. అనేక సపర్యలు చేశాడు. రాజు సంతృప్తి చెందాడు. వశిష్ఠుణ్ణి శెలవు కోరాడు. తన ఆతిథ్యం స్వీకరించవలసిందని వశిష్ఠుడు ప్రార్ధించాడు. విశ్వామిత్రుడు వారించాడు. తనతో అక్షోహిణి సైన్యం ఉందన్నాడు. వారందరికీ భోజనాదికములు అమర్చడం కష్టం అన్నాడు. వశిష్టుడు వినలేదు. తప్పక ఆతిథ్యం స్వీకరించాలన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించలేదు.


    వశిష్టుని దగ్గర "శబళ" అనే కామధేనువు వుంది. భోజన పదార్ధాలు సృష్టించమని దాన్ని కోరాడు. అది తేనె, పేలాలు, మైదేయ్, మద్యం సృష్టించింది. రాజు అతని పరివారం తృప్తిగా భోజనాలు చేశారు. అంతకుముందు వారు అలాంటి భోజనం చేసి ఎరుగరు.


    విశ్వామిత్రుడు ఆశ్చర్యపడ్డాడు. వశిష్టుని సంపద చూచి అతనికి కన్ను కుట్టింది. శబళను తనకు ఇమ్మని వశిష్టుణ్ణి అడిగాడు. కావాలంటే లక్ష ఆవులు ఇస్తానన్నాడు. పద్నాలుగువేల ఏనుగులు ఇస్తానన్నాడు. కాని వశిష్టుడు అంగీకరించలేదు. "ఇదే నాకు ధనం. ఇదే నాకు రత్నం. ఇదే నా జీవితం. ఇదే నా సర్వస్వం. దీనిని విడువలేను" అన్నాడు.


    మహర్షి సౌమ్యంగా వినడు అనుకున్నాడు రాజు. బలప్రయోగం చేశాడు. బలవంతంగా లాక్కుపోయాడు. శబళ విడిపించుకుంది. ఉరికివచ్చింది. వశిష్టుని కాళ్లమీద పడింది. "నన్ను రాజుకు ఎందుకు అప్పగిస్తున్నావు?" అని అడిగింది. అందుకు వశిష్టుడు నాకు అతడ్ని ఎదిరించే బలం లేదు. అతడు రాజు. క్షత్రియుడు. బలవంతుడు. అతడ్ని నేనెలా వారించగలను" అన్నాడు.


    అప్పుడు శబళ "క్షత్రియుని బలం బలంకాదు. అది అల్పబలం. బ్రాహ్మణుని బలమే బలం. అతడు బలవత్తరుడు." అని హ్రంబా అని అరిచింది. అప్పుడు మ్రేచ్ఛులు, పల్లవులు అనే జాతిసైనికులు కొల్లలుగా జన్మించారు. విశ్వామిత్రుని సైనికుల నెదిరించారు. విశ్వామిత్రుడు వారినందరినీ నాశనం చేశాడు. శబళ మళ్లీ హ్రంబా అని అరిచింది. అప్పుడు శకులు, యవనులు పుట్టారు. వారు విశ్వామిత్రుని బలాన్ని నాశనం చేశారు. విశ్వామిత్రుడు వారిని హతమార్చాడు. శబళ మళ్లీ హ్రంబా అని అరిచింది. ఈ తడవ కాంభోజాలు పుట్టారు. వారు విశ్వామిత్రుని ముగ్గురు కొడుకులను చంపేశారు. విశ్వామిత్రుడు వాళ్లను చంపేశాడు.


    విశ్వామిత్రుడు చతురంగబలం నాశనం అయింది. కొడుకులు నశించారు. విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు. అతడు వేగంలేని సముద్రంలా కనిపించాడు. కోరలు తీయబడిన పాములా కనిపించాడు. రాహుగ్రస్తుడైన సూర్యునిలా తేజోహీనుడైనాడు. అతనికి మిగిలిందొకే ఒక కొడుకు. అతన్ని రాజ్యమేలటానికి పంపించాడు. అతడు తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్లాడు.


    అధికారం వున్నవారికి కళ్లు కనిపించవు. అనడానికి ఇదొక నిదర్శనం. అధికారానికి చెవులేగాని కళ్లుండవు అని ఒక సామెత. కాని కన్నుమిన్ను కానని అధికారానికి, కళ్లు, చెవులూ రెండూ వుండవు. అధికారం విచిత్రమైంది. అది ఎంత మంచివాణ్ణయినా చెరుస్తుంది. అధికారం ఎవ్వరినీ లెక్కసేయదు. అది ఊడేదాగా తానే గొప్పనుకుంటుంది. ఓడింతర్వాత మళ్లీ గెలవటానికి ప్రయత్నిస్తుంది. ఇది అధికారానుకున్న సహజస్వభావం.


    ఈ స్వభావం విశ్వామిత్రునిలో కనిపిస్తుంది. రాజైనవాడు తన రాజ్యంలో వున్న అన్ని మంచి పదార్థాలు తనకే కావాలంటాడు. ఇతరుల దగ్గర అవి వుండటానికి సహించడు. దాన్ని హరించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. సాధ్యంకాకుంటే బలం ప్రయోగిస్తాడు. విశ్వామిత్రుడు చేసింది అదే. వశిష్ఠుని ముందు అడిగాడు. తర్వాత ఆశ చూపాడు. ఆ తర్వాత బలప్రయోగం చేశాడు.


    ప్రజలు ప్రభుత్వానికి విధేయులై వుండాల్సినమాట నిజమే. అది ఎంతవరకంటే ప్రభుత్వం తన హద్దును గుర్తెరిగినంతవరకు. ప్రభుత్వం తన హద్దులను మీరినపుడు తిరుగుబాటు చేయడం ప్రజల హక్కు. వశిష్టుడు అదేపని చేశాడు. తన దగ్గర వున్న ఒక్క ఆవును దక్కనీయలేదు. విశ్వామిత్రుడు దాన్ని లాక్కుపోతానన్నాడు. అతడు శాంతమూర్తి నిజమే. కాని దానికి ఒక హద్దున్నది. శాంతలో దాగిన బడబానలం వున్నది. అధికారం బడబానలాన్ని గుర్తించదు. తన ఉనికినే భంగం వచ్చినప్పుడు వశిష్టుడు తిరుగుబాటు చేశాడు. అక్కడి సైన్యం శబల సృష్టించిందా? లేక మునులు విశ్వామిత్రుని బలగంపైన కలియబడ్డారా అనే విషయం అనవసరం, కన్ను మిన్ను ఎరగని బలంమీద వశిష్ఢుడు తిరగబడ్డాడు.


    తిరుగుబాటు శాంతంగా, సహనంగా, అహింసగా జరిగిందికాదు. అది సాధ్యమయ్యే పనికాదు. విశ్వామిత్రుని సైన్యం శబళను లాక్కుపోతుంటే వశిష్టుడు ముక్కు మూసుకొని కూర్చోలేదు. అధికార దర్పాన్ని ఎదిరించడానికి పూనుకున్నాడు. ఎలా ఎదిరించడం? అంటే సైనికులతోనే ఎదిరించాడు. హింసను అహింసతో ఎదిరించడం అసాధ్యమని నిరూపించాడు. హింసను హింసతోనే ఎదిరించాలని వశిష్టుడు నిరూపించాడు.


    ఈ సమరం వ్యక్తులమధ్య జరిగిందికాదు. రెండు వ్యవస్థలమధ్య జరిగింది.


    "నబలం క్షత్రియస్య బ్రాహ్మణో బలవత్తరః" క్షత్రియ బలంకంటే బ్రాహ్మణ బలం గొప్పదని వశిష్టుని విశ్వాసం. ఈ విశ్వాసం మీద దెబ్బకొట్టాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఇదివరకే వివరించినట్లు, బ్రాహ్మణ, క్షత్రియుల మధ్య ఏర్పడిన వైరం బలపడుతూ ఈ దశకు వచ్చింది. బ్రాహ్మణులు తమను రక్షించుకోవడానికి సర్వసన్నద్ధులై వున్నట్టు కనిపిస్తుంది. క్షత్రియులు ఏదో నెపంతో బ్రాహ్మణులను ఓడించాలని ప్రయత్నిస్తున్నట్లు కూడ కనిపిస్తోంది.

 Previous Page Next Page