Previous Page Next Page 
గోరింటాకు పేజి 22


    "బాయ్! ఓ టాక్సీపిలువు" అన్నాడతను.

 

    టాక్సీ వచ్చింది.

 

    బ్రహ్మ ప్రళయంమీద బాయ్, పాణి బ్రహ్మానందాన్ని కారులో ఎక్కించారు. అతనికి దారిలో కొంచెం మెలకువ వచ్చి ఓ పాట పాడేశాడు. "నోర్ముయ్" అన్నాడు పాణి.

 

    "మూసేస్తే పోలా?" అన్నాడు బ్రహ్మానందం.

 

    "గమ్మున పడుకో." అన్నాడు పాణి.

 

    "పడుకుంటే పోలా?" అన్నాడు బ్రహ్మానందం.

 

    ఇంటికి వచ్చారు. ఓ రాత్రివేళ బ్రహ్మానందానికి మెలకువ వచ్చింది. "మనశ్శాంతి వచ్చిందా" అనడిగాడు మత్తుగా.

 

    "ఊరుకో పనికిమాలినవాడా!" అన్నాడు పాణి.

 

    "మంచి బిరుదు" అంటూ బ్రహ్మానందం మళ్ళీ నిద్రలో పడిపోయాడు.

 

                                              5

 

    జోరున వర్షం పడుతోంది. ఓ కారుచీకటి రాత్రి పన్నెండుగంటల సమయానికి అంతకు ఓ అరగంట ముందువరకు ఓ పుస్తకం చదివి రాజారావు నిద్రపోసాగాడు.

 

    ఇంతలో మెట్లమీద అతని గది బయట నిలబడి వానలో తడుస్తూ ఓ స్త్రీ మెల్లగా తలుపు తట్టింది.

 

    రాజారావుకు మెలకువ రాలేదు.

 

    చివరకు రాజారావు కళ్ళువిప్పాడు. మధురమైన కంఠంతో అతన్ని ఎవరో పిలుస్తున్నట్లు తోచింది. చప్పున లేచి కూర్చున్నాడు. కలేమో? ఒకవేళ కాదో... నెమ్మదిగా పరుపు తడిమి సిగరెట్ తీసుకుని వెలిగించాడు. తాను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇక్కడ నుంచి పారిపోవాలి. వద్దు. ఇక్కడ ఇలాంటిది చూస్తే చేయెత్తి నమస్కరించ బుద్ధివేస్తుంది. తాను భస్మం అయిపోతానేమోనని భ్రాంతి కలిగించే కళాకాంతులు. కాని తాను లొంగిపోతున్నాడు... అవును. ఇంతలో తాను ఇప్పుడు ఎందుకు నిద్రలేచినట్లు?

 

    అతనికి... ఆ వర్షంలో... ఆ గది అవతల ఎవరో నిల్చుని తనను కాపాడమని అడుగుతోన్నట్లు అనుమానం తోచింది. నవ్వుకున్నాడు. యువకుల ఆలోచనలు ఇలానే ఉంటాయి. సత్యవతిని ఈ స్థితిలోనే ఊహించుకున్నాడు. తలుపుతియ్యగానే కాళ్ళమీదకు వంగి "ఈ పాదాల దగ్గర కొంతచోటియ్యి బావా!" ఏం ఖర్మం దేముడా! ఏదయితే వద్దు అనుకున్నాడో దానినిగురించి ఆలోచిస్తున్నాడు.    

 

    అతనికి తలుపుతీసి చూద్దామనిపించింది. గమ్మత్తులకేమీ కొదవలేదుగదా...  లైటువేసి తలుపుతీశాడు. అవును. గమ్మత్తులకేమి కొదవా?

 

    ఒక్క అడుగు వెనక్కువేసి "మీరా?" అన్నాడు రాజారావు కంపిత స్వరంతో.

 

    స్త్రీ...! ఒక్కర్తే వర్షంరోజున... ఒక యువకుడి గదిముందు.

 

    మరో క్షణంలో అతనిగుండె కరిగింది. "తడిసిపోతున్నారు. లోపలికి రండి" అన్నాడు.

 

    ఆమె మాట్లాడకుండా, భయంగా లోపలకు వచ్చింది. తలవంచుకుని నిల్చుంది.

 

    "ఏం పనిచేశారు?" అన్నాడు రాజారావు.

 

    ఆమె మెల్లిగా ముఖంఎత్తి అతనికేసి చూసింది. ప్రకాశిస్తున్న నేత్రాలు. గదిలో అలా గుచ్చుకునేటట్లుగా చూసింది.

 

    "నేను చేసినపని సమంజసమైనదికాదని నాకు తెలుసు" అన్నదామె.

 

    "తెలిసే..."

 

    "అవును మహానుభావా! నేను అమాయకంగా రాలేదు మీదగ్గరకు. అలా అపోహపడకండి" అంటూ ఆమె నవ్వింది.

 

    "కూర్చోనా?" అంది కొంచెం ఆగి తనే.

 

    రాజారావు తల ఊపాడు.

 

    "మీరు ఎంత నిర్దయులు రాజా!" అన్నది మంజువాణి కొంచెం కోపంగా.

 

    "నేనా? ఏమిటి నామీద ఈ నింద?"

 

    "ఏమిటో తెలియదా? నేను ఈ రాత్రి ఇంత సిగ్గుమాలినపని చేశానుగదా! నన్ను నేను చిత్రవధ చేసుకున్నానుగదా! అప్పటికీ ఓ సానుభూతి మాటలన్నా పలకరేం? అప్పుడే లోకువైపోవటం మొదలుపెట్టాను కదూ!"

 

    రాజారావుకు మతిపోయింది. వర్షం లోపలకు పడుతోంది. వెళ్ళి తలుపులు మూసివచ్చాడు.

 

    "ఓ ఆడది లోపలవుంటే తలుపులు వేయడం తప్పు తెలుసా?"

 

    అతనికి తిక్కరేగింది. "నాకు తెలియదులే, నీనుంచి నీతిపాఠాలు నేర్చుకోవాల్సివచ్చింది" అన్నాడు.

 

    మంజువాణి తేలిగ్గానవ్వి "అయితే మీరు నా శిష్యులు అవడానికి సిద్ధంగా వున్నారా?" అంది.

 

    "ఆహా! భూమిమీద అంతకంటే పరమభాగ్యం ఏముంది? పుట్టినప్పటి నుంచి ఇలాంటి మహదవకాశం కోసమే చూస్తున్నాను మొదలెట్టండి. పెళ్ళయినవారు పరపురుషుడితో సరస సల్లాపాలు చేయవచ్చునా?"

 

    ఆమె ఫకాలున నవ్వింది.

 

    "మీ నవ్వు అందంగాలేదు. అయినా అంత గట్టిగా నవ్వితే అన్నగారికి వినిపించగలదు."

 

    "నా నవ్వు అరవై మైళ్ళదూరం వ్యాపించదులే మహానుభావా! అయినా అప్పుడే అన్నగార్ని చేసేశారేమిటి?"

 

    "మీ అభిలాష అదేగా!"

 

    "నా శిష్యుడు చాలా తెలివైనవాడు. సూక్ష్మగ్రాహి. మంచి రసికుడు కూడానూ."

 

    "అలానా? నాకు తెలియదనుకో. అయితే గొప్పవాళ్ళ జాబితాలో చేరిపోయాను. అలా చలితో వణక్కపోతే ఆ రగ్గు కప్పుకోకూడదూ" అన్నాడు రాజారావు.

 

    "నేనంటే ఎంత ప్రేమ మీకు... క్షమించాలి. అభిమానం అని అందాం ప్రస్తుతానికి మీరే కప్పండి. జాగ్రత్త! శరీరం తగిలేను... అయ్యో, మీ రగ్గు తడిసి పాడైపోతుందే మరి!"

 

    రాజారావు రగ్గును ఆమెమీద పదిలంగా కప్పి ఇవతలికి వస్తూ "రగ్గేనా పాడయ్యేది? మంచిదే" అన్నాడు.

 

    "శిష్యులు ఏదో భావయుక్తంగా మాట్లాడుతున్నారు."

 

    "చిత్తం. సూటిగా మాట్లాడటానికి సిగ్గేసి..."

 Previous Page Next Page