Previous Page Next Page 
జైలు పేజి 22


    అలా అలోచించి కొంత భరోసా కలిగాక మిత్రులవైపు భయపడాల్సిన అవసరం లేదన్నట్టు చూశాడు.

 

    గార్డు అటూ ఇటూ రెండుసార్లు తిరిగి పిట్టగోడ మీద కూర్చుండిపోయాడు.

 

    డాబా మీదున్న హైఓల్ట్స్ బల్బు వెలుగుతుండడం వల్ల ఆ ప్రాంతమంతా పట్టపగల్లా వుంది.

 

    తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. తాము ట్యాంక్ లో వున్నట్టు గార్డుకు అనుమానం వచ్చే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే వచ్చే ప్రమాదం ఏదీలేదని అనిపించడంతో స్థిమితపడ్డారు.

 

    అంతలో ఎండుటాకులమధ్య త్రాచుపాము కదిలినట్టు నీళ్ళు చప్పుడు వినిపించటంతో ముగ్గురూ కంగారుగా అటూ ఇటూ చూశారు.

 

    కంత దగ్గరున్న నీళ్ళ వైపు నుంచి నీళ్ళు కిందకు దుముకుతున్నాయి.

 

    ట్యాంకును పూర్తిగా నింపడానికి వార్డరు తోటలో బావికున్న మోటారు వేశాడని తెలిసిపోయింది ముగ్గురికి.

 

    ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒంట్లోంచి రక్తం కారిపోయినట్టు నిస్సత్తువ ఆక్రమించింది ముగ్గురికీ.

 

    ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒంట్లోంచి రక్తం కారిపోయినట్టు నిస్సత్తువ ఆక్రమించింది, ముగ్గురు డస్సిపోయారు.

 

    మరో గంటకు ట్యాంక్ లోపలికి నీళ్ళు పూర్తిగా వచ్చేశాయి. బయట గార్డు వుండడంవల్ల తప్పించుకు పోవడానికి లేదు. అక్కడే వుండి నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోవడం ఖాయం.

 

    ఈ ప్రమాదాన్ని ముందే వూహించనందుకు తనకు తానే తిట్టుకున్నాడు తిలక్.

 

    ప్రస్తుతం తమ ముందు రెండే చాన్సులున్నాయని అనుకున్నారు బుద్ధుడు, ఉత్తరుడు. ప్రాణాలు నిలుపుకోవాలంటే వెంటనే అక్కడి నుంచి బయటపడాలి. గార్డుకు దొరకకుండా వుండాలంటే ట్యాంక్ లోనే ఉండి వూపిరాడక చచ్చిపోవాలి. ఇప్పుడేం చేయమంటావన్నట్టు ఇద్దరూ తిలక్ వైపు చూశారు.

 

    అతనూ అయోమయంగా చూడడంతో ఇద్దరి కళ్ళలోనూ ఠక్కున నీళ్ళు వూరాయి. ప్రాణభయం మొత్తం శరీరాన్ని వూపేస్తోంది.

 

    ఈ కొత్త ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నాడు తిలక్.

 

    ట్యాంక్ లోపల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

 

                                                            *    *    *    *

 

    జైలంతా ఉద్రిక్తంగా వుంది.

 

    ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. పారిపోయిన ఖైదీలు దొరక్కపోతే తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందన్న ఆందోళనతో పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు వార్డర్లు. జెయిలు తలుపు వూచలను పట్టుకుని నిలుచున్న ఖైదీలను కూడా లాఠీలతో కొడుతున్నారు. గార్డులు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

 

    అన్ని బ్యారెక్కులలోనూ ఆరోజు పేకాట బంద్ అయింది. ఖైదీలు గుంపులు గుంపులుగా చేరి పారిపోయిన ఖైదీల గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పట్లో భోజనం రాదని తెలిసిన కొందరు ఖైదీలు నిద్రకుపక్రమించారు.

 

    తిలక్ మీద అభిమానం వున్న ఖైదీలు వాళ్ళ గార్డులకు దొరకకూడదని కోరుకుంటున్నారు. ఈ ఎస్కేప్ ఖచ్చితంగా ఫెయిలవుతుందని వాళ్ళ ముగ్గురూ పట్టుబడతారని దాదా గ్రూప్ ఖైదీలు సంతృప్తి పడుతున్నారు.

 

    దాదా చెప్పిన ప్లాన్ ని అమలుజేయక మునుపే తన చేతుల్లోంచి ఉత్తరుడు తప్పించుకున్నందుకు నైఫ్ తెగ బాధపడిపోతున్నాడు.

 

    ఈ పరిస్థితుల్లోనూ దాదాకు బ్రాందీ అందింది. "రా" గానే తాగేసి పడుకున్నాడు.

 

    ఇక సూపరింటెండెంట్ శ్రీపతి ఒంటరిగా తన ఆఫీసులో కూర్చుని ప్రతి అయిదు నిముషాలకి ఫోన్ వైపు చూస్తున్నాడు. అది ఎంతసేపు పలక్కుండా చచ్చిపోయిన గబ్బిళంలా వుంది.

 

    న్యూజెయిలు టెర్రస్ మీదున్న గార్డు దూరంగా చిన్నగా కనిపిస్తున్నాడు ఆయనకు. జైలు లోపల తోటలో తిరుగుతున్న మరో గార్డు కీ ఇస్తే తిరుగుతున్న లియోటాయ్ లా అనిపిస్తున్నాడు.

 

    టెన్షన్ మరీ ఎక్కువ కావడంతో నిస్తేజంగా కుర్చీలో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. పోలీసులు కూడా రంగంలోకి దూకడంతో ఖైదీలు దొరుకుతారన్న ఆశ మిణుకు మిణుకుమంటూ వుంది.

 

    సరిగ్గా ఆ సమయానికి పోలీసులు ఓ జీప్ లో, గార్డులు, వార్డులు మరో జీపులో వేటకుక్కల్లా టౌనంతా మరోమారు తిరుగుతున్నారు.   

 

                                     *    *    *    *

 

    యముని మహిషపు లోహ గంటల చప్పుడలా వుంది నీళ్ళు పడుతున్న శబ్దం.

 

    తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు కళ్ళు ఆర్పకుండా ఆటే చూస్తున్నారు మంత్రం వేసినట్టు నీళ్ళు ఆగిపోయే చిత్రాన్ని చూస్తామో లేదోనన్న భయం వాళ్ళ చుట్టూ నిముష నిముషానికి పెరిగిపోతోంది.

 

    తనకు నీటిగండం వుందని చిన్నప్పుడు కోయవాడు చెప్పింది గుర్తుకొచ్చింది ఉత్తరుడికి. చివరిసారి అమ్మా నాన్నను తనకు తెలిసిన వాళ్ళందర్నీ కళ్ళ ముందుకి తెచ్చుకుంటున్నాడు. ఏదైతే అదే అయిందని అక్కడనుంచి బయట పడాలన్న ఆరాటాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడు. తనకు ధైర్యం చెప్పుకుంటున్నాడు.

 

    ఏదైనా చేసి ఈ అపాయం నుంచి కాపాడమని బుద్ధుడు తన బాస్ వైపు చూస్తూ సైగలతోనే అర్థిస్తున్నాడు.

 

    నీటిమట్టం బాగా పెరిగింది. మెడను పూర్తిగా ముంచేస్తున్న నీళ్ళు ముంచుకొస్తున్న మృత్యుదేవత స్పర్శలా చల్లగా తగుల్తున్నాయి.

 

    కూర్చోవడానికి తప్ప నడుమును మరికాస్త లేపేందుకు కూడా వీలుకావడం లేదు. నడుము లేపితే ముఖం వంగి నీళ్ళల్లో కూరుకుపోతోంది.

 

    బయట తిరుగుతున్న గార్డు బూట్లు చప్పుడు చావు మేళంలా వినిపిస్తోంది.

 

    తిలక్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో బేలగా చూస్తున్నాడు. మరో పదినిముషాలకు కొళాయి ఆగిపోకపోతే ముగ్గురూ ఊపిరాడక చచ్చిపోతామని తెలుస్తూనే వుంది. తనతోపాటు మరో ఇద్దర్ని ఇందుకు పురికొల్పి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నానన్న భావన అతన్ని కలచివేస్తోంది. చప్పున లాలస గుర్తు వచ్చింది అతనికి.

 

    ఇలానే  చచ్చిపోతే లాలస ఏమైపోతుంది? తాము వస్తామని గోడ దగ్గరికి వచ్చిన తనను గార్డు కనిపెడితే....? ఆమెకీ శిక్ష పడుతుందేమో. జైలునుంచి తమను తప్పించాలని వచ్చిన వ్యక్తి చివరకు అదే జైలులో చిక్కుకుపోతుందేమో ఆ తరువాత ఎప్పుడో, రెండు మూడు రోజులకు తాము నీళ్ళ ట్యాంక్ లో చచ్చిపోయినట్టు ఆమెకు తెలుస్తుంది అప్పుడు ఏమని రోదిస్తుంది? అయినా ఎవరీమె? తనకెందుకు సహాయం చేస్తోంది? ఆ కళ్ళల్లో ఎంతటి అభిమానం! అనాధాశ్రమ జీవితాన్ని మనసులోంచి తుడిచిపెట్టడానికి దేవతలు పంపిన దూతలా అనిపిస్తోంది.

 Previous Page Next Page