Previous Page Next Page 
ఉషోదయం పేజి 22

    "మహా బయలుదేరింది లోకాన్ని ఉద్ధరించడానికి ఈవిడ... ఆడపిల్ల పెళ్ళిచేసి ఓ ఇంటిదాన్ని చేయకుండా ఆ పేపరుకి పుస్తె ముడేయించారు ఈయన. ప్రతిక్షణం భయంతో చస్తున్నాను శారదా."
    "డాడీ, ఈ రోజుల్లో గూండాయిజం బాగా పెరిగిపోయింది. చేతికి మట్టి అంటకుండా కిరాయి రౌడీలని పెట్టి ఎంతఘోరమైన చేయిస్తున్నారు. డబ్బుకోసం ఎంతటి ఘాతుకాలైనా చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా వుండాలి డాడీ. నీరద ఆడపిల్ల... మరింత జాగ్రత్త అవసరం. అమ్మే కాదు, నాకూ భయంగా వుంది. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ ని మనం మరీ తేలిగ్గా తీసుకోకూడదు" శారద దిగులుగా అంది.    
    "శ్రీనివాస్, నీవు నీరదని ఎప్పుడూ ఎక్కడికీ ఒంటరిగా వదలద్దు తెలిసిందా! డాడీ, పోనీ ముందు జాగ్రత్తగా పోలీసు కంప్లైంట్ ఇవ్వకూడదూ."
    నారాయణమూర్తి చిరునవ్వు నవ్వి.
    "అమ్మా, ఏదన్నా రాసిపెట్టివుంటే ఆపడం ఎవరి తరం? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మీ అమ్మే అంటుంది గదా!" అన్నారు.
    "ఇలాంటివాళ్ళకి ఎవరూ చెప్పలేరులే తల్లీ. పద నీకిష్టమని వేడి వేడి ఉప్మా చేశాను" కూతురిని లోపలికి తీసుకెళ్ళింది లలితమ్మ.
    "మీ అమ్మ అనడం కాదు. నాకూ కాస్త భయంగానే వుంది. శ్రీనివాస్, మీ ఇద్దరూ జాగ్రత్తగా వుండండి. కాస్త దూకుడు తగ్గించండి వార్తల్లో" నారాయణ మూర్తి అన్నారు.
                                          * * *
    "ఏయ్ సుప్రియా! ఏమిటే నేను ఉద్యోగం ఇప్పించానన్న కృతజ్ఞతన్నా వుందే నీకు? మళ్ళీ కనబడలేదు. ఎలాగుంది ఉద్యోగం? మా శ్రీవారు ఏమంటున్నారు? బాస్ లా వున్నారా, కాస్త ఫ్రెండ్లీగా వున్నారా లేదా... విషయాలన్నీ చెప్పవే. కనీసం ఫోనన్న చెయ్యచ్చు గదా... నీకసలు విశ్వాసం లేదే" శారద దబాయింపుగా అంది.
    "ఆపవే తల్లీ, శాపనార్థాలు. మీవారు ఇచ్చిన జీతానికి తగిన చాకిరీ చేయించుకుంటున్నారులే. రాత్రి ఎనిమిదివరకు ఆయన వుండేంతవరకు ఆఫీసులో వుండాల్సిందే. ఆదివారమూ సెలవు ఇవ్వరే మహానుభావులు... మీ ఆయన పనిరాక్షసుడే. డబ్బు వస్తున్నకొద్దీ వదలాలనిపించదు గాబోలు. ఏ కేసూ వదలరాయన. ఇంక నాకు మీతో సరదాగా కాలక్షేపం చేసే టైమెక్కడుందే బాబూ, సునీతా కనపడలేదంటుంది. తల్లీ, మీవారితో చెప్పి ఆదివారం అన్నా వదలమను నన్ను... ఆయన నీమాట వింటారనుకోనులే..."
    "బాగా కనిపెట్టావు. నెలరోజులలో మావారిని నాకంటే బాగానే స్టడీ చేసేశావు. నేనూ మొత్తుకుంటున్నాను అంతలా డబ్బుకోసం రాత్రింబగళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏముంది అన్నా వినరే. ఈ సంపాదన అనేది వస్తున్నకొద్దీ ఇంకా ఇంకా కావాలనే ఓ జాడ్యం అనుకుంటాను.
    ఒక ఆరేడేళ్ళు నేను రాత్రింబగళ్ళు ఎంత కష్టపడ్డానో... అది సరేగాని బుద్ధిగా వుంటున్నావా... సునీత చెప్పినట్లు కొన్నాళ్ళు ప్రేమలు దోమలు అనకు. అన్నింటికీ దూరంగా వుండు."
    "అబ్బ! ప్రేమించడానికి కిక్కడెవరున్నారే... కేసులు కోసం వచ్చే క్లయింట్లు తప్ప. సివిల్ కేసులు ముసలికంపు... క్రిమినల్ కేసులు రౌడీకంపు... ఎవర్ని ప్రేమిస్తాను! కాగా పోగా నాకు మీ ఆయనే కనిపిస్తున్నాడు కాస్త స్మార్ట్ గా... చిలిపిగా అంది నవ్వి.
    "పెట్టిన చేయినే మింగేరకంలా వున్నావు. జాగ్రత్త! ఫాల్స్ హోప్స్ పెట్టుకోకు. ఫాల్స్ హోప్స్ ఆయనకిచ్చావంటే అంతే సంగతులు..." బెదిరిస్తున్నట్లంది.
    "మరేం బెంగపడకు. మీ ఆయన అంత సులువుగా బోల్తాపడేరకంలా లేడులే. ఆ విషయంలో నీవు అదృష్టవంతురాలివేలే..."
    "అబ్బ! ఆయనగారి గురించి మంచి కాంప్లి మెంట్ ఇన్నాళ్ళకి ఒకటి విన్నాను. థ్యాంక్స్ సుప్రియా. సరేలే ఫోన్ పెడతాగాని ఈ ఆదివారం సునీత ఇంటికి రమ్మంటోంది. నీవూ రా. ముందుగా చెప్పి పర్మిషన్ తీసుకో... ముగ్గురం కాసేపు సరదాగా గడుపుదాం. ఒకే, బై" ఫోను పెట్టేసింది.
                                            * * *
    "రంజనీ! ప్రతిదానికీ చిన్నపిల్లలా ఏమిటీ అలక. మాట్లాడడం మానేయడం మొహం చాటేయడం... ఈ అలకలు... మనం టీనేజ్ పిల్లలం గాదు... మెచ్యూర్డ్ గా ప్రవర్తించు. ఒక నెలరోజులు ఓపిక పట్టలేవా..." అసహనంగా అన్నాడు రవీంద్ర.
    "నెలకాదు... సంవత్సరాలు నీకోసం ఆగుతాను. కానీ, నీ నిర్లక్ష్యధోరణి కంటే కూడా నీ భార్యాబిడ్డలని నీవింకా ప్రేమిస్తున్నావన్న సత్యం భరించలేకపోతున్నాను. నామీద నీకు ఇష్టం తప్ప ప్రేమలేదు. నీకు నామీద మోహం తప్ప నీ గుండెల్లో నేను లేననిపిస్తోంది. నీ భార్యాబిడ్డలమీద వున్న శ్రద్ధ, ప్రేమ, బాధ్యత ఏదీ నాపట్ల నీకు లేదు... ఏం నా మాట అబద్దమంటావా, గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు" నిలేసింది కాళ్ళనీళ్ళు తిరుగుతుండగా.
    "నీవిలాగే సతాయిస్తుంటే నిజంగానే నా భార్యే బెటర్ అనుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. అనేకసార్లు చెప్పాను, సునీత తప్పేం లేనప్పుడు ఆమెను నేనెందుకు ద్వేషించాలి? రక్తం పంచుకునిపుట్టిన పిల్లలమీద ప్రేమ లేకుండా ఎలా వుంటుంది? రియాల్టీని నీవు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అపుడు నీకు నామీద సంశయం వుండదు. నీమీద ప్రేమ లేకపోతే తీరి కూర్చుని సుఖంగా సాగిపోయే నా సంసారం ఎందుకు వదులుకుంటాను? ఈ డైవోర్సు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడతాను? రంజనీ... పదే పదే నన్ను అనుమానిస్తూ, సందేహిస్తూ, నీ మాటలతో, చేతలతో నా మనసు నొప్పిస్తే నష్టపోయేది నీవే అని గ్రహించు. ఈ డైవోర్స్ దొరికేవరకు నానుంచి ఇంతకంటే ఏం ఎక్స్ పెక్ట్ చేయద్దు. ఇదే నీకు ఆఖరిసారి చెప్పడం..." చాలా అసహనంగా అన్నాడు.
    రంజని రవీంద్ర ధోరణి చూసి కాస్త తగ్గింది. ఎంత వద్దనుకున్నా రవీంద్ర భార్యాపిల్లలతో ఏమాత్రం ఆనందంగా వున్నా సహించలేకపోతోంది. ఇంకా నెల! ఎలాగో భరిస్తే, తర్వాత...
                                           * * *
    "ఏమ్మా నీరదా! ఇంటికెళదామా, పని అయిపోయిందా" నారాయణమూర్తి నీరద టేబిల్ దగ్గిరకొచ్చి అడిగారు. కంప్యూటర్లో చేస్తున్న పని ఆపి వాచీ చూసుకుంది. కాస్త ఆశ్చర్యంగా "ఏడే అయింది కదా... ఇవాళ అప్పుడే వెళదాం అంటున్నారేమిటి?"          

 Previous Page Next Page