Previous Page Next Page 
జనవరి 5 పేజి 23

 

       తలుపు కొట్టాలా.... పిలవాలా? ఏమైనా అనుకుంటే....? వేరే ఉద్దేశ్యంతో వచ్చారా అని ప్రశ్నిస్తే-? అయినా ఇలా చెప్పాపెట్టకుండా క్రాంతి ఎక్కడకు వెళ్ళినట్టు?
   
    అతని ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు. అనుమానాలు క్లియర్ అవ్వటం లేదు.
   
    అలాగే దాదాపు నిమిషం సేపు అక్కడే నిలుచుండిపోయాడు.
   
    ఇవేమీ తెలీని మేఖల చాపమీద పడుకొని సీలింగ్ కేసి చూస్తూండి పోయింది.
   
    అంతలో జరిగింది ఓ తమాషా-
   
    మేఖల ఇంటి ఓనర్ కి పదహారేళ్ళ కూతురుంది. ఆ అమ్మాయి ప్రక్క సందులోంచి రోడ్ మీదకు వస్తూ అలవోకగా మేఖల గదికేసి చూసి వులిక్కిపడింది.
   
    సరిగ్గా ఆ సమయానికి మేఖల గది కిటికీ కేసి తిరిగి ఉన్న విమల్ ఉన్నట్లుండి ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. అతనికిప్పుడు చెల్లెలు గుర్తు లేదు. తనెక్కడున్నదీ అంతకంటే గుర్తులేదు. అసలు కనీసం తను నిలుచున్నదీ కూర్చున్నదీ కూడా అతనికి తెలీదు.
   
    ఆ దృశ్యాన్ని మరో కోణం నుంచి తీసుకున్న ఆ పదహారేళ్ళ అమ్మాయి నెమ్మదిగా ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది.
   
    తను చూసిన దృశ్యం ఆమెను థ్రిల్లింగ్ కి గురిచేస్తోంది. ఆ అమ్మాయి మెల్లగా మేఖల గది వెనక్కి చేరుకుంది. ఆ గదికి వెనుకవేపు వున్న కిటికీ రెక్కను మెల్లగా శబ్దం రాకుండా తెరిచి లోపలకు చూసింది.
   
    మేఖల పడుకుని ఉన్న కోణం ఆమెకు మరింత అనుమానాన్ని కలిగించింది.
   
    మేఖల తలవేపు నుంచి చూడటంతో ఆ అమ్మాయిలో మరింత ఉత్సాహం పెరిగిపోయింది.
   
    మేఖల కూడా కిటికీలోంచి గదిలోకి చూస్తున్న విమల్ కేసి చూస్తోందని విశ్వశించి ఒక్కసారి నవ్వుతూ వెనుకవేపు ద్వారం గుండా ఒక్కసారి ఆ గదిలోకి వచ్చి పడింది.
   
    పరధ్యానంగా ఉన్న మేఖల ఉలిక్కిపడి లేచికూర్చుంది.

    "మీరు చాలా అదృష్టవంతులాంటీ?" అంది ఆ అమ్మాయి.
   
    "నాకర్ధంకాలేదు" అంది మేఖల ఆ అమ్మాయికేసి ఆశ్చర్యంగా చూస్తూ.
   
    "నా బాయ్ ఫ్రెండ్ కసలు ధైర్యం లేదు..."
   
    "నీకు బాయ్ ఫ్రెండున్నాడా?" ఆశ్చర్యపోయింది మేఖల.
   
    "ఎందుకంత ఆశ్చర్యం....? నువ్వు అమెరికా ప్రెసిడెంట్ వా.... అన్నంత ఆశ్చర్యంగా అడిగారే?" ఆ అమ్మాయి నవ్వుతూనే అంది.
   
    "నీ వయసెంత?"
   
    "స్వీట్ సిక్స్తీన్ ... మరిది బాయ్ ఫ్రెండ్ ఉండే వయస్సేగదా ఆంటీ?" ఆ అమ్మాయి అమాయకంగా తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ అంటుంటే మేఖల బిత్తరపోయింది.
   
    "అవునూ... నన్ను అదృష్టవంతురాలన్నావెందుకు."
   
    "నా బాయ్ ఫ్రెండ్ కి నేను వెంటనే గర్ల్ ఫ్రెండ్ నయి పోయాను. కొంత కాలం ఏడిపించాల్సింది."
   
    "ఎందుకు ఏడిపించడం?"
   
    "అప్పుడు నాకు లైన్ వేసేవాడు గదా? నా కోసం బస్ స్టాపుల్లో సినిమా హాళ్ళ దగ్గర మా వీధి మొదట్లో ఎలక్ట్రిక్ స్తంభం క్రింద నించుని బీట్ వేసే వాడుగదా? అవేమీ ఇప్పుడు చేయటం లేదు. ఏమిటో జీవితం చప్పగా వుంది."
   
    పెద్ద ఆరిందాలా అన్నీ తెలిసిన దానిలా ఆ అమ్మాయి చెప్పుకు పోతుంటే మేఖల నోటంట మాట రాలేదు.
   
    "మీరు చాలా అదృష్టవంతులాంటీ" అంది మరలా కిటికీ కేసి ఓరగా చూస్తూ.
   
    మేఖల అంతవరకూ వీధివేపున్న కిటికీకేసి చూడలేదు.
   
    "అదే... ఎందుకూ అని అడుగుతున్నాను."
   
    "మీ బాయ్ ఫ్రెండ్ ధైర్యంగా, పట్టపగలే వీధిలో నుంచునే మీకు లైన్ వేస్తున్నాడుగా?" జెలసీ ఫీలవుతూ అందా అమ్మాయి.
   
    ఆ మాటలకి మేఖల షాక్ తిన్నది.
   
    "నాకు.... నాకు బాయ్ ఫ్రెండున్నాడా? అతను నాకు ధైర్యంగా, పట్ట పగలు అదీ వీధిలో నించుని.... నువ్వనేదేమిటో నాకర్ధం కావడం లేదు." అంది ఆమె కంగారుగా.
   
    ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వింది.
   
    "మీ ఇంట్లో నీకు బాయ్ ఫ్రెండున్నాడని తెలిస్తే ఊరుకుంటారా?"
   
    "అలాంటివన్నీ గుర్తుచేసి భయపెట్ట వద్దాంటీ - మీరు భలే లక్కీ... మీది ఈ ఊరు కాదు- మీ పేరెంట్స్ ఇక్కడ లేరు."
   
    "నా లక్కేమిటో చెప్పకుండా చంపేస్తున్నావ్?"
   
    "నాకు తెలీదనుకోకండి. మీ బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను గమనించలేదు."
   
    "నాకు బాయ్ ఫ్రెండేమిటి-? ఎక్కడా ఎవరు-?" అంది మేఖల నవ్వుతూ.
   
    ఆ అమ్మాయి నోటితో చెప్పకుండా చేత్తో కిటికీని చూపించింది.
   
    మేఖల ఆ వేపు చూసి విస్తుపోయింది.
   
    నిజంగానే అక్కడెవరో నించుని వున్నారు.
   
    ఆమెకో క్షణం జరిగిందేమిటో అర్ధం కాలేదు. అతన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. వడివడిగా వీధివేపున్న తలుపుల్ని తెరిచి బయటకు తొంగి చూసింది.
   
    విమల్ ఇంకా ఆలోచనల్నుంచి తేరుకోలేదు.
   
    మేఖలకు అనుమానం వచ్చింది. విమల్ తల ఓ ప్రక్కకు వంచి మౌనిలా వున్నాడు.
   
    "హలో-హలో-" అంది గట్టిగా విమల్ ని వుద్దేశించి.
   
    అతను వినిపించనట్లు అలాగే వుండిపోయాడు.
   
    "హలో మిస్టర్" అంటూ గట్టిగా చప్పట్లు కొట్టింది మరలా.
   
    అప్పటికి తేరుకున్న విమల్ బెరుగ్గా మేఖల కేసి చూశాడు.
   
    "ఏమిటి- ఏమిటిక్కడ నించున్నారు?" అంది కోపంగా.
   
    "అదీ... అదీ..." విమల్ నసిగాడే తప్ప సమాధానం ఇవ్వలేక పోయాడు.
   
    "ఏది..? ఏం కావాలి మీకు?" అంది అసహనంగా మేఖల.
   
    "మా సిస్టర్ ఇటు వచ్చిందేమోనని."
   
    "అదో వంకా...?"
   
    "వంకా....?!" మేఖల తన మీద ఎందుకంత కోపగించుకుంటుందో అర్ధం కాలేదు విమల్ కు.
   
    "ఈ వీధంతా రౌడీమూకే నట్లుంది వెళ్ళండి.... వెళ్ళండి" అంటూ తలుపులేసుకోబోతూ ఆగిపోయింది.
   
    విమల్ ఇంకా ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడనుకుంది మేఖల అతనికి పరధ్యానం ఎక్కువని.
   
   
    "ఎవరు మీ సిస్టర్..?" సౌమ్యంగా అడిగింది.
   
    "క్రాంతి..." అన్నాడు చటుక్కున విమల్.
   
    అప్పుడు నవ్వింది మేఖల. విషయమంతా ఆమె కర్ధమైంది. ఆమెకు అంతకుముందే ఎవరి ద్వారానో క్రాంతికి ఒక అన్న ఉన్నట్లు, క్రాంతి తనతోనే కలిసి వుంటున్నట్లు తెలిసింది.
   
    తన దుడుకుతనానికి సిగ్గుపడుతూ అతన్ని లోపలకు ఆహ్వానించింది.
   
    కాసేపు విమల్ తో మాట్లాడాక ఇద్దరిలోని బిడియం ఎగిరిపోయింది.
   
                     *    *    *    *    *
   

    అభిరామ్ ని చేరుకోడానికి పది అడుగుల దూరం వుంటుందనుకోగానే ఆగిపోయింది క్రాంతి.
   
    ఆమెకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది.
   
    అభిరామ్ మాత్రం సీరియస్ గా నడుస్తున్నాడు. వాళ్ళు నడుస్తున్నది మట్టి రోడ్ పైన, అందువల్ల వాళ్ళు వేసిన అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
   
    క్రాంతి అభిరామ్ వేసిన అడుగుల్లోనే ఆమె కూడా తూచి తూచి నడవసాగింది. ఇప్పుడు ఆమె దృష్టంతా అభిరామ్ అడుగుల గుర్తులపైనే వుంది. మరో పది అడుగుల దూరం నడిచేసరికి ఈ దృశ్యాన్ని చుట్టుపక్కల జనం గమనించారు.
   
    వాళ్ళకా దృశ్యం చిత్రంగా కనబడటంతో వాళ్ళు ఓ క్షణం ఆగిపోయి అభిరామ్ వైపు, ఆమెవైపు చూస్తూ ఓ చిరునవ్వు విసిరి వెళ్ళిపోతున్నారు. అది అభిరామ్ గమనించి ఆశ్చర్యపోయాడు. తనవైపు ఎందుకు విచిత్రంగ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారో అభిరామ్ కి అర్ధం కాలేదు. తన వేషంలో ఏదైనా...అనుకుంటూ హడావిడిగా ఫేంట్ షర్ట్ వైపు తన చెప్పులవైపు పరిశీలనగా చూసుకున్నాడు. వాటిల్లో ఎటువంటి తేడా కనబడకపోవడంతో ఎందుకో అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూశాడు.
   
    క్రాంతి తల వంచుకుని సీరియస్ గా జాగ్రత్తగా అభిరామ్, అడుగులో అడుగు వేసుకుంటూ రావటం కనిపించి చిన్నగా నవ్వుకున్నాడు.
   
    వెంటనే ఆమె ఏం చేయబోతున్నదో చూద్దామన్నట్లు కదలకుండా అలాగే నిలబడిపోయాడు.

 Previous Page Next Page