ఆ వ్యక్తి లోపలినుంచి ఓ బ్రీఫ్ కేస్ తో వచ్చాడు.
వృద్దుడు సైగచేయడంతో అతను తన చేతిలో వున్న బ్రీఫ్ ని మేఖల కందించాడు.
"ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధానం ఆ తర్వాత లక్షల మందికి మార్గదర్శకులు కావాలి. కోట్ల మందికి ఉత్తేజాన్ని కలిగించాలి. మనకు, అమెరికాకు ఎంతో దూరం వున్నా, మనకు జపాన్ కు అంత దూరం లేదు. అదీ గుర్తుంచుకోండి....బై" అన్నాడు ఇక వెళ్ళిరమ్మన్న ఉద్దేశాన్ని పరోక్షంగా కనబరుస్తూ.
వాళ్ళు ఆ బ్రీఫ్ కేస్ చూస్తుండగానే ఆ వృద్దుడు వెళ్ళిపోయాడు.
* * * * *
విమల్ క్రాన్తి గేటు దగ్గరకు వచ్చి అడ్రస్ ను కన్ ఫర్మ్ చేసుకుంటుండగా గేట్ మెన్ వచ్చి ఏమిటన్నట్లు చూశాడు. విమల్ తన చేతిలో వున్న చిన్న కటింగ్ ని చూపించాడు. కొద్దిసేపు వెయిట్ చేయమన్నట్టుగా చూసి లోపలికెళ్ళి తన ఛాంబర్ నుంచి బంగ్లాకి ఫోన్ చేసి బయటకొచ్చాడు.
"మీరు వెళ్ళవచ్చు" చెప్పాడు చిన్న గేట్ ను ఓపెన్ చేస్తూ.
ఇద్దరూ గేట్ దాటి విశాలమయిన బంగ్లా ఆవరణలోకి అడుగు పెట్టారు.
"నాకిదంతా విచిత్రంగా వుంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పడిన ప్రకటనే ఆశ్చర్యంగా వుంటే, అంతకంటే ఆశ్చర్యంగా వుంది యిక్కడి వాతావరణం. ఇంత వైశాల్యంలో బంగ్లా ఉండటం, ఆ బంగ్లా బిక్కు బిక్కుమంటూ కన్పించటం... ఇంకా నేనేదో ఆఫీస్ అడ్రస్ అనుకున్నాను"
మైసూర్ బృందావన్ గార్డెన్స్ లా తీర్చిదిద్దినట్లున్న పూలతోటను చూస్తూ అంది క్రాంతి.
"అవకాశాలు అంతగా రాని యిక్కడ, వచ్చిన అవకాశం గురించి సందేహపడటం పాజిటివ్ అనిపించుకోదు. చూద్దాం ఏం జరుగుతుందో" అన్నాడు విమల్.
ఇద్దరూ బంగ్లా ముందుకి చేరుకున్నారు.
"మాస్టర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ" అంటూ ఆ యిద్దరినీ లోపలికి తీసుకెళ్ళాడు.
మేఖల, అభిరామ్ ని ఇంటర్వ్యూ చేసిన పద్ధతుల్లోనే ఈ ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసి పెట్టుబడి ఎంత కావాలనడిగాడా వృద్దుడు.
ఆయన ప్రవర్తనలో విమల్ కేదో అంతరార్ధం కనబడితే, క్రాంతి మాత్రం దిగ్భ్రాంతికి గురయింది.
"యాభయ్ వేలు కావాలి" అన్నాడు విమల్ ఆ వృద్దుడికేసే పరిశీలనగా చూస్తూ.
"డన్" అన్నాడా వృద్దుడు.
క్రాంతి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది.
"నాకు ఒకటే వ్యధ - అది మనదేశం గురించి, ఎందుకిలా మన దేశం వెనుకబడి పోతుంది? భారతదేశ సార్వభౌమత్వానికి కొందరు ప్రాణ త్యాగం చేశారు. మరలా యిప్పుడు ఆర్ధికాభివృద్దికి ఎందరు ప్రాణత్యాగం చేయాలి? త్యాగం చేసేందుకు ఎవరయినా సిద్దమయినా ఆ ఆత్యాగం విలువను గుర్తించే బాధ్యతాయుతమైన పౌరులు మనదేశంలో ఎంతమందుంటారు?" వృద్దుడు తనలో తానే అనుకుంటున్నట్లుగా అన్నా అతని మాటలు విమల్, క్రనతికి వినిపించాయి.
"సరీగ్గా 365 రోజులని మరవవద్దు. అనంతమైన సహజ వనరుల నిలయం మనదేశం. అనూహ్యమైన మానవ శక్తి కూడా వుంది. అయినా ఎందుకు వెనుకబడిపోతున్నాం?" అని కొద్ది క్షణాలు మౌనంగా వుండి పోయాడా వృద్దుడు.
హాలంతా నిశ్శబ్దంగా వుంది.
"నా సెక్రటరీ మీకిప్పుడు యాభయ్ వేలిస్తాడు. అవి తీసుకున్న క్షణం నుంచీ మీకు నేనిచ్చిన గడువు తీరిపోవడం ప్రారంభిస్తుంది. మైండిట్" అనంటుండగా సెక్రటరీ లోపలి నుండి బ్రీఫ్ కేస్ తో వచ్చి వారికి అందించాడు.
"బెస్టాఫ్ లక్" అంటూ ఆ వృద్దుడు లోపలికెళ్ళిపోయాడు.
* * * * *
"నా కిదంతా అయోమయంగా వుంది. ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాను... ఎవరో అతను? ఎందుకు యిచ్చాడో తెలీదు. ఏం ఆశించి లక్ష రూపాయలు మనకిచ్చాడు? ఇప్పుడా లక్షతో మనం ఏం చేస్తాం...?" అబిరామ్ లక్ష తీసుకున్న ఆశ్చర్యం నుంచి యింకా తేరుకోలేకపోతున్నాడు.
మేఖల బ్రీఫ్ కేస్ లో పొందికగా పేర్చి ఉన్న కరెన్సీ కట్టలకేసి చూస్తోంది.
ఆమెలో ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు.
మామూలుగా అయితే ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయి, అభిరామ్ చదువు పూర్తి చేయించి, పెళ్ళి చేసి తన బాధ్యతను తీర్చుకోవాలనే అనుకుంది. కానిప్పుడు అనుకోకుండా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పడిన ప్రకటన తన ఆలోచనల్లో వున్న నిశ్చలత్వాన్ని భగ్నం చేసింది. ఏం చేయాలి....? లక్ష చేతిలోకి రాకముందు అదే ప్రశ్న ఆమెను వేధిస్తోంది. వచ్చాక కూడా అదే ప్రశ్న వేధిస్తోంది.
"అక్కా ఆకలౌతోంది" అన్నాడు అభిరామ్.
ఆమె ఆలోచనల నుంచి చప్పున తేరుకొని వంట చేద్దామనుకుంది. అనుకున్న వెంటనే బ్రీఫ్ కేస్ ని మూసి ఓ మూలగా పెట్టి వంట సామాను దగ్గరకు నడుస్తూనే చప్పున ఏదో గుర్తుకొచ్చి ఆగిపోయింది.
"అన్నీ ఉన్నాయి. కానీ కిరోసిన్ లేదు తెచ్చిన లీటర్ అయిపోయింది. బయటికెళ్ళి భోంచేసి వద్దామా?" అందామె.
ఆమె అప్పటికే అలసిపోయి వుండటం గమనించాడు అభిరామ్.
"నువ్వు రూములోనే వుండు. నేను బయటికెళ్ళి క్యారేజ్ పట్టుకు వస్తాను" అని వెంటనే హడావిడిగా వెళ్ళిపోయాడు.
ఆవేశం వచ్చినా ఆగాడు ఆకలైనా ఆగడు. తనలో తానే అనుకుంటూ తిరిగి చాపమీద కూర్చుని మరలా ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.
* * * * *
"ఏమిట్రా అన్నయ్యా ఏం చేద్దాం ఈ యాభైవేలతో...." అంది క్రాంతి ఎదురుగా ఉన్న బ్రీఫ్ కేసి చూస్తూ.
విమల్ అప్పటికే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. అతనికీ ఏం చేయాలో అర్ధం కావడంలేదు. యాభైవేలతో తను సాధించేదేమిటి....? సాధించాలనుకొనేవి ఒక్క యాభైవేలతో సాధింపబడతాయా? తన ఒక్కొక్క కల నిజం కావాలంటే మిలియన్స్ బిలియన్స్ కావాలి. విమల్ మెదడు నిండా సవాలక్ష ఆలోచనలు చోటు చేసుకొని అతన్ని అస్థిరత్వానికి గురిచేస్తున్నాయి.
"అన్నయ్యా... ఒరేయ్ అన్నయ్యా.. ఆకలేస్తోందిరా" క్రాంతి విమల్ భుజాల్ని పట్టుకొని కుదిపేస్తూ మారాం చేసింది.
తన అన్న ఆకలికన్నా ఆలోచనలకే ప్రాముఖ్యం ఇస్తాడని తెలుసు. కానీ తనెలా-? అందుకే క్రాంతి లేచింది నేను బయటికెళ్ళి భోంచేసి నీకు పట్టుకొస్తాను అంటూ చెప్పల్స్ వేసుకొని ఖాళీ క్యారియర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది.
ఇక్కడో చిన్న తమాషా జరిగింది.
క్రాంతి సరిగ్గా ఆ టైమ్ కే క్యారేజీ పట్టుకొని బయటకు వెళ్ళడానికి ఆమెకు వేస్తున్న ఆకలి ఒక్కటే కారణం కాదు. ఆకలి అన్నది చాలా చిన్న కారణం.
అసలు కారణం- తెరచి వున్న తమ గది కిటికీలోంచి ఓ దృశ్యం కనిపించింది. అభిరామ్ గది బయటకు రావటం తలమాత్రం వెనక్కితిప్పి ఏదో అనటం, మేఖల గదిలోంచి బయటకు వచ్చి ఏదో అనటం అభిరామ్ తమాషాగా కుడిచేతి వేళ్ళను కలిపి తన పెదాల దగ్గరకు తెచ్చి ఆకలి వేస్తోందన్న సంజ్ఞ చేసి ఆ తర్వాత తన కడుపును చూపించడం, ఆ తర్వాత ఆ అక్కా తమ్ముళ్ళు ఏదో మాట్లాడుకోడం, మేఖల మరలా లోపలకు వెళ్ళి డబ్బు తెచ్చివ్వడం అంతా తను చూసిన దృశ్యంలోని భాగాలే.
క్రాంతి ఆలోచనల్లో అభిరామ్ చోటు చేసుకోవడానికి తనను కాపాడాడన్న కృతజ్ఞత కారణం కాదు. మరేమిటో కూడా ఆమెకి తెలీదు. అతను ఆమెకు నచ్చాడు. ఆ నచ్చటమే ఎందుకన్నది ఆమెకీ తెలీదు. ఆ నచ్చటమే ఆసక్తిగా మారింది.
సరిగ్గా అభిరామ్ డబ్బు తీసుకొని ఫుట్ పాత్ దిగి రోడ్డెక్కి నాలుగడుగులు వేసేవారికి అతనికి రెండడుగుల దూరానికి క్రాంతి చేరుకుంది.
ఒంటరిగా బయటకు రావడానికి క్రితం రోజు నుంచి ఒకింత జంకుతున్న క్రాంతి ఇప్పుడు తాను ఒంటరి కాననే ధైర్యాన్ని ప్రోది చేసుకుంది.
* * * * *
ఆలోచనల్నుంచి కాసేపటికి తేరుకున్న విమల్ ప్రక్కకు చూసి క్రాంతి కనిపించక పోవటంతో ఆశ్చర్యపోయాడు.
క్రితం రోజు జరిగిన గొడవ విమల్ కి గుర్తుకొచ్చి ఆందోళనగా లేచి బయటకు వచ్చి అటూ, ఇటూ చూశాడు. క్రాంతి కనిపించకపోవడంతో అతనిలోకి ఆందోళన రెట్టింపైంది.
అసంకల్పితంగా మేఖల గదికేసి చూశాడు. ఒకవేళ అక్కడకుగానీ వెళ్ళిందా అన్న సందేహం రావటంతో తమ గది తలుపులు మేయాలన్న ఆలోచన కూడా లేకుండా వేగంగా రోడ్ దాటి మేఖల గది ముందుకొచ్చి సడన్ గా ఆగిపోయాడు. ఆ గది తలుపులు దగ్గరకు వేసి వున్నాయి.