Previous Page Next Page 
జనవరి 5 పేజి 24

   

       ఆమె అతను ఆగిపోవడాన్ని గమనించకుండా తన పనిమీదే దృష్టి కేంద్రీకరించి అతనివైపు రాసాగింది. మరికొద్ది క్షణాల్లో ఆమె సరాసరి వచ్చి అతన్ని ఢీకొంది.
   
    ఒక చిన్న ప్రకంపనం... వెయ్యి ఓల్టుల విద్యుత్ అతని శరీరాన్ని తాకింది. ఆమె సుతిమెత్తని శరీర సంపద అతన్ని తాకడంతోనే అతను విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు.
   
    "రోడ్ కి అడ్డంగా ఈ వెధవ గోడలెందుకు కడతారో?" ఆమె చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ తలెత్తి చూసి ఎదురుగా అభిరామ్ వుండడంతో ఆశ్చర్యాన్ని వెనువెంటనే సిగ్గుని అభినయిస్తూ తలవంచుకుంది.
   
    "హలో..." అతను ఆమె శరీర స్పర్శానుభూతి నుంచి తేరుకుంటూ విష్ చేశాడు.
   
    "హలో" ఆమె కూడా విష్ చేసింది.
   
    "సారీ రోడ్ కి అడ్డంగా చైనా వాల్ గానీ కట్టారా అని అనిపించింది. గట్టిగా తగిలేసరికి మీరు ఆగిపోయారనుకోలేదు" వస్తున్న చిరునవ్వును జాగ్రత్తగా దాచుకుంటూ, నొచ్చుకున్నట్లుగా సమాధానం చెప్పింది క్రాంతి.
   
    "భలేవారే చైనా వాల్ తో పోల్చి సరిపెట్టారు - ఏ బెర్లిన్ గోడతోనో పోల్చేస్తారేమోనని భయపడ్డాను" అతను చెప్పిన సమాధానం ఆమెకి అర్ధం కాలేదు.
   
    "అంటే....?" ఆమె ప్రశ్నించింది.
   
    "బెర్లిన్ వాల్ ని పగలగొట్టారుగా అలాగే నన్నూను."
   
    ఆమె అతని సమాధానానికి నవ్వింది.
   
    "సరేగానీ... ఇంతకీ ఎన్ని అడుగులు నడిచారు?"
   
    "నూటనలభై" తడుముకోకుండా సమాధానం ఇచ్చింది క్రాంతి వెంటనే.
   
    "అన్ని అడుగులు నడవనక్కర్లేదమ్మా... ఏడు అడుగులు నడిస్తే చాలు ఎక్కువ అడుగులు నడిస్తే ఈ మగాళ్ళు చనువెక్కువ తీసుకుంటారు" వాళ్ళ పక్కనుంచి ఓ ముసలి వ్యక్తి వెళుతూ చెప్పిన సమాధానానికి ఇద్దరూ నవ్వుకున్నారు.
   
    "సరీగానీ మనం నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటే మీకేమన్నా అభ్యంతరమా!" ఆమె ప్రశ్నించడంతో అతను ఆమెని అనుసరించాడు.
   
    అతను నడుస్తూనే అంత క్రితం ఆమె స్పృశించిన తాలూకు అనుభూతి గుర్తు చేసుకుంటూ "అప్పుడప్పుడు అంటే రోజుకు కనీసం ఓ పదిసార్లు నడుస్తూ నడుస్తూ ఆగిపోవాలని నిశ్చయించుకున్నాను" చెప్పాడు అభిరామ్ నవ్వుతూ.
   
    "అలా చేయకండి, ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. రోడ్ మీద మనుషులతోపాటు జంతువులకి కూడా నడిచే స్వేచ్చ వుంది ఈ భారతదేశంలో" కాస్త దూరంలో వెళుతున్న గొర్రెల గుంపును చూస్తూ చెప్పింది క్రాంతి.
   
    "ఇంతకీ మీరు ఎటు వెళ్తున్నారు" ఆమె చేతిలో వున్న క్యారేజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు అభిరామ్.
   
    "మీరు ఎటు వెళితే అటు- ఎటైనా..."
   
    ఆమె మాటలు పూర్తి కాకుండానే అతని చూపులో మార్పుని గమనించి వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది.
   
    "నేను హోటల్ కి క్యారేజ్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంట్లో కిరోసిన్ అయిపోయింది" చెప్పాడతను.
   
    "సేమ్... మాకు అదే ప్రాబ్లమ్" చెప్పిందామె.
   
    ఇంతలో ఇద్దరూ హోటల్ ని సమీపించారు. హోటల్ కి వెళ్ళి క్యారేజీ సర్వర్ కిచ్చి పార్శిల్ చేయమని చెప్పి, లైట్ గా ఏదైనా టిఫిన్ చేద్దామన్న ఉద్దేశ్యంతో హోటల్ లోపలికి ఎంటరయ్యారు.
   
    హోటల్ నిండా జనం ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ కూర్చోవడానికి అనువుగా టేబుల్ ఖాళీగా లేకపోవడంతో ఇద్దరూ నీరసంగా బయటకు వచ్చి పాన్ షాప్ పక్కన నిలబడ్డారు.
   
    అక్కడే నిల్చున్న కుర్రాడొకడు ఫ్యాక్టరీ పొగగొట్టంలా సిగరెట్ ని ఊది పారేస్తున్నాడు. అభిరామ్ కి సిగరెట్ వాసన పడదు. మొహం మీద కొస్తున్న పొగను చేతితో చేదించసాగాడు. ఆ వ్యక్తి ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. అభిరామ్ కి ఆ కుర్రాడ్ని ఉతికి పారేయాలన్నంత కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు.
   
    "మీకు సిగరెట్ పొగ అంటే ఎలర్జీయా" అడిగింది ఆమె.
   
    "ఆ..." ముక్తసరిగా సమాధానం చెప్పాడు అభిరామ్.
   
    "మీరు సిగరెట్ త్రాగరా?" అడిగింది క్రాంతి.
   
    "త్రాగను"
   
    "పోనీ పాన్ లాంటివి వేసుకుంటారా?"
   
    "ఇంతవరకూ లేదు"
   
    "వక్కపొడి లాంటిది... చిన్న చిన్న సుఖాలు...."
   
    "ఇంతవరకు ఆ రుచేమిటో తెలియదు."
   
    "పోనీ ఎప్పుడైనా ఓ పెగ్గయినా డ్రింక్ తీసుకున్నారా."
   
    "లేదు."
   
    "ఎప్పుడైనా అందరూ కొనుక్కునే సుఖాల కోసం ప్రయత్నించారా?"
   
    "ఇవ్వన్నీ అలవాటు లేనప్పుడు ఇక ఆ అలవాటు మాత్రం ఎందుకుంటుంది?" తిరిగి ప్రశ్నించాడతను.
   
    ఆమె అతని వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి-
   
    మౌనంగా వుండిపోయింది.
   
    ఆమె ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడిగిందో అతనికే మాత్రం అర్ధం కాలేదు. ఆ అనుమానాన్నే వ్యక్తం చేశాడు.
   
    "ఎందుకడిగినట్టు... టెస్టింగ్ కా" అంటూ.
   
    "అబ్బే కాదు... ఓ జోక్ గుర్తుకొచ్చి.... మీలాంటి ఓ మంచబ్బాయికి తనకేవో తెలియని ప్రాబ్లమ్స్ వున్నాయనిపించడంతో ఓ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడట. డాక్టర్ విషయం తెలుసుకొని ఓ గంటపాటు మెడికల్ చెకప్ చేసి పెదవి విరుస్తూ అడిగాడట.
   
    బాబూ! నీకు గానీ సిగరెట్ తాగే అలవాటుందా అని. అలాంటి అలవాటు లేదన్నాడట! పోనీ మందు కొడతావా అని అడిగాడట. దానికీ లేదన్నాడట! డాక్టర్ అసహనంతో పోనీ అమ్మాయిల వ్యవహారం.... అంటూ చివరగా అడిగాడట. దానికీ లేదని సమాధానం రావటంతో డాక్టర్ ఆ వ్యక్తి వైపు జాలిగా చూస్తూ-
   
    "ఎందుకయ్యా నువ్వు బ్రతకటం? జీవితంలో ఏ ఆనందాన్ని పొందకుండా యిన్నేళ్ళు నువ్వు బ్రతికినందుకు చాలా జాలిపడుతున్నానని లోపలికి వెళ్ళిపోయాడట" అంది నవ్వుతూనే క్రాంతి.
   
    అప్పుడు అభిరామ్ చాలా పెద్దగా....
   
    "మీలాంటి వాళ్ళను పెళ్ళి చేసుకున్న అమ్మాయికి సమాజంలో గొప్ప పేరు రాదు" అంది క్రాంతి తమాషాగా కనుబొమల్ని కదిలిస్తూ.
   
    "అదేమిటి?"
   
    "అదంతే.... పెళ్ళికి ముందు మీకు అన్ని అలవాట్లూ వుండాలి.....అవేమీ లేవని అబద్దం చెప్పి పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళయ్యాక మీ అలవాట్లన్నీ మీ భార్యకు తెలియాలి. ఆమె లబ్బున మొత్తుకోవాలి. నా భర్తను సప్త వ్యసనాల నుంచి కాపాడమని ముక్కోటి దేవతలకు మొక్కుకోవాలి.
   
    అయినా అప్పటికీ మీరు మారకూడదు... అప్పుడామె ఓ పథకం వేయాలి. సిగరెట్స్ మానేస్తే ఒకటిస్తానని.... పాన్ మానేస్తే మరొకటిస్తానని లిక్కర్ కూడా మానేస్తే నైట్ డ్యూటీకి సహకరిస్తానని ఊరించి ఊరించి భర్తను మంచివాడ్ని చేసుకోవాలి. యివన్నీ ఎంత థ్రిల్లింగ్ గా వుంటాయి? యివన్నీ చేస్తే సహనశీలి, సద్గుణాల రాశి, తన భర్తను పట్టుదలతో బాగుచేసుకుందని సమాజం పొగుడుతుంది.
   
    ఇవేమీ లేకుండా భర్త రాముడు మంచి బాలుడి లాంటి వాడయితే భార్య చేయడానికేముంటుంది? అదన్నమాట సంగతి... ఆకలవుతోంది.....లోపలకెళ్దామా?" అంది గుక్క తిప్పుకోకుండా.
   
    మొత్తానికి అభిరామ్, క్రాంతి భోంచేసి కేరియర్ తో తిరిగి బయలు దేరారు.
   
    "నీకు గరల్ ఫ్రండ్స్ వున్నారా?" క్రాంతి సరదాగా అడిగింది.
   
    "ఎక్కువ భోంచేసాను... ఆయాసం వస్తోంది" అన్నాడు అభిరామ్.
   
    "మాట మార్చటానికి ఆయాసం గురించన్నానా? లేక..."
   
    అభిరామ్ నవ్వి నడకలో వేగం పెంచాడు.
   
    "కొంచెం బొద్దుగా వుంటావు కదా నువ్వు?" అభిరామ్ నడుస్తూ ఆమెకేసి తల మాత్రం త్రిప్పి అన్నాడు.
   
    "ప్చ్... నేనిప్పుడు నిట్టూర్చాను. ఎందుకో తెలుసా?" అంది.

    "తెలీదే-"
   
    "ప్రాసకోసం ప్రాకులాడలేదే అని"
   
    "అర్ధం కాలేదు...."
   
    "పాపం! నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఏ వయస్సు ముచ్చట్లు ఆ వయస్సులో జరిగిపోవాలి. లేదా జరుపుకోవాలి. బొద్దుకి ప్రాస ముద్దు కదా- బొద్దుగా వున్నావంటే అంత బాగోలేదు.... బొద్దుగా ముద్దుగా వున్నావని అంటే బావుండేది."
   
    క్రాంతి మాటలకు చురుగ్గా చూసాడు అభిరామ్.
   
    "నేను ముద్దుగా వున్నానని కోతలు కోసుకుంటున్నానని అపార్ధం చేసుకోవద్దు మిత్రమా! అయినా నాకు నేనెలా ముద్దొస్తాను? అలా అనుప్రాస బావుండి వినసొంపుగా వుండేది గదా అని నా బాధ. నీ ప్రక్కన నేను నడుస్తుంటే నాకోటి అనిపిస్తోంది" అంది క్రాంతి.

 Previous Page Next Page