Previous Page Next Page 
బంధితుడు పేజి 23


    కనీసం చచ్చి స్వర్గానవున్న అమ్మదగ్గరైనా అవి దొరుకుతాయేమో! అందుకే....

    అన్నయ్యా, నేను మనసు రాయి చేసుకున్నాను.

    నా నిర్ణయానికి వచ్చాకనే నీకు యింత పెద్ద ఉత్తరం రాస్తున్నాను.

    "అన్నయ్యా! నాకు వాగ్దానం చెయ్యి! నా బిడ్డను కనిపెట్టి వుంటానని మాట యివ్వు! నాకు తెలుసు, మా అన్నయ్య మాట యిస్తే తప్పడని.

    ఆ లోకం నుంచి నువ్వు చేసే వాగ్దానం అమ్మ వింటూ వుంటుందని మర్చిపోవద్దు."

    రేపు దీపావళి, అదృష్టవంతుల జీవితాల్లోకి కొత్త కొత్త వెలుగుల్ని వెంటబెట్టుకొని ప్రవేశిస్తుంది. ఆ వెలుగులలో కొత్త ఆశలు అంకురిస్తాయి.

    కాని నా యింటికి నా బిడ్డ జీవితంలో చీకటిని పరచడానికి వస్తుంది ఈ దీపావళి.

    నా చిన్న కోరిక. నా బిడ్డను కనిపెట్టివుంటావు గదూ?

    అన్నయ్యా! ఇంత రాసి నీ మనసు కష్టపెడితే క్షమించు!

    వదినకు నా నమస్కారాలూ, పిల్లలకు నా ముద్దులూ అందించు. ఈ అభాగ్యురాలు యింతకంటే యివ్వగలిగిందేముంది చెప్పు!

     శెలవు! పునర్జన్మంటూ వుంటే నీకే చెల్లెలుగా పుట్టాలని కోరుకుంటూ,

                                                                                                                           నీ ప్రియమైన చెల్లెలు
                                                                                                                           "సరోజ"

    సత్యనారాయణ చెంపలమీదుగా కన్నీళ్ళు చేతిలోని ఉత్తరం మీదకు జారాయి. అక్షరాలూ అలుక్కుపోయాయి.

    ఉత్తరం ముఖానికి అడ్డుపెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. కొద్దినిమిషాల్లో తేరుకొని కళ్ళు తుడుచుకున్నాడు.

    అర్థగంట ఉత్తరం ముందుపెట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. బుర్ర పని చెయ్యడం మానేసింది.

    అలా యెంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు.

    ఈ లోకంలో రాగానే చుట్టూ కలయచూశాడు. పద్మ కనిపించలేదు.

    పద్మను ఏడవడం చూడలేదు.

    థ్యాంక్ గాడ్! ఆలోచనలు బుర్రను తొలుస్తున్నాయి.

    తనెంత నిర్ధయుడు?

    చెల్లెలు భర్తపెట్టె బాధల్ని నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా యింతకాలం వినిపించుకోలేదు.

    తప్పంతా సరోజదే అనుకున్నాడు. అంటీ అంటనట్టువుండిపోయాడు. పట్టించుకోలేదు. ఆ విషయం గురించి ఆలోచించలేదు. అసలు తన చెల్లెల్ని, మాటల్ని నమ్మలేదు.

    పాపం! దానికి మాత్రం ఎవరున్నారు తాను తప్ప!

    తనతోనే మొరపెట్టుకొన్నది.

    హరికృష్ణ యింత దుర్మార్గుడని కలలో కూడా అనుకోలేదు. పైకి మంచివాడుగా ప్రవర్తిస్తాడు?

    మేకవన్నె పులి.

    తన చెల్లెల్ని ఏ స్థితికి తెచ్చాడు?

    అతన్నంటేమాత్రం యేం లాభం? తను మాత్రం ఏం చేశాడు?

    కట్నం వద్దన్నాడు. అంతే చాలని సంబరపడిపోయాడు మరోరూపంగా యివ్వడానికయినా ప్రయత్నించాడా? సరోజకు చిన్న మెత్తు బంగారంతోనైనా పెళ్ళయిన యీ రెండేళ్ళలో ఒక నాగ చేయించాడా? అసలు తనకు ఆ ఆలోచనైనా వచ్చిందా?

    తను మాత్రం ఏం చేస్తాడు? అవును, ఏమీ చెయ్యలేడు.

    తనకు భార్యంటే భయమే, పైకి బింకంగా వున్నా!

    తనకు గయ్యాళి పెళ్ళాం దొరికింది. తన చెల్లెలు వచ్చి యింట్లో వుంటేనే దానికి గిట్టదు. చీర కొనిపెట్టినా మూతి విరుస్తుంది, నగలు చేయిస్తే వూరుకుంటుందా?

    తన పెళ్ళానికి వొళ్ళంతా అహంకారమే!దాని తరుపువాళ్ళు యెప్పుడూ యెవరో ఒకరు వస్తూనే వుంటారు. తను ఎప్పుడయినా వాళ్ళు వస్తున్నారని ఏడ్చాడా?

    వాళ్ళవాళ్ళు వస్తేచాలు, ఎంతో సంతోషంగా వుంటుంది. తన చెల్లెలు వస్తేచాలు, ముటముటలాడి పోతుంది.

    వెంటనే వెళ్ళి తను తన చెల్లెల్ని తీసుకురావాలి. తన దగ్గరే వుంటుంది.

    లోకులకు బరువయితే తన చెల్లెలు, తన రక్తమాంసాలు పంచుకొనిపుట్టిన చెల్లెలు, తనకు బారువా ఏమిటి?

    కాని పద్మ వూరుకుంటుందా?

    ఊరుకోక ఏం చేస్తుందేం?

    పెళ్ళానికి భయపడి చెల్లెలు నిలువునా ప్రాణం తీసుకుంటూవుంటే చూస్తూ ఊరుకోగలడా?

    తను వెంటనే బయలుదేరాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి!

    హరికృష్ణ మనసులో ఏముందో? డబ్బుకోసం యిదంతా చేస్తున్నాడేమో?

    ఒక ఎకరం అమ్మి అయినా తన చెల్లెలికాపురం నిలబెట్టాలి.

    పాపం! పండగపూట! మొగుడి చేతిమీదగా ఇరవై రూపాయల చీరకు నోచుకోలేదు తన చెల్లెలు.

    పైగా కొడ్తాడా?

    దద్దమ్మ!

    రోగ్!

    చూస్తా. వీడి వ్యవహారమేదో?

    "ఇవ్వాళ ఆఫీకు వెళ్ళేదిలేదా ?" స్నానంచేసి చీర కట్టుకొని పవిట సర్దుకుంటూ వచ్చింది పద్మ.

    భార్య మాటలకు సత్యనారాయణ ఆలోచనలనుంచి బయటపడ్డాడు. ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు.

    "మాడ్లారేం?" రెట్టించింది.

    "ఏమిమిటి?"

    "ఆఫీసుకు వెళ్ళరా?"

    "వెళ్ళను! శెలవు పెడ్తున్నాను" అన్నాడు సత్యనారాయణ.

    "ఏం వచ్చిందీ శెలవు పెట్టడానికీ? మీ చెల్లెలు ఏమైనా, పండక్కి పట్టు ధోవతులు పెడ్తాను రమ్మని రాసిందా?" వెటకారంగా అన్నది పద్మ.

    సత్యనారాయణ శరీరంలో రక్తం ఉరకలు వేసింది.

    చివాలున లేచినిల్చున్నాడు. కాని తమాయించుకున్నాడు.

    "ఇంట్లో డబ్బు ఏ మాత్రం వుంది?" అన్నాడు అధికార స్వరంతో.

    మొగుడి మాటలధోరణి మారడం పసికట్టింది పద్మ.

    అసలే మనిషి మహాపెడసరం. మంచిగా వుంటే పద్మత మంచి మనిషిలేదు.

    వీలు తప్పితే ఆమె అంత పెళుసు ఆడది వుండదు. ఆమె మంచి చెడ్డలు ఎదుటి వాళ్ళధోరణికి అనుకూలంగా వుండాయి.

    పుల్ల విరిచినట్టు అన్నది పద్మ "నా దగ్గరేం లేదు"

    "ఏయ్! పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యక ఎంత వుందో చెప్పు!" గద్దించినట్టు అన్నాడు సత్యనారాయణ.

    "పద్మ రోషంతో నిలువెల్లా కంపించిపోయింది.

 Previous Page Next Page