Previous Page Next Page 
బంధితుడు పేజి 22



    "ఆ రాత్రి అలా నన్నెంతసేపు కొట్టారో, హింసించారో తెలియదు. తెల్లవారి ఏడుగంటలకు నాకు స్పృహ వచ్చింది.

    కళ్ళు తెరిచి చూసేసరికి బాబు ణా మంచం పట్టుకొని బిక్కమొహంతో నిల్చుని వున్నాడు. వాడ్ని ఆ స్థితిలో చూస్తుంటే నాకు దుఃఖం ఆగింది కాదు.

    ఆయన ఇంటిలోవున్న ఆలికిడి లేదు. నన్నూ బాబునూ ఆ స్థితిలో వదిలేసి బయటకు వెళ్ళినందుకు ఎంతో బాధ కలిగింది.

    "ఆయనెక్కడే" నా మంచం దగ్గర కూర్చుని వున్న పనిపిల్లను అడిగాను.

    "బాబుగారమ్మా"

    "అవును"

    "డాక్టరుగార్ని పిలుచుకొస్తానని వెళ్ళారు. నన్ను  మీ మంచందగ్గర కూర్చోబెట్టి వెళ్ళారు"

    "డాక్టరు ఎందుకు? నాకు విషం పెట్టించి చంపించడానికా" అన్నాను.

    పనిపిల్ల బిత్తరపోతూ నా ముఖంలోకి చూసింది.

    బాబును గుండెలకు హత్తుకొని ఎంతసేపు ఏడ్చానో ఎలా చెప్పనురా అన్నయ్యా.

    ప్రతిక్షణం మృత్యుదేవత అడుగులు ముందుకు వేస్తూ నన్ను సమిపిస్తున్నట్టే అనిపించింది.

    క్షణం ఒక యుగంగా గడిచిపోయింది.

    ఆ స్థితిలో నుదుటిమీద చెయ్యివేసి ఓదార్చే ఒక ఆత్మబంధువు కోసం నా హృదయం ఎంత విలవిల్లాడి పోయిందో చెప్పలేను.

    అమ్మే బ్రతికివుంటే.... నాన్నే బ్రతికివుంటే.... వాళ్ళిద్దర్నీ తల్చుకుని కుమిలి, కుమిలి, ఏడ్చాను"

    సత్యనారాయణ కళ్ళలో ఉబికి వస్తున్నా కన్నీటిని తుడుచుకొని, ఉబికివస్తున్నా దుఃఖాన్ని దిగమింగుకొని ముందుకు చదవసాగాడు.

    "అన్నయ్యా! ఇది జరిగి ఇవ్వాల్టికి మూడురోజులైంది"

    అతడి ఉనికిని నేను సహించలేకుండా వున్నాను. అతనిగాలి సోకితే నా వంటిమీద తేళ్ళూ, జేర్రులూ పాకుతున్నట్టనిపిస్తుంది. ఆయన కంఠం వినిపిస్తే చెవులు మూసుకోవాలనిపిస్తుంది. ఆయన ఎదుట కనిపిస్తే కళ్ళు నింపుకుంటున్నాను.

    ఆయన నాకు యమదూతలూ కనిపిస్తున్నాడు. ఏ నిమిషంలో నా గొంతుకికు యమపాశాన్ని తగిలిస్తాడో తెలియదు.

    నిజంగా నాకు ఈ నరకం నుంచి విముక్తి దొరికితే నేను అదృష్ట వంతురాల్నే!

    ఈ నరరూప రాక్షసుడితో కాపురం చెయ్యడం ఇక నావల్లకాదు.

    మా ఇద్దరి మధ్యా మౌనం అభేద్యమైన గోడల్ని కట్టేసింది.

    దీనినుంచి నాకు విముక్తి కావాలి, అది ఒకమృత్యువే చెయ్యగలదు.

    మొన్నటి దెబ్బతో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. నరాల బలహీనతకు తోడు మానసిక సంక్షోభం ఒకటి. నాకు ఫిట్సుకూడా వస్తున్నాయి.

    మొన్న డాక్టరుగారు ఏమన్నారో తెలుసా?

    "మీ ఆవిడ ఏదో మానసికంగా చాలా బాధతోంది" అన్నాడురా అన్నయ్యా!

    దానికి ఆయన "లేనిపోనివి ఊహించుకుంటుంది. నేనెంత చెప్పినా వినడంలేదు. అనవసరంగా మానసిక శాంతి దూరం అవుతోంది. పెద్ద సమస్యలు ఏమీ లేవు" అన్నారు.

    చూశావా అన్నయ్యా ఆయన ఎట్లామాట్లాడతారో? బయట ప్రపంచంలో పరువూ ప్రతిష్ట కావాలి. అందుకే బయటివాళ్ళ ముందు నా మీద ఎంతో ప్రేమను ఒలక పోస్తారు. ఎంతో ఆడరిస్తున్నట్టు నటిస్తారు. ఆయన రచయితే కాదు, మంచి నటుడుకూడా.

    ఆ డాక్టరుకూడా ఆయన మాటలు నమ్మేవుంటాడు.

    నేను ఆడదాన్ని వాళ్ళకు నిజం ఎలాచెప్పగలను? అంత చెప్పినా వాళ్ళు నా మాట నమ్ముతారా? ఆయనలా నటించడం నాకు రాదు. అందుకే పెదవి కదపడంలేదు.

    "రేపే దీపావళి. పండక్కు కావాలనే తనకూ. కొడుక్కూ బట్టలు తెచ్చారు. నాకు ఒక రవికబట్టయినా తేలేదు. అయినా నేను బాధపడలేదే? నా కెందుకు తేలేదని అడగలేదే? పై పెచ్చు ఎంతో సంతోషపడ్డానే!

    నీకేం తెలిదులే" అంటూ ఎద్దేవ చేస్తాడా? నీ అన్నకు రాయకపోయావ్, రాళ్ళగాజులు తెమ్మని? ఆ  మాత్రం చేయలేడా? కానీ కట్నం     లేకుండా పెళ్ళిచేశాడుగా?" సూటీపోటీ మాటల్తో నాహృదయం తూట్లుపడి పోయింది.

    ఇక భరించే ఓపికలేదు.

    నాకు విముక్తి కావాలి.

    ఈ  నరకంలో నేను మరొక్కరోజు కూడా ఉండలేను

    నేనేం చేశానని నన్ను ఆయన ఇంతగా సాధిస్తున్నాడు?

    నువ్వే చెప్పరా అన్నయ్యా! తప్పంతా నాదేనంటావా? కట్టుకున్న మొగుణ్ణి ఓ జత గాజులు చేయించమనడం అపరాధమా?

    పండక్కు నూలుచీరైనా ఒక చీర కోరుకోవడం అంత చెయ్యరాని తప్పా!

    క్షమించరాని నేరమో?

    పెళ్ళికి వెళ్తున్నాం! చేతులు మరీ బోసిగా వున్నాయని ఒక జతగాజులు అడిగాను. అంతేగా? దానికి  నన్నింతగా అవమానించాలా? మంచిగా చెప్పవచ్చుగా? నేనేం అంత ఇంగిత జ్ఞానం లేనిదాన్నా?

    వాళ్ళ బట్టలతో పాటు నాకూ ఒక్కచీర, సాదాచీర పాతికరూపాయలు చీర తెచ్చి పెట్టకూడదా? తనకూ, పిల్ల వాడికీ పండగ, నాకు లేదా?

    ఇప్పుడైనా అర్థం అవుతుందా ఆయనకు నేనంటే ఎంత అసహ్యమో? నువ్వంటే ఎంత చిన్న చూపో?

    ఇంతకూ నేను ఆయనకు బరువైపోయాను.

    నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు.

    ఆయనకు డబ్బు ఆశకూడా పట్టుకుంది. కట్నం తీసుకోనందుకు పశ్చాత్తాప పడుతున్నారనుకుంటాను. తను కట్నంగా తీసుకోకపోయినా నువ్వు మరొక రూపంగానైనా ఇస్తావని ఆశించివుంటారు. ఆ కసీ అసంతృప్తి నా మీద చూపిస్తున్నారు.

    ఇక నా బ్రతుక్కు అర్థంలేదు. నా జీవితానికి విలువ లేదు. నేను చస్తే ఆయన కట్నంతో మరో పెళ్ళి చేసుకుంటారు.

    ఆయన మనసులో ఆ పాపపు ఆలోచనే ఉంది.

    ఇక నేనెందుకు బ్రతకాలి?

    ఎవరికోసం బ్రతకాలి?

    బతికి ఇంకెన్ని అవమానాలు?

    నా వీపుమీద ఆయన కొట్టిన దెబ్బల వాపు ఇంకా పూర్తిగా తగ్గలేదు. కుడిభుజం పైకి లేవడంలేదు. చెయ్యి కదిలిస్తే బాధ.

    అవమానం, బాధ, తిరస్కారం, నిరాదరణతో నా హృదయం ముక్కలు ముక్కలై పోయింది.

    నా రక్తాన్ని నేనే తాగుతూ, నా హృదయాన్ని నేనే తింటూ ఇంకెంతకాలం ఈ నికృష్టపు బతుకు బతక మంటావ్?

    నాకు ఆదరణ కావాలి.

    ప్రేమకావాలి.

    సానుభూతి కావాలి.

    అవి నాకు ఈ లోకంలో దొరకలేదు. ఇకమీదట కూడా దొరకవు.

 Previous Page Next Page