"పిచ్చి పిచ్చి వేషాలూ?" కసిగా అన్నది పద్మ.
"పిచ్చి వేషాలు నావి కావు. మీ అన్నా చెల్లెళ్ళే వేస్తున్నారు" మళ్ళీ అన్నది.
"నోటి కొచ్చినట్టు పేలకు!"
పద్మ నిటారుగా నిల్చుని, భర్తముఖంలోకి నిర్లక్ష్యంగా చూసింది.
"పది రోజులు కాలేదు, అప్పుడే జీతం అంతా అయిపోయిందా?" కోపంగా అడిగాడు సత్యనారాయణ.
"అసలు చాలిందేమిటి? పండక్కు ఇంట్లో సామాన్లూ బట్టలూ కొనడం మీ కళ్ళతోనే చూశారుగా? పైగా దబాయిస్తారేం?" చేతులు తిప్పుతూ అన్నది పద్మ.
"ఊఁ ! అయితే ఆ పెట్టె తాళాలు ఇలాపడేయ్!" అతని స్వరంలో దౌర్జన్యం, అధికారం ఒకదాన్నొకటి ఒరుచుకున్నాయ్.
పద్మ ఓ క్షణం కన్నార్పకుండా విస్మయంగా చూసింది.
"ఏమిటలా చూస్తావ్? ఆ తాళాలు ఇలా ఇవ్వు!"
"నా నగలపెట్టె తాళాలు మీ కెందుకూ?" మొండికేసి అన్నది పద్మ.
"అందులో డబ్బుందో లేదో చూడాలి!"
"నేను ఇవ్వను"
"మర్యాదగా చెప్తుతున్నాను. ముందు ఆ తాళాలు ఇలా ఇవ్వు అంటూ రెండడుగులు ముందుకువేసేడు సత్యనారాయణ!"
"మళ్ళీ ఆ ముండ ఏదో రాసినట్టుంది నా కొంపతీయదానికి!" రోషంతో దహించుకు పోతూ ఉన్నది.
మాట పూర్తికాకముందే పద్మ చెంప పెడీలున మోగింది.
సత్యనారాయణ చేతివేళ్ళు పద్మ చెంపమీద తేలాయి.
అవమానంతో పౌరషంతో రగిలిపోతూ అడవులిలా భర్తను చూస్తూ పద్మ ఏదో అనడానికి నోరు తెరిచింది.
"నోరు కదిలావంటే ప్రాణం తోడేస్తా ఊఁ! తాళం చెవులు యిలా యివ్వు!" అరిచాడు పిచ్చివాడిలా.
భార్య జబ్బ గుంజుతూ "ఊఁ! తియ్! తాళం చెవులు యిలా యివ్వు!" అరిచాడు పిచ్చివాడిలా.
పద్మకు కళ్ళనిండా నీళ్ళు తిరిగినై. పొంగివస్తున్న దుఃఖంతో పాటు గుండెగొంతులోకి వచ్చినట్టు అయింది.
భర్త స్పర్శను భరించలేకపోయింది. ఒక విసురి విసిరి దూరంగా జరిగింది.
"ఇస్తావా ఇవ్వవా!" పై పైకి వస్తున్నా భర్తనుచూసి భయపడింది పద్మ.
బొడ్లోవున్న తాళంచెవుల గుత్తితీసి గుచ్చుమీద విసిరి పారేసింది.
"మరీ వళ్ళు మత్తెక్కి చస్తున్నావ్!"
బుసలుకొడ్తూ వంగి తాళంచెవులు తీసుకున్నాడు సత్యనారాయణ గదిలోకి పెళ్ళి పెట్టె తెరిచాడు.
ట్రంకు పెట్టెలో వున్న నగల పెట్టి తెరిచాడు.
నగలపైన వున్న డబ్బు తీస్తూవుంటే ఎర్రరాళ్ళగాజులు కన్పించాయి. ఓ క్షణం వాటికేసి చూశాడు. డబ్బు లెక్కపెట్టుకున్నాడు. తొంభయ్ రూపాయలు వున్నాయ్ అరవై తీసుకొని నగల పెట్టె మూస్తూవుంటే ఎర్రరాళ్ళు గాజులు తళతళ మెరిశాయి.
"నువ్వే చెప్పరా అన్నయ్యా! కట్టుకున్న మొగుణ్ణి ఓ జత గాజులు చేయించమని అడగటం అపరాధమా? అది క్షమించరాని నేరమా?"
చెల్లెలు నీరు నిండిన కళ్ళతో ఎదురుగా నిల్చుని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది సత్యనారాయణకు.
మెల్లా ఇంట్లోకివచ్చేసరికి పద్మ ముఖానికి రెండు చేతులూ అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ గోడకు అనుకొని కూర్చుని వుంది.
"దొంగవేషాలు వేస్తుంది దొంగముండ! పక్క ఎముకలు విరగదన్నే వాళ్ళు లేక మరీచస్తోంది?" అంటూ చేతిలో వున్న తాళం చెవుల గుత్తి భార్యముందుకు విసిరాడు సత్యనారాయణ.
తనకు అంత దూరాన పడ్డ తాళంచెవుల గుత్తికేసి తలెత్తి కూడా చూడలేదు. పమిట చెంగు అడ్డం పెట్టుకొని పెద్ద పెట్టున ఏడుపు లంకించుకుంది.
అంతలోకి వీధిలోనుంచి పరిగెత్తుకొచ్చిన సత్యనారాయణ కొడుకు"నాన్నా! నాన్నా! ఎక్కడికెళ్తున్నావ్? నేనూ వస్తాను" అంటూ కాళ్ళకు బంధం వేశాడు.
"పోరా! వెధవా" అంటూ కుర్రవాణ్ని పక్కకు నెట్టివేసి సత్యనారాయణ గబగబా బయటకు వెళ్ళిపోయాడు.
కుర్రవాడు ఏడుస్తున్న తల్లిని బిక్క మొహంతో చూస్తూ నిలబడిపోయాడు.
అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన కూతురు తల్లి ఏడుస్తూ వుండటం చూసి బావురుమని ఏడవసాగింది.
పద్మ స్వాభిమాని మాటపడే మనిషికాదు.
పెళ్ళయిన ఈ ఏడేళ్ళలో ఇది రెండోసారి భర్త చేతి దెబ్బలు తినటం. రెండుసారూ ఆడబిడ్డను గురించే దెబ్బలు తిన్నది. ఆయనకు చెల్లెలుంటే చాలు! పెళ్ళాం పిల్లలు ఏమైపోయినా ఫర్వాలేదు.
తలచుకొని, తలచుకొని ఆ రోజంతా కుమిలి కుమిలి ఏడుస్తూనే వుంది పద్మావతి.
13
సత్యనారాయణ ఆ పగలంతా కాలు కాలిన పిల్లిలా బజారులన్నీ తిరిగాడు. రెక్కలు కట్టుకొని నిముషాలమీద చెల్లెలిముందు వాలాలని వుంది.
అక్కడ తన చెల్లెలు ఎలా వుందో ఏమిటో?
రాత్రి తొమ్మిది గండలకు గాని బండిలేదు. ఉదయం ఎనిమిది గంటలకంతా హైదరాబాద్ లో వుంటాడు.
అప్పటికి తన చెల్లెలు ప్రాణాలతో వుంటుందా? తనను "అన్నయ్యా" అని పిలుస్తుందా?
నిలువెల్లా వణికిపోయాడు సత్యనారాయణ. చెల్లెలి ప్రాణం లేని శరీరం
కళ్ళల్లో మెదిలి నో! అలా జరగదు.
తను వెళ్ళేప్పటికి తన చెల్లెలు తనకు ఎదురుగా పరిగెత్తుకోస్తుంది.
అలా ఎదురొచ్చిన చెల్లెలికి తనేం ఇస్తాడు?
ఒక చీరకొంటే?
అప్పుడే మనిసిపాలిటీ దీతాలు ధగధగా మెరిసిపోతున్నాయ్. షోకేసుల్లోనూ, వంకీలమీద విద్యుద్దీపకాంతుల్లో రకరకాల చీరెలు మెరిసిపోతున్నాయ్!
తనదగ్గర డబ్బులేదు. ఇప్పుడికిప్పుడు అప్పుమాత్రం ఎక్కడ దొరుకుతుంది.
ముందుకు నడిచిన సత్యనారాయణ మార్వాడీనగల షాపుముందు యాంత్రికంగా నిలిచిపోయాడు.
ఎర్రరాళ్ళగాజులు వున్నాయేమో? ఎంత ఖరీదు వుంటాయో?
అనుకుంటూ లోపలకు వెళ్ళాడు సత్యనారాయణ.
గాజులు వున్న షోకేస్ అద్దంలోనుంచి దృష్టి సారించాడు.
ఎర్రరాళ్ళ, పచ్చరాళ్ళ, తెల్లరాళ్ళ గాజులు ధగధగ లాడుతూ కాంతుల్ని వెదజల్లుతున్నాయ్.
"ఏం కావాలి సార్" సేల్స్ మన్ చూపించు"
"ఆ ఎర్రరాళ్ళ గాజులు చూపించు"
సత్యనారాయణ ఆ గాజులు చేతిలోకి తీసుకొని చూశాడు. చెల్లెలు కళ్ళముందు కదిలింది. ఇది ఇవ్వగలిగితే ఎంత సంతోషిస్తుంది బాధల్ని మరిచిపోయి?
"ఎంత" అడిగాడు.
సేల్స్ మాన్ చూసి"నాలుగువేలదాకా అవుతుంది" అన్నాడు సేల్స్ మన్.
నాలుగువేలా? ఎక్కడ్నుంచి తేవాలి?"