అతనికేమీ అర్ధంకావడంలేదు. అదే భావాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకేసి అయోమయంగా చూశాడు.
అమాయకత్వాన్ని కుండపాతగా వర్షిస్తున్న అతని ముఖాన్ని చూస్తూ మరో క్షణం కూడా వుండలేక మెరుపు వేగంతో తన రెండు చేతుల్లోకి అతని ముఖాన్ని కనురెప్పపాటు కాలంలో అతని కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకుంది.
ఆమె చర్యకి ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు మనోహర్. ఒక్కసారి ఈమె మోము చూస్తేచాలు-కలల ప్రపంచంలోకి వెళ్ళని మగాడువుండడు. ఈమె శరీరాకృతి చూసిన ఏ మగవాడైనా అక్కడికక్కడే బిగుసుకుపోక తప్పదు.
AFIGURE THAT WILL MAKE ANY MAN STAND TO ATTENTION
అందాన్ని అణుబాంబులా పెల్చగల అద్భుతమయిన సౌందర్యవతి ఈమె....ఏ ఉపమానాలైనా ఈమెను చూశాక తమ స్వరూపాన్ని మార్చుకుంటాయేమో? ఎవరినా తన కోసం పడిచచ్చేలా చేసుకోగల ఈమె, తన వెంటెందుకు పడుతోంది.....?!
బుర్ర భూగోళం అంత అయినట్లు అయింది మనోహర్ కి.
పెళ్ళి చేసుకుని భర్తలతో సుఖంగా సంసారం చేసుకుంటున్న గృహిణులు ఈమెను చూస్తే ఆ రాత్రికి నిద్రపోరేమో అసూయతో, భయంతో.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్....? అర్ధం కావడంలేదా నేను? నవ్వుతూ ప్రశ్నించింది మాయాదేవి.
"మీకన్నీ వున్నాయ్.....ఆస్తి, అంతస్తు, అందం, చదువు, స్థాయి, చివరగా మైండ్ బ్లోయింగ్ ఫిగర్ మీది. మీరు తలచుకుంటే వరల్డ్ బెస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీ సొంతం అవుతారు. అలాంటప్పుడు నా వెనుకే ఎందుకు పడుతున్నట్లు? నన్ను వదిలెయ్యకూడదూ....?" అర్ధిస్తున్నట్లుగా అన్నాడు మనోహర్.
"ఎందుకంత దిగిపోతావ్.....?" షార్ప్ గా రియాక్ట్ అయింది మాయాదేవి.
"ఎదిగి విశ్వాస ఘాతకున్ని అవటం ఇష్టంలేక."
"ఒక్కమాట చెప్పు.....నేనంటే నీకు ఇష్టమా? లేదా.....?"
మనోహర్ మాట్లాడలేదు.
"నేను నీకు నచ్చలేదా?"
అయినా మనోహర్. మౌనం వహించాడు.
"నిజానికి పర్యాయ పధం ధైర్యం....మరెందుకు నిజం చెప్పటానికి భయపడుతున్నావ్....? ప్లీజ్ స్పీక్ అవుట్...." ఈసారి మిస్ మాయాదేవి అర్ధిస్తున్నట్లుగా అడిగింది....అందులో కొంత అసహనం కూడా తొంగి చూడకపోలేదు.
అయినా సమాధానం చెప్పలేదు మనోహర్. అలాని అతని మనసు నిస్తేజంలో కూరుకుపోలేదు.
అంతఃచేతనంలో ఆమె ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటోంది.
"పొందిన సహాయానికి కృతజ్ఞతలు కార్య రూపంలో చూపించవలసిన అవసరం వుందా లేదా?" తల వంచుకునే నెమ్మదిగా అన్నాడు మనోహర్.
అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో, ఏ సెంటిమెంట్ కు బందీ అయ్యాడో ఆమె అర్ధం చేసుకోగలిగింది.
"అదెవరూ కాదనరు! కానీ, దానికోసం మనస్సు చంపుకోవలసిన అవసరం వుందా? మనిషి తన మనసు కోసం నిజమయిన మనిషిగా బతికేదెప్పుడు? అలా బతకనప్పుడు ఆ మనిషిని మనసున్న మనిషి అనుకోవచ్చా? అసలు ఒకరి కోసం, మరొకరి మెప్పు కోసం, ఏ మనిషయినా ఎందుకు బతకాలి? ఈ సమాజం ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్ మనిషిని సుఖపెడుతుందా? వ్యక్తిత్వానికి ఆసరా అవుతుందా?"
"అశక్తులైన వాళ్ళు, శక్తిమంతులయ్యాక గురుదక్షిణ చెల్లించుకోవలసిన అవసరం వుందా లేదా?" ప్రశాంతంగా అడిగాడు మనోహర్. ఆమెని తన మాటల ద్వారా శాంతింపజేసే ఆలోచనల్లో వున్నాడతను.
"గురు దక్షిణ పేరిట బొటనవేలు అడగడం న్యాయ సమ్మతం అవుతుందా....?"
"కాకపోవచ్చు.....తమ కూతురు సుఖపడాలని వున్న ఆస్తులన్నీ తెగనమ్మేశారు. నా నీడలో వాళ్ళ కూతురు ప్రశాంతంగా బతుకుతుందని, ఎప్పటినుంచో కలలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కలలన్నీ కుప్పకూలిపోయే పరిస్థితుల్లో వాళ్ళున్నారు. ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పినా నమ్మే స్థితిలో వాళ్ళులేరు. నీ వెనుకున్న ఆస్తి చూసి, నేనె నీ వెంట పడ్డానని వాళ్ళు భ్రమిస్తున్నారు. ఈ విషయమే నన్ను మరింతగా బాధిస్తోంది. కనుక నాకు వేరే దారిలేదు-!"
"దారి దొరికితే నా దారిలోకి వస్తావా_?"
"దొరికిన దారి గురించి దొడ్డి దోవన ఆలోచించడం నాకు యిష్టం వుండదు."
"సరిగ్గా దారి దొరికేచోట కళ్ళు మూసుకుని నడవటం మూర్ఖుల లక్షణం."
"నువ్వెన్నయినా చెప్పు, నా మేనకోడల్ని నేను పెళ్ళిచేసుకోవడమే నాకున్న ఏకైక మార్గం. ఆ మార్గాన్ని వదిలేసి నీ మార్గంలోకి వస్తే, నేను కచ్చితంగా డబ్బుకోసమే ఆ పని చేశారనుకుంటారు. అలా అనుకునేవాళ్లకు నేను సరిగ్గా ఇవ్వగలిగే సమాధానం నా దగ్గరేముంటుంది?"
"హలో....ఒక్కసారి నిలబడు." అంది మాయాదేవి సీరియస్ గా. అలా ఎందుకు అందో తెలియని మనోహర్ ఉనికిపాటును కప్పిపుచ్చుకుంటూ లేచి నిలబడ్డాడు.
"భయపడకు_ నిన్నేమీ చేయను- ఒక స్త్రీ ఒక అడుగు ముందుకే స్తేనే ఎంతో భయపడిపోతారు మీ మగవాళ్ళు....అదే మీ మగవాళ్ళు వంద అడుగులు ముందుకేసినా, యాభై అడుగులు వెనక్కేసినా క్రమంగా భయపడని స్థాయికి చేరుకుంటుంది స్త్రీ జాతి.
అందుకు నా చర్యే ఒక ఉదాహరణ. మగవాడు బస్ స్టాండ్ లోనో, రైల్వేస్టేషన్ లోనో, సినిమాహాల్స్ దగ్గరో, పెళ్ళిళ్ళలోనో ఒక ఆడపిల్లను చూసి, ఇంటికి వెళ్ళి నాకు ఫలానా ఆడపిల్ల నచ్చిందోచ్- అని వాళ్ళ తల్లిదండ్రులతో చెబితే, వాళ్ళు ఎగేసుకుంటూ సదరు ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గరకెళ్ళి మీ అమ్మాయి, మా అబ్బాయికి నచ్చిందట- అది మీ అదృష్టం అన్నట్లు గర్వంగా భుజాలెగరేస్తారు. మీరు మీ అమ్మాయిని కన్నందుకు, చదువు సంధ్యలు చెప్పించి పెద్దదాన్ని చేసినందుకు, ఆమె ప్రయోజకురాలై నందుకు మీరు గర్వపడకూడదు.