"ఛట్"....
నువ్వో పిరికి వెధవ్వి.
అలాచేస్తే రాజర్షికి నిజంగానే మనమీద అనుమానమొస్తుంది."
పట్టాభి కసురుకుంటూ అన్నాడు.
(ఉదయ్ తన ఎనిమిదవయేట సర్టిఫైడ్ స్కూల్ కి వెళ్ళాడు.
అది 1974లో జరిగింది.
కొన్ని కారణాలవల్ల ఉదయ్ నిర్భంధం 1984 వరకూ కొనసాగింది.
ఈ మధ్యన జరిగిన సంఘటనలు ముందు ముందు ప్లాష్ బ్యాక్ లో వస్తాయి.
కథ తిరిగి 1984లో మొదలవుతుంది.
అంటే ఉదయ్ రేపే జైలునుండి వస్తాడనగా తిరిగి కథ మొదలవబోతోంది__రచయిత)
o o o
ఉదయం ఎనిమిదిగంటలు కావస్తోంది.
లలితాంబ కూతుర్ని నిద్రలేపేందుకు అప్పటికి నాలుగయిదుసార్లు ప్రయత్నించి విఫలమయింది.
కూతురు ఉషా చేస్తున్న ఉద్యోగం ఆమెకెంతమాత్రం యిష్టంలేదు.
ప్రొద్దస్తమానం క్రైమ్ రిపోర్టింగంటూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ, కోర్టులచుట్టూ తిరిగి సాయంత్రానికి న్యూస్ తయారుచేసి రెసిడెంట్ ఎడిటర్ కి అందించి ఇంటికొచ్చేసరికి ఒక్కోసారి అర్ధరాత్రవుతుంటుంది.
అలా అని ఖండితంగా ఉద్యోగం మానేయమని చెప్పలేని నిస్సహాయత.
కొడుకు చనిపోయిన దగ్గర్నుంచి భర్త మంచంమీంచి లేవటం లేదు.
ఉన్న ఆస్థి అంతా ఊడ్చుకుపోయింది. చివరకు ఆడపిల్లే ఇంటికి దిక్కయింది.
అలాంటి పరిస్థితుల్లో కూతురుచేసే ఉద్యోగం బావోదని మాన్పిస్తే జరుగుబాటు?
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక పరమైన సంబంధాలే అనటానికి తమ కుటుంబమే ఓ ఉదాహరణ ఆమె నిట్టూరుస్తూ వంటగదికేసి సాగిపోయింది.
సరిగ్గా 8-30 అవుతోంది.
లలితాంబ బెడ్ కాఫీ తీసుకుని ఉషా గదివేపు వస్తుండగా ఒక్కసారే నిశ్శబ్దం బ్రద్దలయింది ప్రక్కింట్లో.
నలుగురయిదుగురు ఆడవాళ్ళు భోరున విలపిస్తున్నారు.
ఆ స్థాయి అంతకంతకు పెరిగిపోతుందేతప్ప తగ్గటంలేదు.
ప్రశాంతత భగ్నం కావడంతో ఉషా సడన్ గా మేల్కొంది.
చికాకుగా కళ్ళను సున్నితంగా రాసుకుంటూ తల్లి అందించిన కాఫీ అందుకుంటూ ఏమిటన్నట్లు తన ఏటవాలు కనుబొమ్మల్ని ఎగురవేసింది.
"ఏమో తెలియదు"
అందామె చెదిరిన కూతురు నుదుటిమీద జుత్తును ప్రేమగా పైకి నెడుతూ.
ఉషా నైటీని సరిచేసుకుని ఆసక్తిగా బయటకు నడిచింది.అప్పటికే పక్కింటి ముందు దాదాపు పాతికమంది దాకా పోగయ్యారు.
ఉషాలో ఆసక్తి రెట్టింపయింది.
తల్లి వెనుకనుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వడివడిగా పక్కింటికేసి సాగిపోయింది.
"ఉషా....ఉషా....ఉషా...." నిజంగా అందమయిన ఉషస్సు....ఉషోదయపు అద్వితీయ అందం ఆమెలో అణువణువునా ప్రతిఫలిస్తుంటుంది. అలా అని తెలుపు....ఎర్రెర్రగా ఎరుపూ కాదు....చక్కని నలుపు. చక్కని చామనఛాయ. నలుపు....అయితే ఏం? గుండ్రటి పెద్దపెద్ద కళ్ళు__
వాటిని ఆక్రమించే అందమయిన కనురెప్పలు....ఆ కనురెప్పల అడుగున వెలుగును చిందించే చురుకయిన కళ్ళు ఏమాత్రం ఆసక్తిని కలిగించే సంఘటనకయినా, వ్యక్తికయినా చలించిపోయే కళ్ళు. వంపులు తిరిగిన నెలవంకలాంటి కనుబొమ్మలు. బుల్లి పెదవులు....ఆ పెదవులపై ఎప్పుడూ తడిదేరి కనిపించే మెరుపు.
నవ్వితే....చిన్నపాటి నవ్వుకయినా చొట్టలుపడే చెక్కిళ్ళు....ఐదడుగుల అరంగుళాల ఎత్తులో అందగత్తేనా కాదా అన్న సందిగ్ధంలో ముందుపడేసి....ఆ తర్వాత పరిశీలనమీద పసందయిన ఆకర్షణ ఆమెలో ఇమిడివుందనిపించే 37:24:36: స్ట్రక్చర్.
కేవలం తెల్లగా వుంటేనే ఆడాళ్ళు అందముగా వుంటారన్న భ్రమలోవున్న భ్రాంతిపరుల్ని సయితం అచ్చెరువందించే అద్వితీయమైన చార్మింగ్ ఆమె ప్రత్యేకత.
ఆమె ఎప్పుడు....?