కొన్ని సర్పాలు అతడు ధరించిన పాయింట్ షూ పాదరక్షల మీదికి ఎక్కుతున్నాయి. అతడు అలవోకగా కాలు కదపగానే దిగిపోతున్నాయి.
కొన్ని సర్పాలు అతని కుర్చీ కాళ్ళమీదుగా పైకి పాకుతున్నాయి. వాటిని ఒక నిడుపాటి కర్రతో అదలిస్తున్నాడా యువకుడు. అతని నిర్భీతికి వాణి ప్రశంసాపూర్వకంగా అతని వంక చూస్తోంది.
వాణి వెనుక మరికొందరు వచ్చారు.
వారంతా లోనికి వచ్చాక గేటు మూసివేశారు. ఇనప జల్లెడ గోడల మధ్య గదిలో సర్పాల మధ్య కూర్చున్న యువకుడు లేచాడు. ఆ గది లోపల ఉన్న పొడవాటి బెంచీ దగ్గరకు వచ్చాడు.
కుర్చీలోంచి అక్కడకు వచ్చేందుకు అయిదారు అడుగులు! ఆ అయిదారు అడుగులు వచ్చేలోగా అతనికి కొన్ని డజన్ల పాములు అడ్డు వచ్చాయి. వాటిని బూట్లు ధరించిన పాదాలతో పక్కకు నెట్టి వేస్తూ బెంచీ దగ్గరకు చేరుకున్నాడతడు.
అతని చేతిలో ఉన్న పొడవాటి కర్ర అదే ప్రయోజనానికి ప్రత్యేకంగా తయారు చేయబడింది. దాని చివర వంకీ తిరిగి ఉంది. సర్పాలను ఒక్కొక్కదాన్ని ఆ వంకీలో ఇరికించి తీసి బల్లమీద ఉంచి, ఆ సర్పం ఏ జాతికి చెందిందో చెప్పసాగాడతడు.
ఒక పాముని వంకీకి తగిలించి తీసి బల్లమీద ఉంచటం, దాని అలవాట్లు, ఉండే చోట్లు, దాని విరోధి ప్రాణులు, దాని వీనమ్ ఎఫెక్ట్ అంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
అదంతా చెప్పి అన్నీ సర్పాలను పరిచయం చేయటానికి ఇంచుమించు అరగంట పట్టింది. మిన్నాగుల వంటివి దూకే అలవాటున్న సర్పాలు కొన్ని ఉన్నాయి.
వాటి గురించి వివరించేటప్పుడు మాత్రం వంకీ బిగించి ఉంచాడు. కాని బల్లమీద వదిలేయలేదు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తరవాత అతడు మళ్ళి వెళ్ళి కుర్చీలో స్థిరంగా కూర్చున్నాడు.
ఇంతకు పూర్వమే వాటిని కదలించటం నించి సర్పాలన్నీ గోడల మధ్య చాలా అలజడిగా తిరుగుతున్నాయి. అలా కూర్చోవటం సంగతి ఎలా ఉన్నా, ఆ ప్రదర్శన చూచేందుకు చాలా గుండె దిటవు కావాలి.
ప్రేక్షకులంతా బొమ్మల్లా నిలిచి పోయినారు. నిజం చెప్పాలంటే ఎవరి సంగతి వారు గుర్తించుకోలేదు. కాని, ఒక్కొక్కరికి బి.పి. నూటయాభై దాటి నడుస్తోంది.
ప్రదర్శన అంతా పూర్తి అయ్యాక ఇనుప జల్లెడ గోడ ఇవతలనుంచే ఆ మహారాష్ట్ర యువకుడిని విష్ చేసింది వాణి అతడు చాలా మృదువుగా నవ్వి లేచి గోడ దగ్గరగా వచ్చాడు.
అక్కడి కార్యకర్తలు వాణి గురించి ఇంతకు పూర్వమే అతనికి చెప్పారు. వాణి తన పేరు చెప్పుకుంది.
"ఫ్రెండ్! ఈ ప్రదర్శన చూచిన తరవాత నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. అడగవచ్చునా?" అని ఎంతో మర్యాదపూర్వకంగా ప్రశ్నించింది వాణి.
"నిస్సందేహంగా! మీరు అనుమానం తీర్చగలిగితే అది నా అదృష్టమే అనుకుంటాను" అన్నాడతడు అందమైన ఇంగ్లీషులో!
"ఈ ప్రదర్శన చేయటం సాహసమే కాదు-దుస్సాహసం. అందుకు సందేహం లేదు. మీరు ఇటువంటి ప్రదర్శనలు యావద్భారతి దేశంలో చాలాసార్లు చాలాచోట్ల చేశారని విన్నాను. మిమ్మల్ని చూచి యువకులంతా గర్వించాలి. అందుకూ సందేహం లేదు. కాని ఇంత దుస్సాహసం మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది" అన్నది వాణి ఆ యువకుడు కొద్ది క్షణాలు మౌనం వహించాడు.
"సర్పాలు రైతులకు మిత్రులు. అంతేకాదు, మానవులందరికీ మంచి మిత్రులు. ఈ విషయం ప్రచారం చెయ్యాలనే నేను ప్రయత్నిస్తున్నాను" అన్నాడు.
వాణి మరింక మాట్లాడలేదు. అతడు తిరిగి ధన్యవాదాలు చెప్పి వెళ్లేందుకు ఉద్యుక్తుడయ్యాడు.
"మేడమ్! సర్పాలు మానవజాతికి మిత్రులే కాని శత్రువులు కావు అని చెప్పేందుకు వ్యాసాలు రాయవచ్చు! సినిమాలు తీయవచ్చు. కాని వారికి ప్రత్యక్షంగా చూచినప్పుడు ఆ అభిప్రాయం ప్రగాఢమైన ముద్రగా నిలిచిపోతుందన్నది యధార్ధం కదా!" అని చెప్పేసి అతడు తిరిగి తన కుర్చిలోకి వెళ్ళిపోయాడు.
సభకు వేళ అయిందని కార్యకర్తలు గుర్తు చేయటంతో తిరిగి ప్రయాణమయింది వాణి. వస్తూ ఉంటే టెంట్ లోపలే మరొక ఇనుప జల్లెడలు గోడగా అమర్చిన గది కనిపించింది.
ఆ వంకకు చూచింది వాణి.
దానిలో కింగ్ కోబ్రా ప్రత్యేకంగా బంధించబడి ఉన్నది. దాని శరీరం ముదిరిన తాటిపండు వర్ణంలో నూనె మెరుగులతో నిగనిగలాడుతోంది.
అక్కడక్కడ బంగారు రింగులున్నాయి. దాని పొడవు పద్దెనిమిది అడుగులు. లావు పద్నాలుగు అంగుళాలు పడగ వెడల్పు అడుగున్నర. ఆ వివరాలన్నీ అక్కడ బోర్డుమీద రాసి ఉన్నాయి.
దాని కళ్ళు కణకణ మండే కొలిమిలోంచి ఈవలకు దొర్లి వచ్చిన ఇనుప గొలీల్లా ఉన్నాయి. దాని పుత్కారం చిన్న పాపాయి ఏడుపులా వినిపిస్తోంది. అది పడగ ఎత్తితే మనిషికన్నా ఎత్తుగా కనిపిస్తోంది దాని భికరాకృతిని యధాతధంగా చెప్పేందుకు అక్షరప్రదాయిని అయిన అంబ దిగి రావాలి.
అలా ఉంది కళింగ సర్పం. దాని వివరాలన్నీ బోర్డుమీద రాసి ఉన్నాయి. ప్రభుత్వం వారి అనుమతితో దాని మధ్యప్రదేశ్ అడవుల్లోంచి పట్టుకొచ్చాడు మహారాష్ట్ర మావకవీరుడు.
అయితే దానితో సహజీవనం విదాతకయినా అసాధ్యం. అందునించి వేరుగా గదిలో బంధించాడు.
దాని వీనమ్ శరీరంలోకి వెడితే ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు కాని, యాంటేవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చేందుకు కాని సమయం చాలదు.
అది కేవలం త్రాచుపాముల్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది. మరే ఇతర ప్రాణినీ ఆహారంగా స్వీకరించదు. అందుకే దాని పేరు రాజసర్పం. కింగ్ కోబ్రా!