Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 21

    నిలువునా తీర్చిన తిలకంతో విశాలమైన పచ్చని నుదురు అగ్ని వేదికలా తరలిస్తోంది. సువిశాలమైన నేత్రాలకు కాటుక రేఖలు సరిహద్దుల్లా నిలిచినాయి.
    మంగళసూత్రాన్ని బ్లౌజులో దాచేసి, సన్నని ఒంటిపేట బంగారు గొలుసు మెడలో వేసుకుంది. చేతికున్న బంగారు కంకణం తీసేసి మట్టి గాజులు వేసుకుంది. ఒక చేతికి రిస్ట్ వాచీ పెట్టుకుంది. ఫోటోసన్ గ్లాసు కళ్ళద్దాలను చక్కదిద్దుకుని సరిగా అమర్చుకుంది. తలలో ఆకుతో సహా త్రుంచిన ఒకే ఒక్క గులాబి పూవు పెట్టుకుంది.
    జరీ అంచు చీర కుచ్చిళ్ళను కాలి కొనగోటితో తన్నుకుంటూ సుకుమారంగా మెట్లు దిగి అతిదులముందు ప్రత్యక్షమయింది వాణి.
    ఆ వచ్చినవారు రెప్పవేయటం మరచి చూడసాగారు. వారిలో ఒక వృద్ధుడు ఇద్దరు యువతులు ఉన్నారు. అలవోకగా చీర కుచ్చిళ్ళను తన్నుకుంటూ, పెద్ద కళ్ళద్దాలను సవరించుకుంటూ వారి మధ్యకు వచ్చింది వాణి.
    యువతులిద్దరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. ఆ వృద్ధునికి తనని పరిచయం చేసుకుంటూ రెండు చేతులూ ముకుళించి నమస్కరించింది వాణి.
    "మంచిదమ్మా! నీ గురించి చాలా విన్నాను. సైన్స్ జర్నల్స్ లో నీవు ప్రచురించిన పరిశోధనలు చదివాను. మంచి కృషి చేశావు. నీ గురించి ప్రొఫెసర్ కృష్ణస్వామి ఎప్పుడూ చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు నీవంటి విద్యార్ధికి గురువు కావటం తన అదృష్టమంటూ అభివర్ణించేవారు.
    చివరకు వారు నీ గురించే కదా అంతకు తెగించి శ్వేతనాగుతో ప్రత్యక్ష పోరాటానికి తలపడ్డారు.  ఎప్పటికైనా వారి శరీర స్థితి మెరుగు అవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నాం. అదీ నీవే సాధించాలి. విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఎందరో మేధావులు ఎన్నో త్యాగాలను చేసి, ఎన్నెన్నో విజ్ఞాన విషయాలను వెలుగులోకి తెచ్చి చిరంజీవులయ్యారు. నువ్వు విజ్ఞానపు వెలుగు లోకానికి తీరయిన రహదారులు నిర్మించగలవని గాఢంగా నమ్ముతాను. అలా నమ్మవచ్చా?" అని ఎంతో అభిమాన పురస్సరంగా ప్రశ్నించారాయన.
    వారి మాటల్ని అనుసరించి వారు ప్రొఫెసర్, లేదా నిష్ణాతులైన విజ్ఞాన శాస్త్రవేత్త  అయి ఉంటారని భావించింది వాణి.
    "సర్! మీ ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు  నేను ఇంతవరకూ ఏదైనా సాధించగలిగానంటే అది ప్రొఫెసర్ కృష్ణస్వామి ఇచ్చిన ఉత్తేజం వల్లనే! నిజానికి నా పరిశోధనల ఫలితాలన్నీ వారికే చెందుతాయి. నేను నడిచాను. వారు నడిపించారు" అన్నదామె వినమితమైన కంటస్వరాన.
    వాణి వినయ సంపన్నతకు అబ్బుర పడిపోయినాడా వృద్ధ విజ్ఞానమూర్తి.
    'వంగే మొక్కలు మాత్రమే తుఫాను తాకిడులనించి అజేయంగా నిలుస్తాయి, వినయ సంపత్తి కలిగిన వారే విజేతలు కాగలుగుతారు' అని భావించినారాయన.
    వారితోపాటుగా వచ్చిన యువతులు పరిశోధనా రంగంలో ఆదర్శప్రాయమైన పాత్రను సాహసోపేతంగా నిర్వహిస్తున్న వాణి వంక రెప్ప వేయక చూస్తున్నారు.
    "ఈ వేళ సభలో ప్రముఖులు చాలామంది ఉన్నారు. వారు కూడా నీ పరిశోధనలలో ప్రత్యక్షానుభవాలను గురించి వినాలన్న కుతూహలంతో ఉన్నారు. అందునించి నీకే ఎక్కువ సమయం కేటాయించబడింది. నేను కూడా ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నాను. సమయం కూడా దగ్గర అవుతోంది. బయల్దేరుదామా?" అన్నారాయన.
    ఆ మాటలను ఆదేశంగా భావించిన విజ్ఞానశాస్త్ర విద్యార్దినులైన అమ్మాయిలు ఇద్దరూ లేచి నిలబడ్డారు వారితో పాటుగా వాణి కూడా లేచి నిలబడింది.
    ఆయన రవంత ప్రయాసపడి తన స్థూల  శరీరాన్ని కుర్చీలోంచి లేవదీశారు.
    లాల్ బహదూర్ స్టేడియంలో మహారాష్ట్ర  యువకుడు ప్రదర్శనలిస్తున్న టెంట్ ముందు కారాగింది. వాణి గురించి పత్రికల ద్వారా, రేడియో, టి.వి.ల ద్వారా విన్న విద్యార్ధి లోకం ఆమె రాకతో ఉవ్వెత్తున లేచింది.
    అంతదాకా స్తబ్ధుగా ఆమె పరిశోధనల చర్చలలో మునిగి ఉన్నవారంతా కెరటంలా క్లిక్, క్లిక్ మంటున్నాయి.
    తల దించుకుని ముందుకు సాగిపోయింది వాణి.
    టెంట్ లోకి వెళ్ళాక తల ఎత్తిందామె!
    టెంట్ లోకి అద్భుతమైన దృశ్యం!
    ఇనుప జల్లెడతో తయారయిన ఓ గదిలో ఓ యువకుడు కుర్చీలో చాలా నిర్భయంగా కూర్చుని ఉన్నాడు. ఆ ఇనుప జల్లెడ గోడల మధ్య గదిలో అతని చుట్టూ కొన్ని వందల సర్పాలున్నాయి.
    వాటిలో కొన్ని స్తబ్దుగా పడి ఉన్నాయి. కొత్తగా ప్రకృతిలోంచి ఆ చోటుకి కొని రాబడిన సర్పాలు మాత్రం పరవళ్ళు చేస్తున్నాయి.
    కొత్తగా తెచ్చిన త్రాచులు రేచుల్లా గోడలమధ్య పరుగులు తీస్తున్నాయి. టెంట్ మధ్యలో అమర్చి ఉన్నదా గది.
    జల్లెడ గోడల సందులలోంచి సర్పాలు బయట పడేందుకు వీలుకాదు. కాని, బయటనించి లోపలదృశ్యం ఒళ్ళు జలదరించేలా కనిపిస్తోంది.
    గదిలోపల ఒక వారగా పొడవాటి బెంచీ అమర్చి ఉంది. దాని మీదికి సర్పాలు ఎగబాకుతున్నాయి. లోపల ఇంచుమించు రెండు వందల సర్పాలున్నాయి. వాటిలో తెల్ల తాచులున్నాయి. నల్లతాచులున్నాయి. గోదుమవన్నే తాచులున్నాయి.
    కొన్ని జెర్రులు సుదీర్ఘమైన శరీరాలతో గోడలమధ్య భాగంలో విహారం చేస్తున్నాయి. రబ్బరు పాము (మొండి శిఖండి)లు, బురదపాములు, కట్లపాములు, మిన్నాగులు కూడా ఉన్నాయి.
    అరుదయిన సముద్ర సర్పాలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఆ యువకవీరుడు కొన్ని రోజులుగా సహజీవనం చేస్తూ ప్రదర్శన ఇస్తున్నాడు. 'సర్పాలతో సహజీవనం రెండు వందల సర్పాలతో ఇరవై రోజులు' అన్న బోర్డులు అక్కడక్కడా తగిలించి ఉన్నాయి.
    వాణి ఆ యువకుడి వయసును ఇరవై అయిదు సంవత్సరాలుగా అంచనా వేసింది.
    అతడు చాలా స్థిరంగా కుర్చీలో కూర్చున్నాడు. తన చుట్టూ అన్నీ సర్పాలు స్వేచ్చగా తిరుగుతున్నా రవంత అయినా జంకు గొంకులు అతనిలో కనిపించలేదు.

 Previous Page Next Page