"నోరుముయ్యి. నీపుట్టింటి గొప్పలు నాదగ్గిర చెప్పకు. నీ మొగుణ్ణి నువ్వే చులకన చేసుకోడానికి సిగ్గులేదూ! కన్నపిల్లలకి తిండిపెట్టుకోలేని స్థితిలో వున్నాననా నీ ఉద్దేశం!" శకుంతలని, జగన్నాథం గారిని నోటికివచ్చినట్టు అని ఉన్నపాటున వెళ్ళిపోయాడు అతను. ఆరోజునుంచి మళ్ళీ అత్తవారి గుమ్మం తొక్కలేదు. వీళ్ళా తనకు చెప్పడం అన్నట్టు పంతానికి మరీ తను ఆపరేషన్ చేయించుకోలేదు. శకుంతల చేయించుకోడానికి అనుమతి యీయలేదు. శకుంతల భర్తపట్ల విముఖత పెంచుకోవడం మినహా ఏం చెయ్యలేకపోయింది.
ఇద్దరు ముగ్గురు పిల్లలతో ముచ్చటగా ఉండే సంసారాలని చూసి నిట్టూరుస్తుంది శకుంతల. తన తోబుట్టువుల కాపురాలను, వారి అన్యోన్యాన్నీ చూసి తన దురదృష్టానికి లోలోపలే విచారిస్తుంది.
పెళ్ళీడుకు వచ్చిన కూతురు యింట్లోవుండగా, నలభై రెండేళ్ళకి వచ్చిన యీకానుపుతో ఆమె నలుగురి ముందు తలయెత్తుకోనంతగా సిగ్గుపడిపోతూంది. మొదట్లో రాత్రింబగళ్ళు కుమిలిపోయి ఏడ్చింది. సూర్యనారాయణ భార్య స్థితిని అర్ధంచేసుకుని సానుభూతి చూపకపోగా 'ఎందుకలా నేను చచ్చినట్లు ఏడుస్తావు? నేనేదో చేయరాని పని చేసినట్లు ఎందుకలా చీధరించుకుంటావు? కొంపమునిగినట్టు ఆదుఃఖ మేమిటి!" అంటూ మరింత కోతపెట్టాడు.
భర్తమీద కోపంతో శకుంతల ఎంత నీరసంగా ఉంటున్నా డాక్టర్లు చెప్పిన మాటకూడా పాటించకుండా ఆరోగ్య విషయం నిర్లక్ష్యం చేసి బ్రతుకుపట్ల నిర్లిప్తత ఏర్పరచుకుంది.
కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్న శకుంతలణు చూసి పార్వతమ్మా జగన్నాథాలు ప్రాణాలు తల్లడిల్లాయి.
"వడ్డించారు. అందరూ కూర్చున్నారు, భోజనాలకి. ఇంకా ఇద్దరు అలాగే పడుకున్నారేమిటి" పార్వతమ్మ మళ్ళీ వచ్చింది. హడావిడిగ ఆలోచనలనుంచి తేరుకుని "ఆ! ఆ! వస్తున్నాపద!...." అన్నారు. పట్టుపంచ కట్టుకుంటూ జగన్నాథంగారు.
6
రాత్రి నూతన దంపతులణు గదిలోకి పంపి, భోజనాలు కానిచ్చి, పగలంతా వడ్డనలతో, అతిథిమర్యాదలతో, యితరమైన ఏర్పాటులతో అలసిన వారందరూ పక్కలకి చేరపడ్డారు తమలపాకులు వేసుకుంటూ.
ఉదయంనుంచి ఊపిరి సలపకుండా తిరిగిన రామం చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు ఒకచోట కూడడం చూసి, కాస్త నడువాల్చుకుందుకు, బాతాఖానీ కొట్టడానికి అక్కడ తనూ చేరాడు. జగన్నాథంగారు అప్పటికప్పుడే ఓకునుకుతీసి లేచారు.
"విజయ, బావ తప్ప అందరూ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా వుంటే ఎంత బాగుండేది! యిన్నాళ్ళకి ఉషపెళ్ళి ధర్మమా అని అంధరం కలుసుకోగలిగాం!" అంది అన్నపూర్ణ.
"అవునర్రా......వాళ్ళిద్దరూ కూడా వచ్చివుంటే, చక్కగా అందరం ఫామిలీగ్రూప్ ఫోటో తీయించుకొని ఉండేవాళ్ళం గదా!" అన్నాడు శంకర్.
"ఏదీ, జతపడితేనా? ఒకరువస్తే ఒకరు రారుగదా!" అన్నారు జగన్నాథంగారు.
"విజయ అంటే విదేశాల్లో వుంది!....పక్కనే ఉన్న బావ గారుకూడా రాలేదు!" రామం కాస్త నిష్టూరంగా అన్నాడు. శకుంతల మొహం తిప్పుకుంది.
"బావగారు అలిగా రేమిటి అక్కయ్యా?" అని కృష్ణమూర్తి అడిగాడు.
"ఆ.....ఈ బావగారు అలగనిది ఎప్పుడు!" శంకర్ నవ్వుతూ అన్నాడు.
"ఇదిగో, మీరంతా కలసి మాఅన్నగారి మీద యిలా వ్యాఖ్యానిస్తూంటే, వదినగారు కోపం ఆపుకోలేకపోతున్నారు." అని నవ్వుతూనే వారించాడు అన్నపూర్ణ భర్త, సుందర్రావు.
"రావమ్మా, వదినా! కాసేపు నడుంవాల్చు!....పాపం, తెల్లవారగట్ల మూడింటికి లేచి తిరిగిన దానివి తిరిగినట్లే ఉన్నావు!...." మీనాక్షి గదిలోకి రాగానే అన్నపూర్ణ తనపక్కను చోటిస్తూ వదిన గారిని ఆహ్వానించింది.
"అబ్బబ్బ.....కాళ్ళు పడిపోతున్నాయి.....ప్రొద్దుటినించి ఎక్కడా రెస్ట్ లేదు. ఇప్పటికి కాస్త ఊపిరి తిప్పుకోడానికి అయింది.....ఇంకా అవతల పాలు, పెరుగు, మిఠాయలు అన్నీ సద్ది మూతలు పెట్టాలి...." అంటూ మీనాక్షి చతికిలబడింది.
"మరేమిటి, కూతురిపెళ్ళంటే తమాషా అనుకొన్నావా ?.....అప్పుడే ఏమయింది? ముందుఉంది సందడి అంతా! పిల్లని పంపడం, తీసుకురావడం, లాంఛనాలు, సూడిదలు, పురుళ్ళు, పుణ్యాలు ఎన్ని ఉన్నాయి! నీ నడుం పూర్తిగా వంచేస్తారు మనవలు బయలు దేరి...." పార్వతమ్మ అందుకుంది.
"అబ్బ! ఒక్క కూతురు పెళ్ళి చేయడానికే ఎంత శ్రమ ! ఖర్చు! నెలరోజులబట్టి ఒకటే హడావిడి! ఊపిరి తీసుకోడానికైనా లేదు. వంద రూపాయల నోటు తీసి పట్టుకుంటే, మరు నిమిషానికి మాయమయిపోతూంది!...." రామం వెళ్ళబోసుకున్నాడు.
"ఇదంతా చూస్తూంటే, ఇప్పటినుంచీ నాకు భయంగా వుంది రేపు నేనేం చేస్తానా అని!" పూర్ణ అంది.
"నీకేం! ఒక్క కూతురిపెళ్ళి చెయ్యలేకపోతావా?" అన్నారు జగన్నాథంగారు.
"అందరికంటే శకుంతలకే ఎక్కువకష్టం. ఆరుగురుపిల్లలు! అందులో నలుగురు ఆడపిల్లలు!" రామం మౌనంగా పడుకున్న శకుంతల వంక చూస్తూ అన్నాడు.
"మనం ఒకళ్ళు యిద్దరికే యిలా అవుతున్నాం.....కాని యీ విషయంలో వదినగారి ఓపికను మెచ్చుకోవాలి. ఇంకా పిల్లల ముచ్చట తీరినట్లు లేదు!" మీనాక్షి శకుంతల కేసి చూస్తూ వేళాకోళం చేసింది.
శకుంతల ముఖం వివర్ణమయింది. చివుక్కున లేచి అక్కడనుంచి వెళ్ళిపోయింది. మగవాళ్ళు అందరూ ముఖాలు గంభీరం పెట్టారు. మీనాక్షి ఏదో తొందరపడి అనేసింది. శకుంతల వాలకం చూడగానే తప్పుచేసినట్లు అందరివంక బెరుగ్గా చూసింది.