Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 21


    "నా పేరు షణ్ముగం" అన్నాడు ఇన్ స్పెక్టర్.


    "గుడ్ మార్నింగ్ ఇన్ స్పెక్టర్" అన్నాడు మూర్తిగారు.


    డాక్టర్లని ఎంతగా గదమాయించగలడో, పోలీసు వాళ్ళనీ అదేవిధంగా గదమాయించగల వ్యక్తిత్వం ఆయనది. డబ్బు ఉండొచ్చు. దాని ద్వారా వచ్చిన పవర్ ఉండొచ్చు. కానీ - వాటిని మించిన నైతిక అధికారం ఉన్న మనిషిలా కనబడతాడు ఆయన. తప్పులు చెయ్యకుండా బతికేవాడు తప్పులు చేసే వాళ్ళని "ఇది తప్పు" అని చెప్పగల స్తోమత ఉంటుందే - అది ఆయనకి బాగా ఉన్నట్లుగా కనబడుతుంది. "షణ్ముగం - ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే!" అన్నాడు మూర్తిగారు.


    ఏదో దోమని తోలినట్లు చిత్రంగా సెల్యూట్ చేశాడు ఇన్ స్పెక్టర్.


    "షణ్ముగం సార్! అంటే ఆరు మొహాలు. కుమారస్వామి పేరు. నేను అంతటివాణ్ణి కాకపోయినా ఆరుసార్లు ఆరు మొహాలతో కనబడ్డాను జనాలకి!"


    చిత్రంగా చూశాడు మూర్తిగారు. "అంటే?" అన్నాడు.


    ఏడవబోయి నవ్వినట్లు నవ్వాడు షణ్ముగం.


    "ప్రొహిబిషన్ పాలసీ సార్! మా చిన్నప్పుడు తాగితే తప్పు! కాదు కాదు, ఆంధ్రాలో తాగితే తప్పు! నైజాంలో తాగితే ఒప్పు! కొన్నాళ్ళు తమిళనాడులో తాగితే తప్పు! ఒక్కడుగు వేసి ఆంధ్రలో అడుగుపెట్టి 'తడ'లో తాగితే ఒప్పు. పెద్దయ్యాక పోలీసు ఉద్యోగంలో చేరానా! పోలీసు పని అంటే పార్టీలు తప్పవు కదండీ! అప్పటికి ప్రొహిబిషన్ ను ఎత్తేశారు. పార్టీల్లో నేను తాగకపోతే తప్పు! అన్నలు సారా దుకాణాలు మూయించేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్పిందీ? అమ్మకపోతే లైసెన్సులు కాన్సిల్ చేస్తాం అని! ఆ అన్నలు అట్లా అంటూ ఉంటే ఈ అన్న ఎన్టీఆర్ "అన్నన్నా! ఎంతమాట!" అని పోలీసు స్టేషన్లలో సారా అమ్మించాడు. పిక్ పాకెట్ గాళ్ళని పట్టుకునే కోటా, దొంగతనాల కోటా, దొంగతనాల కోటా, స్కూటరు చలాన్ల కోటా, రెడ్ లైట్ ఏరియా అమ్మాయిలని పట్టుకునే కోటాల్లాగా ఈ సారా అమ్మకం కోటా కూడా తగులుకుంది! అప్పట్లో స్టేషన్లో సారా అమ్మనన్నా! శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈలోగా అక్కలు సారా వ్యతిరేక ఉద్యమం మొదలెట్టారు. నాకు భలే సంతోషం కలిగింది. ఉద్యమకారుల మీద లాఠీఛార్జి చెయ్యమన్నారు. చెయ్యనన్నా! మళ్ళీ శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈలోగా ఎలక్షన్లొచ్చాయ్. ఎలక్షన్ల కోసం మద్యనిషేధం వచ్చింది.దొంగసారా దొరుకుతూనే ఉంది. దొంగలు దొరల్లాగా తిరుగుతూనే ఉన్నారు. దొరబాబులాంటి ఓ కుర్రాడి మీద దొంగకేసు బనాయించారు. బస్సులో వెళ్తూ సూట్ కేస్ లో విస్కీ బాటిల్ తీసుకెళ్తున్నాడని! ఆ బస్సుకి ముందే మంత్రిగారి కారు వెళ్ళింది. ఆ వెనకనే వస్తున్న లారీకి ఎస్కార్టులాగా - అందులో రాజస్థాన్ నుంచి వస్తున్న లిక్కరు ఉంది. బస్సులో వస్తున్న సూట్ కేసులో విస్కీ బాటిల్ ఉండడం కుర్రాడి తప్పు కాదు. ఆ కుర్రాడంటే గిట్టనివాళ్ళెవరో అతను జడ్చర్లలో కాఫీ తాగడానికి కిందికి దిగినప్పుడు అతని సూట్ కేసులో బాటిలు ఉంచారు. పోలీసులు అతనిమీద కేసు బనాయించారు. కుర్రాడిని వదిలెయ్యాలనీ రాజస్థాన్ లిక్కరు రవాణా చేస్తున్న మంత్రిగారిని అరెస్టు చెయ్యాలనీ చెప్పా - మళ్ళీ శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. తిరిగి రాగానే అయ్యా - మీ గార్డెన్ లో పార్టీ! ఆసియాలో ఎక్కడా లేనంత సారా ఫ్యాక్టరీ కడుతున్నారుట అమ్మాయిగారు. ఓపెనింగ్ కి ఓ వి.ఐ.పి.గారు - బందోబస్తుకి నేను! ఏం చెప్పమంటారు! అది చాలనట్లు గార్డెన్ లో ఈ కుర్రాడు విషాహారం తిని ఫ్లాట్ గా పడిపోవడం - హాస్పిటల్లో చేర్పించారు గదా! ఇది మెడికో లీగల్ కేసు! విచారణ చెయ్యాలి" అని నలిగిన ఒక నోట్ బుక్కు, బాల్ పాయింట్ పెన్ను తీశాడు. నోట్ బుక్కులో పేజీల చివర్లు కుక్క చెవుల్లా ఉన్నాయి. బాల్ పాయింట్ పెన్ను నీలంది. దానికి ఇంకేదో పెన్ను తాలూకు ఎర్ర క్యాపు ఉంది. అతని జేబుకి సిరా మరకలు కూడా ఉండడం గమనించాడు మూర్తిగారు. నిట్టూర్చాడు. ఆయనకి లండన్ లో తను చూసిన పోలీసులు గుర్తువచ్చారు. ప్రపంచం మొత్తం బ్రిటీష్ పోలీస్ బలగం అత్యుత్తమం అని చెప్పుకుంటూ ఉంటారు. అందులో స్కాట్ లాండ్ యార్డ్ పోలీసు డిటెక్టివ్ ల ప్రతిభ కథలు కథలుగా ప్రచారంలో ఉంది కదా!


    ఇండియన్ పోలీసు ఫోర్సులో చూడబోతే ఇట్లాంటి వాళ్లు! 'చూడు మిస్టర్ షణ్ముగం! ఈ కుర్రాడి కేసు చూస్తే నీకేమనిపిస్తోంది?' అన్నాడు ఆయన.


    "విషప్రయోగం జరిగింది సార్! మేడమ్ ఐశ్వర్యగారిని చంపాలని చూస్తున్నారు ఎవరో!"


    "అది డాక్టరే చెబుతున్నాడు కదా! విషప్రయోగం ఎందుకు జరిగింది? ఎవరిని ఉద్దేశించి?" అని.


    "సింపుల్ సార్! మేడమ్ ఐశ్వర్యగారిని చంపాలని చూస్తున్నారు ఎవరో!"


    "ఎవరయి ఉంటారు?"


    "మూర్తిగారి వైపు, డాక్టరు వైపు చూశాడు ఇన్ స్పెక్టర్.


    "ఇలా కాస్త పక్కకి వస్తారా?" అన్నాడు.


    టైం చూసుకున్నాడు మూర్తిగారు. ఆయన ఇంకో రెండు గంటల్లో బాంబే వెళ్ళాలి. అర్జెంటు పని! కానీ, ఇది ఇక్కడ పోలీసు కేసయింది. దీనిని కాస్త దార్లో పెట్టకుండా తను వెళ్ళలేడు. కేసు ఈ చిత్రమైన క్యారక్టర్ షణ్ముగం చేతిలో పడింది. ఇతనేం డీల్ చెయ్యగలడు! హోం మినిష్టర్ తో మాట్లాడాలి. "పదండి!" అన్నాడు మూర్తిగారు.


    "నా ఆఫీసులో కూర్చోండి" అన్నాడు పెద్ద డాక్టరు.


    ఆఫీసులో కూర్చున్నారు షణ్ముగం, మూర్తి. "చెప్పు ఇన్ స్పెక్టర్" అన్నాడు మూర్తి.


    "నీల్ కుమార్ ఇండియాకి వచ్చాడు" అన్నాడు షణ్ముగం ఉపోద్ఘాతం లేకుండా.

 Previous Page Next Page