Previous Page Next Page 
గోరింటాకు పేజి 21

   
    "మెలకువ వచ్చేసింది" అని బ్రహ్మానందం పెద్దపెట్టున నవ్వాడు.

 

    "నువ్వు అర్భకుడివి పాణీ! మొదటిసారికదూ, తట్టుకోలేకపోయినావు. భయపడిపోయినావు. జడుసుకున్నావు. బాగా నిషా ఎక్కింది."

 

    "లేదు. నాకు నిషా ఎక్కలేదు."

 

    "నిషా ఎక్కినవాడికి తెలియదులే. నాకుమట్టుకు తెలిసిందేమిటి?"

 

    "నీ విషయం వేరులే."

 

    "నువ్వు దిగివచ్చావా ఆకాశంనుంచి?"

 

    "దిగిరానక్కర్లా ఆకాశంనుంచి, భూమ్మీద వున్న తేడాలు చాలు."

 

    "దెబ్బలాడుకుందామా ప్రొద్దున్నే?"

 

    "ఇది ప్రొద్దున్నకాదు, మధ్యాహ్నము."

 

    "నేనెప్పుడు లేస్తే అప్పుడు ప్రొద్దున్న."

 

    "నీ దగ్గర భాష నేర్చుకుంటాలే."

 

    "నేనూ కన్నాను ఓ కల. చెప్పనా?"

 

    "చెప్పొద్దు. నువ్వే అనుభవించు."

 

    "ఆ కలలో నువ్వు కనిపించావు."

 

    "వద్దని చెప్పలా?"

 

    "నీ జుట్టు తెల్లగా అయింది."

 

    "నిషా ఇంకా తగ్గలేదా?"

 

    "ఇంకో బుడ్డి కొడితే?"

 

    "ఆకలి చల్లారుతుందా ?"

 

    "అన్నట్లు ఆకలి. కడుపు మండిపోతోంది."

 

    "అది ఆకలికాదు, మంట."

 

    "ఆకలిమంట."

 

    "దాని పేరెత్తకు. ఆ అర్హత మనకు లేదు."

 

    "నువ్వు మారిపోయాననుకుంటున్నావా?"

 

    "తప్పులు చాలా చేస్తుంటానులే. ఇదొకటి."

 

    "నువ్వు వస్తోంది నాకు."

 

    "నవ్వద్దు."

 

    "ఏడవమన్నావా?"

 

    "నవ్వటం, ఏడవటం రెండేకాదు, ఇంకా వున్నాయి."

 

    "ఏడిపించటం."

 

    "అదే అదే."

 

    "ఏమిటా ఉత్తరం? ప్రేమలేఖా?"

 

    "ప్రణయలేఖ."

 

    "సాయిబుగారమ్మాయి రాసిందా?"

 

    "రాసింది తురకంలో."

 

    "అర్థం చెబుతాను ఇటుతే."

 

    "నా కర్థమయింది."

 

    "ఎంత ప్రేమటా?"

 

    "గుండెనిండా."

 

    "ప్రేమను నెత్తుటితో ముంచి తేల్చు."

 

    "నెత్తుటిని ప్రేమలో ముంచి తేలుస్తా."

 

    "మనం మాట్లాడుకునేది ఏభాష?"

 

    "దీన్ని వ్యతిరేక భాష అంటారు. మరో అర్థం మూడ్స్."

 

    "ఓ! మూడ్సులో వున్నావా?"

 

    "ఇవతలికి వచ్చేశానులే."

 

    "ముకుందం వచ్చాడా?"

 

    "వచ్చాడు... వెళ్ళాడు."

 

    "రెంటికీ తేడా ఎంత?"

 

    "మన పాడునిద్రలో ఓ దారుణభాగం."

 

    "నీకు కవిత్వం వచ్చే!"

 

    "నీకు విమర్శ వచ్చే!"

 

    "కోపం పోయిందా?"

 

    "కోపం రాలేదు."    

 

    ఉన్నట్లుండి బ్రహ్మానందం గట్టిగా నవ్వి, భుజాలెగరేశాడు. లేచి నిలబడి, ఓసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని చక్రపాణిదగ్గరకు వచ్చి మెల్లిగా అతని భుజంమీద కొట్టాడు. "బలే! ఇద్దరం మతం పుచ్చుకున్నాం" అన్నాడు.

 

    చక్రపాణి జవాబు ఇవ్వలేదు. అతనికి అసహ్యం వేసింది. ఊరుకున్నాడు.

 

                                           * * *

 

    ఇంటిదగ్గర నుంచి వరుసగా ఉత్తరాలు వచ్చాయి చక్రపాణిని రమ్మని. ఇల్లు అనగానే ఏదో భయం వేస్తోంది. కాని వెళ్ళక తప్పదు. దసరా సెలవులకి ఇక్కడ వుండి ఏం చేస్తున్నాననే ప్రశ్న ఉదయిస్తుంది. రాజారావు ఉత్తరానికి అతనింకా జవాబు ఇవ్వలేదు. ఏమి రాయటమనేది సందేహం.

 

    ఇంతలో అతనికి అదృష్టం కలిసొచ్చి తండ్రి దగ్గర్నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అతని అక్కయ్య జయలక్ష్మి ఓ మొగపిల్లవాడ్ని ప్రసవించిందంటూ. తల్లీ పాపాయి క్షేమంగానే వున్నారుకాని పిల్లాడు జన్మించేటప్పుడు బొడ్డుచేరు కంఠాన్ని చుట్టుకునివుంది. అందుకని మూడు నెలలదాక పిల్లాడిని మేనమామ చూడకూడదు. వాడి ఏడుపు వినకూడదు. అందువల్ల తండ్రి జాలిగా రావద్దని మరీమరీ రాశాడు. చక్రపాణి నిట్టూర్చాడు. తాను క్రూరుడు. తల్లిదండ్రులను దర్శించటానికి ఉత్సాహం ప్రదర్శించకుండా భయపడే దుర్మార్గుడు.   

 

    బ్రహ్మానందం వచ్చాడు. "ఏమిటి అలా వున్నావ్?"

 

    "నాకు మనశ్శాంతి తెచ్చి ఇవ్వు బ్రహ్మానందం" అన్నాడు చక్రపాణి జాలిగా.

 

    బ్రహ్మానందం నవ్వి 'పద' అంటూ చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళాడు.

 

    ఓ ఎత్తయిన హోటల్లో ఓ అందమైన గదిలో ఇద్దరూ కూర్చుని పానీయాన్ని సేవించారు.

 

    "రమ్మూ, జిన్నూ కలిపి తాగాలి" అన్నాడు బ్రహ్మానందం.

 

    "తెప్పించు" అన్నాడు పాణి.

 

    పుచ్చుకున్నారు.

 

    "బీరు తాగితే ఆరోగ్యం" అన్నాడు బ్రహ్మానందం. ఎవడేడ్చాడు ఈ సమయంలో ఆరోగ్యంకోసం? అయినా "తెప్పించు" అన్నాడు పాణి.

 

    పుచ్చుకున్నారు.

 

    ఓ గంటగడిచాక బాయ్ వచ్చి చూసేసరికి బ్రహ్మానందం కుర్చీని తలక్రిందులుగా పడేసి ప్రక్కన తాను అడ్డదిడ్డంగా దొర్లుతున్నాడు. పాణి బల్లమీద ఆనుకుని కూర్చుని ఎటో తీవ్రంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతనికళ్ళు ఎర్రగా వున్నాయి.

 Previous Page Next Page