Previous Page Next Page 
జైలు పేజి 21


  మరో అరగంటకు చర్చ ముగిసింది.

 

    "ఖైదీలు జైల్లో లేరు సార్. వాళ్ళు నాలుగుగంటల నుంచే కనిపించడం లేదని తోటి ఖైదీలు చెబుతున్నారు. నాలుగు గంటలనుంచీ కనిపించడం లేదంటే ఇంకా ఇక్కడ ఉండరు సార్. ఈపాటికి బయటపడి ఎటైనా వెళ్ళడానికి మార్గాలు వెదుకుతుంటారు సార్" తనకు తెలిసిన సమాచారం అందించాడు ఆర్ముగం.

 

    "మార్నింగ్ నుంచీ వాళ్ళు పారిపోయే ప్లాన్ లో వున్నారని, అప్పుడు వాళ్ళ మాటలు అర్థం కాకుండా పోయాయని ఇప్పుడు వాటిని అన్వయించుకుంటే అన్నీ అర్థం అవుతున్నాయనీ మొదటి బ్యారెక్కు ఖైదీలు చెబుతున్నారు సార్" రంగారావు మరికొంత సమాచారం చెప్పాడు.

 

    "అవును. నాకూ అదే అనిపిస్తోంది రంగారావూ! నువ్వు పోలీసులకు ఫోన్ చేసి విషయమంతా చెప్పు. నేను ఎస్.పి.కి ఫోన్ చేస్తాను. వామనరావుగారూ! మీరు వార్డర్లును, గార్డులనూ తీసుకుని మొత్తం టౌనూ, అవుట్ స్కర్ట్స్ అన్నీ గాలించండి జెయిల్లో ఇద్దరు వార్డర్లను, నలుగురు గార్డులనూ వుంచండి. నేను ఆఫీసులో వుంటాను. ఎవ్వరీ ఫైవ్ మినిట్స్ కి నాకు చేయండి" అని శ్రీపతి అక్కడి నుండి వడివడిగా నడిచాడు.

 

    తన తండ్రి తనను కిందపడేసి గుండెలమీద కూర్చుని గొంతు పిసుకుతున్నట్లే అతను గిలగిల్లాడిపోతున్నాడు.

 

    వామనరావు తనచుట్టూ వున్న గార్డులకు, వార్డర్లకు పనులు పురమాయించాడు. "ఖైదీలకు ఇప్పుడే భోజనం పెట్టకండి. ఏ పరిస్థితులలోనూ ఖైదీలు బ్యారెక్కులనుంచి బయటికిరాకూడదు. ఇద్దరు గార్డులు బ్యారెక్కుల చుట్టూ పహరాకాస్తూ వుండండి. ఓ గార్డు టెర్రస్ పైన నిలబడి లోపలా, బయటా నిఘా వేయాలి. మరో గార్డు ప్రహారీగోడచుట్టూ రౌండ్లు తిరుగుతుండాలి. ఇక మిగిలిన వార్డర్లు, గార్డులూ నాతో రండి."  

 

    నలుగురు గార్డులు, ముగ్గురు వార్డర్లు తప్ప మిగిలినవాళ్ళు ఆయనతో పాటు కదిలారు.

 

    మరికొంతసేపటికి రెండు జీపులలో వాళ్ళు బయలుదేరారు. ఇంత రాత్రిపూట తమను ఆందోళనకు గురిచేస్తున్న వాళ్ళు ముగ్గురూ కనిపిస్తే కాల్చేద్దాం అన్నంత కసితో గార్డులు తమ తుపాకులను పొజిషన్ లోకి తెచ్చుకున్నారు.

 

                                 *    *    *    *

 

    బూట్లచప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది.

 

    ఎవరో వస్తున్న అలికిడి.

 

    తిలక్, ఉత్తరుడు, బుద్ధుడు మరింత బిగుసుకుపోయారు. వాటర్ ట్యాంక్ చీకటిగా వుండడం వల్ల ఒకరి ముఖాలు ఒకరికి కనిపించడం లేదు.

 

    సగంవరకు నీళ్ళలో వున్నా ఉత్తరుడికి చెమటలు పడుతున్నాయి. ఆ వచ్చిన గార్డో, వార్డరో ట్యాంక్ లో దిగి తమను పట్టుకునేట్టే వుంది అతనికి. తమను కిందకు తీసుకువెళతారు. తమను పట్టుకున్న గార్డు విజయగర్వంతో నవ్వుతూ తనకు ఎలా అనుమానం వచ్చిందీ, ఎలా ట్యాంక్ లో చూసిందీ మిగిలిన గార్డులకూ, వార్డర్లకూ వివరిస్తాడు.అంతలో పెద్దదొర శ్రీపతి వస్తాడు. తమను తోటలో వుండే గానుగ చెట్లకు కట్టేస్తారు. శ్రీపతి "ఫైర్" అనగానే తమ ముందున్న గార్డులు కాల్పులు జరుపుతారు. తమ శరీరాలలోకి బుల్లెట్లు దూసుకెళ్ళి....రక్తం.... రక్తం.... చిమ్ముతుంది.

 

    మొత్తం ఈ సీన్ అంతా కళ్ళముందు మెదలడంతో ఉత్తరుడు వణికిపోతున్నాడు.

 

    బూట్ల శబ్దం ఆగింది.

 

    ఆ వచ్చింది ఎవరో తెలియడం లేదు. వార్డరో, గార్డో వచ్చి వుంటాడు ఆ వచ్చిన వ్యక్తి వున్నాడో, వెళ్ళిపోయాడో తెలియటం లేదు. బూట్ల శబ్దం వినపడటం లేదు. వచ్చిన గార్డు రాత్రి ఒంటిగంటవరకూ అక్కడే వుంటే ఏం చేయాలో తోచటంలేదు తిలక్ కి.

 

    అతను చాలారోజులు పరిశీలించాకే ఆ ప్లేస్ ను ఎంపిక చేశాడు. కానీ యేదో అనుమానం పీకుతోంది. రాత్రి ఒంటిగంటకు కరెంట్ ఆగిపోతుంది గనుక అప్పుడు ఏదో విధంగా పారిపోవచ్చునని సర్దిచెప్పుకుంటున్నా అదెంత కష్టమో తెలుస్తూనే వుంది. కానీ అంతకంటే మించిన మార్గం కూడా కనపడడం లేదు. ఏదో విధంగా మేనేజ్ చేసి రాత్రి ఒంటిగంటకు ప్రహారీగోడ దగ్గరికి చేరుకుంటే లాలస తాడు వదులుతుంది. దానిని పట్టుకుని పైకి ప్రాకితే ఆ తరువాత అవతలికి దూకెయ్యచ్చు. అటువైపు నీళ్ళు వుంటాయి దెబ్బలు తగిలే ఛాన్స్ లేదు. మరి గార్డును ఎలా తప్పించుకు వెళ్ళాలా అని అతను ఆలోచనలో పడ్డాడు.

 

    మళ్ళీ బూట్లు కదిలాయి అదే నిష్పత్తిలో వాళ్ళ ముగ్గురిలోనూ భయం కదిలింది.

 

    ఈసారి గుండెకు దగ్గరగా బూట్లు ఆనినట్లు చప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది.

 

    ఉత్తరుడు అనాలోచితంగానే అటూ ఇటూ కదిలాడు. నీళ్ళల్లో సన్నగా అలజడి. బుద్ధుడు షార్ప్ గా రియాక్టయి ఉత్తరుడిని కదలవద్దని గిల్లాడు. తను చేసిన తప్పేమిటో తెలిసింది ఉత్తరుడికి. మెదలకుండా కూర్చున్నాడు.

 

    ఆ వ్యక్తి ట్యాంక్ మీదకు వంగినట్టు కంత మూసుకుపోయింది. వెలుగు మాయమై చీకటి కమ్మేసింది.

 

    లోపలికి చూసిన ఆ ఆకారం తిరిగి పైకి లేచింది. ఇప్పుడు, బయటి వెలుగు కంతలోంచి లోపలికి పాకుతోంది.

 

    మళ్ళీ బూట్లచప్పుడు. ఎవరో మరో వ్యక్తి వస్తున్నట్లు అర్థమైంది ముగ్గురికీ. ప్రాణాలు తమ కళ్ళముందే పావురాయిల్లా ఎగిరిపోతున్నట్టు సన్నగా వణుకు ప్రారంభమైంది.

 

    "ఏమిటి భయ్యా? ఇలా వచ్చావ్" ట్యాంక్ దగ్గరున్న వ్యక్తి అడగటం తెలుస్తూనే వుంది వాళ్ళకు.

 

    "ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు కదా. నన్నిక్కడ వుంది నిఘా వేయమన్నారు. నువ్వేమిటి ఇక్కడున్నావ్?" వచ్చిన వ్యక్తి అడిగాడు.

 

    "ట్యాంక్ లో నీళ్ళున్నాయో లేదో చూడడానికి వచ్చాను. వెళతాను భయ్యా"

 

    బూట్లు కదలడం మొదలుపెట్టాయి.

 

    తొలుత వచ్చింది వార్డర్ అనీ అతను వెళ్ళిపోతున్నాడనీ, రెండోసారి వచ్చిన గార్డు ఇక అక్కడే వుంటాడని తెలిసింది వాళ్ళకి.

 

    తాము వలలో చిక్కుపోయామన్న భావన వాళ్ళను కుంగదీస్తోంది. కరెంట్ ఆగిపోయినప్పుడు తాము బయటపడితే గార్డు గుర్తించే ఛాన్స్ ఎంతవుందో వూహిస్తున్నాడు తిలక్. అప్పటివరకు వెలుగుకు గార్డు బాగా అలవాటుపడి వుండటం వల్ల కరెంట్ ఆగిపోయినంత క్షణం అతని కళ్ళు దేన్నీ గుర్తించలేవు చీకటికి సర్దుకున్నాక మాత్రమే కళ్ళు చూడగలుగుతాయి. తాము మనకు వెలుగులో వుండడంవల్ల కరెంట్ ఆగిపోయినప్పుడు కూడా పరిసరాలు కనిపిస్తాయి. సరిగ్గా ఈ అంశం ఆధారంతోనే గార్డుకి కనపడకుండా టెర్రస్ దాటి కిందకు దిగిపోవచ్చని అతనూ వూహించాడు. అంటే ఆగిపోయిన మరుక్షణం తాము అక్కడి నుంచి వెళ్ళిపోగలిగితే గండం గడిచినట్టేననిపిస్తోంది.

 Previous Page Next Page