Previous Page Next Page 
ఉషోదయం పేజి 21

    సినిమాకి వెళ్ళినట్టు చెప్పడమా మానడమా అని ఆలోచించేలోగా రంజని అలుకగా "ఏమిటి సెల్ ఎందుకు కట్ చేస్తున్నావు? మనం సినిమాకి వెళదాం రమ్మని చెబుదామని ఇందాకటినించి ట్రై చేస్తున్నా" అంది.
    రవీంద్ర మాటలకి తడుముకుంటూ "ఇవాళ కుదరదు..." అన్నాడు పొడిగా.
    "ఏం" అని రెట్టించింది.
    ఈ రంజనికి అసలు తనెందుకింత భయపడాలి అని పౌరుషం వచ్చి "పిల్లలతో సినిమాకి వచ్చాను ఐమాక్స్ కి. వాళ్ళని చాలా రోజులనించి బయటికి తీసుకెళ్ళలేదని గొడవ చేస్తుంటే వచ్చాం."
    రంజని గొంతు మారిపోయింది "వచ్చాం... అంటే సునీత కూడా వచ్చిందా" అంది అసూయగా.
   "ఆ.... అందరం వచ్చాం... ప్లీజ్ నేను రేపు ఫోన్ చేస్తాను.. హాల్లో వుండగా ఇంక ఫోన్ చెయ్యకు" అంటూ కట్ చేశాడు.
    రంజని మొహం మాడిపోయినట్లయింది. పెళ్ళాం పిల్లలతో చక్కగా సినిమాకెళ్ళాడన్నమాట... తను పిలిస్తే కుదరదంటాడా... ఈర్ష్య అసూయలతో మండిపోయింది. పెళ్ళాం పిల్లలతో ఎంజాయ్ చేసుకునే మాటైతే తననెందుకు ప్రేమిస్తున్నానంటాడు... ఉదికిపోయింది. ఏదో చెయ్యాలనిపించి కసికసిగా ఆలోచించి చటుక్కున బ్యాగ్ అందుకుని బయటికి బయలుదేరింది. తిన్నగా ఐమాక్స్ కి వెళ్ళి టిక్కెట్టు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆమె కళ్ళు చకచకా రవీంద్రని వెతికాయి.
    తనకు ముందు రెండు వరుసల దూరంలో కూర్చున్న ఆ కుటుంబాన్ని చూసేసరికి ఉక్రోషం, కసి వచ్చాయి. ఉడికిపోతూ ఎలాగో ఇంటర్వెల్ వరకు కూర్చుంది. లైట్లు వెలగగానే కావాలనే వెనకనించి కాకుండా రవీంద్ర ముందువైపు నించే విసవిసా బయటికి నడిచింది.
    రవీంద్ర కంటపడాలనే అలా వెళ్ళింది... రవీంద్ర చూశాడు.
    సునీత చూసింది.  
    సునీత అర్థవంతంగా నవ్వి రవీంద్రవంక చూసింది. అతని మొహం మాడిపోయింది.
    అనుకున్నట్టే మర్నాడు ఆఫీసుకి వెళ్ళగానే దూకుడుగా గదిలోకి వచ్చింది రంజని. "సో, నిన్న పెళ్ళాం పిల్లలతో సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేశావన్న మాట" వ్యంగ్యంగా అంది.
    రవీంద్ర కాగితాలలోంచి తలెత్తి ఆమెవంక చూసి జవాబు చెప్పడానికేం లేనట్టు మళ్ళీ కాగితాలవంక చూశాడు.
    "నిన్న నీతో సరదాగా బయటికి వెళ్ళాలని ఫోను చేస్తే నన్ను ఎవాయిడ్ చేసి వాళ్ళతో వెళతావా... నీకు వాళ్ళే ముఖ్యం అనుకుంటే మనమధ్య ఈ బంధానికి అర్థం ఏమిటో చెబుతావా?" నిలేసింది వ్యంగ్యంగా.
    "చూడు రంజనీ... నీవు ఒకటి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు నా పిల్లలు. వాళ్ళమీద నా ప్రేమ  ఇప్పటికీ, ఎప్పటికీ వుంటుంది. వాళ్ళ మంచిచెడ్డలు, బాధ్యత నామీద ఎప్పటికీ వుంటాయి. డైవర్సు తీసుకున్నా పిల్లల చదువు, మంచిచెడ్డలు చూసే బాధ్యత నామీద వుంటుంది. ఇంతకీ పిల్లలేం పాపం చేశారని వాళ్ళని దూరం చేసుకుంటాను? వాళ్ళ సరదా తీర్చడం తండ్రిగా బాధ్యత..." కరుకుగా అన్నాడు.
    "భర్తగా భార్య సరదాలూ తీర్చాలి మరి పాపం" వెక్కసంగా అంది.
    నీకు జవాబు చెప్పాల్సిందేంలేదు అన్నట్టు రవీంద్ర కాగితాలు చూడసాగాడు.
    రంజని ఒక్కక్షణం జవాబు కోసం చూసి విసవిసా వెళ్ళిపోయింది బయటికి.
                                             * * *
    "సుప్రియా! నీవు ఇప్పుడు సునీత ఇంట్లో వుండడం లేదా?" ప్రకాష్ ఆరా తీశాడు.
    "లేదు సార్... వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి షిప్ట్ అయ్యాను."
    "ఉమెన్స్ హాస్టల్లో ఏం బాగుంటుంది? వేరే అపార్ట్ మెంట్ తీసుకోకపోయావా"
    "వేరే ఇల్లు నేను ప్రస్తుతం అఫోర్టు చెయ్యలేను సార్... కొన్నాళ్ళు యిలా..."
    "ఫర్వాలేదు. నీకు కావాలంటే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ చూసుకో. అద్దె విషయం నేను చూస్తాను.. నా ఎంప్లాయీలు ముందు సుఖంగా సెటిల్ అవ్వాలి. అప్పుడే నమ్మకంగా పనిచేస్తారు అని నా నమ్మకం. ఏమంటావు" నవ్వుతూ అన్నాడు.
    సుప్రియ ఆశ్చర్యంగా చూసింది. అంతటి ప్రసన్నత ఎప్పుడూ అతని ముఖంలో చూడలేదు ఈ నెలా పదిహేనురోజులలో.
    "అందులో నీవు శారద స్నేహితురాలివి కూడా గదా, మిగతా వారిలా నిన్ను ట్రీట్ చెయ్యలేను గదా..."
    అతనంత చనువుగా మాట్లాడుతుంటే సుప్రియకి ధైర్యం వచ్చింది. "అయితే అపార్ట్ మెంట్ చూసుకోమంటారా... మీరు పర్మిషన్ ఇచ్చాక ఇంక నాకేం లోటు! మీ అండ నాకుంటే ఇంకేంకావాలి" అంది సంబరంగా.
    ప్రకాష్ తలవూపాడు, ఆమెవంక కాంక్షతో చూస్తూ... ఆ చూపు గుర్తించని వెర్రిది కాదు సుప్రియ.
                                           * * *
    'ఉషోదయం' పేపరులో బ్యాంక్ దివాళా వార్తలు, బ్యాంక్ డిపాజిటర్ ఆత్మాహుతి, పోలీసులు, బెదిరింపు ఫోనులు... ఇవన్నీ చదివి కలవరపడింది శారద. ఆ సాయంత్రం వీలు చూసుకుని ఇంటికి వెళ్ళింది.
    "ఏమిటి డాడీ ఇది! మీరెందుకు ఈ గొడవల్లో ఇరుక్కున్నారు? ఫోన్ లో బెదిరింపులు వస్తున్నాయని రాశారు. డాడీ! నాకెందుకో భయం వేస్తోంది. ప్లీజ్! ఆ వార్తలన్నీ ఆపేయండి. డాడీ, వాళ్ల బెదిరింపులు నిజం చేస్తే మేమందరం ఏమైపోవాలి..." శారద వ్యాకులంగా అంది.
    "ఏమిటమ్మా శారదా! నీవూ ఇలా మాట్లాడితే ఎలా అమ్మా. పేపరన్నాక నిజానిజాలు రాయకపోతే ఎలా అమ్మా... బాధితుల ఆర్తనాదాలు ప్రజలకి అందేలా చెయ్యాలంటే పత్రికలే మధ్యమాలమ్మా... తాటాకుల చప్పుళ్ళకి భయపడితే ఇంక పత్రిక నడపడం మానుకోవాలమ్మా."
    "అక్కా... ఏమిటక్కా, నీవూ అలా మాట్లాడుతున్నావు. మనం వేయకపోతే ఇంకో పత్రిక ప్రచురిస్తుంది. ఈ రోజుల్లో పత్రిక నడపాలంటే ఎంత కాంపిటీషన్ వుందో తెలుసా, ప్రజలకి హాట్ న్యూస్ లు అందించాలి ఎప్పటి కప్పుడు... మనం వెనకనపడితే పత్రికా వెనక బడుతుంది. ఈ రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే కావాలి. అంతే కాదు ఈ బ్యాంక్ దివాళా తీయడానికి కారకులైన పెద్దమనుషులని ఎవరికి వారు పట్టించుకోకపోతే బాధితుల కెలా న్యాయం జరుగుతుంది" నీరద అంది.

 Previous Page Next Page