Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 22

    సినిమాలోలా, నిజంగా ఇలాంటి హోటల్సు, డాన్సులు వగైరాలు చూడటం ఇదే ప్రథమం. వళ్ళంతా కళ్ళు చేసుకుని అందరూ ఎలా తాగుతున్నారో, ఎలా తింటున్నారో, ఎలా డాన్స్ చేస్తున్నారో, ఎవరెలాంటి డ్రస్సింగ్ చేసుకున్నారో అన్నీ గమనించింది.
    సుబ్బారావు విషం మింగుతున్నట్టు మొహంపెట్టి ఒక గుటక బలవంతంగా వేశాడు. రెండు జీడిపప్పులు నోట్లో కుక్కుకున్నాడు.
    మురారి నవ్వాడు.
    "ఒరేయ్ పూల్! పెద్ద షో చేయకురా. ఏమిటిరా విషం మింగుతున్నావా?" అని వేళాకోళం చేశాడు.
    "నీకేం నాయనా! బంగారుపిచ్చుకవి. ఇలాంటివేవో నీ ధర్మాన నా కలవాటయితే చస్తాను. గుమస్తాగాడిని" అన్నాడు.
    జ్యోతికి వళ్ళుమండింది. గుమస్తాగాడిని అనుకుంటూ తనని తాను ఇక్కడ కూడా కించపరుచుకోవాలా?
    కాసేపు తామెవరో మర్చిపోయి ఎంజాయ్ చేయకూడదు. తాము ఎలాగూ ఇలాంటి హోటల్స్ మొహాలు చూడలేరు. ఎవరో తీసుకొచ్చినప్పుడైనా హాయిగా ఎంజాయ్ చేయకుండా అడుగడుగునా తమ పేదరికం గుర్తుంచుకోవాలా?
    "స్టాపిట్ ఓల్డ్ మాన్! ముసలికబుర్లు చెప్పకుండా ఎంజాయ్ చెయ్యరా. వెన్నెల్లో కూర్చుని ఆ వెన్నెలని అనుభవించకుండా రేపీ వెన్నెల వుండదేమో, చీకటేమో అని ఏడవడం ఎందుకురా? నీవేమిటో కాసేపు మరిచిపోరా నాయనా! మరిచిపోడానికే ఇక్కడికి వచ్చాం" అన్నాడు మురారి.
    'అబ్బ! ఎంత చక్కగా చెప్పాడు?' జ్యోతి మెచ్చుకోలుగా మురారి వంక చూసింది.
    అతను ఏం మాట్లాడినా అందంగానే వుంది ఆమెకి.
    అతను నాజూగ్గా గ్లాసుపట్టుకుని సిప్ చేయడం, షోగ్గా ఒకో జీడిపప్పు నోట్లో వేసుకోడం, సిగరెట్ అంటించడం, షోగ్గా పీల్చడం, అందమైన పలువరుస కనపడేట్టు నవ్వడం, అదోరకంగా మత్తుగా పెదాలు విరిచి మాట్లాడడం, గాలికి ఎగురుతున్న జుట్టు, తల ఎగరేసి వెనక్కి తీసుకోడం ఏంచేసినా అందంగా, నాజూగ్గా, షోగ్గా మోడరన్ గా కనిపించింది.
    అతని ప్రతి కదలికని మెచ్చుకుంది. అతని పక్కనున్న భర్త రోజూకంటే మరింత అనాగరికంగా, మోటుగా, అసహ్యంగా కన్పించాడు.
    'అబ్బ! ఆ గ్లాసు పట్టుకోవడం ఏమిటో, ఆ తాగడం కాస్త నాజూకుగా తాగకూడదూ? ఆ జిడ్డుకారుతున్న మొహం కాస్త రుమాలుతోనైనా తుడుచుకోడే!
    భర్తని చూస్తుంటే అసహ్యంగా, జుగుప్సగా అన్పించింది జ్యోతికి. చూసీచూడనట్టు అవకాశం వచ్చినప్పుడల్లా మురారిని నిశితంగా గమనిస్తూనే వుంది జ్యోతి.
    మరో గంటకి మురారి మూడుపెగ్గులు పూర్తిచేశాడు. సుబ్బారావు ఒకటితాగి ఇక వద్దంటున్నా మరోసారి గ్లాసునింపాడు మురారి.
    మ్యూజిక్ ఆగి డాన్సులు చేసేవారంతా ఎవరి స్థలాల్లో వారు వచ్చి కూర్చున్నారు.
    "నౌ ఉయ్ ఆర్ హేవీ టు ప్రెజంట్ యూ మిస్ జానీ" అన్న ఎనౌన్స్ మెంటు విన్పించింది.
    మిస్ జానీ కాబరే డాన్సర్!
    కాండిల్ లైట్ వెలుతురులో మ్యూజిక్ మొదలవగానే మిస్ జానీ ఎటునించి వచ్చిందీ జ్యోతి గమనించలేదు.
    ఆమెమీదకి గుండ్రటి స్పాట్ లైట్ ఫోకస్ అయ్యాక చూసింది. జానీ మిలమిలలాడే దుస్తులు కట్టుకుని, పైన మెరిసే ఒక రోబ్ కప్పుకుని వుంది.
    ఎర్రగా పెయింట్ చేసిన పెదాలు బాబ్డ్ హెయిర్, హైహీల్స్, ఒళ్ళు గులాబీరంగులో, నాజూకుగా, మంచి ఫిగర్ తో మగాళ్ళ మతులు పోయేటట్టుగా వుంది.
    ఆమె వచ్చి గిర్రున ఓ రౌండ్ డాన్స్ ఫ్లోర్ అంతా తిరిగింది.
    అందరూ తనని చూడడానికి వీలుగా, ఆ తరువాత మ్యూజిక్ కి అనుగుణంగా డాన్స్ చేస్తూ ముందు కప్పుకున్న రోబ్ విసిరేసింది. ఆ తరువాత జోళ్ళు విసిరేసింది.
    డాన్సు చేస్తూనే వంటిపైనున్న ఒక్కొక్క దుస్తూ విప్పి గిరవాటు వేస్తూంది.
    మగవాళ్ళంతా నోర్లుతెరుచుకుని చూస్తున్నారు.
    ఆమె వాయిద్యానికి అనుగుణంగా చకచకా వళ్ళు కదిల్చేస్తుంది, ఎటుపడితే అటు వంపులు తిరిగిపోతూంది. వంట్లో ఎముకలేనట్లు వంగి పోతుంది.
    కొందరు స్త్రీలు సిగ్గుతో తలలు దించుకున్నారు. అలవాటయిన మరి కొందరు నిర్వికారంగా చూస్తున్నారు.
    జ్యోతికి ముందు బాగానే ఉత్సాహంగా అన్పించినా, చివరికి ఆమె ఒక్కొక్క దుస్తూ తీసిపారేసే రెండు గుడ్డపీలికలతో నిలబడేసరికి, మగవాళ్ళందరూ ఎలా చూస్తున్నారో గమనించేసరికి అలా చూడడం అదే మొదటిసారేమో వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుపోయింది.
    చటుక్కున మురారిని చూసింది.
    మురారి కళ్ళు ఆ చీకట్లో కేండిల్ వెలుగులో మెరుస్తున్నాయి. ఆటే కుతూహలంగా చూస్తున్నాడు.
    సుబ్బారావు కాస్త సిగ్గుపడుతున్నా, బాగానే చూస్తున్నాడు. మిస్ జానీ ముందుకువంగి వళ్ళు కుదుపుతోంటే ఎవరో ఫ్లాష్ లైటుతో ఫోటోలు తీసుకుంటున్నారు.
    మిస్ జానీ సిగ్గు మరిచిపోయినదానిలా, ఎదురుగా పురుషులన్నవారేలేనట్టు, నిర్వికారంగా మొహం అంతా చిరునవ్వు పులుముకొని నృత్యం చేస్తూంది.
    నృత్యం క్లై మాక్స్ కి అందుకున్న గుర్తుగా మ్యూజిక్ మోగిపోతోంది.
    ఆమె వంటి కదలిక మరీ ఎక్కువైంది. మగవాళ్ళ ఎక్సైట్ మెంట్ ఎక్కువైంది.          

 Previous Page Next Page