ఎటు చూసినా అందం, ఆనందం, ఐశ్వర్యమే కనిపించాయి జ్యోతికి.
వారందరి మధ్య అతి సామాన్యంగా చవకరకం బట్టలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నట్టు, అందరూ తమని తేరిపార చూసి నవ్వుకుంటున్నట్టు జ్యోతి కుంచించుకుపోయింది.
అసలు వారు హోటలు ముందు ఆగాకగానీ తను అతిమామూలు వాయిల్ చీరలో, జిడ్డుమొహంతో ఉందన్న విషయమే గుర్తురాలేదు.
హోటల్ దేదీప్యమానంగా లైట్లతో వెలిగిపోతూంది. కార్లోనించి దిగుతున్న అందమైన జంటలని చూశాక చటుక్కున ఆ మాట గుర్తువచ్చింది జ్యోతికి.
'ఛీ- ఛీ.... బజారుకని ఏదో కట్టుకొచ్చింది. కాస్త మంచిచీర కట్టుకోవాల్సింది, ఏమో - ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా జరిగుతుందని తలచిందా తను?
కారు దిగి "కమాన్! రండి...." అని తలుపు తీసి పట్టుకున్నాడు మురారి.
"బట్టలు బొత్తిగా బాగోలేదండీ, బజారుకని బయలుదేరాను ఏదో కట్టుకుని" అంది చాలా మొహమాటపడుతూ, సిగ్గుపడుతూ.
"అవునురా! సాయంత్రం అంతా తిరిగాం. జిడ్డుమొహాలు మేము, మావెంట నీవుంటే నీకూ చిన్నతనం అన్పిస్తుంది జాగ్రత్త" అన్నాడు సుబ్బారావు.
"ఏడిశావులే. రండి - ఫరవాలేదు. మీరేం కట్టుకున్నారో చూడడమేనా అందరికి పని" అన్నాడు తేలిగ్గా మురారి.
ఇంక తప్పలేదు జ్యోతికి, హ్యాండ్ బాగన్నా లేకుండా వచ్చినందుకు మరోసారి తిట్టుకుంది.
లోపలికి వెళ్ళాక కళ్ళు జిగేల్ మనిపించే వెలుతురు లేకుండా ప్రతి టేబుల్ మీద పెద్ద పెద్ద కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి.
హాలులో అంత వెలుగు లేనందుకు సంతోషించింది జ్యోతి.అయినా అందరు తమవంకే చూస్తున్నట్లు అడుగడుగునా సిగ్గుపడిపోతూనేవుంది.
"కమాన్!" కుర్చీ జరిపాడు మురారి
వాళ్ళు కూర్చున్నాక ఒక బేరర్ దగ్గర నిలిచాడు.
"ఏరా! ఏం తీసుకుందాం? వాట్ డు యూలైక్ టు హావ్ విస్కీ ఆర్ బ్రాంది" అన్నాడు మొహమాటంగా.
"నీ మొహం. ఇదేం మన సాంబార్ అయ్యర్ హోటల్ అనుకున్నావేమిటి - ఇంకా ఏడే అయింది. ఇప్పుడే డిన్నర్ ఏమిటి? అయినా ఇన్నాళ్ళకి కల్సుకున్నాం. సెలబ్రేట్ చేయాలి మనం. కమాన్! ఏం తీసుకుంటావు?"
"వద్దురా - అలవాటు లేదురా. నీకు అంతగా అయితే ఏ కూల్ డ్రింకన్నా తెప్పించు."
"పోరా కూల్ డ్రింకట. ఆడవాళ్ళే తాగేస్తున్నారు. నీవేమిటిరా ఈ చచ్చు కబుర్లు! పోనీ బీర్ తీసుకో, అట్టే స్ట్రాంగ్ గా వుండదు" మురారి బలవంతం చేశాడు.
వింటున్న జ్యోతికి మొగుడిమీద చచ్చేంత కోపం వచ్చింది. ఏమిటో ఆడవి మనిషిలా ప్రవర్తిస్తారు.
కాస్త నలుగురిలోకి వచ్చినపుడన్నా మోడ్రన్ గా బిహేవ్ చేయడం రాదు. ఒకపూట కాస్త డ్రింకు తీసుకుంటే కొంప మునుగుతుందా? అంత బలవంతం చేయించుకుంటారేం? బొత్తిగా మేనర్స్ తెలియవు. తిట్టుకుంటూ సుబ్బారావు వంక చూసింది తీక్షణంగా.
కోపంగా చూస్తున్న జ్యోతిని చూసి ఆమె భావం మరోలా అర్థం చేసుకుని -
"వద్దురా బాబూ! మా ఆవిడ వుంది. ఇంటికి వెళ్ళాక చంపుతుంది" అన్నాడు హాస్యంగా.
"ఆవిడేం అనదు. అనకుండా చూసే పూచీ నాది. ఏమండీ! విత్ యువర్ పర్మిషన్. ఈ రోజుకి మావాడ్ని వదిలేయాలి" మురారి జ్యోతి వంక చూశాడు.
జ్యోతి చప్పున నో ....నో..... నాకేం అబ్జక్షన్ లేదు. ఏమిటంత బతిమాలించుకుంటూన్నారు? ఒకపూట తీసుకుంటే కొంపమునగదులెండి" అంది.
"మీరే నయం మావాడికంటె. చూశావురా ఆవిడే ఫార్ వర్డుగా వున్నారు నీకంటె. నౌ మైబాయ్ ఇంకేం చెప్పకు" అంటూ బేరర్ కి విస్కీ ఆర్డర్ చేశాడు.
"నౌ - వాటెబౌట్ యూ" అన్నాడు.
జ్యోతి వైపు తిరిగి- "ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ తెప్పించనా, లేక కాస్త వైన్ రుచిచూస్తారా? వైన్ లేడీస్ డ్రింక్" అన్నాడు.
"ఒరే బాబూ! నాకే అలవాటు లేదంటుంటే తనకేం అలవాటుంటుందిరా, ఆమెని వదిలేయ్" అన్నాడు సుబ్బారావు జ్యోతి ఏదన్నా అనే లోపలే.
"ఆల్ రైట్! మన లేడీస్ ఇంకా అంత ముందుకు వెళ్ళలేదులే" అంటూ ఆరంజ్ స్కాష్ ఆర్డర్ చేశాడు జ్యోతి కోసం.
జ్యోతి అతను విస్కీకాదు, బ్రాందికాదు ఏది తెప్పించి తాగమన్నా తాగేసివుండేది ఆ క్షణాన్న అతన్ని మెప్పించడానికి. మోడ్రన్ ఫేషన్ అంటే ఏది చేయడానికీ అరక్షణం ఆలోచించదు జ్యోతి.
వెయిటర్ డ్రింక్, ఐస్, వేయించిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు తీసుకొచ్చి పెట్టాడు.
రికార్డుసంగీతం ఆగింది,
డయాస్ మీద ఆర్కెస్ట్రా ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు. ఆర్కెస్ట్రా మొదలైంది.
మ్యూజిక్ మొదలవగానే కూర్చున్నవాళ్ళల్లో కొందరు జంటలులేచి డాన్స్ చేయడం ఆరంభించారు.
అతిమోడర్న్ గా, ఫేషన్ బుల్ గా కనిపిస్తున్న ఆ జంటలని చూడడము వింతగానే వుంది జ్యోతికి.