ఆఖరికి పెద్ద బ్యాంగ్ తో మ్యూజిక్ ఆగింది. జానీ ఎలా ఎంత చురుకుగా వచ్చిందో అంత చురుకుగానూ మాయమైపోయింది. స్పాట్ లైట్ వెలుతురు ఆగి కొన్ని లైట్లు వెలిగాయి.
"వండర్ పుల్! షి ఈజ్ ఏన్ ఏంజిల్" అంటున్నాడు కైపు తలకెక్కిన ఓ సరసుడు.
అంతవరకూ నిశ్శబ్దమైన వాతావారణం తిరిగి కలకలంతో హడావిడి అయింది.
"ఎలా వుంది?" అన్నాడు మురారి నవ్వుతూ జ్యోతివంక తిరిగి. జ్యోతి ఒక్కక్షణం సిగ్గుపడి తలతిప్పుకుంది.
"పాపం బతుకుతెరువుకోసం ఎంతకైనా దిగజారిపోతారు ఇలా మానాభిమానాలు విడిచి, సిగ్గు, లజ్జావిడిచి రోజూ ఇన్ని వందలమంది ముందు అలా నగ్నంగా నిలబడాలంటే ఎంత ప్రాణం చచ్చిపోతుందో ఆమెకి?" జాలిగా, సానుభూతిగా అన్నాడు సుబ్బారావు.
"ప్చ్! ఈ వ్యవహారం అంతా వాళ్ళకి అలవాటయిపోతుంది" తేలిగ్గా అన్నాడు మురారి.
"ఇప్పుడంటే అలవాటయిపోయివుంటుంది. మొదట్లో ఎంత బాధపడేదో, ఎంత సిగ్గుపడేదో, ఎలాంటి దీనస్థితికి తట్టుకోలేక ఇంతకి తెగించిందోగదా, ప్చ్! ఛ! ఈ కేబరేలని నిషేధించాలోయ్" సుబ్బారావు బాధగా అన్నాడు.
"యూ సెంటిమెంటల్ ఫూల్! సాధారణంగా ఈ కేబరేడాన్సర్స్ అందరూ ఆంగ్లో ఇండియన్సే! వాళ్ళమీద మన స్త్రీలకంటే పాశ్చాత్య స్త్రీల ప్రభావం ఎక్కువగా వుంటుంది.
ఇలా అర్థనగ్న వేషం వాళ్ళకి కొత్తకాదు. అందులో సిగ్గుపడవలసింది వున్నట్టు భావించరు.
ఆఫ్ కోర్స్! అందులో కొందరు బతుకుతెరువుకి మనసు చంపుకుని వచ్చినవారూ వుంటారు. కొందరు ప్రోఫెషనల్స్ కి అదే వృత్తి. రకరకాల వాళ్ళుంటారు...." మురారి విశదీకరించాడు.
"ఏమిటో ఈ డాన్సులు, ఈ నాగరికత అంతా కృత్రిమంగా కనిపిస్తుంది నాకు. చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో, తిరోగమిస్తున్నామో అర్థంకాదు ఒకోసారి" సుబ్బారావు నిట్టూర్చుతూ అన్నాడు.
మురారి వేళాకోళంగా నవ్వాడు.
జ్యోతికి సుబ్బారావు అమ్మమ్మ కబుర్లు చూస్తుంటే వళ్ళుమండింది. మురారి ఏమనుకుంటాడో అనుకుని భయపడింది.
"మా ఆయనవన్నీ పాత చింతకాయపచ్చడి భావాలులెండి. మంచికో, చెడ్డకో మార్పు అవసరం అని గుర్తించరు. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పాత అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలే మంచివి అంటారు" జ్యోతి అంది.
"మంచి అన్నది ఇటు ఆధునికతతో కొంత వుంటుంది. అలాగే చెడు అన్నది పురాతనంలోనూ వుంటుంది. ఎటొచ్చి మనం ఎప్పుడు నేర్చుకున్నా చెడే నేర్చుకుంటున్నాం మంచి వదిలి."
సుబ్బారావు తీవ్రంగా అన్నాడు.
"ఫర్ ఎగ్జాంపుల్! విదేశాలనుంచి మనం నేర్చుకున్నది తాగుడు, కేబరేలు తప్ప కార్యాదక్షత, డిసిప్లిన్, పంక్చువాలిటీ, సిన్సియారిటీలు నేర్చుకున్నామా? ఈరోజు ఈ తాగుడికి, ఈ తిండికి మనవాడు ఖర్చుపెట్టే దాంతో ఓ మామూలు కుటుంబం నెలకాకపోయినా సగంరోజులు హాయిగా బతుకుతుంది."
"ఒరేయ్! ఫ్రెండువిగదా అని పిల్చి డిన్నరిస్తుంటే ఆఖరికి నా మీదకే తిప్పావురా గాలి?" మురారి నవ్వుతూ, వెయిటర్ తీసుకొచ్చిన మెనూకార్డు చదువుతూ అన్నాడు.
"అయితే ఈపూట నీకు పస్తే. హాయిగా మేమిద్దరం భోంచేస్తాం. చెప్పండి మీరేం తీసుకుంటారు?" జ్యోతికి మరోకార్డు అందిస్తూ అన్నాడు మురారి.
"డబ్బుతో పులిసి వున్నావు. నీకులేని బాధ నాకెందుకు? ఆర్డర్ చెయ్యి. మేము ఎలాగూ రోజూ తినలేం. నీ డబ్బుతోనన్నా సుష్టుగా తింటాను" సుబ్బారావు నవ్వుతూ అన్నాడు.
జ్యోతి కార్డు తిరగేసింది కాని అందులో ఒక్క వంటకం పేరూ ఎప్పుడూ వినలేదు, కననూలేదు.
మురారి మరోసారి అడిగేసరికి ఆఖరికి తెల్సిన పేరు చపాతి కుర్మా చెప్పింది.
"ఇంకేం వద్దు. చాలు, హెవీగా వుంది" అంది గడుసుగా.
భలేవారే! మీతో లాభంలేదు" అంటూ తనే ముగ్గురికీ కలిపి ఏవేవో ఆర్డరు చేశాడు మురారి.
ఒక్కొక్క కోర్సు తీసుకొచ్చి పెడుతున్నారు వెయిటర్లు.
సూప్ ఎలాగో తాగగలిగింది జ్యోతి. మురారి ఏమనుకుంటాడోనని కొన్ని బలవంతంగా నోట పెట్టింది. అలవాటులేని ఆ రుచులు, ఆ మసాల వాసనలు, ఆ ఉప్పుకారంలేని చప్పిడి వంటలు తినలేకపోయారు జ్యోతి సుబ్బారావు.
ఆఖర్న ఫ్రూట్ సలాడ్ మాత్రం తీసుకుంది తృప్తిగా.
ఆఖర్న వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి గుండెలు బాదుకున్నంతపని అయింది సుబ్బారావుకి.
మురారి నిర్లక్ష్యంగా నూరు రూపాయల నోటు పడేసి, వెయిటర్ తీసుకొచ్చిన ఐదురూపాయల చిల్లర టిప్ గా వదిలేశాడు.
"ఒరేయ్! ఏం భోజనంరా దరిద్రం, దీనికి నూరురూపాయలా? హాయిగా ఏ తాజ్ కో పోతే పదీ ఇరవై రూపాయలకి సుష్టుగా తినేవాళ్ళం. ఓ ఉప్పులేదూ కారం లేదు. ప్లేట్లు, టేబుల్స్, వెయిటర్లు అంతా పటాటోపమే మనం తిన్నదెంత? వందరూపాయలు వడికారు" సుబ్బారావు వళ్ళంతా జర్రులు పాకినట్లు అన్నాడు.
మురారీ నవ్వాడు నిర్లక్ష్యంగా.
"వాళ్ళ హోటలు మెయిన్ట్ నెన్స్, ఆ కేబరే అదంతా మరి మన నెత్తినేగా రుద్దుతారు."
"నీకు, నీ డిన్నరుకి ఓ నమస్కారం. ఇంకెప్పుడూ ఇలాంటి చోటుకి తీసుకురాకు" సుబ్బారావుకి నిజంగా ఆ రాత్రికోసం వందరూపాయలు ఖర్చుపెట్టటం బాధగా వుంది.
జ్యోతికీ.... మురారి అంతలా ఖర్చుచేసిన డబ్బుతో తనకో మంచి రెండు చీరలు వచ్చేవి అన్పించింది.