రాజర్షి ఆలోచనలు ఇప్పుడు ఉదయ్ నిజం చెబితే ఏమిటన్న సందేహంపై నిలిచాయి.
o o o
నిద్రాహారాలు మానేసి పోలీస్ స్టేషన్ ముందే జాగారం చేస్తున్నారు పరమశివం, అతని భార్య, కూతురు.
అప్పుడొచ్చి ఆగిందో కారు__అందులోంచి పట్టాభి, మధుమూర్తి దిగారు దిగులుగా బెంచీమీద తలవంచుకుని కూర్చున్న పరమశివం దగ్గరకు వెళ్ళి గొంతులు సవరించుకున్నారు.
పరమశివం ఉలికిపాటుగా తలెత్తి చూశాడు.
"సారీ....శివా....ఇప్పుడే విన్నాం. ఎలా జరిగింది? నీవూ, శశిభూషణ్ ప్రాణమిత్రులు, అలాగే మీ కొడుకులు కూడా...."
పట్టాభి గొంతులో కృత్రిమయిన జాలి తొంగిచూసింది.
పరమశివం భోరుమన్నాడే తప్ప మరేం మాట్లాడలేకపోయాడు.
"మరిప్పుడెలా?"
మధుమూర్తి, కేజువల్ గా అడిగాడు.
పరమశివం వారి గొంతుల్లో తొంగి చూస్తున్నది కృత్రిమమయిన జాలి అని పసిగట్టే స్థితిలో లేడు.
"మేం వ్యాపారంలో దెబ్బతిని ఆర్ధికంగా నాశనమయితే, నీవు ఒకే ఒక కొడుకుని పోగొట్టుకుని అంధకారంలోకి వెళ్ళిపోయావు. ప్చ్....మాకు చాలా బాధగా వుంది....వస్తాం శివా...." అంటూ వచ్చినంతసేపు వుండకుండా వెళ్ళిపోయారు.
ఉదయ్ ని ఏలూరులోని శనివారపేటలో వున్న సర్టిఫైడ్ స్కూల్ కి పంపే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
చిన్నపిల్లలు కదా అని నేరం చేస్తే వదిలేయదు చట్టం.
అయితే వార్ని నిర్భందించేది జైల్లోకాదు. సర్టిఫైడ్ స్కూల్ లో.
అది జైలులా వుండదు.
స్కూల్ లా వుంటుంది.
ఇందులో వార్ని ఓ పక్క చదివిస్తూ, మరో పక్క చిన్న చిన్న వృత్తుల్లో శిక్షణ ఇస్తూ, ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఇస్తారు.
పదహారు సంవత్సరాల వయస్సులో వున్నవార్నే సర్టిఫైడ్ స్కూల్ కి పంపిస్తారు.
పదహారు సంవత్సరాలకు పైన పద్దెనిమిది సంవత్సరాల లోపు వున్న వార్ని బోస్టన్ స్కూల్ కి పంపిస్తారు.
పద్దెనిమిది సంవత్సరాలు దాటితే జైల్ కే పంపిస్తారు నేరుగా.
అప్పుడు కూడా నోరు విప్పలేదు ఉదయ్.
అతని ప్రవర్తన అటు రాజర్షికి....ఇటు తల్లిదండ్రులకు పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎందుకని ఉదయ్ నోరు మెదవటంలేదు. వ్యాన్ స్టేషన్ ముందు సిద్ధంగా వుంది.
ఓ పోలీస్ వచ్చి సెల్ లోంచి ఉదయ్ ని బయటకు రమ్మన్నాడు.
నాలుగు రోజులుగా సరయిన తిండి, నిద్రలేక చిక్కిపోయి, కళ్ళు లోతుకుపోయి దైన్యంగా వున్న ఉదయ్ మౌనంగా వచ్చి వ్యాన్ ఎక్కాడు.
కొడుక్కేసి పరిగెత్తుకురాబోయిన పరమశివాన్ని, అతని భార్యనూ కూతుర్ని పోలీసులు ఆపేశారు.
వ్యాన్ బయలుదేరింది దుమ్ము రేపుకుంటూ.
ఆ దుమ్ములో పరుగెడుతున్నారు పరమశివం, అతని భార్యా, కూతురు పిచ్చివాళ్ళలా, వెక్కి వెక్కి ఏడుస్తూ.
o o o
శశిభూషణ్, అతని భార్యా, కూతురు నాలుగురోజులుగా పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు.
తల పగిలిన కొడుకు శవమే శశిభూషణ్ కళ్ళలో మెదిలి అతన్ని పిచ్చివాడ్ని చేస్తోంది.
తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చమని ఎవర్నడగాలి?
ఇదిపిల్లల విషయంగానే అనిపిస్తోంది కనుక పరమశివాన్ని నిలదీయలేడు.
ఇక మిగిలింది ఉదయ్. అతనిప్పుడు చిన్నపిల్లల జైలుకి వెళ్ళనున్నాడు.
అయినా ఎవర్ని ఏం అడిగినా తన వంశాంకురం తిరిగి ప్రాణాలతో తనకు దక్కడుకదా?
"నాన్నా అన్నయ్య తలెందుకు పగిలింది?" ఎక్కిళ్ళ మధ్య అడిగింది శశిభూషణ్ కూతురు తండ్రి గడ్డాన్ని తన లేత చేతులతో కదిలిస్తూ.
ఏం చెప్పాలో తెలియని శశిభూషణ్ కూతుర్ని వళ్ళోకి లాక్కుని బావురుమన్నాడు.
o o o
"మనకు ఆస్థి పోయింది. వాళ్ళకు పిల్లలు పోయారు. మనం తిరిగి సంపాదించుకో గలిగినా వారికిమాత్రం ఆ అవకాశం లేదు"
పట్టాభి పగలబడి నవ్వాడు.
"ఎందుకయినా మంచిది మనం త్వరలో ఇక్కడినుండి మకాం లేపేయడం మంచిదేమో?" మధుమూర్తి అంత మత్తులోను కంగారుగా అన్నాడు.