Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 20


    "ఎలా ఉంది నీకు?"


    "బాగుంది సార్!"


    "ఎవర్ని తిడుతున్నావ్?" అన్నాడాయన నవ్వుతూ.


    అక్కడున్న డాక్టర్లు, నర్సుల మొహాల్లో భయం కనబడింది.


    పెద్ద డాక్టర్ వైపు తిరిగాడు ఆయన.


    "ఎన్నిసార్లు చెప్పినా కక్కుర్తి పనులు మానరన్నమాట. కడుపు కాలుతున్నవాడు కక్కుర్తికోసం చేస్తే అది వేరేమాట డాక్టర్! అడ్డమైన గడ్డీ తింటే అరగదని నీకు తెలుసుగా! నువ్వే గడ్డిమేస్తే, మేయిస్తూ ఉంటే ఎలాగయ్యా!"


    "సార్!" అన్నాడు పెద్ద డాక్టర్ భయంగా.


    "క్షణంలో ఉద్యోగాలు పీకించెయ్యగలను. కానీ వెధవది... ఈ జాలి గుండె ఉందే... ఇది అన్నింటికీ అడ్డం వస్తుంది. నిర్దయ కావాలని తపస్సు చేస్తాను. అప్పుడు కానీ మీ తోలు వలవడానికి చేతులు రావు. సరే! ఇది ఇంకో వార్నింగ్ అనుకో. పాపం ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేం. ఈ కుర్రాడికి ఎలా ఉంది!?"


    పైకి చెప్పకపోయినా డాక్టర్ మొహంలో పైశాచిక ఆనందం ఏదో కనబడింది.


    "ఫిజికల్ గా పర్ ఫెక్ట్ గా ఉన్నాడు సార్! మెంటల్ గానే అఫెక్ట్ అయినట్లు అనిపిస్తోంది."


    "ఎందుకలా అనుకుంటున్నావ్?"


    "మీరొక్కసారి పక్కకొస్తే చెబుతాను" అన్నాడు డాక్టర్.


    డాక్టరూ, ఆయనా కలిసి కొద్దిగా పక్కకు వెళ్ళారు.


    "విషం దెబ్బకి హాల్సూసినేషన్స్ మొదలయ్యాయి సార్!" అన్నాడు డాక్టర్.


    "ఏం జరిగిందీ?" అన్నాడు పెద్దాయన.


    'అదంతా ఓ తమాషా' అన్నట్లు వినయంగానే నవ్వి, ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు డాక్టర్. "రాత్రి ఇక్కడికి మేడమ్ గారు గనక వచ్చి ఉంటే భలే మజాగా ఉండేదండి!"


    "మేడమ్ రాత్రిపూట ఇక్కడికెందుకొస్తారూ?"


    "మాట వరసకి అంటున్నానండి! వచ్చి ఉంటే ఈ కుర్రాడి తోలు ఒలిపించి ఉండేవారు - ఇందాక మీరన్నట్లుగా!"


    "ఏమయిందీ? సరిగ్గా చెప్పు!"


    "మేడమ్ గారు తన భార్య అంటాడండీ ఈ అబ్బాయి!"


    "ఏమిటీ?" అన్నాడు ఆయన నిర్ఘాంతపోతూ.


    "గాడ్ ప్రామిస్ సర్! రాత్రంతా ఒకే కలవరింత! 'ఐశ్వర్యా, ఐశ్వర్యా!' అని."


    "సరిగ్గా చెప్పు డాక్టర్!"


    డాక్టర్ వివరంగా చెప్పడం మొదలెట్టాడు. విషం తిన్న ఎఫెక్ట్ కి కాశీకి శారీరకంగా ఏమీ కాలేదు గానీ, అతనికి మానసికంగా షాక్ తగిలినట్లయింది. అతను ఏదేదో ఊహించుకుంటున్నాడు. తనకి గతజన్మ గుర్తు వచ్చిందని భ్రమపడుతున్నాడు. ఆ గత జన్మలో మేడమ్ గారు అతని భార్యట. అప్పట్లో ఆమె పరమ సాధ్వీమణిట. ఇతనేమో జులాయి, జల్సా పురుషుడుట. తప్పతాగి తందనాలాడుతూ ఉండేవాడట. చీపురుకట్టకి చీర కట్టినా దాని వెనకబడి విరహ గీతాలాలపించేవాడట. పెళ్ళాన్ని మాత్రం పక్కలోకి రానిచ్చేవాడు కాడట. ఆ జన్మలో తాగుడు వల్ల లివర్ పాడయిపోయిందట. వ్యసనాల వల్ల ఒళ్లు పుచ్చిపోయిందట. ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్లో చేరాడట. అమ్మమ్మ! ఎంత గోల చేశాడు సార్! టాబ్లెట్లు ఇవ్వడానికి వచ్చిన నర్సుని వాటేసుకుని "ఐశ్వర్యా! ఐశ్వర్యా!" అని వదలడే! మేల్ నర్సుని పట్టుకుని "పాపారావు, పాపారావు" అంటాడు సార్! ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఇతను మీకు దగ్గరి మనిషా... అహ... మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని రాత్రి కబురు పంపించారుగా..."


    నవ్వాడు ఆ పెద్దమనిషి.


    "ప్రతి మనిషీ ప్రతి మనిషికీ దగ్గరే! ప్రతి మనిషీ ప్రతి మనిషికీ బంధువే! ఇతను మా తోటమాలి. మన దగ్గర పనిచేసేవాళ్ళ మంచిచెడ్డలు మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు? అవునా?" అన్నాడు.     


    "అవునవును!" అన్నాడుగానీ డాక్టర్ దృష్టి ఆ పెద్దమనిషి మీద లేదు. ఆ వెనకే వస్తున్న ఇంకో మనిషి మీదకి మళ్ళింది.


    తానుకూడా తిరిగి చూశాడు ఆ పెద్దమనిషి. ఆయన పేరు మూర్తిగారు. శ్రీరామచంద్రమూర్తి. ఐశ్వర్యకి వరసకి బాబాయి అవుతాడు. ఆమె ఆస్తులన్నిటికీ ట్రస్టీ.


    ఆ లోపలికి వస్తున్నవాడు ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్. కాని వాలకం చేస్తే పోలీసాఫీసరులాగా లేడు. మున్సిపాలిటీ వర్కరులాగా ఉన్నాడు. నలిగిన యూనిఫారం, ఎక్స్ ర్ సైజ్ మర్చిపోవడం వల్ల బాగా పెరిగిన బానపొట్ట, మొద్దుచూపులు, పాలిష్ చేయని బూట్లు. చాలామంది పోలీసులు మఫ్టీలో ఉన్నా కూడా వీళ్లు 'పోలీసులు' అని స్టాంపు వేసి ఉన్నట్లు తెలిసిపోతూనే ఉంటుంది. పర్సనాలిటీ, మాట తీరూ - అన్నీ!


    కానీ ఇతనికి యూనిఫారం వేసి బాడ్జి పెట్టినా కూడా నాటకంలో అతకని నటుడిలా ఉన్నాడుగానీ పోలీస్ ఇన్ స్పెక్టర్ లాగా లేడు!


    "రాత్రంతా స్టేషన్ లోనే. ఇంకా స్నానం చెయ్యలా" అన్నాడతను దగ్గరికొస్తూ. అదే అతని పలకరింపు.


    అతను స్నానం చెయ్యలేదన్న విషయం అతని నోరు చెప్పనక్కర్లేదు. ఒళ్ళే  చెబుతోంది - అల్లంత దూరంలోనుంచే!

 Previous Page Next Page